"అవును సార్!"
"పదిహేడో తేదీ నేను చచ్చిపోతున్నాను...." నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అన్నాడు విశ్వాత్మ.
పరాంజపాకి ముందు తను విన్నదేమిటో అర్థంకాలేదు. అర్థంకాగానే షాక్ తిన్నాడు.
"ఎస్! అయామ్ గోయింగ్ టు డై మిస్టర్ పరాంజపా" అన్నాడు విశ్వాత్మ.
తల గిర్రున తిరిగినట్టయింది పరాంజపేకు.
ఈ వయసులో పెద్దాయనకు మతిచాంచల్యం కూడా వచ్చినట్టుంది. పపం.... అంటూ పెదవి విరిచాడు పరాంజపే.
"ఏమిటీ... నేను చెప్పే మాట నమ్మలేకపోతున్నావా? నేను అకస్మాత్తుగా అనూహ్యమైన పరిస్థితుల్లో చనిపోతాను. డోన్ట్ వర్రీ... మళ్ళీ పుడతానులే" ఆ మాటలకు పిచ్చి బాగా ముదిరిపోయినవాడిలా చూశాడు పరాంజపే విశ్వాత్మ వైపు.
నోటమాట రాకుండా నేలచూపులు చూస్తున్న పరాంజపే వైపు మందస్మితంతో చూశాడు విశ్వాత్మ.
"నమ్మలేకపోతున్నావు కదూ... దిసీజ్ ట్రూ... నేను నాలుగురోజులలో చనిపోవటం ఎంత నిజమో... మళ్ళీ పుట్టడం కూడా అంతే నిజం.... కావలిస్తే ఔట్ కడతావా?" అన్నాడు అదోలా నవ్వుతూ.
ఆ సమయంలో పరాంజపే సీరియస్ గా విశ్వాత్మ ప్రస్తుత పరిస్థితి గురించి వెంటనే ఆయన పర్సనల్ డాక్టర్ కి తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు.
పరంజాపే తన మాటల్ని విశ్వసించడం లేదన్న అభిప్రాయానికి లోనయిన విశ్వాత్మ కించిత్తు నిరాశకు గురయ్యాడు.
"నౌ యు కెన్ గో" అనేశాడు అప్రయత్నంగా. ఆ మాటకోసమే ఎదురు చూస్తున్న పరాంజపే గబుక్కున రూమ్ లోంచి బయటికొచ్చేసి మేడ మెట్లు దిగి, హాల్లో టెలిఫోన్ రిసీవర్ని అందుకుని విశ్వాత్మ పర్సనల్ డాక్టర్ కి ఫోన్ చేశాడు.
* * * *
"నేను మీకు ఫోన్ చేద్దామనుకుంటుండగానే మీరే రావడం విచిత్రంగా వుంది" లోనికి అడుగుపెట్టిన పర్సనల్ డాక్టర్ వైపు చూస్తూ అన్నాడు విశ్వాత్మ.
"మీ హెల్త్ ఎలాగుంది?" ప్రశ్నించాడు డాక్టర్.
"మీకు తెలీని హెల్తా?" కూర్చోమన్నట్లుగా సంజ్ఞ చేస్తూ అన్నాడు విశ్వాత్మ.
"ఈ వారంలో మీరు లండన్ వెళ్ళాలనే విషయం గుర్తుచేయడానికి వచ్చాను"
"లండన్... ఆ క్యాన్సర్ టెస్టులకేనా? ఆ అవసరం లేదు డాక్టర్! ఖరీదయిన టెస్టుల్ని ఇన్నాళ్ళూ నేనెందుకు చేయించుకున్నానో చెప్పగలరా డాక్టర్?"
"క్యాన్సర్ బారి నుండి బయటపడి.... మీ జీవితకాలాన్ని పొడిగించుకోడానికి"
"కానీ ఆ అవసరం లేదు... ఇక లేదు...." అన్నాడు విశ్వాత్మ ధీమాగా.
వృద్ధాప్యంతో వ్యాధులకు సంబంధించిన నిరాశ ఆవరించడం మనిషికి చాలా సహజం అనుకున్నాడు డాక్టర్. "ఏం...?" ప్రశ్నించాడు డాక్టర్.
"ఎందుకో చెప్తాను... చెప్పే ముందు.... నా మనస్సులోని సందేహాలను మీరు తీర్చాలి"
"అడగండి"
"ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు... ఏ విధమయిన ఆత్మహత్యకు మీరు సలహా యిస్తారు?" అన్నాడు విశ్వాత్మ.
"నేనిప్పటి వరకూ అలాంటి సలహాలు ఎవరికీ ఇవ్వలేదు. ఒక డాక్టర్ గా అలాంటి సలహాలు ఇవ్వటం చట్టరీత్యా నేరం కూడా."
"నేను నేరం గురించి, ఘోరం గురించి మాట్లాడడం లేదు. జస్ట్ ఫన్ డౌట్ క్లారిఫికేషన్. మనిషి ఎన్ని రకాలుగా ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం వుంది? ఫ్రాంక్ లీ టెల్ మీ డాక్టర్?"
ఆ మాటలు విని అనుమానంగా విశ్వాత్మ వైపు చూస్తూ చెప్పసాగాడు డాక్టర్.
"కొండమీంచి దూకి, సముద్రంలో మునిగి, రైలు పట్టాల కింద తలపెట్టి, స్లీపింగ్ పిల్స్ మింగి లేదా.... బాగా తాగి, తాగి... లేదా పాయిజన్ తీసుకొని- కిరసనాయిల్ వంటి మీద పోసుకుని... కత్తితో నరాలను తెగకోసుకుని, ఎలక్ట్రిక్ ఛెయిర్... ఎన్నని చెప్పమంటారు? మనిషిలోని బాధలే రకరకాల ఆత్మహత్యలకు మార్గాలను సూచిస్తాయి...." స్పీచ్ ఇచ్చినట్లు చెప్పాడు డాక్టర్.
"నేనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానుకోండి... నాకు మీరు సూచించే మార్గం ఏమిటి?"
"మీరొకసారి బ్రెయిన్ స్కానింగ్ తీయించుకుంటే బావుంటుంది" సీరియస్ గా సలహా ఇచ్చాడు డాక్టర్.
"ఎందుకు...?" డాక్టర్ ఆ సలహా ఎందుకిచ్చాడో తెలుసుకున్న విశ్వాత్మ చిన్నగా నవ్వుతూ అడిగాడు.
"ఈ వయసులో సూసైడల్ ఇన్ స్టింక్ట్ మీలో ప్రవేశించడానికి గల కారణం... మీ ఒంటరితనమే. ఆ ఒంటరితనాన్ని దూరంగా తరిమేయడానికి ప్రయత్నించండి" అన్నాడు డాక్టర్.
మరో పదినిముషాల తర్వాత డాక్టర్ వెళ్ళిపోయాడు.
తను ఆత్మహత్య చేసుకుంటానని చెపితే ఎవరూ నమ్మరేం? ఈ విషయాన్నే నమ్మనివారి తను పునర్జన్మ పొందుతానని చెపితే తనను మరింత పిచ్చివాడిగా చూస్తారేమో!
ఇంకా నాలుగు రోజులు....
అంటే 96 గంటలు. ఈ 96 గంటల్లో తను చేయాల్సిన పనులు చాలా వున్నాయి.
తను ఏవేం పనులు చేయబోతున్నాడో ఒక పేపర్ మీద లిస్ట్ రాసుకున్నాడు.
మొదట ఢిల్లీలోని పారాసైకాలజీ ప్రొఫెసర్ రామకృష్ణారావుతో మాట్లాడి, కొన్ని విషయాల్లో తన సందేహాలను అర్జంట్ గా నివృత్తి చేసుకోవాలి.
రెండు... వీలునామా రాయించాలి.
మూడు... నాలుగు... అయిదు... తను మాత్రమే గుర్తుపట్టేటట్టుగా కొన్ని పాయింట్స్ రాసుకున్నాక ప్రొఫెసర్ రామకృష్ణారావు కోసం న్యూఢిల్లీకి ఫోన్ చేశాడు. విశ్వాత్మ డైరెక్ట్ గా తనకి ఫోన్ చేసి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది రామకృష్ణారావుకి.
"నన్ను ఢిల్లీ రమ్మంటారా? మీరిక్కడకు రాగలరా?"
"ఈ వయసులో మిమ్మల్ని నేను శ్రమపెట్టలేను. రేపు మార్నింగ్ ఫ్లయిట్ లో నేనే వస్తాను..." చెప్పాడు ప్రొఫెసర్ రామకృష్ణారావు.
* * * *
మర్నాడు మధ్యాహ్నం.
మూడుగంటల సమయంలో....
విశ్వాత్మ పర్సనల్ రూమ్ లో కూర్చున్నాడు పారాసైకాలజీ ప్రొఫెసర్ రామకృష్ణారావు.