అమృత కన్నార్పకుండా, మూతి బిగించి సీరియస్ గా చూస్తోంది. ఇంతలో టేప్ లోంచి మళ్ళీ వినిపించింది.
"ఆ....స్నఫ్ కలర్ టీ షర్టులో చాలా అందంగా వున్నావ్ కానీ రాజశేఖరం...త్వరగా స్నానం చేసి వచ్చెయ్యి. ఇప్పటికే నీ జయంతిని మధ్యాహ్నం నుంచి చాలా ఏడిపించావు."
ఎగిరి గంతేసి బాత్ రూమ్ వైపు వెళ్ళబోయాడు.
మళ్ళీ టేప్ లోంచి "ఆ 'కోమలాంగి' ని తల్చుకుంటూ నాతో రమించక" అని వినిపించింది. కసిగా దాని పీకె నొక్కేసి వెళ్ళాడు.
అమృత పెదాలు బిగపట్టి నవ్వాపుకొంటోంది.
కాస్సేపటికి బాత్ రూంలోంచి 'అమ్మో' అని కేక వినపడింది. అది తనని బాత్ రూమ్ లోకి లాగటానికి అతడు పన్నిన యుద్దవ్యూహం అనుకుని గమ్మున వుండిపోయింది కానీ, ఆ తరువాత నిశ్శబ్దం అనుమానాన్ని రేకెత్తించింది.
బాత్ రూంలో హర్ష నడుం పట్టుకుని "అయ్యో" అంటున్నాడు. మరి అది నాటకమో...నిజమో తెలియలేదు.
"ఏమైంది ఆంజనేయా?" కాస్త ఆందోళనగా అడిగింది.
"తొందరలో, చూసుకోకుండా బకెట్ తనని అబ్బా! పడిపోయాను. లక్కీగా పూర్తిగా ఒకటే తన్నెయ్యలేదు. నడుంలో కలుక్కుమంది. కాస్త చెయ్యి అందించు అమృతా..." అడిగాడు. మూలుగుతూ నగ్నంగావున్న అతడికి టవల్ చుట్టి చెయ్యి ఆసరా ఇచ్చి, బైటికి తీసుకువచ్చింది.
కాస్సేపయ్యాక అమృత స్వీట్సు తింటూ హర్ష నడుంమీద ఎక్కి తొక్కసాగింది.
బోర్లా పడుకున్న హర్ష "ఆహా...ఓహో" అంటూ తన్మయంగా-
"నడుం బెణకడంలో ఇంత హాయి వుందని నాకు తెలియనే తెలియదు సుమా! ఎంత బాగుందో! స్వర్గం కనిపిస్తోంది" అన్నాడు.
అమృత తొక్కడం ఆపి, నిలబడి సీరియస్ గా అడిగింది.
"రేపట్నించి కొంపదీసి దానికన్నా ఇదే బాగుంది, ఇలాగే....కానీ అంటావా?"
ఆమె మాట పూర్తి చెయ్యకుండానే హర్ష పెద్ద పెట్టున నవ్వుతూ, వెల్లకిలా తిరిగేసరికి, ఆమె పట్టుతప్పి అతని చాతీమీద వాలిపోయింది.
* * *
హర్ష బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు. అప్పుడే ఏడు దాటిపోయింది. రోజూ ఆపాటికి అమృత లేచి వంటింట్లో పని చేసుకుంటోందనడానికి నిదర్శనంగా సుప్రభాతం విన్పిస్తూ వుంటుంది. "ఇంకా ఈ రోజు లేవలేదా?" అని పక్కకు తిరిగి చూశాడు.
పక్కకి తిరిగి పడుకుని కళ్ళు విప్పార్చుకుని, ముగ్ధ మోహనంగా హర్షనే చూస్తోంది అమృత.
"లేవలేదేం? ఒంట్లో బాగా లేదా?" నుదురు తాకుతూ అడిగాడు.
"అయితే రాత్రి నేను చెప్పింది మర్చిపోయావన్నమాట..." అలకగా అడిగింది.
"రాత్రి...ఏం చెప్పానబ్బా?" అతను ఆలోచించాడు. "సైగల్ నుండి బాబా సెహగల్ వరకూ మాట్లాడుకున్నాం కదూ?"
"అది కాదు"
"శరత్, చలంల స్త్రీ వాదం గురించా?"
ఆమె కాదు అన్నట్టు తల అడ్డంగా వూపింది.
"రాజ్ కపూర్ సినిమాలు బాగుంటాయా, లేక గురుదత్ వి బాగుంటాయా అని చర్చించుకున్నాం...అదీ కాదా? వింబుల్దన్ గురించా మరి?"
"అబ్బా పడుకునే ముందు చివరిగా ఏం అనుకున్నామో గుర్తు లేదా?" గట్టిగా అడిగింది.
గుర్తొచ్చినట్టు "అదా?" అని ఆ తరువాత సీరియస్ గా "ఛీ నేను పగలు బూతు మాటలాడను" అన్నాడు.
"నీ తలకాయ! ఆదివారం రోజున నువ్వూ నేనూ ఒకళ్ళ పనులు ఒకళ్ళు చెయ్యాలని అనుకోలేదూ?" అడిగింది.
అతను అప్పుడే గుర్తొచ్చినట్టు "ఓ అదా!" అని అరచి "సారీ డార్లింగ్, ఇప్పుడే 'టీ' తెస్తానుండు" అని ఉషారుగా బెడ్ దిగబోయాడు.
"ఏయ్ ఇటురా" పిలిచింది.
అతను దగ్గరకు రాగానే, తన మీదకు లాక్కుని గట్టిగా కౌగలించుకుంది.
హర్ష ఆమెని తమకంగా అల్లుకుపోతుంటే, "అలా కాదు; నువ్విప్పుడు నా భార్యవి అన్నమాట. వదలండి. వంటింట్లో చాలా పని వుంది అనాలి" గుసగుసగా చెప్పింది అతని చెవిలో.
హర్ష అలాగే చెప్పాడు. (పది నిమిషాల తరువాత)
ఆమె మొహం కడుక్కుని ముందు గదిలోకి వచ్చేసరికి 'టీ' పట్టుకుని రెడీగా వున్నాడు హర్ష.
"ఒక కప్పు టీ కలవడానికే అలా ఏబ్రాసిగా తయారయితే ఎలా డియర్? చూడు లాల్చీ మీద ఆ టీ మరకలూ" అంది.
హర్ష లాల్చీవైపు చూసుకొని "అరే...రే, చూసుకోలేదు" అన్నాడు.
"మీ ఆడవాళ్ళు ఇలా వుంటేనే, క్లబ్బులూ, స్నేహితులూ, అని బైట తిరగబుద్ది అవుతుంది మాకు" అంది సీరియస్ గా.
"ఇప్పుడే స్నానంచేసి కడిగిన ముత్యంలా తయారయి వస్తాగా" అని అతను చప్పున బాత్ రూం లోకి వెళ్ళిపోయాడు.
అమృత పేపర్ చదవసాగింది.
హర్ష స్నానం చేసి వచ్చి, అచ్చు భార్య చేసినట్లే పూజ చేస్తూ అపస్వరాలతో మంగళహారతి పాడుతుంటే, అమృత నవ్వు ఆపుకోలేక పోయింది.