"ఏం చదివారు మీరు ?' ఉద్యోగస్తురాలనీ తెలియగానే కాస్త కుతూహలంగా కలిగింది ఆమె పట్ల.
"యింటర్ ప్యాసయ్యాను.... ఏదో దేముడి దయవల్ల ఆ చదువైన వుంది గాబట్టి సరిపోయింది. లేకపోతే నాగతి వీధి పాలయ్యేది ..." తనలో తను అనుకున్నట్టు గొణిగింది ఆమె.
వనజ ఆశ్చర్యంగా చూసింది. "ఏం మీరెందుకు ఉద్యోగం చెయ్యాలను కుంటున్నారు/ మీ వారికేం ఉద్యోగం లేదా? యీ స్థితిలో మీరెందుకు పని చెయ్యడం ?' అదోలా నవ్వింది ఆమె.
"వారు శ్రీవారు వుండి వుంటే నాకీ పాట్లు ఎందుకు ?"
'అంటే చనిపోయారా?" ఆమెని పరిశీలించి చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది వనజ.
"హు చనిపోయినా ఏడుపు ఏడ్చి నా ఖర్మ అని సరిపెట్టుకునే దానిని...." కఠినంగా అంది ఆమె. తెల్లబోతూ చూసింది వనజ. వనజ మొఖంలో హావ భావాలు చూసి తన తొందరపాటుని కప్పిపుచ్చుకుంటూ "నాకు పెళ్ళి ఓ మొగుడు వుంటే నా బ్రతుక్కి ఇంకేం కావాలి?....' ఆ...మరి....మరి....మీరు...." అడగదలచుకున్న ప్రశ్న ఎలా అడగాలో తెలియక తడబడింది వనజ.
"మీ అనుమానం అర్ధం అయింది ఖర్మ! చేతులారా చేసుకున్నది అనుభవించవద్దూ....' విషాదంగా అంది ఆమె....' అయినా మీకెందుకు లెండి. ఇలాంటి సంగతులు చిన్నవాళ్ళు ఏం చదువుతున్నావమ్మా " మాట మారుస్తూ అడిగింది ఆమె.
"బియ్యే సెకండ్ ఇయర్"
"హు ! నేనూ ఇలాగే బియ్యే చదువుతుండేదాన్ని. నాకూ అపురూపంగా పెంచిన తల్లి, తండ్రి.... డబ్బు, హోదా.....అన్నీ వుండేవి.... అన్నీ వుంది యీనాడు ఏమీ లేక, ఎవరికి చెందని దాన్నయి పోయాను" దైన్యంగా అంటూ నిట్టూర్చింది ఆమె.
"ఏం?' ఎందుకు వెళ్ళిపోయావు ఇంట్లోంచి ? ఏం జరిగింది? ఎవరైనా ఏమైనా అన్నారా?" ఇష్టం లేని పెళ్ళి చేసుకోమన్నారా ?' కుతూహలం ఆపుకోలేక , చదివిన పుస్తకాల, చూసిన సినిమాల విజ్ఞానం అంతా ఉపయోగించి అడిగింది వనజ.
"ఎందుకు వెళ్ళిపోయానా? బుద్ది వక్రమార్గం పట్టి , వళ్ళు తిమ్మిరెక్కి.... కళ్ళు మూసుకుపోయి , చదువుకుని కూడా ఉచితా నుచితాలు తెలుసుకునే జ్ఞానం లేక....ప్రేమ ప్రేమ అనుకుని మొహంలో పడి ఓ మోసగాడిని నమ్మి గోతిలోకి దిగాను!.... గొయ్యి అని ఎలా తెలుస్తుంది? అంతా అనుభవించాక గదా తెలిసింది. అప్పుడు ఆ మైకంలో వళ్ళు తెలియని మోహంతో ఇంకేమైనా తెలిసిందా! వంశం , పరువు , ప్రతిష్ట తల్లిదండ్రుల బాధ.... వారికి కలిగే తలవంపులు , నా భవిష్యత్తు గురించిన ఏమైనా ఆలోచనలు వస్తేనా ?.... అబ్బే!..... ఆ యవనపు పొంగులో ఆ ఉద్రేకంలో, ఆ వళ్ళు తెలియని వ్యామోహంలో ఎటు చూచినా నవ వసంతమే! ఎటు చూసిన స్వర్గ సౌఖ్యాలే! ఓహ్! ఆ రోజుల అనందం ఎలా తెలుస్తుంది మీకు .... యుగ యుగాలుగా ఒకరికోసం ఒకరు పుట్టామనిపించింది. ఈ బంధం జన్మజన్మలదని , విడదీస్తే వీడేది కాదని అనిపించేది.... ఏదో మత్తు మందు జల్లిన అనుభూతి అప్పటిది. కుమారే నా సర్వస్వం , అతను లేనిదే ఈ లోకంలో నేనెలా జీవించను. అనిపించే రోజులు..."
"కుమార్ ...ఎవరతను ?"
"కుమార్ ఎవరా! నా సర్వస్వం అని నమ్మి ఇల్లు వాకిలి తల్లి తండ్రులను వదిలి ఎవరి మొహంలో పడి వెళ్ళానో అతను నమ్మించి అవసరం తీరాక మోసం చేసి.... నా యీ స్థితికి కారకుడయిన వంచకుడు ద్రోహి. ఆ పాప ఫలాన్ని మోస్తున్న నా బిడ్డ తండ్రి....." ఆవేశంతో ఆమె కళ్ళు ఎర్రబడి , ఆమె పెదాలు అదిరాయి.
ఉలిక్కిపడింది వనజ. ఎందుకో ఏం "ఏమయ్యాడు అతను. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడా.' ఆత్రుతగా అడిగింది.
"అంతకన్నా ఏం చేస్తాడు? ఆ ప్రేమ వేడి పోయాక యింక నన్నేం చేసుకుంటాడు? యిదిగో పెళ్ళి చేసుకుందాం అదుగో చేసుకుందాం ...ఉద్యోగం దొరకనీ అంటూ అరునేలలూ కాలం గడిపి నేను తెచ్చిన డబ్బు నా వంటేడు నగలు అన్నీ హరించాక, నేను చేసిన సాహసానికి పాపపు పనికి సాక్షిగా నా మీద చెరగని ముద్ర వేసి తన పాటికి తను వెళ్ళిపోయాడు . హు అంతకంటే ఏదో ఉద్దరిస్తాడని తల్లిదండ్రులని కాదని వచ్చిన వాడిని పెళ్ళాడి మురిసిపోదామని నేను అనుకుని అతనిని నమ్మి వస్తే అది నా పొరపాటు కాని అతని తప్పు యెలా అవుతుంది. కావాల్సిందే నాకిలా !.... యీ శిక్ష నాకు సరి అయినదే !
మంచి మర్యాద లేకుండా , కనిపెంచిన తల్లి దండ్రులని కాదని ప్రేమ ప్రేమ అని బరితెగించి యిల్లోదిలి వెళ్ళిన ఆడపిల్లకి యింతకంటే ఏం జరుగుతుంది.
కడుపులో దాచుకునే తల్లి, ఉన్నతిని కాంక్షించే తండ్రి రక్తం పంచుకున్న తోడబుట్టిన వాళ్ళు.... ధనం....గౌరవం వుండి అందరిని వదులుకుని.... యింతమంది వున్నా ఎవరికీ మళ్ళీ మొహం చూపలేని యీ స్థితి కంటే శిక్ష ఏముంటుంది ?"
"నా అని చెప్పుకునే అర్హత కోల్పోయి పొట్టకోసం పాట్లుపడే యీ స్థితి కంటే దుస్థితి ఏముంటుంది.'
యింతకంటే ఏం శిక్ష కావాలి. నా పాపానికి సాహసానికి కళ్ళలో తిరిగే నీటిని పమిటతో వత్తుకుంది ఆమె.
చాకితురాలై వింటున్న వనజ తేరుకుని అడిగింది. "పోనీ మీరు మళ్ళీ యింటికి వెళ్ళలేక పోయారా? లేకపోతే అతని యింటికి వెళ్ళి నలుగురి ముందు చేసిన పనికి తలెత్తు కోలేకుండా సంగతి బయటపెట్టక పోయారా ....' ఆమె చాతకానితనానికి జాలిపడుతూ సలహా యిచ్చింది వనజ.
"ఆ....అదీ అయింది. అంత తేలిగ్గా నేను మాత్రం వదిలానా.... తరువాత వదలక చేసేదేముందని తెలుసుకున్నాను. అతను నన్ను రమ్మన్నట్టు సాక్ష్యం ఏముంది? యిల్లోదిలి వస్తే పెళ్ళి చేసుకుంటానని అతను ముందు మాట యిచ్చినట్టు సాక్ష్యం ఏముందీ? యీ పుట్టబోయే బిడ్డకి అతడే తండ్రి అన్న సాక్ష్యం ఏముంది ?..... సరిగ్గా ఆ ప్రశ్నలే అడిగి నా నోరు మూయించాడు నలుగురెడురుగా ! నా తరపున మాట్లాడేవారెవరు ? యిల్లోదిలిన ఆడదాన్ని ఏ లోకం నమ్ముతుంది. లేచి వచ్చిన ఆడదాని మాట నమ్మి గౌరవించి న్యాయం చేకూర్చే దాతలు ఎవరూ?"