"అవును. అన్నయ్య దైర్యస్తుడు కాకపోయినా పిరికి వాడు మాత్రం కాదు. చేయని నేరం తనమీద వేసుకుని పారిపోడు" అంది శృతి.
"నాకా నమ్మకం వుంది" అంది శ్రీదేవి.
"మన నమ్మకాలు కాదు చూడాల్సింది. ముందేంచేయాలో చూడాలి" అన్నారు పరమశివంగారు.
14
సిద్దార్థ కనపడకుండాపోయి నాలుగు నెలలయింది.
సిద్దార్థని ఉద్యోగంలోంచి తీసేసోనట్లే.
నెలనెలా సిద్దార్థ తెచ్చే జీతంలేదు. క్వార్టర్స్ ఖాళీ చేసే పరిస్థితి దగ్గరపడింది. బ్యాంక్ లో దాచిన డబ్బు తరుగుతున్నది.
సీతమ్మ పెత్తనాలు మానేసింది. ఆవిడవల్ల ఎంతో సాయం పొందిన ఇరుగు పొరుగు ఇప్పుడు సాయం అడగటం లేదు తిరుగు ఏం చేయాల్సి వస్తుందో అని వాళ్ళ భయం.
"చూశావా అమ్మా! ఇదివరకు నీ సాయం లేంది బ్రతకలేమనేవారుఇప్పుడెలా మొహం చాటేస్తున్నారో, ఓ వేళ ఎదురుపడ్డా అన్నయ్య సంగతి ఎత్తి బాధపడటంతప్ప వాళ్ళవల్ల ఏం ప్రయోజనం వుంది?" శృతికి వళ్ళు మండినప్పుడల్లా అడుగుతుండేది.
"ఉపకారం చేయాలి. ప్రత్యుపకారం కోరగూడదు తల్లీ! లోకసహజం అనుకోవాలి." అనేది సీతమ్మ లోకులమాటలకన్నా సిద్దార్థ కనపడకపోవడమే ఆవిడకి బాధగా వుంది.
"నీశాంతం నాకు లేదమ్మా! ఏదో ఒకటి అనేవాళ్ళకి ఎదురు తిరగాలిగాని, పడి ఉండకూడదు. అది వాళ్ళు అలుసుగా తీసుకుని ఇంకా ఇంకా అంటూనే వుంటారు. అంది శృతి.
"అననీ తల్లీ! ఎన్నాళ్ళంటారు. సిద్దూ ఎప్పుడో అప్పుడు తిరిగి రాకపోడు. నా నాయన ఏనేరమూ చేయలేదని తెలియకపోదు."
న్యాయం, ధర్మం ఇంకా కొద్దిగా ఈ ప్రపంచంలో రాజ్యం చేస్తూనే వున్నాయని, ధర్మం జయిస్తుందని సీతమ్మ నమ్మకమే ఆవిడచేత ఆ మాట అనిపించింది.
"అన్నయ్య వస్తాడంటావా అమ్మా!"
"వస్తాడమ్మా! ఆరోజు రావాలి."
ఆ తల్లీ కూతురికి నాలుగు రోజుల కో పర్యాయం ఇలా అనుకోడం మామూలాయిపోయింది. చెడు కోరక పోయినా మనసు ఊరుకోదు. అది మంచీచెడ్డా ఆలోచింపజేస్తూ, అప్పుడప్పుడు హృదయాన్ని ముల్లుపెట్టి పొడుస్తూనే వుంటుంది. కొందరు ఇంట్లోంచి మాయం అయి అయిపూ అజా లేకుండా ఎన్నో ఏళ్ళు గడిచిపోయిన సంఘటనలు వున్నాయి. సిద్దార్థ తిరిగి వస్తాడని ఏమిటి? ఊరికే మాయంకావడం కాదు. అతనితో పాటు లక్షలు మాయమయ్యాయి. డబ్బు కాజేసి ఎవరైనా అతన్ని చంపేసి ఏ రహస్య స్థలంలోనో పాతేసి వుంటే సిద్దార్థ కథ అలాగే ముగిసిపోవచ్చు. అసలు సిద్దార్థ ప్రాణాలతో వున్నాడో లేదో!
ఇలా ఆలోచించి "ఛీ.....ఛీ...." నా మనసు ఇలా పరిపరివిధాల పోతున్నదేం? నేను ఎవరికీ అపకారంచెయ్యలేదు. భగవంతుడు నాకు అపకారం చేస్తాడా?' అనుకునేది సీతమ్మ.
ఇలాంటి ఆలోచనలే శృతికీ వచ్చేవి. తల్లితో అంటే ఆవిడని బాధ పెట్టినట్టు అవుతుందని "అన్నయ్య ఏదో ఓ రోజు చటుక్కున ప్రత్యక్షమవుతాడు చూడమ్మా!" అనేది.
తిని కూర్చుంటే వున్న డబ్బు ఖర్చయి చిప్ప చేతికొస్తుంది. ఒక్కొక్క రాయి తీస్తున్నకొద్దీ కొండంత రాళ్ళ గుట్టకూడా తరిగిపోతుంది. ఈ సత్యం తెలిసే శృతి ఉద్యోగాల వేటలో పడింది. పెద్దలిచ్చిన ఆస్తి వెనకేమీ లేదు. భర్త మరణించిన తర్వాత సీతమ్మ ఎంతో కష్టపడి ఇద్దరు పిల్లల్ని రెండు కళ్ళులా చూసుకుంటూ పెంచి పెద్ద చేసింది. చదువు పూర్తి కాగానే రైల్వే ఉద్యోగమొచ్చింది సిద్దార్థకి. నాలుగు వేళ్ళూ నోట్లోకి పోతూ, రేపటి రోజుకికూడా దాచుకుని ప్రశాంతంగా బతుకుతుంటే మాయదారి మనుషులో, మాయదారి దేముడోగాని వాళ్ళకి పెద్దకష్టమే తెచ్చిపెట్టాడు. శృతి ప్రయత్నాలు లాగానే వున్నాయిగాని, కించిత్ ఫలితం దరిదాపుల్లో కనిపించలేదు.
ఏదో కంపెనీలో ఖాళీగా వుందంటే వెళ్ళివచ్చిందిశృతి.
నిస్త్రాణగా వచ్చి కుర్చీలో కూలబడిన శృతిని చూసి "అక్కడా ఖాళీ లేదామ్మా?" అంటూ మంచినీళ్ళు అందించింది సీతమ్మ.
గటగట గ్లాసెడు మంచినీళ్ళూతాగి గ్లాసు కింద పెట్టింది.
"ఖాళీ వుందమ్మా! అయితే, అది నాకోసం కాదు. వాళ్ళ వాళ్ళ తాలూకు చుట్టంకోసం" అంది శృతి.
"బి.ఏ. ఫస్టు క్లాసులో ప్యాసయ్యావుకదే?"
"ఫస్టుక్లాసులో ప్యాసయినవాళ్ళు ఈ దేశంలో కోటిమందికి తక్కువ ఉండరు. ఫస్టు క్లాసు కాదమ్మా వుండాల్సింది. రికమండేషన్, అక్కడికీ రెండుచోట్ల పరమశివంగారు చూశారు. మా దురదృష్టంకొద్దీ పనికాలేదు. ఇదివరలో చాలామంది చేసే తప్పు నేనూ చేశానమ్మా!"
"తప్పా?"
"ముమ్మాటికీ తప్పే. చదువుకుంటే చాలని, అదే పెద్ద ఉద్యోగం తెచ్చిపెడుతుందని ఏ డిగ్రీయో చదవడం, ఆ పై గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోడం చేస్తున్నాము. ఏ టెయిలరింగో, మరొకటో నేర్చుకుని వుంటే మిషను కుట్టుకుంటూ బతకవచ్చుకదమ్మా!"
"అందరూ టెయిలరింగు నేర్చుకుంటే గుడ్డలు కుట్టించుకునేవారు ఉండరమ్మా! దానికే పెద్దలంటారు! అందరూమేనా ఎక్కి తిరిగితే మోసేవాళ్ళు వుండవద్దా అని. ఒక్కో సారి ఎన్నో పనులు చేతనై వుండి, చేతిలో పనితనం వుండి విధికి బానిసలయి పడివుంటారు. పంచపాండవులు విరాటరాజు కొలువులో పనివాళ్ళుగా చేరవలసి వచ్చిందా లేదా?"
"అబ్బబ్బ-అమ్మా! నువ్వెప్పుడూ జీవితాల్లోకి రామాయన భారతాలు తెస్తావేమిటమ్మా!" విసుక్కుంది శృతి.
"రామాయణ భారతాల్లోకంటే విధిచేసే వింతలు ఏ కథలోనూ లేవు, ఎవరి జీవితాల్లోనూ లేవు" అంది సీతమ్మ.
శృతి చిరాగ్గా ఏదో అనబోయి శ్రీదేవి రావటం చూసి మాట ఆపేసింది.
"రావచ్చా?" అంటూనే శ్రీదేవి లోపలికి అడుగు పెట్టింది.
"ఇది నీ యిల్లే రారా." అంది శృతి ద్వంద్వార్థంగా.
మరొకసారయితే శృతి అన్నదానికి శ్రీదేవి సిగ్గుపడేదే. ఇప్పుడు బుగ్గలు ఎర్రబడే స్థితికాదు, భారంగా నిట్టూర్పు విడిచి శృతి పక్కకొచ్చి కూర్చుంది.
నిన్నటికి ఇవాల్టికి మార్పేమీ లేదు, కొత్తమాట లేముంటాయ్?
సీతమ్మ కాఫీ కలుపుకు రావటానికి లోపలికి వెళ్ళింది.
శ్రీదేవి మాట్లాడిస్తుంటే పొడి పొడిగా జవాబులు కూర్చుంది శృతి.
15
ఊళ్ళోనే చిన్న గదిలోకి మారారు తల్లీ కూతురూను, గదిముందు టెర్రేష్, మెష్షూవున్న పంచవుంది. దాన్ని గది అనవచ్చు. దాని తీరు అలా వుంది. దాని అద్దె అరవై అయిదురూపాయలు.
సొంత ఇల్లులాంటి క్వార్టర్స్ పోయింది.
సిద్దార్థ జీతమూ పోయింది.
అసలు సిద్దార్థే కనపడకుండా పోయాడాయె.
తను దిగులుపడి మంచంపడితే శృతిని చూసే దెవరన్నట్లు సీతమ్మ పేరుకి లేచి తిరుగుతున్నది.
తల్లి బాధ రెట్టింపు చేయడమే అవుతుందని పైకి మామూలుగా వుంది శృతి. లోలోపల కుంగిపోతున్నది.
శ్రీవాస్తవ హేండ్ లూమ్ బట్టలకొట్టు చాలా పెద్దది. అక్కడేదో ఉద్యోగం వుందని తెలిసి తనంతట తానుగా వెళ్ళింది శృతి.
"ఎవరు చెప్పారమ్మా వుందని?" అంటూ యక్షప్రశ్న లేసి, చివరికి నాలుగురోజుల క్రితం వస్తే బాగుండేది. ఇప్పుడేం ఖాళీలేదు" అంటూ చావు కబురు చల్లగా చెప్పారు.
కాళ్ళీడ్చుకుంటూ ఇంటికీ బైలు దేరింది శృతి.
బజారంతా కిటకిట లాడుతున్నది. ఎదురొచ్చే మనుషులను తప్పించుకుంటూ శృతి నెమ్మదిగా నడుస్తున్నది.
చిన్నకారు, రిక్షా ఢీ కోనబోయాయి. చిన్న కారతను సడెన్ బ్రేక్ వేశాడు.