Previous Page Next Page 
తల్లి మనసు కధలు పేజి 18


    "నీవెవరో నాకు తెలియదు పొమ్మన్నాడు.... కావలిస్తే ఈ డబ్బు పట్టికేళ్ళు మావాడి జోలికి రాకు యింక" అన్నాడు ఆ తండ్రి. చేతిలో ఓ ఐదొందలు పెట్టి విసిరి మొహాన్న కొట్టుదామనుకున్నా....యీ నష్ట పోయిందానికి తోడు. ఆ డబ్బు కూడా నష్టపోయి అగచాట్లు పడేకంటే తీసుకోడమే మంచిదని తీసుకున్నాను. బ్రతకడానికి డబ్బు కంటే ముఖ్యమైనది ఏముంది? ఆ డబ్బే ప్రస్తుతం నా జీవనాధారం. ఏదో వుద్యోగం  దొరికే వరకు ఆ వూరి నుంచి యీ వూరు వచ్చి..... మొగుడు వదిలాడనో, చచ్చాడనో చెప్పి లోకాన్ని నమ్మించి, ఏదో అదృష్టం కొద్ది ఆ వున్న చదువుతో జీవనాధారాన్ని వెతుక్కోవడం నా ప్రస్తుత కర్తవ్యం "...... ఆయాసంతో ఆగింది ఆమె.
    'అసలు మీరు యిద్దరికీ ఎలా పరిచయం అయింది." ఆసక్తిగా అడిగింది.
    "ఏముంది మాయింటి ప్రక్క యింట్లో వుండేవారు. కాలేజీ చదువుకు తెలిసీ తెలియని వయసు తొలి యవ్వనపు పొంగు. అంతకంటే ఏం కావాలి కాలు జారడానికి మోసపోవడానికి.'
    తత్తరపడింది వనజ ఒక్క క్షణం .
    "పోనీ మీ యింటికెళ్ళి క్షమాపణ అడిగితె మీవాలలు మళ్ళీ రానిచ్చి వుండేవారేమో?"
    "ఏం మొహం పెట్టుకు పెడతాను ? ఆ గుమ్మం త్రొక్కే అర్హత ఆనాడే పోగొట్టుకున్నాను. అక్కడికి ఆశ చావక మమకారం చంపుకోలేక ఓ రాత్రి ఆవూరు వెళ్ళి మాయింటి వాళ్ళ గురించి అరా తీశాను. నేను శలవలకి అమ్మమ్మగారింటికి వెళ్ళి అక్కడ హటాత్తుగా  కలరా వచ్చి చనిపోయానని చెప్పి, ఓ ఏడుపు ఏడ్చి అందరిని నమ్మించి పరువు కాపాడుకున్న వాళ్ళ దగ్గిరికి , మళ్ళీ వాళ్ళ పరువు ప్రతిష్టలు బజారు పాలు చెయ్యనా? వాళ్ళని సంఘంలో తలెత్తుకోకుండా చేయడానికి మనస్కరించలేదు....
    చావాలంటే చావడానికి చాలా మార్గాలున్నాయి.... కాని చచ్చి ఏం సాధిస్తాను? బ్రతకండి.... ఏనాటికైనా ఆ నీచుడి మీద పగ సాధించడానికే బ్రతకాలని నిశ్చయించుకున్నాను ....నాకు చేసిన అన్యాయానికి ఆ వంచకుడి మీద పగ తీర్చుకోడాని కైనా ఎన్ని కష్టాలయినా భరించి బ్రతకాలను కున్నాను....' పళ్ళు బిగించి వేగంగా, కఠినంగా అన్న మొహంలోకి చూస్తూ జంకింది మనసులోనే వనజ.
    "యిదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా అమ్మా..... నాలాగా ఏ ఆడపిల్లా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించకూడదని నా కోరిక. అలాంటి వంచన నించి ఏ ఒక్క ఆడపిల్లని రక్షించినా నాకెంతో తృప్తిని యిస్తుంది..... అసలు నాకేమనిపిస్తుందో తెలుసా ఒకేసారి. నలుగురూ ఏమనుకున్నా సరే. నా మొహం మీద ఉమ్మేసినా సరే ....నాకు జరిగిన అన్యాయం ఊరంతా చాటాలనిపిస్తుంది.... కనిపించిన ప్రతి ఆడపిల్లతో మగవాడి దౌర్జన్యం ఆడదాని అసహయతని రుజువు చేస్తూ నా గాధ చెప్పి నాలాంటి ఆడపిల్లల కళ్ళు తెరవాలనిపిస్తుంది. నాలాగా ఏ ఆడపిల్లా కళ్ళు మూసుకు ప్రవర్తించకూడదని నా కోరిక.... ఇలాంటి దుస్థితితో ఏ అమాయకురాలు చిక్కుకూడదని నా ఆశ!....' నిట్టురుస్తూ బయటికి చూసిందామె.
    యీ గొడవలో .... యీ మాటలతో వర్షం దారిన వర్షం చక్కాపోవడం యిద్దరూ గుర్తించలేదు. ఆమె ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టు ఉలిక్కిపడి గభాలున లేచి, వంగి వనజ చేతిన వున్న వాచీ టైము చూస్తూ అమ్మయ్యో పావుతక్కువ పదకొండే....టైమయిపోయింది....యింతసేపూ నావళ్ళే తెలియలేదు".... స్వాగతం చెప్పుకుంటూనే వడివడిగా మెట్లు దిగివెళ్ళి పోయింది ఆమె.
    వర్షం వెలిసిందని తను వెళ్ళాల్సిన చోటికి వెళ్ళాలన్న మాట కూడ మరచి వనజ అలా ఆమె వెళ్ళిన వైపే చూస్తూ అచేతనంగా కూర్చుండి పోయింది. ఆమె మాటలని మననం చేసుకుంటూ ఆమె స్థానంలో తనే వున్నట్టు వూహించుకుని మనసులో భయంతో గజగజలాడింది.
    తనే అలాంటిపని చేస్తే తల్లిదండ్రులు ఏమయిపొతారు, యీ పరువు ప్రతిష్ట తన తల్లి దండ్రి తను అలాంటి పని చేస్తే మళ్ళీ తన మొహం చూస్తారా?" ఇంట్లోకి రానిస్తారా?...
    ఆమెలాంటి స్థితిలో తనుంటే....ఆమెలా పరిస్థితులాని దైర్యంగా ఎదుర్కొనే శక్తి తనకుందా? ఆ కష్టాలని నిష్టూరాలని భరించి బ్రతుకీడ్చగలిగే శక్తి తనకుందా! ఎండకన్నెరుగకుండా పెరిగిన తను ఆ బాధలు పడగలదా?.... ఆ పరిస్థితిలో ఆమె గాబట్టి ఆ మాత్రం ధైర్త్యం గా ఉంది. తనే అయితే ఏం చెయ్యాలో తోచని స్థితిలో పిచ్చిదయిపోవడం నిజం.
    ఆఖర్న ఆమె చెప్పిన మాటలు పాపం ఎంత బాధపడి ఎంత అనుభవంతో చెప్పింది. పాపం అభాగ్యురాలు .
    ఎంతసేపు ఆలోచనలో అలా కూర్చుండిపోయింది వనజ. చాలాసేపటికి నిట్టూర్చి , భారంగా లేచి లోపలికి తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. గాడ్రెజ్ బీరువా తెరచి లోపల నగలపెట్టెలు అరడజను మంచం మీద పరచింది. హేండు బేగులోంచి చిక్కుపడిన అన్ని నగలు ఒక్కొక్క సెట్టు విప్పి విడివిడిగా వేటి పెట్టిలో అవి పెట్టేసింది. ముత్యాల సెట్టు, రాళ్ళ సెట్టు, అరురకాల సెట్లని ఆరు పెట్టెల్లో సర్ది బీరువాలో యధాస్థానంలో పెట్టేసింది. హేండు బాగులోంచి వంద రూపాయలు నోట్లు పది తీసి చీరల కింద యధాప్రకారం పెట్టేసింది. ఒక చిన్న దంతం పెట్టె తీసి దాన్లో ఉన్న ఉత్తరాలన్నీ ఒక్కక్కటే జాగ్రత్తగా చింపి వేస్టు పేపర్ బాస్కెట్ లో పారేసింది. అన్నీ అయ్యాక బీరువా మూసి తేలిగ్గా నిట్టూర్చింది.
    గది మధ్య నిలబడి ఒక్క క్షణం ఏదో ఆలోచించింది... ఏదో నిశ్చయించుకుంది ఆ క్షణంలో.
    డ్రెస్సింగ్ టేబిల్ ముందు కూర్చుని చెమట పట్టిన మొహాన్ని తుడుచుకుని పౌడరు అడ్డుకుంది.....రేగిన ముంగురులు సవరించుకుంది. హేండు బాగు తీసుకుని చెప్పులు తొడుక్కుని "నేను లలిత ఇంటికి నోట్సు తెచ్చుకోడానికి వెడుతున్నాను. ఒక్క అరగంటలో వచ్చేస్తాను అమ్మ అడిగితె చెప్పు " వీధిలో నున్న బంట్రోతు తో చెప్పి గేటు తీసుకుని రోడ్డు మీద నడవ సాగింది.
    "శ్యాం తో' చెప్పాలి....ధైర్యం వుంటే వచ్చి తిన్నగా నాన్నతో మాట్లాడి వప్పించి తనని పెళ్ళి చేసుకోమనాలి! అంతేకాని ..... శ్యాం మొహం చూసి తను కరిగిపోయా, ఆ మాటలని నమ్మేసి అతను చెప్పినట్లు ఎంతమాత్రం చేయకూడదు.....అసలు ఆ మాటలు వినకూడదు ....' త్రోవలో గట్టిగా నిశ్చయించుకుంది వనజ.
    వాన వెలిసి, మబ్బులు చెదిరి నిర్మలంగా వున్న ఆకాశం లాగే .....ఆలోచనలు, అనుమానాలు , భయాలు ఆందోళనలు అన్నీ తొలగి వనజ మనసు కూడా ప్రశాంతంగా వుంది ఆ క్షణాన.

                                                    ***

 Previous Page Next Page