"హారినీ మాటలు దొంగలుదోయా!" అని ముచ్చటగా నవ్వాడు సూర్యారావు.
"ఏ మందులు అక్కరలేదు అన్నయ్యగారూ! స్నానం చేసేటప్పుడు ధారగా వేడివేడి నీళ్ళు కాళ్ళమీద పోసుకోండి. నాలుగు రోజులు ఎటూ కదలకుండా విశ్రాంతిగా పడుకోండి. ఎక్కడ నెప్పుడు అక్కడ హుష్ కాకీ అని ఎగిరిపోతాయి." అక్కడే వున్న మాణిక్యాంబ చెప్పింది.
"నీ వైద్యం తేలికగా బాగుంది అలా చేస్తానమ్మా! వీడుచూడు పిండతైలం మొండిబండతైలం అంటూ హడలగొడుతున్నాడు." అన్నాడు కైలాసగణపతి.
"ఆ....ఆ.... ఆపని చెయ్యి. వేడినీళ్ళు కాళ్ళమీద పోసుకుంటే రెండుకాళ్ళూ కాలి నిమ్మకాయంత బొబ్బలు లేస్తాయి. అప్పుడు ఎలాగూ అడుగుతీసి అడుగెయ్యలేవు. విశ్రాంతిగా మంచం ఎక్కుదువుగాని." సూర్యారావు అన్నాడు.
"ఛీ.....అవేం మాటలండీ! శరీరం పట్టే వేడి చూసుకుని నీళ్ళు పోసుకోవాలి అంతేగాని. సలసలకాగే వేడి మసుళ్ళు కాదు." అంది మాణిక్యాంబ నొచ్చుకుంటూ.
"నువ్వేం అనుకోకమ్మా! నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కదా! వాడి బాధ నేను పిండతైలం వాడలేదే రోగిజారిపోయాడే అన్న బాధ భరించలేక అలా వాగుతున్నాడు అంతే."
కైలాసగణపతి నవ్వుతూ అన్నాడు.
మాణిక్యాంబా, సూర్యారావు నవ్వారు.
"అన్యాయం, అన్యాయం" అంటూ వచ్చింది విమల.
"ఏమిటమ్మా అన్యాయం?" సూర్యారావు అడిగాడు.
కూతురికి ఏమి అన్యాయం జరిగిందో అన్నట్లుకంగారు పడింది మాణిక్యాంబ.
"నేను రాకముందే మీరంతా కలిసి జోక్స్ చెప్పుకుంటే ఎలా? ఇది అన్యాయం కాదా! ఇది అధర్మం కాదా?" సీరియస్ గా అడిగింది విమల.
"నా ముఖంలా వుంది అన్యాయం అంటుంటే ఇంకేదో అనుకున్నాను" అంది మాణిక్యాంబ.
"నువ్వు ప్రతిదీ అలాగే అనుకుంటావు రత్నమాణిక్యం. నాకుతెలిసిన విషయమే కదా?" సూర్యారావు అన్నాడు.
"లాయర్ గా నువ్వుచాలా పనికివస్తావమ్మా కమలా!" మెచ్చుకోలుగా అన్నాడు కైలాసగణపతి.
"నా పేరు కమల కాదు మామయ్యగారూ! విమల..... విమల."
"అదేనమ్మా విమలా వెయ్యకూడదు అనుకుంటూనే మళ్ళీ పప్పులో కాలేశాను. ఏమైనాసరే ఈరోజు పొరపాటు పడకూడదనుకుంటూ ఈ మధ్యాహ్నం నుంచీ నీ పేరు కమల కమల అని ఏ వందసార్లో మననం చేస్తున్నాను. కాని అదేం ఖర్మో నిన్ను చూసేసరికి అసలు పేరు మరిచిపోయి విమల అన్నాను" కైలాసగణపతి చెప్పి "సారీ విమల తల్లీ! జోక్ చేశాను" అన్నాడు.
అందరూ పగలబడి నవ్వారు.
"చూశావురా ఎంతమందిని ఎలా నవ్వించానో హహ్హహ్హ అంటూ ఆనందంగా నవ్వాడు కైలాసగణపతి.
"మేము నవ్వలేదు." సీరియస్ గా ముఖంపెట్టి చెప్పాడు సూర్యారావు.
"మరి?"
"మర్యాదగా వుండదని బాగుండదని నీ జోక్ నవ్వాము. అతిధి మర్యాద యిదన్నమాట." సూర్యారావు చెప్పాడు.
"నీ మర్యాద మండినట్లేవుంది. నా జోక్ కి పడిపడి నవ్వారు కదా అని మురిసిపోయాను. అయ్యో!" వాపోయాడు కైలాసగణపతి.
"అన్నయ్యగారూ! వారిమాటలు నమ్మకండి. అందరి సంగతి ఏమోగాని నేనుమాత్రం నిజంగానే నవ్వాను." అంది మాణిక్యాంబ.
"విన్నావురా సూరీడూ! చెవులు బాగా పనిచేయకపోతే మళ్ళీ చెప్పించుకొని విను."
"అన్నగారివికదా నొచ్చుకుంటావని....."
"అదేమీ కాదు ఉన్న నిజం నువ్వు భరించలేక మసిపూసి మారేడు కాయని చేస్తూ నన్ను నమ్మించాలని చూస్తున్నావు."
"ఏమిటది! నేను లేకుండా చూసి చర్చలు సమావేశాలు!" అంటూ రవి బైటనుంచి వచ్చాడు.
"రావోయ్ రవి నువ్వు లేకపోతే నిండేలేదు." అన్నాడు కైలాసగణపతి.
"అంకుల్! ఈ తఫా మీరు నాపేరు మరిచిపోలేదు."
"అమ్మయ్య అయితే నీపేరు రవేనన్నమాట.....?"
"అదేమిటి అంకుల్?"
"మీ నాన్న నన్ను అదేపనిగా ఎక్కిరిస్తున్నాడోయ్! ఆబాధ భరించలేక మీ పేర్లని అదేపనిగా వల్లిస్తూ రాత్రంతా నిద్రపోలేదనుకో." కైలాసగణపతి కాళ్ళునొక్కుకుంటూ చెప్పాడు.
"అదేమిటి అంకుల్ అలా....."
"అలా చేయటం కష్టం కాదు. మీ సూరీడు పెద్ద కొడుకు పేరు హరి. చిన్న కొడుకుపేరు రవి. అమ్మాయి పేరు కమల కాదు విమల. అనుకుని మళ్ళీ మొదటికి వస్తాను అదెలాగంటే మా సూరీడు పెద్దకొడుకు పేరు హరి చిన్న కొడుకు పేరు - "
"చాలు అంకుల్!" చేతులతో వారిస్తూ అన్నాడు రవి.
"అర్ధమైంది కదా మీ నాన్న ఎక్కిరింపువల్ల నేను ఎంత కష్టపడిందీను!"
"అది కాదు అంకుల్ నేను అడిగింది. కాళ్ళు నొక్కుకుంటున్నారు అదేమిటి అలా.....అని అడిగాను."
"మీ నాన్న చేసిన పనికి నా కాళ్ళు నొప్పులు చేశాయి."
"అదేమిటోయ్ ఈ కొత్త అపవాదు" సూర్యారావు మధ్యలో అడ్డు తగిలి ఆశ్చర్యంగా అడిగాడు.
"నాకీ ప్రదేశం కొత్త కాబట్టి కొండలు గుట్టలు తిప్పి చూపించమన్నాను. సరే చూపించాడు బాగానే ఉంది. వరే చిట్టి తండ్రీ! నీకు కొత్త అన్నీఒకేసారి తిరిగితే కాళ్ళు నొప్పులు చేస్తాయి అవి ముందే అఘోరించవచ్చుకదా? నేను చూపించమన్నాను. నా రోగం కుదర్చటానికి చూపించాడు. కాళ్ళు నొప్పులు చేశాయి. మీ నాన్న సంగతి నీకు తెలియదు హరీ - "
"హరి కాదు అంకుల్ రవి."
"ఆ....ఆ - రవి, ఒకదాంట్లోకి వెళితే రెండోది మరచిపోతుంటారు. ఎందాక వచ్చాను, మీ నాన్న విషయం దగ్గర కదూ ఆగాను!"