Previous Page Next Page 
చీకటికి అవతల పేజి 18


    ఆ స్పర్శకు ఆమె రక్తనాళాలు కదిలినట్లు ఆమెలో ప్రకంపనాలు మొదలయ్యాయి.

 

    ఆయన తన పెదవుల్ని ఆ తరువాత పైకి లేపలేకపోయాడు. ఆమె ముక్కుని రాస్తూ పెదవుల్లోకి దిగి, అక్కడ ఏదో రుచిని ఆస్వాదిస్తూ- "సప్త సింధు అంటే ఏడు నదులు అని అర్థం. ఆ ఏడు నదుల సంగమం వద్ద వున్న నీళ్ళు కూడా ఇంత రుచిగా వుండవు" అని ఆమె నోట్లోకి తన పెదవుల్ని తోశాడు.

 

    ఆ తరువాత కంఠం నునుపుకి తన పెదవులు జారిపోయినట్టు ఠక్కున ముఖాన్ని కిందకు దించి ఆమె ఎదవద్ద ఆపాడు.

 

    "పూర్ణకుంభ స్వాగతం అంటే ఏమిటో అనుకునేవాడ్ని ఇంతకాలం. నీ ఎద చూస్తే తెలుస్తోంది అలా అంటే ఏమిటో-" అని ముఖంతో ఆమె ఎదపై రాశాడు. ఆమె చిన్న జర్క్ ఇచ్చినట్లు కదిలింది.

 

    దాంతో అతను పట్టుతప్పి ఆమె ఎద మధ్యలో ముఖాన్ని వుంచాడు.

 

    "రెండు యుద్ధాల మధ్యనున్న విరామమే శాంతి అన్నట్లు రెండు పర్వతాల మధ్యనున్న స్థలమే మైదానం" అని అక్కడ తల వుంచడం ఇక సాధ్యం కాకపోవడంతో నెమ్మదిగా కిందకు దిగాడు.

 

    "వెన్నెలరాత్రి ఇసుక మైదానం కూడా ఇంత గొప్పగా వుండదనుకుంటా" అంటూ ఆమె నడుమును కళ్ళు వెడల్పు చేసి చూశాడు.

 

    ఇంకాస్తసేపు అలాగే వుంటే ఏదో అంటాడనిపించి ఆమె ఆయన ముఖాన్ని తిరిగి పైకి లాక్కుని కజ్జికాయలో పూర్ణాన్ని కూర్చినట్టు తన పెదవుల్ని ఆయన నోట్లో కూరింది.

 

    ఇక అక్కడ వుండలేకపోయారు దీపశిఖ,నందిని.

 

    నిజానికి అంతసేపు కూడా వాళ్ళు అక్కడ వుండేవాళ్ళు కాదు. లోపల కనిపించిన ఆ దృశ్యం తాలూకు షాక్ నుంచి వాళ్ళు అప్పటికి తేరుకోగలిగారు.

 

    వాళ్ళిద్దరూ లవ్లీహిల్స్ నుంచి బయల్దేరిన రాఘవానంద భక్త బృందంతో కలిసి అక్కడకు వచ్చారు. వారికి రాఘవానంద మీద భక్తి భావం ఏమీ లేదు. అలా అని వ్యతిరేకత కూడా లేదు. చుట్టుపక్కల వాళ్ళంతా బయల్దేరుతుంటే తామూ సరదాగా వచ్చారు.

 

    తీరా ఇప్పుడు అలాంటి దృశ్యం కంటపడేసరికి తట్టుకోలేకపోయారు.

 

    ఎలా నడుస్తున్నారో కూడా తెలియడం లేదు. భగవంతుని అవతారమని నమ్మే రాఘవానంద సగటు మగాడిలా ఓ అమ్మాయితో గడపడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

    వారితోపాటు వచ్చిన వాళ్ళంతా అక్కడున్న ఓ గెస్ట్ హౌస్ లో వున్నారు. అక్కడికి వెళ్ళారు.

 

    ఎవరితో మాట్లాడాలనిపించలేదు. వాళ్ళిద్దరూ సైతం మాట్లాడలేకపోతున్నారు.

 

    అనసూయమ్మ అనే ఆవిడ దీపశిఖకి పిన్ని వరసవుతుంది. ఆమె వాళ్ళ వాలకం కనిపెట్టింది. దీపశిఖ దగ్గరికి వెళ్ళి ఆమె "ఏమిటిలా వున్నావ్? ఏదో పోగొట్టుకున్నదానిలా" అని అడిగింది.

 

    "ఆఁ పోగొట్టుకున్నాను" అంది దీపశిఖ.

 

    "ఏమిటే!" ఆమె కంగారుపడింది. ఆడపిల్ల 'పోగొట్టుకున్నాను' అంటే ఆమె దృష్టిలో శీలమనే. అందుకే అంతగా కంగారుపడిపోయింది.

 

    "నమ్మకాన్ని"

 

    "నమ్మకమా!" కంగారు స్థానంలో ఆశ్చర్యాన్ని నింపుకుంది అనసూయమ్మ.

 

    "రాఘవానంద ఒట్టి మోసగాడు- దొంగ- వ్యభిచారి" కసికసిగా అంది.

 

    "అయ్యొయ్యో- అపచారం" అనసూయమ్మ చెంపలు వాయించుకుంటూ అంది.

 

    "అపచారం లేదు- ఆవకాయ పచ్చడీ లేదు" అంటూ తాను చూసిన దంతా చెప్పింది.

 

    రకరకాల భావప్రకటనల అనంతరం ఆమె "నువ్వు చూసింది నిజమే కావచ్చు. కానీ అది తుచ్ఛకామం కాదు. భగవంతుని లీలలు మనకు తెలియనట్టే ఆయన దూతల లీలలు కూడా అర్థంకావు. ఆయన ఎందుకలా ఆమెను చేరదీశాడో- దాని వెనుక నున్న మర్మం ఏమిటో మనకు తెలియదు. కృష్ణుడికి పదహారు వేలమంది గోపికలు వున్నారంటారు. వాళ్ళంతా ఆయన ఉంపుడుగత్తెలనుకుంటున్నారా? కానే కాదు. వాళ్ళు అంతక్రితం జన్మలో ఆయన భక్తులు" అంది.

 

    ఇక ఏం చెప్పినా అనసూయమ్మ నమ్మడాని అర్థమైంది. భక్తి కూడా ఒక రకమైన పిచ్చి.

 

    ఆ పిచ్చి అంత తొందరగా వదలదు. స్వయానా రాఘవానంద ఎదుటే నలుగురు యువకుల హత్య జరిగినా ఈ భక్తులు ఏమీ అనుకోరు.

 

    ఆయన పైనున్న భక్తి సన్నగిల్లదు. నమ్మకం పిసరంత తగ్గదు. అందుకే రాఘవానంద లాంటివాళ్ళు ఎప్పుడైనా ఏమరపాటున దొరికిపోయినా వాళ్ళ స్థానం మాత్రం చెక్కుచెదరదు.

 

    మరుసటిరోజు తెల్లవారుజామునే వాళ్ళ తిరుగు ప్రయాణం. ఆ రాత్రంతా దీపశిఖగానీ, నందినికిగాని నిద్ర రాలేదు. ఎవరో సరైన వాళ్ళకు విషయమంతా చెప్పి రాఘవానంద నిజస్వరూపం బయటపెట్టాలని ఆ ఇద్దరి ఆరాటం. కానీ చెబితే వినేదెవ్వరు? విన్నా నమ్మేదెవరు?

 

    వాళ్ళలా ఆలోచనల్లో వుండగానే మిగిలినవారంతా నిద్రలేచారు. స్నానాలు ముగించుకుని చివరిసారిగా రాఘవానంద దర్శనానికి వెళ్ళి వచ్చారు. ఎనిమిది గంటలకు వాళ్ళ వ్యాన్ లవ్లీహిల్స్ కి బయల్దేరింది.

 

    ఇంటికి చేరుకున్నా ఆ రహస్యాన్ని వాళ్ళిద్దరూ తమలో దాచుకోలేకపోయారు. రాఘవానందను ఏదో చేయాలన్న కసి కూడా బయల్దేరింది.

 

    ఆయన అసలు రూపం బయటపెట్టాలన్న వత్తిడిని భరించలేకపోయారు.

 

    వాళ్ళిద్దరికీ కలిపి ఓ కామన్ ఫ్రెండ్ వుంది.

 

    ఆమె పేరు తనూజ. ఓ ప్రముఖ పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తోంది.

 

    మొదట్లో ఆమె ఆ పత్రికలో సబ్ ఎడిటర్ గా వుండేది. స్త్రీలు మగవాళ్ళ కంటే ఎందులో తీసిపోరని ఆమె నమ్మకం. అందుకే ఓసారి పత్రిక డైరెక్టర్ వస్తే "సార్! నేను రిపోర్టర్ గా చేరుతాను" అని తన మనసులోని మాట చెప్పింది.

 

    ఆయన ఆశ్చర్యపోయాడు.

 

    "నువ్వా! ఆడపిల్లవి- రిపోర్టర్ అంటే ఎక్కడెక్కడో తిరగాలి. ఎంతెంతసేపో అవుతుంది. ఒక్కొక్కసారి అర్థరాత్రిపూట బయటికి వెళ్ళాల్సి వుంటుంది" అని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించాడు.

 

    కానీ తనూజ వినలేదు.

 

    "నేనూ అర్థరాత్రి వెళతాను సార్" అంది.

 

    "అర్థరాత్రి- ఆడపిల్లవి- ఒంటరిగా...." వచ్చే ప్రమాదాన్ని చెప్పలేక అంతటితో ఆపేశాడు.

 

    "అర్థరాత్రి అబ్బాయిలు వెళుతున్నారు కదా"

 

    "అవునమ్మా- కానీ...."

 

    "ప్రమాదముంటే ఇద్దరికీ వుండాలి. లేకుంటే ఇద్దరికీ వుండకూడదు. నేను దేనికైనా సిద్ధమే సార్"

 

    ఇక డైరెక్టర్ ఏం మాట్లాడలేకపోయాడు. వెంటనే రిపోర్టర్ గా అప్పాయింట్ మెంట్ ఇప్పించాడు.

 

    అలా తనూజ రిపోర్టర్ గా చేరింది.

 

    ఆమెతో దీపశిఖకు, నందినికి అంతగా స్నేహం లేకపోయినా పరిచయం బాగానే వుంది. దాన్ని ఆధారం చేసుకుని ఓరోజు ఇద్దరూ వెళ్ళి తనూజకు ఆశ్రమంలో తాము చూసింది చెప్పారు.

 

    "అయితే రాఘవానందను ఓ పట్టు పడతాను" అంది అంతా విన్నాక.

 

    అలా దీపశిఖ, నందిని తీగలాగడంతో డొంకంతా కదలడం ప్రారంభించింది తనూజ రంగంలోకి దిగడంతో.

 

    వెంటనే ఆశ్రమానికి వెళ్ళింది.

 Previous Page Next Page