"ఐతే వెళ్ళిపోతాను...." లేచి నిలబడి రోషంగా చెప్పింది.
"హర్షకి జాలేసింది "అమృతా ఇంతకీ ఏం పనిమీద వచ్చావు?" అన్నాడు సౌమ్యంగా.
"చెప్పానుగా బోర్ గా వుందని!"
"చక్కగా ఏదైనా మంచి పుస్తకం చదువుకో, మ్యూజిక్ విను లేకపోతే ఏదైనా కొత్తరకం వంటలు ట్రైచెయ్యి."
"చాలు చాలు. ఇంకా లిస్టు ఆ పెయ్యి, ఇవన్నీ పెళ్ళికి ముందు చేసేదాన్ని ఇప్పుడేం ఖర్మ?"
"అయితే ఇప్పుడేం చేస్తానంటావ్..." అని ఆగి "...ఓయ్ అదా నీ గొడవ కుదరదు. ఇప్పుడు ఇంటికి రాలేను. సాయంత్రం కావాలంటే త్వరగా వస్తాను" అన్నాడు.
"ఏం బిజీగా వున్నారూ? పది నిమిషాల నుంచి మీరు ఖాళీగా వున్నారు" అంది ఉక్రోషంగా.
"లేదు! అమృ...., నువ్వు వచ్చేముందు తల ఎత్తాను. అంత వరకూ చాలా బిజీగా వున్నాను. ఇటు చూడు?" అని వేలు పెట్టి తన ముందు వున్న ఫైల్సు చూపించాడు. "ఇవన్నీ ఓసారి చూసి, సంతకాలు పెట్టాలి. తేడా పాడా వస్తే కష్టం, లక్షల్లో పని!" అన్నాడు చిన్నపిల్లని బుజ్జగిస్తున్నట్టు మొహంపెట్టి.
అమృత కొద్దిగా నవ్వి "సరే అయితే సాయంత్రం, త్వరగా రండి, వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి...ఇంకా మధువన్ నుంచి స్వీట్సు కూడా" అంది రహస్యం చెప్తున్నట్టు.
హర్ష నవ్వి. "ఓ....కే" అన్నాడు.
తలుపు తీసుకుని బైటికి వెళ్ళి, అంతలోనే వెనుతిరిగి "చెప్పడం మరిచాను! ఆ కోమలి కోసం 'టైం' వేస్టు చేసుకోకండి బుచ్చిబాబుగారూ, ఆమె రాదు" అని ఫకాల్న నవ్వి, "అర్ధం అయిందా ... మొద్దు" అంటూ వెక్కిరించింది.
హర్షకి అర్ధం అవడానికి ఓ నిమిషం పట్టింది. "అమ్మ రాక్షసీ! ఎంత బాగా గొంతు మార్చావూ!" అన్నాడు పేపర్ వెయిట్ తీసి కొట్టేటట్లు చెయ్యెత్తి.
"చూశారా మరి. పెళ్ళయ్యేసరికి పెళ్ళాం ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న విషయం మర్చిపోయారు."
"అంటే...రామాచారి?"
"ఆహా! రామాచారి కూడా అమృత-అమృత కంఠ జనితుడే. అయినా భార్యతో ఫోన్ లో రెండు నిమిషాలు మాట్లాడితే టైం వేస్టు అనుకునేవాళ్ళు కూడా ముక్కూ మొహం తెలియని అమ్మాయి కోసం పావుగంట పైగా వేస్టు చేస్తారా" అంది అల్లరిగా.
హర్ష ఏమీ మాట్లాడకుండా క్షమించమన్నట్టు చెంపలు వేసుకుని అభినయం చేశాడు.
అమృత నవ్వి వెళ్ళిపోయింది.
* * *
హర్ష ఒక చేత్తో పూలపొట్లం, మరో చేత్తో స్వీట్ ప్యాకెట్ పట్టుకొని లోపలికి వస్తూండగా, డోర్ తీసిన చప్పుడుకి అమృత కూడా బైటికి వచ్చింది.
ఎరుపు అంచున్న తెల్లని వెంకటగిరి జరీ చీరలో, తలంటి పోసుకుని అలాగే వదిలేసిన కురులతో, మన్మోహనంగా వుంది అమృత.
"అమ్రూ..." అంటూ తనవైపు వస్తున్న హర్షని చూసి ఠక్కున మూతి తిప్పి లోపలికి వెళ్ళిపోయింది.
హర్ష ఆమె వెనకాలే బెడ్ రూమ్ వైపు నడుస్తుంటే వినిపించింది. "ఆగండి....నేను మీతో ఇవాళ కాసేపు మాట్లాడదలచుకోలేదు. అలిగాను."
అతను అమృత వైపు చూశాడు.
ఆమె పెదవులు బిగించే వున్నాయి. మళ్ళీ దూరం నుంచి ఓ స్వరం వినిపించింది "ప్లాస్కులో కాఫీ వుంది త్రాగితే స్నానం చేసి రండి."
అతను ఆశ్చర్యంగా అమృతనే చూశాడు. పెదవులు కదలకుండా మాట్లాడే విద్య ఎక్కడ నేర్చుకుందా? అని.
"కేవలం స్వయంగా మాట్లాడను అంటే!" అని కిసుక్కున నవ్వు.
అప్పుడే అర్ధమయింది అతనికి! ఆ శబ్దం టేప్ రికార్డర్ లోంచి అని. తనూ నవ్వి "సారీ డియర్...గుంజీలు తియ్యమంటావా?" అన్నాడు చెవులు పట్టుకొని.