Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 17

    "మీ జేబులో  పెద్దబచ్చలాకంత  డైరీవుందే  అదిలేకుండా  మీరు బైటకి రారా? మీ దగ్గరికి  వచ్చింది మొదలు నేను చూస్తున్నాను. రోజూ జరిగినవన్నీ  డైరీలో రాసే  అలవాటా?" అని అడిగాను.

    "ఇది నిన్నా_ఇవాళా  వచ్చింది కాదు సరోజా! నేను చదువుతున్న రోజుల నుండి  అంటే 1929నుండి నాకు డైరీలురాసే అలవాటుంది. 'అవి ఇప్పుడు ఏవి' అని మాత్రం  అడగకు వున్నాయనుకోను" అన్నారు.

    "ఏవండీ అసలు మీరు డబ్బింగ్ కంటూ రాసిన  మొట్టమొదటి  చిత్రం ఏదండి?" అని అడిగాను.

    "నీరా ఔర్ నందా_అనే హిందీపిక్చర్. అయినప్పటికీ  అంతకు ముందు వచ్చిన 'కాలచక్రం' అనే పిక్చర్లో నా 'మరో ప్రపంచం' అనే గేయం వచ్చింది. గేయమైతే ఎక్కిందిగానీ డబ్బు ఇప్పటికీ నాకు అందలేదు. అది వేరేసంగతి అనుకో" అన్నారు. (ఆ చిత్రం 1950లో  అని వారు నాతో చెప్పినట్టు  జ్ఞాపకం. సంవత్సరం పొరపాటు అయితే  అది నాతప్పు కావచ్చు)

    "ఇక ఇంటికి వెళదామా" అన్నారాయన.

    నేను ఇంట్లో  అడుగుపెట్టేసరికి  అందరూ  నాకోసమే  అన్నట్టు  కాచుకూర్చున్నారు.

    "అక్కియా మనింటికి  శ్రీశ్రీగారి  పెళ్ళాం  వచ్చివెళ్ళిందే" అని మా ఆఖరి చెల్లి అమ్మలు (చాలా చిన్న పిల్ల) పరిగెత్తుకొని  వచ్చి చెప్పేసింది.

    నేను నిజంగానే  ఆశ్చర్యపోయాను. ఫైల్సన్నీ  అలమారులో పెట్టి "ఏమిటి జరిగింద"ని  అడిగాను.

    "నిన్ను శ్రీశ్రీగారికిచ్చి  పెళ్ళి చెయ్యమని ఇంతసేపూ ఆవిడ  గొడవచేసి వెళ్ళారమ్మా" అని మా నాన్నగారు చెప్పారు.

    "నిజంగానా?" అని అడిగాను.

    "అవునమ్మా! నేనొప్పుకుంటున్నాను నాకేమీ  అభ్యంతరం లేదంటూ  అరగంట మాట్లాడార"ని చెప్పారు.

    ఈ హఠాత్పరిణామానికి  ఆశ్చర్యం  వేసింది.

    శ్రీశ్రీగారితో  మర్నాడు  ఆఫీసులో కూర్చున్నాను. వాళ్ళావిడ  వచ్చిన సంగతి  మావాళ్ళతో  మాట్లాడిన విషయాలు చెబుతూ_

    "ఆవిడెందుకింత త్వరగా  మారిపోయార"ని  అడిగాను.

    "నేనూ ఇంటికి వెళ్ళగానే  అన్ని విషయాలు చెప్పింది సరోజా! 'ఈ నిర్ణయాని కెందుకొచ్చావ'ని అడిగాను. 'దానిసంగతి  నాకు బాగా తెలుసు. మిమ్మల్ని  కాదని పోయేదైతే  ఎప్పుడో పోయివుండేది. నేను మిమ్మల్ని వదిలినా అదిమాత్రం  వదిలేఘటం  కాదన్న సంగతి నాకు బాగా తెలుసు. పైగా  నాతో పందెంకూడా కట్టింది' అని చెప్పి నవ్వింది" అన్నారు.

    ఆవిడమీద కృతజ్ఞతతో  కళ్ళలో నీళ్ళుతిరిగాయి. జీవితంలో ఏ స్త్రీ  చేయని పని ఆవిడచేస్తోంది. ఆవిడకి చాలా  రుణపడతాను.

    భవిష్యత్తులో  మేమిద్దరం కలిసే యోగం  అంటూవుంటే మాత్రం  ఆవిడ మాటకు ఎదురుచెప్పి  ఆవిడ మనసు నొప్పించేలా  ప్రవర్తించకూడదని  గట్టిగా  నిశ్చయించుకున్నాను.

    "ఏమిటాలోచిస్తున్నావ"ని  అడిగారు.

    "మీ ఆవిడ  గురించే" అన్నాను.

    "దానిసంగతి  నాకుతెలుసు  సరోజా! మీ ఇద్దరు నాకోసం  పడిచస్తారు. పోతే అది నేనేంచెప్పినా  నామాట వింటుంది. నువ్వు వినవు. నేనుగంగలో  దూకమన్నా  అది దూకుతుంది" అన్నారు.

    "గంగలో అయితే నేనూ  దూకుతాను  అది వేరేసంగతి. కానీ ఆవిడకి నేను జోహాలు చేస్తాను" అన్నాను.

    "నువ్వే దాని పొజిషన్ లో వుంటే  నేనింకో  పెళ్ళి చేసుకోడానికి  ఒప్పుకుంటావూ?" అని అడిగారు.

    "నెవర్_నాకంఠంలో ప్రాణంవుండగా  ఒప్పుకోను. మీ విషయంలోనేను  వినని మాట అదొక్కటే. అందుకే ఆవిడకి సరండరై  పోయానని అంటున్నానుగా" అని అన్నాను. (నా నోటంట  ఆ మాట అనిపించి  ఎంత మురిసిపోయేవారో చెప్పలేను)

    "అంతేకానీ నాకిష్టమైన పనిమాత్రం చెయ్యవు అంతేగా?" అన్నారు.

    "ఇప్పుడవన్నీ  ఎందుకుగానీ ఈపూట  అయినా కంపెనీ పని చేద్దామా?" అని అడిగాను.

    "నేను  రాసేమూడ్ లో లేను సరోజా! సర్ ప్రయిజ్_మా ముసిల్ది (రవణమ్మగారిని ఆయన అప్పుడప్పుడూ  అలా అనేవారు) ఇంత ఈజీగా  ఒప్పుకుంటుందనుకోలేదు. అయామ్ వెరీ హేపీ. ఏదైనా  సినిమాకి వెళదామా?" అన్నారు.

    "పెళ్ళి కాకుండానా? నథింగ్ డూయింగ్. మావాళ్ళు  చీల్చేస్తారు" అన్నాను.



                                           *    *    *    *


    1958 నవంబర్ నెలలో రవణమ్మగారి అనుమతితో  శ్రీశ్రీగారూ నేనూ మామూలుగా పెళ్ళిచేసుకున్నాం. అంటే_వారికి గుళ్ళూ  గోపురాలూ  ఇష్టంలేదు కదా? ఆడంబరం  లేకుండా  స్నేహితుల్ని, కావలసిన ముఖ్య బంధువుల్ని  మాత్రం  పిలిచి నా మెడలో తాళికట్టారు. ఆ రోజు తేదీ 15_11_1958.

    "నాకే పిల్లలు పుట్టలేదు. నీకేం పుడతారులే" అన్నారు రవణమ్మగారు. శ్రీశ్రీగారు కూడా  "శ్రీశ్రీ పిండాన్ని మోసేటంత శక్తి  ఏ ఆడదానికీ  లేదు" అన్నారు.

    "నేను కంటే" అన్నాను.

    మాటా మాటా అనుకున్నాం అలా పందాలులోకి దిగాం. నేను బెట్ కట్టాను.


                               రవణమ్మగారి మంచితనం


    పెళ్ళయిన  రోజే ఇద్దరం మూడు రోజులు  బెంగుళూరులో వుండేటట్టు రిటన్ ప్లయిట్ టిక్కెట్లు  కొనేసుకొని బెంగుళూరు వెళ్ళిపోయాం. మూడురోజులు బెంగుళూరు ఉడ్ లాండ్స్  హోటల్లో  వుండాలనుకున్నాం.

 Previous Page Next Page