ఆ మనిషి ఇన్నేళ్ళ తరువాత ఇలా కనిపిస్తాడని ఊహించని జయంతి ఎంత నిబ్బరంగా ఉందాం అనుకున్నా, ఈ విషయాన్ని తనంత తేలిగ్గా తనని కట్టుకున్నవాడు తీసుకోడు అన్నది ఆమెకి అర్ధం అవసాగింది. పన్నెండేళ్ళ వైవాహిక జీవితం, ఇద్దరు పిల్లల తల్లి అయిన తన భార్య గతం అనవసరం అనుకునే సహృదయత ఓ మగాడికి, ఓ మొగుడికి ఉంటుందని ఆశించడం అత్యాశేమో అనిపించసాగింది జయంతికి.
"ఏమిటలా చూస్తున్నారు? నేనెందుకు ఎవరికీ చెప్పలేదో అర్ధం అయిందా? కానీ, నాకర్థం కానిది ఏమిటంటే, అప్పుడు అంత పశ్చాత్తాపం ఒలకబోసి, తరువాత నా జోలికి రావడం మానేసిన ఆ శేఖర్ పనిగట్టుకు ఇన్నాళ్ళ తరువాత మీరెవరో తెలీకుండా ఎందుకు చెప్పాడు? మీరు ఎవరో తెలిసి చెబితే నా మీద కసి తీర్చుకోవడానికీ, నా కాపురం పాడుచేయడానికి చెప్పాడని అనుకోవచ్చు. పాత సంగతి ఎందుకు తవ్వాడు?" సాలోచనగా చూస్తూ అంది.
"వాడు నాతో చెప్పలేదు నేనే వాణ్ణి అడిగా." కృష్ణమూర్తి అన్నాడు.
"మీరడిగారా, మీకెలా తెలుసు ఈ విషయం?" ఈసారి ఆశ్చర్యపోవడం జయంతి వంతు అయింది.
"మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ శ్రీధర్ అని ఉన్నాడులే. నేను శేఖర్ కంటే ఓ ఏడాది సీనియర్ని. నేను కాలేజీ నుంచి వెళ్ళిపోయాక జరిగిన సంఘటన ఆ మధ్య శ్రీధర్, శేఖర్ చేసిన పని చెప్పాడు. అది గుర్తువచ్చి అడిగా. పాపం వాడు నాకు తెల్సిందని చాలా సిగ్గుపడ్తూ చేసిన తప్పు చెప్పాడు.
"ఏమిటోరా ఆ అమ్మాయి నన్ను నిర్లక్ష్యం చేసి రెచ్చగొట్టిందన్న అహంతో, ఉడుకు రక్తం వేడిలో, ముందూ వెనుకలు ఆలోచించకుండా ఆవేశంతో అమ్మాయి జీవితంతో ఆడుకున్నాను. ఆ వయసులో పొగరు, వగరు ప్రతీకారం తీర్చుకునేంతవరకు దుగ్ధ చల్లారలేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఎంత సిగ్గుగా ఉంటుందో, తప్పు చేసిన పశ్చాత్తాపం నన్ను నిలవనీయలేదు. చేసిన తప్పుకి పరిహారంగా ఆ అమ్మాయిని పెళ్లాడదాం అనుకున్నాను. కానీ, ఆమె అభిమానవతి. ఛీకొట్టి తన జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దాంతో ఆ ప్రయత్నం మానుకున్నాను. ఈ శ్రీధర్ గాడు ఇన్నాళ్ళ తరువాత పనిగట్టుకుని నీకు చెప్పడం ఏమిటి అంటూ బాధపడ్డాడు, సిగ్గుపడ్డాడు. ఇదివరకటి శేఖర్ కాదులే వాడు ఇప్పుడు. "మిత్రుడు గురించి సానుభూతి చూపాడు.
"ఓహో, స్నేహితుడు వెధవ పనిచేసినా మీకేం కోపం రాలేదు. కానీ, నా తప్పు లేకపోయినా నన్ను నిలేస్తున్నారు, అంతేలెండి, పరాయి మగాడి ఇంట ఉన్నందుకే అగ్నిపరీక్ష పెట్టిన శ్రీరామచంద్రుడి వారసులుగా మీరు, మగాడి తప్పు లెక్కలోకి రాదు. కానీ, ఆడదాని తప్పు భూతద్దంలో చూడడానికి ప్రయత్నిస్తారు" వ్యంగ్యంగా అంది.
కృష్ణమూర్తి తలదించుకొని అన్నం కెలుకుతూ కూర్చున్నాడు. "ఏమిటి ముఖం అలా పెట్టారు? ఇంకా జరిగిందానికి నా తప్పులేదనిపించడం లేదా?"
"నీ తప్పు ఉన్నా లేకపోయినా, కావాలని చేయకపోయినా, జరగాల్సిన అనర్ధం జరిగింది. పోవాల్సింది పోయింది కదా."
"ఏమిటి పోయింది? చెప్పండి. ఆహాఁ చెప్పండి, శీలం పోయిందా. పవిత్రత పోయిందా. మానం మంటగలిసిందా? ఏం పోయిందో డొంకతిరుగుడు లేకుండా స్పష్టంగా చెప్పండి" తీక్షణంగా అంది.
కృష్ణమూర్తి జవాబివ్వలేదు.
"అయితే, పోయిందానికి పాపపరిహారం ఏమిటిది? అగ్నిప్రవేశం చెయ్యాలా సీతమ్మవారిలా? చేస్తే కాలి బూడిద అవుతా, గానీ బతికి బయటపడను. నిప్పులో దుమికినా నా శీలం నిరూపించబడదు. పాపం నాతో పన్నెండేళ్ళు కాపురం చేసినందుకు మీరూ అపవిత్రమైపోయి ఉంటారు. పదండి ఇద్దరం వెళ్ళి గంగలో మునిగి పునీతులం అయివద్దాం." హేళనగా ఎత్తిపొడిచింది కృష్ణమూర్తి మౌనాన్ని సహించలేక.
కృష్ణమూర్తి ఉక్రోషంగా లేచి లోపలికి వెళ్ళిపోయాడు.
కృష్ణమూర్తి మగమనస్తత్వం అర్ధమైంది జయంతికి. ఓ మగాడు, మొగుడి స్థానంలో ఉన్నవాడు ఈ విషయం తేలిగ్గా తీసుకోడు, కనీసం తేలిగ్గా తీసుకున్నట్టు కనపడడానికి ఇష్టం ఉండదు. పట్టించుకాకపోతే నాలుగు రోజులు పోతే అతనే సర్దుకుంటాడు అనుకుంది జయంతి.
జయంతి ఆలోచన తప్పన్నట్టు. అంత సులువుగా క్షమించను అన్నట్టుగా నెల, రెండు నెలలయినా కృష్ణమూర్తిలో మార్పు రాలేదు. ఒకేగదిలో ఒకే పక్కమీద పడుకున్న ఇద్దరి మధ్య యోజనాల దూరం పెరిగింది. జయంతి వండడం, పెట్టడం, పిల్లలు, ఇంటిపని, ఆఫీసు పని పైకి అన్నీ యధావిధిగా జరుగుతున్నాయి. లోపల ఇద్దరి మధ్య జరిగేది బయటికి తెలిసే అవకాశం లేదు. పిల్లలు చిన్నవాళ్ళు, తల్లిదండ్రి మధ్య భేదాభిప్రాయాలు అర్ధం చేసుకునే వయసు లేదు వారికి. మాటా మంతి కరువై తప్పుకు తిరిగే కృష్ణమూర్తిని చూసి ఒళ్ళు మండి నిలేసింది ఓ రోజు జయంతి.
"ఏమిటి మీ ఉద్దేశం మీ ఈ ప్రవర్తనకి అర్ధం ఏమిటి?"
"ఏ ప్రవర్తన. ఏం నేనేం చేశాను?" ముభావంగా అన్నాడు.
జయంతి హేళనగా నవ్వింది. "అవును, ఏం చెయ్యలేదు. తిట్టలేదు. కొట్టలేదు. చాలా తెలివైనవారు గదా. సైలెంట్ టార్చర్ చేస్తున్నారు. ఈ రకంగా శిక్షించి తృప్తి పడుతున్నారు. నేను చెయ్యని తప్పుకు" కసిగా అంది.
"చూడు నేను నిన్నేమన్నా అన్నానా? మనిద్దరి మధ్యా భార్యాభర్తల బంధం తప్ప మిగతాదాన్లో మార్పేం లేదుగదా. పిల్లల కోసం మనం కలిసి ఉండక తప్పదు గదా. ఇంతకంటే సర్దుకోవడం నావల్లకాదు."
"ఓహో, పిల్లల కోసం కలిసి ఉన్నారన్నమాట. లేకపోతే నన్నీపాటికి ఇంట్లోంచి తన్ని తగలేసేవారు గాబోలు, పరవాలేదు. పిల్లల కోసం మీరంతంత త్యాగాలు చెయ్యక్కరలేదు. నాకూ ఉద్యోగం ఉంది. పిల్లల్ని నేను పోషించుకోగలను. ఈ చెడిపోయిన దానికి డైవోర్స్ ఇచ్చి మీరు మహారాజులా రెండో పెళ్ళి చేసుకోండి." ఉక్రోషంగా అంది.
"చెడిపోయావని అనలేదు. కానీ, చూస్తూ, చూస్తూ నీతో... నావల్ల కావడంలేదు. నాకేం పెళ్ళాడాలన్న కోరిక లేదు. మనవల్ల పిల్లలు బాధపడకూడదు. నన్నర్ధం చేసుకో. ఈ నాలుగు గోడలు దాటి వెళ్ళాల్సిన అవసరంలేదు."
"హుఁ ఎంతటి అవకాశవాదులు మీరు. ఇప్పుడు భార్య ఇలాంటిదని తెలిస్తే అవమానం. ఇప్పుడు భార్యని ఇంట్లోంచి పంపించేస్తే లోకం ఏమంటుదోనని భయం. ఇల్లాలు ఇంట్లో లేకపోతే ఎదుర్కొనే ఇబ్బందులు తలుచుకుని భయం. పిల్లలని, ఇంటిని చూసుకోవడం రేపు పిల్లల భవిష్యత్తు తల్లి ఇలాంటిదని తెలిస్తే ఏమవుతుందోనని భయం. ఇన్ని భయాలతో దయతలిచి నన్ను ఇంట్లో ఉండనిస్తున్నారు. హుఁ.. నేనేం మగాడి పొందుకోసం మొహంవాచీ ఏడుస్తున్నాననుకోకండి. ఆడదానికి భర్తనుంచి కావాల్సింది కాస్తంత ప్రేమ, అనురాగం, సానుభూతి, నేనున్నాననే భరోసా కావాలిగాని.."
"జయంతీ నన్ను అర్ధం చేసుకో. మనం అనవసరంగా రొస్టు పడొద్దు. నాకు కొంత టైమియ్యి. నిన్ను వదులుకోవాలని నాకేంలేదు. నా మనఃస్థితి అర్థం చేసుకో. కాలం అన్ని గాయాలు మాన్పుతుంది."
"గాయం తగిలింది నాకయితే అది మానడానికి మీకు టైమివ్వాలి. వెల్ సెడ్, ఎనీహౌ నన్నీ ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే నన్ను పొమ్మనే హక్కు మీకు లేదుగనుక. ఇది నా ఇల్లు ఇక్కడ నుంచి నన్ను పంపాలంటే కోర్టుకెక్కి విడాకులు తీసుకోవాలి మీరు. మన మధ్య భార్యాభర్తల సంబంధం లేదన్నప్పుడు ఇంక ఈ మంచం మీద పడుకోవడం అనవసరం." జయంతి విసురుగా గదిలోంచి వెళ్ళిపోయింది.
* * *
రాత్రి పదకొండు గంటలవేళ మంచి నిద్రలో ఉన్న జయంతి ఒంటిమీద చెయ్యిపడేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చేయిపట్టి లాగుతున్న కృష్ణమూర్తిని చూసి ఛీత్కారం చేస్తూ "చేయి వదలండి" తీక్షణంగా అంది చేయి విదిల్చికొట్టి.
"జయా... ప్లీజ్ రా మన గదిలోకి. జరిగింది మర్చిపోదాం! జరిగింది ఓ పీడకలని మరిచిపోదాం." అనునయిస్తూ అన్నాడు. జయంతి అతణ్ణి ఓ పురుగుని చూసినట్టు తిరస్కారంగా చూసింది. "వెళ్ళండిక్కడి నుంచి. మరెప్పుడూ నా ఒంటిమీద చెయ్యివేసే సాహసం చెయ్యకండి. జరిగింది మీ అవసరం కోసం మీరు మరిచిపోదలచినా నేను మరిచిపోను. ఈ మాట ఆ రోజు.. ఆర్నెల్ల క్రితం అనుంటే తప్పకుండా మర్చిపోయేదాన్ని. నౌ ఇటీజ్ టూ లేట్. ఆడదాని అవసరం కోసం ఆత్మాభిమానం మీరొదులుకోగలరేమో కానీ, చేసిన అవమానం నేను మరిచిపోలేను. వెళ్ళండిక్కడ నుంచి" చాలా కటువుగా అంది.
"ప్లీజ్ నీ కోపం నాకర్థం అయింది జయా. నా మనసుకి నచ్చచెప్పుకోవడానికి నాకు టైము కావాలన్నాగా, నన్ను నా మనఃస్థితిని అర్థం.."
"అర్థం చేసుకోవడానికేం లేదు. అర్థం చేసుకుని ఉండాల్సింది మీరు. నా నిస్సహాయ స్థితిని, నా అవమానాన్ని, నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన ఆ సంఘటనకి సానుభూతి చూపాల్సింది పోయి చేయని నేరానికి శిక్ష వేశారు. ఆనాడు జరిగింది మీ పరిభాషలో నా మానభంగం అయివుండవచ్చు. ఈనాడు ఇది నా అభిమానభంగం. నా దృష్టిలో శేఖర్ కంటే మీరెక్కువ దోషులు. వాడు నాకేం కాడు కనుక వాడు చేసిన పని మరిచిపోగలిగాను. కానీ, కట్టుకున్న భార్యను, పన్నెండేళ్ళ కాపురం చేసిన భార్యను, మీ ఇద్దరి పిల్లల తల్లి పట్ల కనీస సానుభూతి కూడా చూపలేకపోయిన మొగుడనే మిమ్మల్ని మాత్రం క్షమించను. అభిమానభంగం జరుగనీయను. కనీసం ఆ తృప్తి అయినా నాకు దక్కాలి. మానం పోయినా అభిమానం పోగొట్టుకోను ఈసారి. మరోసారి ఈ ప్రసక్తి తెచ్చినా, నా ఒంటిమీద చేయి వేసినా సహించను. వెళ్ళండిక్కడినుంచి" చాలా స్థిరంగా తర్జని చూపిస్తూ అని అటు తిరిగి పడుకుంది జయంతి.
* ఇండియా టుడే, నవంబర్ -98
* * * *