సరిగ్గా 12-15 నిమిషాలయింది.
ఆ లారీ అనుకోకుండా ఆ జంక్షన్ లోనే ఆగింది. అందులోంచి శక్తి, మిత్రబృందం దిగింది. వాళ్ళూ ప్రమాదాన్ని ఊహించే అక్కడ దిగారు.
"బాబూ.. శక్తీ..."
చీకట్లో ఆ పిలుపు విని ఉలిక్కిపడ్డాడు శక్తి.
చటుక్కున తలతిప్పి చూసాడు. ఎదురుగా తల్లి.... ఆశ్చర్యపోతూ...
గబగబా తల్లి దగ్గరకెళ్ళాడు శక్తి.
తల్లిని చూడగానే అర్ధమయింది శక్తికి- వూళ్ళో ఏదో జరిగిందని.
"ఏంట్రా ఇది?" చేతులు పట్టుకుంది. ఆమె గొంతు బొంగురు పోయింది.
కళ్ళంట నీళ్ళు ఆగలేదు.
"ముందు నా వెనకరా.... తర్వాత జరిగింది చెపుతాను" రోడ్డు దిగిపోయి ప్రక్కనే వున్న తోటలోకి నడిచింది.
మిత్ర బృందానికి గుండెలు గుబగబలాడాయి. ఏం జరిగిందోనని గుండెల్లో రైళ్ళు పరిగెట్టాయి. వాళ్ళూ తోటలోకి వెళ్ళారు.
"ఏంటమ్మా... ఏం జరిగింది... ఈ సమయంలో ఇక్కడ...?" అడిగాడు శక్తి.
అదే సమయంలో వూళ్ళోంచి బైపాస్ రోడ్ జంక్షన్ వరకూ ఓ జీపొచ్చి అటూ, ఇటూ తిరిగి వెళ్ళిపోయింది.
"జరగాల్సిందంతా జరిగింది... ఆ జీపెవరిదో తెల్సా? బాలచంద్రది" అని జరిగిందంతా చెప్పింది తల్లి.
"వాణ్ని చంపేస్తాను" అంతెత్తున లేచాడు శక్తి.
"ముందు నన్ను చంపు" కోపంగా ఏడుస్తూ అందావిడ.
"నీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాన్రా... నువ్వు అదృష్టజాతకుడవని అంటే నిజమనుకున్నాను... అదృష్టమంటే, ప్రాణాల మీదకు తెచ్చుకుంటావని నాకు తెలీదు... ఇవాళ నీ వల్ల వూళ్ళో మనం బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. నీవల్ల వాడి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..." అందరూ తోటలోంచి ఎవరికీ కనబడకుండా నడుస్తున్నారు. తల్లి చెపుతోంది.
వింటూనే ఆలోచిస్తున్నాడు శక్తి.
లక్ష్మీదేవి చెప్పిందంతా వినగానే అందరికీ ప్రాణభయం పట్టుకుంది.
"మీరు బ్రతకాలనుకుంటే రాత్రికి రాత్రే వూరు విడిచి మీ బంధువుల వూళ్ళకు వెళ్ళిపోండి" అని మిగతావాళ్ళను హెచ్చరించింది లక్ష్మీదేవి.
ఆ మరుక్షణం వాళ్ళు చీకట్లో అదృశ్యమైపోయారు. తోటలోంచి, పొలాల మీదుగా ఇంటి వెనక్కి తీసుకొచ్చింది శక్తిని.
అప్పటికిగాని, ఆమె తల్లి హృదయం కుదుటపడలేదు.
* * * *
"జీవితంలో ఏ వ్యక్తికయినా ఒకే ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అది ఎక్కడో ఒక దగ్గర అకస్మాత్ గా, ఆ వ్యక్తికి తెలియకుండానే ఎదురవుతుంది.
దానినే కొంతమంది అదృష్టం అంటారు. మరికొందరు జాతకం అంటారు... అక్కడ నుంచి మనిషి ఎదగడం ప్రారంభిస్తాడు. తనను తాను తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. తన జీవితాన్ని మలుచుకోవడం ప్రారంభిస్తాడు.
మనిషి బాగుపడడానికిగాని, చెడిపోవడానికిగానీ కారణం అతనే అవుతాడు. తన మంచి, చెడులకు కారణం ఇతరులని చాలామంది అనుకుంటారు. కాని కాదు. తనకు తనే మిత్రుడు. తనకు తనే శత్రువు.
ఈ విషయం అనుభవం మీద కాని, అర్థం కాదు. జీవితంలోని సంఘర్షణ ప్రారంభమయ్యేది అక్కడే. ఆ సంఘర్షణ పర్యవసానమే సత్ఫలితం.
రాత్రి రెండు గంటలయింది.
గదిలో అటు తల్లి, ఇటు తండ్రి ద్వారానికి ఆనుకొని చెల్లి మధ్య ముద్దాయిలా కూర్చున్నాడు శక్తి.
"నువ్విక్కడుంటే మరి బాగుపడవు... వాడు నిన్ను బ్రతకనివ్వడు. నువ్విక్కడ నుండి వెళ్లిపోతేనే మాకు దక్కుతావు... అంతే... అంతకంటే మరో గత్యంతరం లేదు" నెమ్మదిగా అంది తల్లి.
"అంటే భయపడి పిరికివాడిలా ఊరొదిలి వెళ్ళిపొమ్మంటావా!" కాళ్ళూపుకుంటూ పొగరుగా అన్నాడు శక్తి.
"నువ్వు ధైర్యవంతుడివే... అయితే.. ఏం చేస్తావురా... వెళ్ళివాడ్ని చంపు... చంపాక జైలుకెళ్ళు... మనిషన్నాక చంపుకోవడం, చావడం కాదురా... మంచి బతుకు కోరుకోవాలి... అందుకోసం సాయశక్తులా ప్రయత్నించాలి... నీకాలోచన లేదు. అది మా ఖర్మ...." తండ్రి బాధగా అన్నాడు.
ఆ మాటకి పౌరుషం వచ్చింది శక్తికి.
"ఆఖరుకు నన్ను జులాయి వెధవలా కట్టేసారు.... నాకు బాగుపడాలనే కోరిక లేదా... ఐయామ్ వెయిటింగ్ ఫర్ ఏన్ ఆపర్చునిటీ" తలదించుకొని అన్నాడు శక్తి ఉక్రోషంగా.
"యాంబిషన్... ఆపర్చునిటీ... వాటిని మనసులో వుంచుకుంటే సరిపోదురా... అవకాశం కోసం ప్రయత్నించాలి... అవకాశం ఇంట్లో కూర్చుంటే వస్తుందా" మందలింపుగా అంది తల్లి.
"వస్తుంది. అవకాశం వస్తుంది. అవకాశం నన్ను వెతుక్కుంటూ వస్తుంది. నాకా నమ్మకం వుంది. నాకు నామీద నమ్మకముంది.
మీకు నామీద నమ్మకం లేకపోతే ది మీ బేడ్ లక్..."
"వాదిస్తూ కూచునే టైములేదు. తాడో, పేడో ఈ రాత్రే డిసైడ్ అయిపోవాలి... రేపుదయానికి నువ్వీ వూళ్ళో వుండటం మంచిది కాదు. పరిస్థితులన్నీ ఒకసారి ఆలోచించి చెప్పు... నీకు చేతకాకపోతే నేను చెపుతాను" తల్లి అప్పటికే ఒక నిర్ణయానికొచ్చింది.
"అమ్మ చెప్పినట్లుగా చెయ్యరా...." ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు తండ్రి.
ఐదు నిమిషాలసేపు ఎవరూ ఏం మాట్లాడలేదు.
బాలచంద్రగాడికి తన ప్రతాపం ఏమిటో చూపించాలని ఉంది శక్తికి. కానీ దానికి తల్లీ, తండ్రి అడ్డుకట్ట వెయ్యటం నచ్చలేదు శక్తికి.
"ఏమాలోచించావో... నువ్వే చెప్పు" నెమ్మదిగా అన్నాడు శక్తి. ఆ మాటకు తల్లి ముఖం వికసించింది.
"శారదా.... అన్నయ్య బట్టలు సర్దు" అని కూతురికి చెప్పి...
"చూడు శక్తీ... ఈ సమస్యలన్నిటికీ ఒక్కటే పరిష్కారం... నువ్వు బెంగుళూరు వెళ్ళిపో" కొడుకు కాళ్ళ దగ్గర కూర్చొని ముఖంలోకి చూస్తూ అభిమానంగా అంది తల్లి.
"అక్కడి కెందుకు? హైదరాలీ, టిప్పూ సుల్తాన్, విజయ్ మాలవ్యా మన చుట్టాలా" వెక్కిరింపుగా అన్నాడు శక్తి.