Previous Page Next Page 
అందమైన అపశృతి పేజి 19


    కీచుమంటూ చిన్నకారు శృతి పక్కనే ఆగింది.

    డోర్ తెరుచుకుకుని ఒకతను కారులోంచి కిందకు దిగాడు. "ఏం భాయ్! బతకాలని లేదా! లేక మమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలని కోరికా?" ఖంగుమంటూ కంచు కంఠంతో అడిగాడు.

    "తప్పు నాదే బాబయ్యా! బ్రేకు సరిగా పడటం లేదు." అంటూ రిక్షా అతను తప్పు  వప్పేసుకుని రిక్షా పక్కకి తీశాడు.

    "తప్పు నీదయినా ప్రమాదం జరిగితే నేరం మా నెత్తికి చుట్టుకునేది" అంటూ అతను వెనక్కు తిరిగాడు.

    ఆ కంఠస్వరం, ఆ ఎత్తూ, లావు శృతి గుర్తుపట్టింది.

    అతను మురారిదేముడు.

    ఏదో తెలియని ఆనందం. శృతి అతని దగ్గరగా వెళ్ళి "మురారిదేముడూ!" అంది.

    అతను గతుక్కుమని ఆగిపోయాడు.

    కారులో వున్న నలుగురు మగవాళ్ళు బైటికి (వీళ్ళనే) చూస్తున్నారు.

    శృతి అన్నది వినిపించుకొనట్లు అతను కారెక్కబోయాడు.

    శృతి టకీమని అతని చెయ్యి పట్టుకుంది.

    "నేనే మురారిదేముడూ! శృతిని. ఆ రోజు నిన్నురక్షించాను. మా ఇంట్లో వున్నావు గుర్తు లేదూ? మా అన్నయ్య కనపడటంలేదు. చోరీనేరం అన్నయ్యమీద పడింది. అంతా అయోమయంగా వుంది. దేముళ్ళా నీవు కనపడ్డావ్. దొంగలతో, హంతకులతో నీకు పరిచయంమేకదా? ఏ దొంగన్నా ఆ రాత్రి రైల్వే డబ్బు మూడు లక్షలూ కాజేసి అన్నయ్యని మాయం చేసి వుండొచ్చు....."

    శృతి మాటలకు అడ్డొచ్చాడు అతను.

    "మీరెవరోగాని నన్ను చూసి పోరపడుతున్నారు. నా పేరు చంద్రగుప్తుడు," అంటూ శృతి చేతిని విదిపించుకోబోయాడు అతను.

    "కాదు, నా కళ్ళు నన్ను మోసగించవు. నువ్వు మురారిదేముడివే." అరిచినట్లే అంది శృతి.

    శృతి గొంతుక విని బజారులో వెళ్ళేవాళ్ళు చాలా మంది తలతిప్పి చూశారు. ఇద్దరు ముగ్గురు ఆగిపోయారు.

    "ఎవరా అమ్మాయి!" కారులో కూర్చున్నవాళ్ళలో ఒకతను తల బైటికిపెట్టి అడిగాడు.

    "ఎవరో కాస్త మతి చలించిన పిల్ల." అన్నాడు అతను.

    "నా మతి చలించలేదు. నువ్వే తెలియనట్టు నటిస్తున్నావు. ఆపదలో ఆదుకున్నావ్. నీకు ఆపద వస్తే రక్షిస్తానని ఇంత పెద్ద లెటర్ రాసి పెట్టి వెళ్ళావే. ఇప్పుడు మేము ఆపదలో వున్నాము. మా అన్నయ్య ఆచూకీ తెలిస్తేగాని మా కష్టాలు తీరవు. ఆ నేరస్తులెవరో నీలాంటి నేరస్తులకే తెలుస్తుంది. ప్లీజ్ ఈ ఒక్క సాయం చెయ్యి, నువ్వు నిజంగా మా పాలిటి దేముడవే అని నమ్ముతాను. నువ్వో గజదొంగ పని, ఖూనీకోరునని మర్చిపోతాను." అది బజారన్నదికూడా మర్చిపోయి ఆవేశంగా అని, అంతలో ప్రాధేయపూర్వకంగా అంది శృతి.

    అతని చెయ్యి గాలిలో అతని చెయ్యి వదిలేసి చెంప వత్తుకుంది శృతి.

    "ఏమిటీ న్యూసెన్స్" కారులో చెయ్యి వదిలేసి చెంప వత్తుకుంది శృతి.

    "అందమైన పిచ్చిది" అంటూ అతను కారు ఎక్కి డోర్ లాగాడు.

    చిన్న కారు ముందుకు పరుగు తీసింది.

    శృతి తెప్పరిల్లేటప్పటికీ చిన్నకారు బజారు మలుపు తిరిగింది.

    అప్పటికే శృతి చుట్టూ కొందరు మూగి ఏమి టేమిటని అడుగుతున్నారు.

    తనున్న దెక్కడో తెలిసోచ్చింది శృతికి.

    మునిపంటితో పెదవి గాయపడేటట్టు నొక్కిపట్టి తలోంచుకుని ముందుకు దారితీసింది శృతి.

    "పాపం  మతిలేనట్టుంది" వెనుక నుంచి ఎవరో అంటున్నారు.

    "అవును నాకు మతి లేదు. లేకపోతే, ఓ హంతకుడు నాకు సాయం చేస్తాడనుకోడం ఏమిటి, నా గీత బాగుండి అప్పుడు అతను ఆ స్థితిలో నా జోలికి రాలేదు అంతే. మొహమాటాకన్నట్టు ఓ లెటర్ రాసి పెట్టి పోయాడు. సాయం చేయని గుణం వున్నప్పుడు ఆ వెధవరాత దేనికి? అనుకుంటూ ముందుకు సాగింది శృతి.

    కొయ్యకాలు వాళ్ళు కనపడినప్పుడు, ఆటక చూసినప్పుడు మురారిదేముడు గుర్తుకొచ్చేవాడు. నెమ్మదిగా అదో పీడకలలా మరిచిపోయింది. నిజంగా పీడకల వచ్చిన రోజు అతను గుర్తుకు వచ్చాడు. అదేరోజు నుంచే సిద్దార్థ కనపడకుండా పోయాడు. అది జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎందుకో మురారిదేముడు గుర్తుకు వచ్చాడు. అతను ఓ గజదొంగ. దొంగలతో పరిచయముంటుంది. పెద్ద ఖూనీ కోరు. ఖూనికోరుతోను పరిచయ ముంటుంది.  ఆ లైన్ వేరు. రౌడీలు, గుండాలు, దొంగలు ఎవరైనాగాని సిద్దార్థ వాళ్ళ వల్ల ఆపదలో చిక్కుకుని వుంటే ఆ వూబినుంచి బైటపడేయడానికి మురారిదేముడులాంటి వారికే సాధ్యం. ఆపదలో అదుకుంటానని అతను మాట యిచ్చాడు. దేముడు కనపడితే బావుండును. అతను మాట తప్పడు. అనుకునేది.

    ఆరోజు నుంచీ ఒక్కసారి మురారిదేముడు కనపడితే బాగుండునని ముక్కోటి దేవతలకూ మొక్కుకుంది శృతి.

    బజారులో నడుస్తుంటే మురారిదేముడి కోసం ఆమె చూపులు వెతికేవి. పొడుగ్గా వున్న ప్రతిమనిషిలోను మురారిదేముడు దాక్కున్నాడేమో అన్నట్టు కాస్త ఎత్తుగావున్న ప్రతిమనిషిని పరీక్షగా చూసేదిశృతి.

    అనుకోకుండా ఆరోజు మురారిదేముడు కనబడ్డాడు. నేను దేముణ్ని కాదంటూ చటుక్కున మాయమయ్యాడు.

    పెట్టుకున్న రవ్వంత ఆశ నిరాశ కాగా "చంద్రగుప్తుడుట, ఎంత చక్కగా పేరు మార్చుకున్నాడు. వేశం మార్చుకున్నట్టే పేరునూ మార్చుకున్నాడు! సూటుబూటు కళ్ళకు గాగుల్స్, అయినా తన కళ్ళు తన్ని మోసం చెయ్యవు. అతను ముమ్మాటికి మురారిదేముడే. సాయం కోరితే చెంప వాయగోడతాడా! ఆరోజు....ఆరోజు.....తను దయతల్చకపోతే ఎక్కడుండేవాడు?" పళ్ళు సూరుకుంటూ అనుకుంది శృతి.

    అణువణువునా నిరాశా నిస్పృహలు ఆవరించగా కాళ్ళీడ్చుకుంటూ ఇంట్లో అడుగుపెట్టింది శృతి.


                                                                       16

    "నాకేదో భయంగా వుంది" అంది సీతమ్మ.

    సూట్ కేసులో చీరలు సర్దుతున్న శృతి తల్లికి దైర్యం చెప్పడానికా అన్నట్టు నవ్వుతూ తల ఎత్తి చూసి "నీదంతా ఉత్త భయమమ్మా; ఈ కాలం ఆడపిల్లలు ఎన్ని సాహసమైన పనులు చేస్తున్నారు, మారుమూల పల్లెల్లో ప్రాక్టీసు పెడుతున్నారు. లేడీడాక్టర్లు సంఘసేవికలు పల్లెపల్లెకీ తిరుగుతున్నారు. పెద్దచదువులు చదివేవాళ్ళు వంటరిగా ఇతర దేశాలు వెడుతున్నారు. నేనేం దూరం వెళ్ళడంలేదు కదమ్మా!" అని తిరిగి బట్టలు సర్దుకుంటూ వుండిపోయింది.

    "ఆ విషయం వేరు."

    "తీసుకుంటే అన్నీ తేలికే"

    "నువ్వు చెప్పినంత తేలిక కాదే శృతీ! ఆడపిల్లవని మార్చిపోకు."

    ఫో అమ్మా" అంటూ నవ్వుతూ కొట్టిపారేసి "ఆడ పిల్ల ఏ పరిస్థితులలోను తాను ఆడపిల్లనని మర్చిపొదమ్మా! విధికి తలొగ్గాలని చెబుతుంటావుకదా, అందుకే తలొగ్గి మనవ ప్రయత్నం  చేస్తున్నాను. ప్రయత్నం ఫలించాలి కదా?" అంది శృతి.

    "ఆ ప్రయత్నం మేదో ఇక్కడ చేస్తే!"

    "అది లాభంలేదని తేలిపోయిందికదమ్మా! పదిమందికి సహాయం చేసిన చెయ్యి నీది. ఈరోజు మన రోజులు బాగుండలేదని వాళ్ళముందు సహాయం చేయండంటూ చేయి జాపగాలమా అమ్మా!"

    సీతమ్మ మాట్లాలేదు.

    "పోనీవున్నవి అమ్ముకుతింటూ ఎన్నాళ్ళు కాలంగడుపుతాము? బ్యాంకి బ్యాలెన్స్ మూడొంతులు తరిగిపోయింది. ఇహ మిగిలింది రెండువేలు క్యాష్, పాత్ర సామాను. ఇక్కడ ఎంత ప్రయత్నించినా వంద రూపాయల జాబ్ కూడా దొరకలేదు. ఒకటా రెండా నెలకి నాలుగువందలు. తిండి, బట్టవాళ్ళే యిచ్చి....."

    "నిజమే. నీవక్కడ నేనిక్కడ. నా ప్రాణమంతా అక్కడే వుంటుంది. ఒకరోజూ రెండురోజులా?

 Previous Page Next Page