అవునన్నట్లు తల వూపాడు రవి.
"మీ నాన్న సంగతి నీకు తెలియదు. పైకి మంచిగానే ఉంటూ రోగం కుదురుస్తాడన్నమాట. కనపడకుండా శిక్ష విధిస్తాడు. ఇప్పుడు నా విషయమే చూడు. రోజూ కొద్ది కొద్దిగా చూడొచ్చులేదా! ఈ కొండలు ఎక్కడికీ పోవు. నేను ఎక్కడికీ పోను. అంటే నేను నోరు మూసుకుని చచ్చినట్లు వినేవాడిని! అది లేకపోగా చూపించరా అన్నాను తిప్పి తిప్పి చూపించాడు. ఇవేమన్నా పడుచుకాళ్ళా! వాటికి ముసలితనం వచ్చింది. జబ్బు పడుతున్నాయి చూశావుగా ఇప్పుడు ఎలా పట్టుకుపోయాయో" కైలాస గణపతి వివరించాడు.
"అసలు విషయం కాళ్ళు నొప్పులన్నమాట" రవి అన్నాడు.
"గుర్తుంచుకోరా కైలాసం" అన్నాడు సూర్యారావు.
"ఏమిటి గుర్తుంచుకోవాలి?"
"ఈమాట....."
"ఎందుకు?"
"మరోసారి రోగంతిన్నగా కుదురుస్తానని - "
"అన్యాయంరా సూరీడు అన్యాయం! నా మీద ఏదైనా కోపం వుంటే తీర్చుకునే విధానం యిదికాదురా! కాళ్లు లేకపోతే ఈ కైలాసం బతకడురా" వాపోయాడు కైలాసగణపతి.
"కాళ్ళు విరగ్గొట్టకుండా మరోరకంగా శిక్ష వేస్తాలే" నవ్వుతూ అన్నాడు సూర్యారావు.
"ఊరుకోండి ఏమిటా మాటలు" చిరుకోపంతో అంది మాణిక్యాంబ. ఎంత స్నేహితుడైతే మాత్రం అంతలాంటి జోకులా, విస్తట్లో అన్నంపెట్టి ఛీ - తినరా అన్నట్లు ప్రవర్తిస్తే ఏం బాగుంటుంది ఇది ఆమె అభిప్రాయం.
"హోమ్ మినిస్టరీ నుంచి నోరు మూసుకోమని హెచ్చరిక వచ్చింది. నోరు మూసుకుందామా" సూర్యారావు నవ్వుతూ అడిగాడు.
"అలాగే" అన్నాడు కైలాస గణపతి.
"అంకుల్!"
"ఊ...."
"మీరు ఎక్కడెక్కడ తిరిగారు! ఏమేమి చూశారు అదిచెప్పండి అంకుల్! కాలక్షేపంగా వుంటుంది" రవి దిండు సరిచేసుకుని దానికానుకుని కూర్చుంటూ అడిగాడు.
కొండమీదికి ఎలా ఎక్కింది వివరించాడు కైలాసగణపతి.
కైలాస గణపతి చెపుతున్నంతసేపు మధ్య మధ్య సూర్యారావు అందుకుంటూ "జారిపడబోతే పట్టుకున్నాను" పడుతూ లేస్తూ కొండ చివరిదాకా చూశాడు. "ఇది చాలదన్నట్లు అటు లోయలోకి దిగి చూద్దామా" అంటాడు. "అది అయ్యేపని కాదురా తండ్రీ? కాలు పెడితే దిగేపని లేదు. జర్రుమని లోయమధ్య చెట్టుకొమ్మల్లో యిరుక్కుని అలా అయిపోతుంది శాల్తీ గల్లంతు" అంటూ చెపుతూనే వున్నాడు.
కైలాసగణపతి చెప్పటం పూర్తి అయింది.
"ఆ తరువాత రవి ఏదో సినిమాకధ చెపుతుంటే అంతా వింటూ కూర్చున్నారు."
కబుర్లే వాళ్ళకి మంచి కాలక్షేపం.
13
కైలాస గణపతి ఒంటరిగా బయలుదేరాడు.
ముందు చాలా రోజులు సూర్యారావు షికారు నెపంతో అతను ప్రతిరోజూ వచ్చేవాడు. అప్పటికింకా ఏ పరిశోధన మొదలుపెట్టలేదు.
"నీవు తొందరపడి పరిశోధనలోకి దిగకురా కైలాసం నీవు సంవత్సరాల తరబడి మా యింట్లో వున్నా ఎవరూ ఏమీ అనుకోరు. నా పిల్లలు రత్నమాణిక్యాలు. నా భార్య అంతేరా పేరు రత్నమాణిక్యం గుణము అంతే. నిన్ను చూసి తనకో అన్నయ్య దొరికాడని అది ఎంతో సంతోషిస్తున్నది. పిల్లలు అయితే సొంత మామయ్య వచ్చినట్లు మురిసిపోతున్నారు. మా కోడలు ప్రమీల సంగతి నీకు తెలియదు. మా యింటికి తగ్గది. ఇంకా చెప్పాలంటే అతిశయోక్తి అనుకోకపోతే మా ఇంట్లో అందరికన్నా మంచిది" అని అతను అంటే.....
"నీవు చెప్పింది బాగానే వుందిరా సూరీడూ! కానీ ఇదంతా నాకు ఎందుకు చెపుతున్నట్లు?" కైలాస గణపతి అడిగాడు.
"ఎందుకు చెప్పింది యింకా అర్ధం కాలేదా?"
"ఉహూ!"
"ఈవూళ్ళో పరిశోధన చేయటానికి వచ్చినవాళ్ళు హతం అయ్యారో. హత్యచేయబడ్డారో ఆ పరమాత్ముడికి తెలియాలి. ఏదిఏమయినా నీవు క్షేమంగా వుండాలంటే జాగ్రత్త వహించక తప్పదు. డాక్టర్ నీకు విశ్రాంతి అవసరం అన్నాడు. కొన్నాళ్ళు కొత్తగాలి. కొత్తనీరు. కొత్త ప్రదేశం అయితే పూర్తి బాగుపడుతుందని చెప్పాడు. అది తెలిసి నేను నిన్ను మా వూరు వచ్చి మా యింట్లో కొద్ది నెలలు వుండమన్నాను. కానీ ముందు నీవు వప్పుకోలేదు. నా బలవంతంతో ఒప్పుకున్నావు....."
సూర్యారావు చెపుతుంటే మధ్యలో అడ్డు తగిలి -
"ఇదంతా దేనికి?" అన్నాడు కైలాసగణపతి.
"నీవు ఈఊరు పరిశోధనకి రాలేదని నమ్మించటానికి నాలుగురోజులు ఉట్టుట్టి షికార్లు చేయి. అప్పుడు ఊళ్ళో వాళ్ళు కూడా పరిచయం అవుతారు. నీ షికార్లు వాళ్ళకి అలవాటు అవుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా పరిశోధనమొదలుపెట్టు. అప్పుడయినా రహస్యంగానే సుమా!"
సూర్యారావు చెప్పింది ఇప్పుడు బాగా అర్ధమైంది. అర్ధం అయిన తరువాత కైలాసగణపతి మాట యిచ్చాడు.
"నిజం చెప్పాలంటే నా పరిశోధన రోజుల్లో పూర్తి కాదు. నీవు నా శ్రేయస్సుకోరి నామీద ప్రేమతో ఈ విషయం ఒకటికి పదిసార్లు చెపుతున్నావు కాబట్టి నీవు చెప్పినట్లు అక్షరాలా చేస్తాను" అన్నాడు.