శిక్ష
నీరెండల సాయంకాలం
అన్నపూర్ణ అనాధ శరణాలయం ' తెల్లని గేటు మీద సూర్యకిరణాల కాంతి ధగధగా మెరుస్తుంది. అంతకంటే మెరుస్తున్న నల్లని పెద్దకారు ఒకటి తెరిచే వున్న గేటు లోంచి దూసుకువచ్చింది. బాట కిరువైపులా ఉన్న రకరకాల సైజు మొక్కల్లాగే రకరకాల సైజుల్లో పిల్లలు నిలబడి చేతులు జోడించారు.
కారు తిన్నగా పోర్టికో లోకి వచ్చి ఆగింది. మానేజరు స్వయంగా తెరచిన తలుపులోంచి నల్లటి ఉలెన్ పాంటు , తెల్లటి జోద్ పూరీ కోటుతో, చేతికర్ర తో హుందాగా ఉన్న మాజీ జమీందారు రంగారావు గారు , ఆవెనకే ఖరీదయిన దుస్తులతో అధినికంగా తయారయిన మెరుపుతీగ లాంటి శ్యామలా దేవి దిగారు.
అక్కడ చేరిన గుమాస్తాలు, పిల్లలు, నౌకర్లు పెట్టిన నమస్కారాలు అందుకుంటూ మానేజరు దారితీయగా అనాధశారణాలయం అంతా తిరిగి చూశారు. పిల్లల గదులు, వంటశాలలు, భోజనశాలలు, ప్రార్ధనామందిరం . గార్డెను అంతా తిరుగుతూ చెయ్యవలసిన మార్పులు, ఉంచవలసిన రీతులు చెబుతూ మానేజరు కావాలని చెబుతున్న వాటికి తలవూపుతూ , అన్నీ తిరగడం పూర్తయ్యాక , విశాలమైన చోట గార్డెను లో ఏర్పాటు చేసిన సభలో కూర్చున్నారు. వెంట తెచ్చిన బట్టలు, పళ్ళు, మిఠాయిలు పిల్లలందరికీ శ్యామలాదేవి పంచి ఇచ్చింది. రంగారావు గారు పిల్లలందరినీ బుద్దిగా చదువుకోమని, మంచి పౌరులు కావాలని ఉద్భోచించారు. తరువాత మానేజరు దారి తీయగా ఆఫీసు రూములోకి వెళ్ళి జమాఖర్చులు , ఆదాయాలు, ఇతర లెక్కలు తనిఖీ చెయ్యడంలో మునిగిపోయారు. ఆ పరిశీలన ఇప్పుడే ముగియదని అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న శ్యామలాదేవి నెమ్మదిగా శరణాలయం లోపలి గదుల్లోకి దారితీసింది. వెంట ఆయా పున్నమ కూడా నడిచింది.
"పున్నమ్మా, బాగున్నావా?" నడుస్తూ నెమ్మదిగా అడిగింది శ్యామలా.
"ఎదోనమ్మా , ఇలా పడి ఉన్నాను. పసివాళ్ళను చూస్తూ వాళ్ళతో ఆడుతూ పడుతూ ఉంటే రోజులు దొర్లిపోతున్నాయి. ' నిమిషం ఆగి శ్యామల వంక ఆప్యాయంగా చూసి, 'అమ్మ, మిమ్మల్ని చూస్తె నాకెంత సంతోషమో తెలుసా? నా చేతుల్తో ఇక్కడే పెరిగి పెద్దదయిన మీరు ఈనాడు ఇంత ఉచ్చస్థితిలో ఉన్నారంటే .... ఎంత అదృష్టవంతురాలివి తల్లీ ! ఎంతమందికి ఉంటుంది ఇలాంటి అదృష్టం " అంది.
శ్యామల ముఖంలోకి ఒక్కసారి రక్తం పొంగి సిగ్గుపడింది. "అవును పున్నమ్మా! తలుచుకుంటే అంతా ఆశ్చర్యకరంగా వుంటుంది. ఎక్కడ నేను! ఎక్కడ జమీందారుగారు! అనాధగా పెరిగిన చోటుకే ఈనాడు యజమానురాలుగా వచ్చానంటే అదంతా జమీందారు గారి ఔదార్యానికి చిహ్నం."
'అవునమ్మా! ధర్మప్రభువులు ...." అంటూ నర్సరీలోకి దారి తీసింది పున్నమ్మ.
బెబికాట్స్ లో కూర్చుని కొందరు ఆడుకుంటున్నారు. నడక వచ్చిన పిల్లలు కొందరు అటూ ఇటూ నడుస్తున్నారు మరీ చిన్నపిల్లలు కొందరు నిద్రపోతున్నారు. రకరకాల వయస్సులతో నెలల పిల్లల నుంచి నాలుగైదు ఏళ్ళ దాకా ఉన్నారక్కడ. అలా వరసగా చూసుకుంటూ వెళ్ళి ఒక బేబికాట్ దగ్గిర ఆగిపోయింది శ్యామల. ముద్దులోలుకుతూ , బొద్దుగా తెల్లగా ఉన్న ఓ రెండేళ్ళ పాపను చూడగానే శ్యామల ముఖం లోకి ఒక్కసారిగా కాంతి వచ్చినట్లయింది. ఆ పాపను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ "పున్నమ్మా, ఈ పాప చాలా ముద్దుగా ఉంది కదూ." అంది.
'అవునమ్మా, ఎవరిపిల్లో? ఆ తల్లికి చేతులెలా వచ్చాయో, ఇలాంటి బంగారు బొమ్మని ఇలా దిక్కులేని దానిలా పారేయడానికి ?"
శ్యామల ముఖం వివర్ణమయింది. "ఇలాంటి పిల్లని ఇలా అనాధగా వదిలి వేయవలసి వచ్చిన ఆ తల్లి ఎంత దురదృష్టవంతురాలో! ఎంత బాధ పడిందో ఆమె మనసు" ఆమె కళ్ళలో నీరు చిమ్మింది.
"మీ మనసు మెత్తన గాని, ఒళ్ళూ పై తెలియకుండా ప్రవర్తించి, వాళ్ళ పాపఫలాన్ని ఇలా వీధి పాలు చేసినవాళ్ళకి బాధ ఉంటుందా, అమ్మా, పాపం, పసిగుడ్డు , తెల్లావారుజామున వీధి వరండాలో ఏడుస్తూ కనపడుంది. అందుకే మేనేజరు గారు ఉష అని పేరు పెట్టారు. ఎంత ముద్దులు మూటగడుతుందో చూడండి. ఎవరో పెద్దింటి పిల్ల లాగానే ఉంది. పాపిష్టి తల్లి చేసిన పనికి శిక్ష అనుభవిస్తుంది.
శ్యామల ఇంక వినలేకపోయింది. ఆ మాటలు ఆమెలో సూటిగా గుచ్చుకున్నాయి. పిల్లను పున్నమ్మకు ఇచ్చి భారంగా ముందుకు నడిచింది.
* * * *
అన్నపూర్ణ అనాధ శరణాలయం రంగారావు గారి తాతగారి కాలంలో అయన భార్య పేర కట్టించినది. అప్పట్లో కేవలం దిక్కులేని పిల్లలకు ఆశ్రయం కల్పించేదిగా మాత్రం ఉండేది. తరువాత రంగారావు గారి తండ్రి గారి హయాంలో ఇంకా ఎక్కువగా వసతులు, సదుపాయాలు సమకూర్చారు , ఉచితంగా మెట్రిక్ వరకు చదివించి, తరువాత వాళ్ళకో దారి అంటూ ఏర్పడేదాకా అక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేశారాయన.
కాలక్రమాన జమీందారులు పోయి జమీందార్లకే భరణాలు ఏర్పడ్డాయి. వారితో పాటు బారి అనాధశరణాలయానికి కూడా కొంత ముట్టచెప్పేది ప్రభుత్వం. తాహతుకు మించినదే అయినా రంగారావు గారు ఆచారం ప్రకారం శరణాలయాన్ని సాధ్యమైనంత చక్కగా తీర్చిదిద్ది అభివృద్దిలోకి తేవాలని కృషి చేస్తున్నారు యాజమాన్యం వహించి.
రంగారావు నలభై ఏళ్ళ మనిషి. ఆజానుబాహుడు. దృడమైన శరీరం, చూసేవాళ్ళకు గౌరవం, మర్యాద తో పాటు హడలు పుట్టించే లాగా ఉంటారు. అంతకన్న ముఖ్యం , అయన మనసు ఒకోసారి వెన్నకన్న మెత్తపడితే అవసరం వచ్చినప్పుడు వజ్రం కన్న గట్టిపడుతుంది. ఎంతటి ఔదార్యం , సహృదయత ఉన్నాయో, అంతటి పట్టుదల, మూర్ఖత్వం ఉన్నాయనిపిస్తుంది. పరువు ప్రతిష్టల కోసం ప్రాణం పెడతారు.
అయన మొదటి భార్య కూడా ఓ జమిందారు కూతురు. రెండు సంవత్సరాల క్రితం ఎనిమిది సంవత్సరాల కొడుకు, జమీందారు తమ్ముడు నారాయణరావు లతో బాటు, ఘోరమైన కారు ప్రమాదంలో చనిపోయింది. రంగారావు గారి తల్లి, ఆ ఘోర వార్త విని స్పృహ తప్పి యింక ఆ తరువాత మళ్ళీ కోలుకోలేక రోగంతో మంచమేక్కింది.
భార్య, కొడుకు పోయిన తరువాత చాలాకాలం మతిచేడినట్లు ఉండేవారు రంగారావు. ఒక్కసారే అంతటి దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఆయనకు లేకపోయింది. తరువాత తల్లి, ఇతరులు మళ్ళీ పెళ్ళి చేసుకోమని ఎన్నివిధాల చెప్పినా అయన వినిపించుకోలేదు. తమ వంశం ఈ విధంగా నిర్వంశం అయిపోతున్నందుకు ముసలి జమీందారిణి వ్యధ చెంది ఎన్ని విధాలుగానో కొడుక్కు చెప్పి విఫలురాలైంది.
తన జీవితంలో ఏర్పడ్డ శూన్యాన్ని ఎలాగైనా మరిచిపోవాలన్న ప్రయాసతో ఊరు వదిలిపెట్టి ఎప్పుడూ మద్రాసులో తిరుగుతుండేవారు రంగారావు.
ఓ సాయంకాలం పరధ్యానంగా, వేగంగా కారు నడుపుతున్న రంగారావుకు శ్యామల కారు కింద పడబోవడంతో స్పృహ వచ్చింది. ప్రక్కకు తిప్పి బ్రేక్ వేసినా, అప్పటికే శ్యామల కారు కింద పడడం, గాయపడడం, జరిగిపోయాయి. ఆమెను వెంటనే తీసుకువెళ్ళి ఓ ప్రవైటు నర్సింగు హోమ్ లో చేర్పించారు. ఆమెను చూడగానే ఏదో తెలియని ఆకర్షణ కలిగింది ఆయనకు. నాజూగ్గా, పచ్చగా తీర్చిదిద్దినట్లున్న ఆ రూపు, ఆయనను ఆకట్టుకుంది. తరువాత ఆమె ఆస్పత్రిలో ఉన్న ఇరువై రోజులు స్వయంగా వెళ్ళి యోగ క్షేమాలు విచారించేవారు. ఆ ఇరవై రోజులలో ఆయనకు శ్యామలతో ఎంతో సాన్నిహిత్యం కలిగింది.