Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 18


    "శరత్! మరొకటి అడుగుతాను. విసుక్కోకుండా సమాధానం చెబుతావా?" జంకుతూ ప్రశ్నించింది.


    "ఏమిటి?"


    "నిన్ను కన్నతల్లి మరో విధంగా జీవిస్తుందనుకో, ఆకస్మాత్తుగా నిన్ను చూసి భయపడిపోతుందనుకో నువ్వు ఆమె ప్రశాంత జీవితంలో తుఫాను రేపుతావనుకో.... మాసిపోయిన ఆ మచ్చను వెలికితీసి...."


    "రాజూ! ఏమిటి నువ్వనేది?" మధ్యలోనే అందుకున్నాడు.


    "నిన్ను కన్నతల్లి ఏ ధనవంతుల ఇంట్లోనో ముద్దుబిడ్డగా పెంచి వుండొచ్చు. ఆమె తల్లిదండ్రులు ఆమెను ఏ దూరదేశాలకో తీసుకుని వెళ్ళి రహస్యంగా పురుడు పోసి...." ఆగి శరత్ ముఖంలోకి చూసింది.     


    "ఊఁ! చెప్పు!"


    "నిన్ను ఎవరికో అప్పగించి కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళారనుకో మంచి కట్నంతో మంచి సంబంధం చూసి పెళ్ళి చేసిం తర్వాత, ఆమె బిడ్డా పాపతో సుఖంగా గౌరవంగా జీవిస్తుందనుకో.... అప్పుడు...."  నువ్వు అని ఆగి ఆలోచనలో పడింది రాజేశ్వరి.


    "పూర్తిచెయ్" రెట్టించాడు శరత్.


    "నువ్వు అకస్మాత్తుగా వెళ్ళి ఆమెతో నేను నీ కొడుకుని అని చెప్తావా? అప్పుడు ఆమె పరిస్థితి ఎలా వుంటుంది? భయపడిపోతుంది ఎవరికైనా తెలిస్తే తన బతుకు ఏమైపోతుందో అని బెదిరిపోతుంది. నిన్ను గుండెలకు హత్తుకోలేని తన అసహాయతకు బాధపడుతుంది. మానిపోయిన గాయాన్ని మళ్ళీ కెలికి ఆమెను అశాంతికి గురిచేస్తావా?"  


    శరత్ ఆలోచనలో పడ్డాడు.


    "చెప్పు శరత్!"


    అతను వేదాంతిలా నవ్వాడు.


    "చెప్పు శరత్! ప్రశాంతంగా గడిచిపోతున్న ఆమె జీవితాన్ని నాశనం చేస్తావా?"


    "ఎన్నటికీ అలా చెయ్యను."


    "మరి ఏం చేస్తావు?"


    "దూరం నుంచే కళ్ళారా చూస్తాను. ఆమె సుఖంగా వున్నట్టు చూసి సంతోషిస్తాను. నాకీ అనుభూతి చాలు" అనుకొని సంతృప్తి పడతాను."


    రాజేశ్వరి గుండెల్లో గుబులుగా వుంది.


    "అయితే ఈ ప్రయత్నం మానను అంటావా." దిగులుగా అడిగింది.


    "రాజూ! అంటూ రాజేశ్వరి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు శరత్.


    "ఏమిటి?" అన్నట్టు చూసింది!


    "నా కొరకు కొంతకాలం వేచి వుండగలవా?"


    రాజేశ్వరి కళ్ళలో నీరు తిరిగింది!


    "దుఃఖం ఉబికి వచ్చింది.


    "చెప్పు? రాజూ!" అతని చేతిలో ఆమె చెయ్యి బిగిసిపోయింది.


    "శరత్!" దాదాపు ఏడుస్తున్నట్టే అన్నది.


    "అవును! రాజూ! నేను ఎవర్నో నేను తెలుసుకోవాలి. దానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేను. అంతవరకూ నిన్ను నాకోసం ఎదురు చూస్తూ కూర్చోమని చెప్పేంత స్వార్థపరుడ్నికాను. ఏదో మనసు ఉండబట్టలేక...."   


    శరత్ కంఠం వణికింది.


    "ఎంతకాలం....?"


    "చెప్పలేను."


    "పోనియ్! నన్ను ఎంతకాలం నీ కోసం ఎదురు చూడమంటావో చెప్పు."


    "నీకు నా మీద అసహ్యం, విసుగూ, పుట్టేంతవరకు...." బాధగా అన్నాడు.


    రాజేశ్వరికి దుఃఖం పొర్లుకొచ్చింది.


    రెండు చేతులతో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది.


    అతడు నిలువెల్లా కదిలిపోయాడు.


    ఆమెను గుండెలకు హత్తుకొని లాలించాలనిపించింది.


    కాని తామున్న ప్రదేశంలో అలా చెయ్యడానికి వీల్లేదు!


    రాజేశ్వరి అభిమానంగల యువతి, విజ్ఞానవతి, చీటికీమాటికీ ఏడ్చే సాధారణమైన ఆడపిల్ల కాదు. అలాంటి రాజేశ్వరి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే వెర్రివాడిలా చూశాడు.


    శరత్ రాజేశ్వరి రెండు చేతుల్నీ ముఖం మీద నుంచి తన చేతుల్లోకి తీసుకున్నాడు.


    "రాజూ! ఏడవకు. చూడు! ఇది పబ్లిక్ ప్లేస్. అందరూ మనవంకే చూస్తున్నారు. ప్లీజ్ అనునయంగా అన్నాడు.


    "శరత్ ఈ ప్రయత్నం మానేయ్...."


    అతను రాజేశ్వరి చేతులు వదిలేశాడు.


    రాజేశ్వరి శరత్ ముఖంలోకి చూసింది.


    "రేపే మనిద్దరం రిజిష్టర్ మారేజ్ చేసుకుందాం. ఆ తర్వాత నువ్వు మీ అమ్మను వెతుక్కుంటూ వెళ్ళిపో. నువ్వు ఎంతకాలానికి తిరిగివచ్చినా నీకోసం ఎదురుచూస్తూ వుంటాను. జన్మంతా...." ఉద్రేకం దుఃఖం అంతా కంఠంలో ఒకదాన్ని మరొకటి ఒరుసుకున్నాయ్.   


    "రాజూ!"


    "అవును శరత్. నువ్వెంత కాలానికి తిరిగివస్తావో నీకే తెలియదు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అంతకాలం, అవివాహితగా - నేను ఉండగలను.... కాని తర్వాత పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలు నా చెల్లెల్లు వున్నారు. మా నాన్న నా మీద ఒత్తిడి తీసుకురావచ్చును. నాకూ తల్లిదండ్రుల పట్ల కొన్ని బాధ్యతలు వున్నాయిగా?"


    "నేను అంత ద్రోహం చెయ్యలేను. ముందు మా అమ్మను చూడాలి నేనెవర్నో తెలుసుకోవాలి. నా జన్మ వృత్తాంతం తెలిసి కూడా నీకు నన్ను వివాహం చేసుకోడానికి అభ్యంతరం లేకపోతేనే మన వివాహం జరుగుతుంది. అంతవరకూ ఈ వివాహం జరగదు నన్ను అర్థం చేసుకో అన్నాడు శరత్.

 Previous Page Next Page