Previous Page Next Page 
మారణహోమం పేజి 19

   

    కాసేపయ్యాక ఇంక భరించలేక, మళ్ళీ ఫోన్ ఎత్తింది.   
    మళ్ళీ ఆర్తనాదాలు వినబడ్డాయి.   
    ఫోన్ పెట్టేసింది అమూల్య.   
    పావుగంట తర్వాత మళ్ళీ -   
    ఫోన్ ఎత్తకుండా ఉండలేకపోయింది అమూల్య. అక్కడ ఆ మనిషి ఏమయిపోతున్నాడో అన్న ఆరాటం.   
    "న్ న్ న్ న్ను చంపెయ్యండి!" అని రోదిస్తున్నాడు ఆ మనిషి.   
    ఉన్నట్లుండి ఒక నిశ్చయానికి కొచ్చేసింది అమూల్య.   
    ఆ మరణవేదన పడుతున్న మనిషిని వీలయితే బతికించాలి తను.   
    వీలుకాకపోతే కనీసం చంపెయ్యాలి. బాధనుంచి విముక్తుడిని చెయ్యాలి. మెర్సీకిల్లింగ్! దాక్షిణ్యంతో ప్రాణాలు తియ్యడం!   
    మెర్సీ కిల్లింగ్ ని తను చదివిన లా ఒప్పుకోదు.   
    కానీ అతను అలా నరకయాతన పడుతుంటే చూస్తూ ఊర్కోవడానికి తన మనసొప్పుకోదు.   
    తలుపులు తెరిచి బయటికొచ్చింది అమూల్య.   
    అపరిశుభ్రంగా ఉన్న కారిడార్ లా కనబడుతోంది అది. తక్కువ కేండిల్ పవర్ బల్బు ఒకటి బలహీనంగా వెలుగుతూ పసుపచ్చటి కాంతిని పల్చగా పరుస్తోంది.   
    ఒక్కొక్క గదీ దాటుకుంటూ వెళ్ళి బేస్ మెంటు మెట్లు దిగింది అమూల్య.

    ఇందాక ఎటువైపు వచ్చింది తను? ఎక్కడుంది ఆ టార్చర్ ఛాంబర్?   
    ఒక్కొక్క రూమునీ పరీక్షగా చూస్తూ వెళుతోంది అమూల్య.   
    చివరికి ఒక రూము ముందు ఆగింది. అదే రూమని గుర్తుతనకు.   
    తను ప్రాణాలకి తెగిస్తోందని తెలుసు అమూల్యకి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి పట్టుబడిపోయిందంటే, ఇంక కొద్దినిమిషాల తర్వాత తనుకూడా మేకలాగా హుక్కుకి వేలాడుతుందని బాగా తెలుసు.   
    అయినా, సాటి మనిషి మీద జాలి కాలు నిలువనియ్యడంలేదు.   
    గది ఇదే అయి ఉంటే ఫర్వాలేదు. ఇది కాకపోతే?   
    ఈ గదే అయినా లోపల ఎవరన్నా మనుషులుండి ఉంటే?   
    దడదడలాడుతున్న గుండెతో తఃలుపు నెట్టడానికి చేతులు ముందుకు జాచింది అమూల్య. మరుక్షణంలో తలుపులు శబ్దం కాకుండా తెరుచుకున్నాయి.   
    అది టార్చర్ ఛాంబర్ కాదు!   
    కానీ భరించలేని వేదన అనుభవిస్తున్నట్లు మూలుగులు వినబడుతున్నాయి. అక్కడ! అవేమిటో అర్ధమయి, మతిపోయినట్లయింది అమూల్యకి.   
    ఒకమ్మాయి, ఒకబ్బాయి, పూర్తిగా నగ్నంగా రతిపారవశ్యంలో మునిగి ఉన్నారు. తలుపు చప్పుడు విని తలెత్తి చూశారు వాళ్ళు కానీ అమూల్యని చూసి కూడా కంగారు పడలేదు. సిగ్గుపడలేదు. ఇది చాలా మామూలు అన్నట్లు అలా సన్నిహితంగానే ఉండిపోయారు.   
    ఆ అబ్బాయి నిఖిల్ కి అసిస్టెంటయిన రాజు. ఆ అమ్మాయి జేన్.   
    "ఏమిటి మేడమ్?" అంది జేన్, ఆ భంగిమలోనే ఉండి.   
    జవాబు చెప్పకుండా గబగబా తనగదిలోకి వచ్చేసింది అమూల్య. రాగానే ఫోన్ ఎత్తి వింది.   
    లైన్ డెడ్ అయిపోయి ఉంది. అరుపులు వినబడడం లేదు.   
    ఇంకో పది నిమిషాల తర్వాత జేన్ గదిలోకి వచ్చింది. ఆమె మొహంలో లజ్జగానీ, తప్పుచేస్తూ దొరికిపోయానన్న సంకోచంగానీ కనబడటంలేదు.   
    "మేడమ్ కేమన్నా కావాలా?" అంది చాలా మామూలుగా.   
    కోపాన్ని బిగపట్టుకుని, ఆమెని ఆపాదమస్తకం అసహ్యంగా చూసి "ఒక్క మాట అడుగుతాను చెబుతారా?" అంది అమూల్య.  

    "అడగండి మేడమ్"   
    "ఆ టార్చర్ ఛాంబర్ లోని మనిషి ఇంకా బతికి ఉన్నాడా చనిపోయాడా?"   
    "చనిపోయాడు మేడమ్! అయిదు నిమిషాల క్రితం!"   
    గుండెల మీద నుంచి పెద్ద భారం దింపేసినట్లు రిలీఫ్ గా ఫీలయింది అమూల్య.   
    జేన్ వెళ్ళిపోయింది.   
    ఆ చిత్రవధ అనుభవిస్తున్న మనిషి చచ్చిపోయాడని తెలిసిన తర్వాత, నిద్రపట్టక పోయినా, కాసేపు మంచం మీద పడుకోగలిగింది అమూల్య.
    
                                                                * * *
    
    తెల్లవారుతుండగా బ్రేక్ ఫాస్ట్ ట్రేలో పెట్టుకొని వచ్చింది జేన్. ఆమె వెనకే ఇంకొకతను వచ్చి ఒక బండిల్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు.   
    "బట్టలు, మీకోసం!" అంది జేన్. "రాత్రి నేను తీరుబడి చేసుకుని వెళ్ళేసరికి షాపులన్నీ మూసేశారు. తెరిపించం, మీకోసం!" అంది.   
    ఆ మాటల్లో వాళ్ళ గ్యాంగుకి ఉన్న పొగరూ, పవరూ బయటపడిపోతున్నాయి. బట్టలు కొనడం కోసం మూసిన షాపులని తెరిపించారంటే -   
    ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది అమూల్య. నిఖిల్ కనబడితే ఛడామడా అడిగేద్దామని ఉంది తనకు. కానీ అతను ఆ రోజంతా కనబడనే లేదు ఆమెకి.   
    పగలంతా ఆ రూములోనే జైల్లో గడిపినట్లు గడిపింది అమూల్య. రాత్రికి మళ్ళీ రొటీన్ మొదలయింది.    

    "రౌండ్స్ కి వెళ్ళివద్దామా అమ్మాయ్?" అన్నాడు బిల్డింగ్ వాలా.   
    ముచ్చెమటలు పోశాయి అమూల్యకి. మళ్ళీ టార్చర్ చాంబర్ వైపు తీసుకెళతారా తనని? మళ్ళీ మరికొన్ని ఘోరమైన సీన్లు చూడవలసి వస్తుందా?   
    "నేను రాను!" అంది తడి ఆరిపోతున్న గొంతుతో. పెద్దగా నవ్వాడు బిల్డింగ్ వాలా. ఆ గొంతులో అపహాస్యం వినబడుతోంది.

 Previous Page Next Page