"లుక్ మైడియర్!" అన్నాడు అమూల్యని అంచనా వేస్తున్నట్లు చూస్తూ.
"నిఖిల్ ని మోసం చెయ్యదలుచుకున్నవాళ్ళు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కుంటారు. వెంటనే చంపివేయబడ్డ వాళ్ళు చాలా అదృష్టవంతుల కిందలెక్క! ఇంకా దురదృష్టవంతుల విషయానికొస్తే...." అని ఆగి, "అమ్మాయ్! నీకు బాగా గుండెధైర్యం ఉందా?" అన్నాడు.
బింకంగా చూస్తూ ఉండిపోయింది అమూల్య.
బిల్డింగ్ వాలా బట్టతలని కర్చీఫ్ తో తుడుచుకుని లేచి, "నాతోరా!" అన్నాడు.
తన భయం పైకి కనబడకుండా జాగ్రత్తపడుతూ ఆయన వెనక వెళ్ళింది అమూల్య.
బేస్ మెంట్ లో ఒక రూం ఉంది. అతిచిన్న ఆడిటోరియమ్ లా ఉంది ఆ రూం. మెత్తగా, సౌఖ్యంగా ఉన్న సోఫాలు అయిదు వరసలుగా వేసి ఉన్నాయి.
"కూర్చో!" అన్నాడు బిల్డింగ్ వాలా.
వాళ్ళకెదురుగా పెద్ద స్క్రీన్ లాగా గ్లాస్ పానెల్ ఉంది. దానివెనక ఒక రూం ఉంది. ఆ రూంలో లైటులేదు.
స్విచ్ నొక్కాడు బిల్డింగ్ వాలా. ఆ రూంలో లైటు వెలగ్గానే ఆ గ్లాస్ పానెల్ ప్రకాశవంతంగా అయింది. అవతల రూములోని దృశ్యాలు సినిమా స్క్రీన్ లా దానిమీద కనబడటం మొదలెట్టాయి.
అక్కడ
ఒక భారీమనిషి ఉన్నాడు దాదాపు యాభై ఏళ్ళుంటాయి. నగ్నంగా ఉన్నాడు అతను.
అతన్ని చూడగానే షాక్ తగిలినట్లు ఉలిక్కిపడింది అమూల్య అతని నగ్నత్వాన్ని చూసికాదు ఆమె ఉలిక్కిపడింది. అసలు ఆమె ఆ విషయాన్ని సరిగా గమనించనేలేదు.
అతన్ని మాంసం దుకాణంలో మేక కళేబరాన్ని తగిలించినట్లు ఒక కొక్కానికి తగిలించారు. ఆ కొక్కెం అతని వీపులో గుచ్చి ఉంది!
వళ్ళంతా గాయాలు ఉన్నాయి అతనికి. కారుతున్న రక్తం కళ్ళమీద గడ్డకట్టి, కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి.
కడుపులో దేవినట్లయింది అమూల్యకి. భయంతో నోటెంబడి మాటరాలేదు.
"నిన్నటినుంచి అలా వేళ్ళాడుతున్నాడు పాపం! చావు కొందరిని తొందరగా కరుణించదు." అన్నాడు బిల్డింగ్ వాలా చాలా మామూలుగా.
ఆ వేలాడుతున్న మనిషి దగ్గరికి మరొక అతను వచ్చాడు. అతని చేతిలో ఒక జగ్గు ఉంది. దాన్లో నీళ్ళున్నాయి. ఆ నీళ్ళని చుక్కచుక్కగా వేలాడుతున్న మనిషిమీద పోశాడు. అతను ఒక్కొక్క చుక్కకీ ఒక్కొక్క చావుకేక పెట్టాడు ఆ మనిషి.
"ఒళ్ళంతా గాయాలయి చచ్చిపోతున్నాడు ఆ మనిషి! అతని మీద నీళ్ళుకూడా పొయ్యడం ఎందుకు? గాయాలని రేపి మండించడానికా?" అంది అమూల్య కలవరిస్తున్నట్లు.
"అందుకు కాదు!" అన్నాడు బిల్డింగ్ వాలా, జేబులోంచి చుట్టతీసి, కొసలు కొరికి అంటించుకుంటూ. "వళ్ళంతా తడిగా ఉంటేనే షాక్ బాగా తగులుతుంది."
ఆ గదిలో ఉన్న రెండో మనిషి ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తున్న ఒకలైవ్ వైర్ తెచ్చి కంచీతో కొట్టినట్లు కొట్టాడు ఆ అభాగ్యుణ్ణి.
కప్పుకూలి మీద పడేటంత పెద్దగా కేకపెట్టాడు అతను. వెంటనే మరో దెబ్బ. మరో కేక.
నలుగు నిముషాల తర్వాత దెబ్బలూ కేకలూ ఆగాయి. రొప్పుతూ చాలాసేపు ఉండిపోయాడు వేలాడుతున్న ఆ మనిషి. ఊపిరి అందాక, అతి కష్టంమీద చేతులు రెండూ జోడించాడు.
"నన్ న్ న్ను చంపెయ్యండి! ప్ లీలీ జ్!"
అతని పెదిమలు ఒకపక్కకి తోసుకుపోయి వికృతంగా వస్తోంది మాట.
మళ్ళీ దెబ్బపడింది.
"మ్ మ్ మ్ మ్ మ్ మ్మా!"
అతనికి స్పృహ తప్పిపోయింది.
చూస్తున్న అమూల్య కనుకొలకుల్లోనుంచి ఒక కన్నీటి చుక్క నెమ్మదిగా ఆమె బుగ్గమీదికి జారింది.
"అతను చనిపోయాడా?" అంది అస్పష్టంగా.
బిల్డింగ్ వాలా చుట్టపొగ వదిలి నవ్వాడు. "వాడు ఇప్పుడప్పుడే చావడు. ఉక్కులాంటి ఒళ్ళు. రేపంతా పడుతుందేమో, బాధల నుంచి విముక్తి పొందడానికి."
క్షుద్రమైన కీటకాన్ని చూసినట్లు చూసింది అమూల్య బిల్డింగ్ వాలా వైపు.
అప్పటికి లక్షసార్లు లక్షమంది చేత అలా చూడబడిన వాడిలా నిర్లక్ష్యంగా ఉండిపోయాడు బిల్డింగ్ వాలా. తర్వాత రిసెప్షనిస్టుని పిలిచాడు.
"జేన్ డార్లింగ్! విల్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ గర్ల్!"
"సర్టెన్లీ సర్!" అని అమూల్యని తనతో రమ్మని సైగ చేసింది జేన్.
ఒక్కసారి పక్కగదిలో వేలాడుతున్న మనిషి వైపుచూసి, తర్వాత వెంట నడిచింది అమూల్య.
తేనెతుట్టిలాగా చాలా రూమ్సు ఉన్నాయి ఆ బిల్డింగ్ లో. చాలావరకూ అండర్ గ్రవుండ్ లోనే ఉన్నాయి అవన్నీ. మున్సిపాలిటీ పర్మిషను తీసుకోకుండా మూడోకంటికి తెలియకుండా, కట్టిన వాటిలా ఉన్నాయి. చాలా గదులు నేలమాళిగల్లా ఉన్నాయి. అవన్నీ దాటి, గ్రవుండ్ ఫ్లోర్ లోకి వచ్చారు. ఒక రూం ముందు ఆగి తాళం తీసింది జేన్. గెస్ట్ రూంలా ఉంది అది. ఖరీదయిన ఫర్నిచరు ఉంది లోపల.
గదిలోకి వెళ్ళగానే అమూల్య దృష్టిని మొట్టమొదటగా ఆకర్షించింది టెలీఫోన్.
టెలీఫోన్! అది తనకు అందుబాటులో ఈ గదిలో ఉంచుతారా? లేకపోతే ఇది ఒక పెద్ద ట్రాపా? చూస్తే ఎక్స్ టెన్షన్ ఫోన్ లాగా కాదు. అది డైరెక్టు లైన్ లాగా ఉంది.
బెడ్ సరిచేసి వేసింది జేన్. రూంలోని వస్తువులు అటూఇటూ సవరించి సర్దింది. తర్వాత అమూల్యవైపు తిరిగి, "ఇంకేమన్నా చెయ్యగలనా నేను?" అంది మర్యాదగా తమ బాస్ కి కాబోయే భార్య అన్న గౌరవం ధ్వనిస్తోంది ఆమె గొంతులో.