ఆ వెక్కిరింపు అర్థమైంది లక్ష్మీదేవికి.
"అంతకంటే గొప్పవాడు మన చుట్టం."
"ఎవరట... అంత గొప్పవాడు..." తల్లి ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు శక్తి.
"వీరమాచనేని వెంకటనారాయణ..."
"ఏం చేస్తుంటాడాయన... సినిమా ప్రొడ్యూసరా...?"
"వీరమాచనేని వెంకటనారాయణ కోటీశ్వరుడు.... పెద్ద బిజినెస్ మాన్" చెప్పిందావిడ.
"అయితే- ఏంటట... అలాంటివాళ్ళు చాలామంది ఉంటారక్కడ కానీ మనకు తెలియాలి కదా" అసహనంగా అన్నాడు.
"ఆయనెవరో కాదు... మీ మేనమామ. మీ అమ్మకు స్వయానా అన్నయ్య" తండ్రి చెప్పాడు. చెప్పడం ఇష్టంలేకపోయినా.
"మేనమామ?!" ఆ పదం క్రొత్తగా ఉంది శక్తికి. తనకో మేనమామ ఉన్నాడని, ఎప్పుడూ ఎవరు చెప్పలేదు శక్తికి. అందుకే ఆశ్చర్యపోయాడు. ఆ పైన నమ్మలేదు కూడా.
"వి.వి.ఎన్.ఎస్టేట్స్ పేపర్లో చూసే ఉంటావ్. ఆయనదే... నారాయణన్నయ్య... నీలాగే తిరిగేవాడు. ఒకసారి న పెట్టెలోంచి వంద రూపాయలు తీస్తే మా నాన్నచేత చావు దెబ్బలు తిన్నాడు. పైసా సంపాదన లేకుండా నా ఇంట్లో ఉండొద్దని తాతయ్య ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. అంతే మళ్ళీ పదేళ్ళగ్గానీ ఎవరూ అనుకోలేదు. మనూరికి, మన జిల్లాకే కాదు, మన రాష్ట్రానికి, ఈ దేశానికి పేరు తెచ్చేంతగా ఎదిగిపోయాడు మా అన్నయ్య-" చెప్పుకుపోతోంది తల్లి గర్వంగా.
"మరెప్పుడూ మనింటికి రాలేదే ఆయన..." అనుమానంగా అడిగాడు శక్తి.
"నువ్వు బాగా చిన్నప్పుడు వచ్చాడు. ఆ తరువాత ఏవో మనస్పర్ధలు వచ్చాయి. అందుకే రాలేదు. కానీ మనమంటే ప్రాణం..."
"పదో, పాతికో పెద్ద కంపెనీలున్నాయి. నిన్ను తలమీద పెట్టుకోడూ... మేనల్లుడిని వదులుకుంటాడా-" ఎంతో ఆనందంగా అంది తల్లి.
"చిన్న ఉద్యోగం ఇస్తాడా- పెద్ద ఉద్యోగం ఇస్తాడా..."
"నీకు తగ్గ ఉద్యోగం ఇస్తాడు."
"ఏ గుమాస్తా ఉద్యోగమో మొహాన పడేస్తాడేమో..." మళ్ళీ అనుమానం.
"ఎదగడానికి, ఏ ఉద్యోగమైతేనేం రా... ఇవాళ చిన్న ఉద్యోగమే రేపు పెద్ద ఉద్యోగమౌతుంది. నమ్మకంగా పని చేసావనుకో... ఒక్కగానొక్క కూతుర్ని కట్టబెట్టినా కట్టబెడతాడు" తల్లి ఉత్సాహంగా అంది.
"మామయ్యకి కూతురుందా..." శక్తి తిరిగి కలల్లోకి వెళుతూ అడిగాడు.
"కూతురేవిట్రా- కుందనపు బొమ్మ. చిన్నప్పుడే అది దొరల పిల్లలా ఉండేది. అత్తయ్యా- అత్తయ్యా అని అంటూ నన్ను వదిలేది కాదు. ఆ రోజుల్లో మా అన్నయ్య చెప్పినట్టు మీ నాన్న వినుంటే ఇక్కడ ఈ వూళ్ళో దిక్కులేని వాళ్ళలా ఉండేవాళ్ళమే కాదు. పోనీలే ఇప్పటికి మించి పోయిందేం లేదు- ఎప్పుడు... ఎలా- ఏం జరగాలని ఉందో" నిట్టూర్చింది తల్లి.
కోటీశ్వరుడు మేనమామ, కుందనపు బొమ్మ మేనమామ కూతురు. మేనమామ దగ్గరికెళ్ళి, మేనమామని మంచి చేసుకుని ఆ కంపెనీలకు తన మేనేజింగ్ డైరెక్టరో, చైర్మనో అయిపోయి, మేనమామ కూతుర్ని పెళ్ళి చేసుకుంటే, కోట్లు అన్నీ తనవే. హంసతూలికా తల్పాలు- బంగారు పళ్ళాలు- డబ్బు- డబ్బు- తన చుట్టూ కరెన్సీ కాగితాలు... తన బ్రేక్ ఫాస్ట్ బొంబాయిలో- లంచ్ జపాన్ లో, డిన్నర్ వాషింగ్టన్ లో, డి.సీ.లో- తనో పెద్ద ఇండస్ట్రీయలిస్ట్.
అలా ఊహించడమే గొప్ప ఆనందంగా వుంది శక్తికి.
"మరి ఇన్నాళ్ళూ చెప్పేవు కాదేం..." విసుక్కుంటూ అన్నాడు శక్తి.
"సరి అయిన సమయంలో మీ అమ్మ నిర్ణయం తీసుకుంటుందిరా ఆ నిర్ణయానికి తిరుగులేదు..." పొగుడుతూ అన్నాడు తండ్రి.
"అవును. ఒకే ఒకసారి నిర్ణయం తీసుకున్నాను, మీరు దొరికారు నా జీవితం ఎలిమెంటరీ స్కూలు టీచరుగా మిగిలిపోయింది" విసుక్కుంటూ అని.
"అయిదున్నరకు బస్సుంది. ఆ బస్సుకు నువ్వు బయలుదేరుతున్నావు. నేనో ఉత్తరం రాసిస్తాను. అడ్రసిస్తాను. ఆ అడ్రసు పట్టుకుని, నేరుగా మామయ్య దగ్గరికి వెళ్ళిపో-" ఎవర్నీ కలవద్దు. డైరెక్టుగా మామయ్యనే కలువు. మామయ్య నీకేం చేస్తాడో చూడు.
"మామయ్య అసలు పట్టించుకోకపోతే, మంచి ఉద్యోగం ఇవ్వకపోతే..." మళ్ళీ అనుమానం.
"ఎవరూ ఒకేసారి ఎమ్.డి. చైర్మన్ లో అవర్రా- ఎవడూ బంగారు మొలతాళ్ళతోనూ, పట్టుదట్టీలతోను పుట్టర్రా- అంచెలంచెలుగా ఎదిగిన వాడే మనిషి. కష్టాలు, నష్టాలు, దుఃఖం, ఆకలి ఇలాంటి పదాల్ని వినడానికి భయపడే మనిషెప్పుడూ పైకి రాలేడు. పదేళ్ళ క్రితం వైజాగులో స్టీల్ ఫాక్టరీ పుడుతుందని ఎవరయినా అనుకున్నారా? అప్పుడక్కడ పెద్ద అడవి వుండేది. ఇవాళ చూడు... ఏదో బంగారు లోకంలా వుంది. మనిషి బతుకు కూడా అలాంటిదే, ఒక ఫ్యాక్టరీ కట్టడానికి మొట్టమొదటగా చేసే పని భూమిని చదును చెయ్యటం, అలాగే మనిషి ఎదగడానికి, తనని తాను చదును చేసుకోవాలి. గంగానది మహా ప్రవాహంలా మనకు కనిపించొచ్చు- కానీ అది ప్రారంభమైంది ఒక్క చిన్న బిందువుగానే..." తల్లి మాటల వెనుక, ఏదో శక్తి ఉందన్న విషయం మొట్టమొదటిసారిగా తెల్సింది శక్తికి.
అయినా ఏదో అనుమానం- బెంగుళూరు మహానగరంలో యూబీగ్రూప్ విజయ్ మాలవ్వా, ఎల్.వి. రామయ్యలు పారిశ్రామికవేత్తలుగా ఎంత గొప్పవారో వి.వి.ఎన్. ఎస్టేట్స్ వెంకట నారాయణ అంత గొప్పవాడని బిజినెస్ మేగ్ జైన్ లో చదివాడతను. ఆయన తనకు మేనమామా? నిజమేనా? తనకు అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది తల్లికి. బాలచంద్రకి భయపడి తల్లి తనను ఎలాగయినా నందిగామ నుంచి పంపించేయాలని అలా చెబుతోందా?
"మామయ్య ఏదో ఒక ఉద్యోగం ఇస్తాడు. ఇచ్చిన ఉద్యోగాన్ని నిచ్చెనలా ఉపయోగించుకో- పైకెదుగు- తిరిగిరాకు- ఎంత నిరాశ ఎదురయినా డీలా పడిపోకు. నీ లక్ష్యం, నీ గమ్యం విజయం వేపే ఉండాలి. జీవితంలో ఒక భాగం జులాయిగా తిరిగావు- రెండో భాగాన్ని కూడా నాశనము చేసుకుంటే మరిక నిన్నెవడూ రక్షించలేడు. జాగ్రత్త..." అని తల్లి లేచి, తన గదిలోకెళ్ళింది. పదినిమిషాల తర్వాత బయటకొచ్చింది.
"ఇదిగో మామయ్యకు ఉత్తరంరాసి, ఈ కవర్లో పెట్టాను. నీ సర్టిఫికెట్లు, పుస్తకాలు ఏం కావాలో సర్దుకో..." అని కొడుక్కి చెప్పి భర్తవేపు తిరిగి "అంతదూరం వెళుతున్నాడు... కనీసం వెయ్యి రూపాయలయినా వాడి చేతిలో పెట్టకపోతే ఎలా- ఇంట్లో ఏడువందలున్నాయి" అంది దిగులుగా.