"అందుకే ఎవరు చేసారో తెలియగూడదు. మనం అని ఊహించినా కంప్లయింట్ ఇవ్వలేడు. ముహూర్తం ఈ రోజు రాత్రి మూడు గంటలు...." అన్నాడు శక్తి.
"పని పూర్తయ్యాక అందరం జగ్గయ్యపేట వెళ్ళిపోదాం" రమణరావు అన్నాడు.
"అందరం వెళ్ళిపోతే అనుమానం వస్తుంది..." సుబ్రహ్మణ్యం అన్నాడు.
"అయితే ఓ పని చేద్దాం... మనకి శక్తి కున్నంత ధైర్యం లేదు. మనం నందిగామలోనే ఉండిపోదాం. శక్తి మాత్రం జగ్గయ్యపేట వెళ్ళిపోతాడు."
రమణరావు ప్రపోజల్ కి అందరూ తలూపి బయలుదేరారు.
* * * *
సరిగ్గా ఉదయం పదిగంటలకు బాలచంద్రకు థియేటర్ మేనేజర్ ఫోన్ చేసి విషయం చెప్పాడు కంగారుగా... భయంగా.
ఫోన్ లో ఆ వార్త వింటూనే షాక్ తిన్నాడు బాలచంద్ర. ఆ వెంటనే థియేటర్ కొచ్చేశాడు వేగంగా.
"ఇది వాంటెండ్ గా ఎవరో చేసిన పని. ఆ ఎవరో- ఎవరన్నది తేలిపోవాలి వెంటనే" రకరకాలుగా ఆలోచిస్తున్నాడు బాలచంద్ర.
క్షణాలు- నిముషాలు- గంటలు గడిచిపోతున్నాయి.
ఇన్ ఫర్మేషన్ రాబట్టటం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు బాలచంద్ర.
అప్పుడొచ్చాడు లైబ్రేరియన్... చేతిలో ఒక బాక్స్ తో.
"మన వాళ్ళని పంపించి అన్నిచోట్లా వెతికించండి. ఎవరో ఎత్తుకెళ్ళి తలా చోట పడేసుంటారు" అన్నాడు బాలచంద్ర.
ఎంతసేపటికి మిగతా రీళ్ళు కనిపించలేదు.
బాలచంద్రలో బీ.పీ. రెయిజయింది.
"ఎవరు చేసుంటారీ పని..." ఆలోచిస్తున్నారందరూ. అప్పుడు జ్ఞాపకానికొచ్చాడు శక్తి.
"సూర్యనారాయణ షాప్ లో ఉద్యోగం పీకించేసామని వాడే ఈ పని చేసుంటాడు. వెంటనే వాడి గ్రూప్ లో ఎవడ్నో ఒకడ్ని పట్టుకురండి" ఆజ్ఞాపించాడు బాలచంద్ర.
* * * *
మరో పదినిమిషాల తర్వాత రమణరావు థియేటర్ లోని పర్సనల్ రూమ్ లో ఉన్నాడు.
అప్పటికే బాలచంద్ర ఆరోపెగ్గు పూర్తిచేసి, ఏదో పెగ్గులోకి వెళుతున్నాడు.
"ఇతను- రమణ- అని-" ఏదో చెప్పబోయాడు రాజారావు.
"మీరందరూ వెళ్ళిపోండి" అరిచాడు బాలచంద్ర.
అందరూ వెళ్ళిపోయారు.
"నిన్న రాత్రి... సిన్మారీళ్ళని ఎవరెత్తుకెళ్ళారో నీకు తెలుసు. టైమ్ వేస్ట్ చెయ్యకుండా, నాకు చెప్పెయ్యాలి అంతే."
"ఏ సినిమా రీళ్ళు" బుకాయించబోయాడు. కానీ అప్పటికే అతని దవడ పేలిపోయింది.
"బుకాయించకు... ఇప్పుడు శక్తెక్కడున్నాడు" జుట్టు పట్టుకుని అడిగాడు.
"నాకు తెలీదు..." వణికిపోతూ అన్నాడు రమణరావు.
"మర్యాదగా చెప్పెసేయ్. లేకపోతే... నువ్వు" అంటూ తలని గోడకేసి కొట్టాడు.
భయంగా అరిచాడు రమణరావు. బాలచంద్ర బూటుకాలెత్తి కడుపుమీద నొక్కుతూ-
నడుం బెల్టు తీసాడు. గొడ్డును బాదినట్లు బాదాడు. రమణరావు హాహాకారాలతో అ ప్రాంతమంతా దద్దరిల్లింది. వళ్ళంతా గాయాలు- రక్తంతో తడిసిపోయాడు రమణరావు.
మరోపావుగంట తర్వాత కారు శక్తి ఇంటిముందుంది.
అక్కడ...
అరగంటసేపు రసాభాస జరిగింది.
శక్తి తల్లి, బాలచంద్ర కాళ్ళు పట్టుకుంది. శక్తి తండ్రికి నోట మాట రాలేదు.
"ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్- శక్తి రాగానే నాకు అప్పగించండి. లేదా- వాడ్ని మీరు మర్చిపోండి."
బయటకొచ్చాడు బాలచంద్ర.
అప్పటికి రాత్రి ఏడుగంటలయింది.
నోట మాటరాక, గుడ్లలో నీళ్ళను కుక్కుకుంటూ శిలాప్రతిమల్లా ఉండిపోయారు శక్తి తల్లి, చెల్లి, తండ్రి.
ఎమ్మెల్యే ప్రతాపం తెల్సు. రౌడీయిజం కూడా తెలుసు. తన కొడుకుని ఎలా రక్షించుకోవాలి?
చాలాసేపు ఆలోచించింది లక్ష్మీదేవి.
"శక్తి ఊళ్ళో కొస్తే, వాడ్ని ఆ బాలచంద్ర బతకనివ్వడు... ఎలా..." భయంగా అన్నాడు తండ్రి.
"వాడ్ని బెంగుళూరు మా అన్నయ్య దగ్గరికి పంపించేస్తే..." చాలాసేపు ఆలోచించినమీదట, కళ్ళు తుడుచుకుంటూ అందావిడ.
"వెళతాడా-" అనుమానంగా అన్నాడు తండ్రి.
"వెళ్ళకపోతే ఛస్తాడు- ఈ గొడవలిలా రోజు- రోజుకూ పెరుగుతూనే వుంటాయి. వాడ్ని ఎలా పంపించాలో నాకు తెలుసు..." అప్పటికప్పుడే ఒక నిర్ణయానికొచ్చారు.
"ఈ రోజు రాత్రి ఏదో ఒక సమయంలో వాడు ఊర్లోకొస్తాడు. వాడ్ని ఆ బాలచంద్ర మనుష్యుల నుండి ముందు రక్షించుకోవాలి. ఆ పైన ఎక్కడి కెళ్ళేది ఆలోచించాలి-" తనలో తను అనుకున్నట్లుగా అన్నాడు శక్తి తండ్రి.
ఆ విషయం గురించే ఆలోచిస్తోంది లక్ష్మీదేవి. ముందు కొడుకును, బాలచంద్ర కంట్లో పడకుండా రక్షించాలి. ఎలా-? ఎఅపుడు సమయం రాత్రి పదయింది.
జగ్గయ్యపేట నుంచి వచ్చే ఆఖరి బస్సు రాత్రి పదకొండు గంటలకొస్తుంది. వస్తే ఆ బస్సులో రావాలి. బాలచంద్ర మనుషులు బస్టాండులో ఎలాగూ కాపలా కాస్తారు. తను ఊరి శివార్లలో కెళ్ళాలని నిశ్చయించుకుంది లక్ష్మీదేవి. వెంటనే ఇంట్లోంచి బయటకొచ్చింది.
అరగంట నడక-
ఊరు చివర బైపాస్ రోడ్ జంక్షన్ కొచ్చిందావిడ. రోడ్డు ప్రక్కన ఉన్న టీ బడ్డీ దగ్గర నుంచుంది.
నేషనల్ హైవేమీంచి వెళుతున్న వెహికల్స్ వేపు చూస్తోందావిడ. పన్నెండయింది. జగ్గయ్యపేట నుంచి రావాల్సిన బస్సు ఎందుచేతో రాలేదు. తెలుగుదేశం సాంబశివరావు డాబా హోటల్ సందడిగా ఉంది. పది పదిహేను దాకా లారీలు ఆ హోటల్ ముందాగి ఉన్నాయి. జనంతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. అందుకే ఆమె రాత్రి పన్నెండయినా ధైర్యంగా ఉండగలుగుతోంది. శక్తి- ఈ బస్సులో రావాలి... రావాలి... ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకుందో.