Previous Page Next Page 
హత్య పేజి 19


    కైలాసగణపతి అలామాట యివ్వబట్టి ఈరోజువరకూ పరిశోధనమాట ఎత్తలేదు.

 

    రోజూ సూర్యారావుతో కలిసి షికారుకి వెళ్ళివస్తుండేవాడు.

 

    ఊళ్ళో చాలామందితో కూడా పరిచయం అయింది. గాలికన్నా వేగంగా వార్తలు వ్యాపించాయి. కనక కైలాస గణపతి ఈ ఊరు విశ్రాంతి కొరకు, గాలి మార్పుకొరకు వచ్చినట్లు తెలిసిపోయింది.

 

    పంటపొలం కోతకి వచ్చింది.

 

    చాలా చిన్న రైతుకి కౌలుకిచ్చి పొలం అది. అయినా అతనికి సహాయంగా కూలీలకి పెట్టి పని జరిపించటానికి సూర్యారావు తరచు అటు పొలం దగ్గరకు వెళుతున్నాడు.

 

    కైలాసగణపతిని రమ్మని అడిగితే అదంతా చూడటం నాకు బోర్ నేను రాను అన్నాడు.

 

    సూర్యారావు పొలానికి వెళ్ళాడు అటు.

 

    కైలాసగణపతి మొదటిసారిగా ఇటు షికారుకి బయలుదేరాడు ఒంటరిగా.

 

    "తింటం, తిరగటం. లేకపోతే కబుర్లు లైఫ్ బోర్ గా వుంది. నా ప్రాణమంతా అటు దానిమీద వుంటే ఈ విశ్రాంతి మటుకు మనసుకి చల్లగా ఎలా వుంటుంది?" అనుకుంటూ కైలాసగణపతి నడుస్తున్నాడు.

 

    "గణపతిగారూ!" ఎవరో పిలిచినట్లయి ఆగాడు కైలాసగణపతి.

 

    ఎదురుగా మస్తానయ్య.

 

    ఆ ఊళ్ళో మోతుబరి, సూర్యారావుకి స్నేహితుడి లాంటివాడు.

 

    "మీరా?" అన్నాడు కైలాసగణపతి.

 

    "నేనే గణపతిగారూ! మస్తానయ్యని. సూరయ్యగారు ఈపూట మీతో బయలుదేరలేదా?"

 

    "ఉహు? పొలం నూర్పిడో, కోతో అదేమిటో నాకు తెలియదు. దానికి వెళ్లారు." అతడు తలగోక్కుని కాస్త ఆలోచించి చెప్పాడు.

 

    "మీరు భలే తమాషాగా మాట్లాడుతారు గణపతిగారూ." నవ్వుతూ అన్నాడు మస్తానయ్య.

 

    "ఏమిటో. హీ.... హి..... హి...." అన్నాడు కైలాసగణపతి అంతకు మించి ఏం మాటాడాలో తెలియలేదు.

 

    ఇరువురూ అక్కడే నుంచుని రెండు మాటలు మాట్లాడారు.

 

    మస్తానయ్య ఇటూ, కైలాసగణపతి అంటూ బయలుదేరి వెళ్ళారు.

 

    మళ్ళీ.....

 

    కైలాసగణపతిని నలుగురైదుగురు మాట్లాడించారు వాళ్ళతో నాలుగుమాటల మాటాడి అలానే ముందుకు సాగాడు.

 

    సూర్యారావు వెంటరాకుండా ఇదే మొదటిసారి అతను షికారు బయలుదేరటం. అందుకని సగంమంది కల్పించుకుని మాట్లాడారు.

 

    అలా నడుస్తూ పొలాలు దాటి కొండదగ్గరకు వచ్చాడు కైలాసగణపతి. ప్రాణం హాయిగా వుంది. ఒకసారి నలువైపులా చూశాడు. దరిదాపులలో ఎవరూ కనపడలేదు.

 

    "ఇప్పుడు వెళ్ళి ఆ గుహ చూస్తే"

 

    అతను కొద్దిసేపు అక్కడే వున్న బండమీద కూర్చుని ఆలోచించాడు.

 

    ఇంతవరకు ఒక్కసారి కూడా పగలు పన్నెండు గంటల లోపు రావడం కుదరలేదు. షికారుకి ఎప్పుడొచ్చినా సాయంత్రమే.

 

    గవ్వలమ్మ గుహలోకి వెళ్ళి చూద్దామాఅంటే పగలు పన్నెండు గంటలలోపు తప్ప పన్నెండు తరువాత విషయం తెలిసి ఆ గుహలో కాలుపెట్టడం కోరి మృత్యువుని కొనితెచ్చుకోవటమేనని సూర్యారావు చెప్పాడు.


    అక్కడ గవ్వలమ్మ అనే దేవత ఉందని తెలియక ఎవరయినా ఆ గుహలోకి వెళితే ఆమె ఏమీ చేయదు. కానీ విషయం తెలిసి కావాలని పనిగట్టుకుని గవ్వలమ్మ ఉన్న గుహలోకి వెళ్ళటం మాత్రం ఆ దేవత సహించలేదు. రోగం కుదురుస్తుంది. అందుకనే తెలిసిన వాళ్ళెవ్వరూ వెళ్ళరు.

 

    "గుహలో కుండమూకుడు, గవ్వలులాంటివి తప్ప ఏమీ వుండవు. గవ్వలమ్మ దేవత వాటిని ఆక్రమించుకొని వుంటుంది. చూడటానికి అవే కనపడతాయి. మనకి తెలియని శక్తి అక్కడ ఆక్రమించుకుని వుంటుంది. నీకు నమ్మకం లేకపోయినా నాకు వుంది. ఉదయం వచ్చి ఓసారి చూపిస్తాలే" అన్నాడు సూర్యారావు. ఉదయం అంటూ రావడం పడలేదు.

 

    అందువల్ల

 

    కైలాసగణపతికి ఆ గుహ చూడటం పడలేదు.

 

    కైలాసగణపతికి నమ్మకాలు లేవు.

 

    "ఇప్పుడెళ్ళిచూస్తే!" అనుకున్నాడు. "నిజం తెలిస్తే సూరీడు బాధపడతాడు" మళ్ళీ అనుకున్నాడు. కొద్దిసేపు వెళదామా వద్దా! అని తర్జనభర్జన పడి చివరికి ఓ నిర్ణయానికి వచ్చాడు.

 

    కైలాసగణపతి లేచి నిలబడ్డాడు. నలువైపులా కలయచూశాడు. దూరాన అటువైపుగా మేకలని కాచే కుర్రవాళ్లు కొండదిగి వెళుతున్నారు. కొండమీద ఎవరూ ఉండరు. కారణం మామూలుదే పొద్దు ఏటవాలుతుంటే, సూర్యుడు దిగిపోతుంటే ఎవరైనాసరే కొండ దిగుతారుగానీ కొండ ఎక్కరు.

 

    కానీ ఇప్పుడు కైలాసగణపతి కొండ ఎక్కటం ప్రారంభించాడు. నలువైపులా జాగ్రత్తగా చూస్తూ మరీ ఎక్కుతున్నాడు.

 

    కైలాసగణపతి కొండ ఎక్కేతీరు ఎలా వుందంటే ఏదో తప్పుపని చేసేవాడు నలువైపులా దొంగచూపులు చూసే విధంగా వుంది.

 

    ప్రస్తుతం కైలాసగణపతి చేస్తున్నది అదేమరి, మధ్యాహ్నం దాటింతరువాత గవ్వలమ్మ వున్న గుహలోకి వెళ్ళకూడదురానాయనా తండ్రీ అని పసివాడికి చెప్పినట్లు కైలాసగణపతికి చెప్పాడు సూర్యారావు.

 

    ఇప్పుడు ఆ మాట పెడచెవినపెట్టి కైలాసగణపతి కొండ ఎక్కుతున్నాడు. ఏ అనర్ధకం జరగనుందో మరి.

 

    సగం కొండ ఎక్కితేగాని గవ్వలమ్మ గుహరాదు.

 

    కైలాసగణపతి పావువంతు కొండ ఎక్కాడు.

 

    ముందు జాగ్రత్త కోసం పది అడుగులు వెయ్యను నలువేపులా చూడను చేస్తున్న కైలాసగణపతికి కాస్త పైనున్న బండరాయి చాటునుంచి ఎవరో తనని గమనిస్తున్నట్లు, తను గబుక్కున తల పైకి ఎత్తేసరికి రాతిచాటుకి తప్పుకున్నట్లు అనిపించింది. పోనీ అది భ్రమ అనుకుందామా? అనుకుంటే ఆ మనిషి ఎవరో హఠాత్తుగా తప్పుకోటంవల్ల కాలికింద చిన్న గులకరాయి జారి కిందకుదొర్లింది. అయితే అది దడ దడ అంటూ పెద్ద శబ్దం చేస్తూ దొర్లలేదు. బారెడు దూరం దొర్లి ఆగిపోయింది.    

 Previous Page Next Page