Previous Page Next Page 
మారణహోమం పేజి 18

 

    "ఎస్! తక్షణం బయటికి నడవగలవు!"   
    ఆ ఇన్సల్టుని భరించింది జేన్. బయటికి వెళ్ళబోతూ, చటుక్కున ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి తిరిగింది.   
    "మర్చిపోయాను. మీ మెజర్ మెంట్స్ కావాలి."   
    "ఎందుకు? ఖైదీలకు కుట్టించినట్లు యూనిఫారం కుట్టిస్తారా?"   
    "స్టోన్ వాష్ డ్ జీన్సూ, షర్ట్సూ మీకు బాగా సూటవుతాయని చెప్పారు బాస్."   
    "బుల్ షిట్! నేను ఈ చీరనే చిరిగిపోయేదాకా కట్టుకుంటాను. మీరిచ్చే యూనిఫారం నాకక్కరలేదు. నౌ విల్ యూ ప్లీజ్ గెట్ ధీ హెల్ అవుటాఫ్ హియర్?"   
    "సారీ మేడమ్! ఆర్డర్స్ ఫ్రమ్ బాస్!" అంటూ స్కర్టు జేబులోనుంచి టేపుతీసి కొలతలు తీసుకుంది జేన్. ఛాతీ ముఫ్ఫయ్ ఆరు అంగుళాలు, నడుము ఇరవైనాలుగు అంగుళాలు, పిరుదులు ముఫ్ఫయ్ ఆరు అంగుళాలు.   
    'పర్ ఫెక్ట్ కర్వ్స్!' అనుకుంది జేన్. ఆమె కళ్ళలో అతికొద్దిగా మెదిలిన అసూయని గమనించింది అమూల్య. జేన్ కూడా అందంగానే ఉంటుంది. కానీ అమూల్య అంత కాదు.   
    "మీ బ్రా నెంబరు, పాంటీస్ సైజు చెబితే..."       
    మాట్లాడకుండా సీరియస్ గా చూసింది అమూల్య.   
    జేన్ ఒకసారి తనవైపు చూసుకుని, తర్వాత అమూల్యవైపు చూసింది. "నాకంటే రెండు సైజులు పెద్దవయితే చాలనుకుంటాను."   
    జరుగుతున్నదంతా అసహజంగా, అమానుషంగా అనిపిస్తోంది అమూల్యకి. ఒకవైపు నగ్నంగా చిత్రవధ కాబడుతున్న మనిషి మరోవైపు బ్రా, పాంటీలసైజుల గురించి ఎన్ క్వయిరీ! ఏమీ జరగనట్లే! ఏమీ పట్టనట్లే! ఇంత నిర్దాక్షిణ్యం మనుషుల్లో ఉంటుందా అసలు? అందులోనూ ఆడపిల్లల్లో మైగాడ్!   
    తలుపులు బయటనుంచి వేసుకుని జేన్ వెళ్ళిపోయింది. సో! ఇంక తన ఖైదు జీవితం మొదలయిందన్నమాట! నిట్టూర్చి, చుట్టూతా చూసింది అమూల్య. రేక్స్ నిండా పుస్తకాలు వున్నాయ్. గెస్టులని ఇంప్రెస్ చెయ్యడానికి ఆలంకారంగా వుంచినవి కాబోలు అవి!   
    దగ్గరికెళ్ళి చూసింది.   
    వాటిలో హిట్లర్ రాసిన 'మెయిన్ కేంఫ్' ప్రముఖంగా కనబడింది ఆమెకి.   
    హిట్లర్ పుస్తకాలు చదువుతాడా ఈ నిఖిల్? అతనా ఇతనికి హీరో?   
    నరరూప రాక్షసుడైన హిట్లర్ పేరు తలుచుకోగానే అమూల్యకి మొదట గుర్తొచ్చేది చిత్రహింస! జైనోసైడ్! ఒక జాతిని మొత్తం ఈ భూతలం మీద నుంచి తుడుచి పెట్టెయ్యాలని మొదలెట్టిన మారణహోమం!   
    ఒకే గూటి పక్షులలాంటి వాళ్ళా హిట్లరూ, నిఖిల్ కూడా?   
    నిఖిల్ అంటే చెప్పలేనంత అలర్జీ కలిగింది ఆమెకు.   
    ఆమె గదిని క్షుణ్ణంగా పరిశీలిస్తుండగానే చీకటిపడిపోయింది.   
    తలుపు తట్టి లోపలికి వచ్చింది జేన్. లైట్లువేసి "మీరు డిన్నర్ ఇక్కడ తీసుకుంటారా? డైనింగ్ రూంలోనా?" అని అడిగింది.   
    "ఈ నెత్తుటి మెతుకులు నేను తినను" అంది అమూల్య విసురుగా.   
    ఓపిగ్గా చెప్పింది జేన్.   
    "మీరు తినక తప్పదు మేడమ్! మీరు మొండి పట్టుపడితే మా డాక్టర్ ని పిలిచి ఇంట్రావీనస్ ఫీడింగ్ చెయ్యవలసి వస్తుంది. ఆర్డర్స్ ఫ్రమ్ బాస్!"   
    ఒక్కక్షణం ఆమెవైపు తీక్షణంగా చూసి, "సరే! ఇక్కడే తింటాను" అంది అమూల్య.   
    జేన్ వెళ్ళి ఒక ట్రే తెచ్చి మీదకప్పి ఉన్న లేసుగుడ్డ తీసింది.   
    "అక్కడ పెట్టి వెళ్ళిపో!" అంది అమూల్య.   
    "మీరు తిన్న తర్వాతే వెళతాను."   
    "వైడోన్ట్ యూ లీవ్ మీ అలోన్!" అంది అమూల్య సహనం కోల్పోతూ.   
    నెమ్మదిగా అంది జేన్ "తినండి మేడమ్! లేకపోతే బాస్ కి చాలా కోపం వస్తుంది."   
    ఆమె వెళ్ళిపోగానే తలుపులు బిగించుకుని, ఆ ప్లేట్ లోని భోజనాన్ని టాయిలెట్లో వేసి ఫ్లష్ చేసేసింది అమూల్య.   
    నిస్సత్తువగా మంచంమీద వాలిపోయిందిగానీ నిద్రపట్టలేదు తనకి.   
    అటూ ఇటూ దొర్లుతూ అర్ధరాత్రి దాకా గడిపేసింది.   
    అప్పుడు మెల్లిగా లేచి కూర్చుని ఫోన్ వైపు చూసింది అమూల్య.   
    వాళ్ళు డైరెక్ట్ లైన్ ఫోన్ ని ఆ గదిలో ఉంచడం చాలా అసహజంగా వుంది. నిశ్చయంగా ఏదో ట్రాప్ అయి ఉంటుంది. లేదా ట్రిక్ అయి ఉంటుంది.   
    కానీ ఏమిటది?   
    అదేమిటో తెలుసుకోకపోతే తనకు ప్రాణాలు నిలవవనిపించింది అమూల్యకి.   
    ఫోన్ దగ్గరికి నడిచి, రిసీవర్ ఎత్తింది.    

    డయల్ టోన్ వినబడలేదు తనకి. కానీ.....కానీ......ఎవరిదో డయింగ్ టోన్ వినబడుతోంది!!   
    చనిపోతున్న మనిషి పెడుతున్న చావుకేకలు!!   
    గుండెలు ఝల్లుమన్నాయి అమూల్యకి. అతనే - ఆ చిత్రవధ కబడుతున్న మనిషే - ఆపకుండా అరుస్తున్నాడు. అరిచి అరిచి బొంగురు పోయి బొదురు కప్ప గొంతులా వినబడుతోంది అతని గొంతు!   
    అది వినలేక చటుక్కున రిసీవర్ క్రేడిల్ మీద ఉంచింది అమూల్య. ఆ టార్చర్ చాంబర్ లో నుంచి ఈ ఫోన్ లోకి ఎలా పెట్టారో గానీ తెలివిగా కనెక్షన్ పెట్టారు. ఫోన్ ఎత్తితే చాలు అతని మరణవేదన వినబడుతోంది.       
    ఏం చెయ్యాలో తోచక అటూ ఇటూ తిరగడం మొదలెట్టింది అమూల్య.   
    టెన్షన్ తో మతిపోతున్నట్లు అనిపిస్తోంది తనకి.

 Previous Page Next Page