అయిదవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.
1. అగ్నీ ! మేము స్తోత్రములతో నిన్ను ఆహ్వానించుచున్నాము. బలపుత్రుడవు. నిత్యతరుణుడవు. ప్రశస్త స్తుతులతో స్తవనీయుడవు. ప్రకృష్ట జ్ఞానవంతుడవు. బహుస్తుతుడవు. ద్రోహరహితుడవు. అట్టి అగ్ని స్తోతలకు అభిలషించిన ధనము ప్రసాదించును.
2. అగ్నీ ! నీవు జ్వాలా విశిష్టుడవు. దేవతల ఆహ్వానకర్తవు. యాగయోగ్యులగు యజమానులు అహర్నిశలు నీకు హవ్యరూప ధనము సమర్పింతురు. దేవతలు సమస్త జీవులను భూమిమీద ఏర్పరచినారు. అట్లే సంపూర్ణ ధనమును అగ్నిలో ఏర్పరచినారు. "సౌభాగ్యాని దధిరే పావకే"
(సమస్త ధనములు వాస్తవముగా అగ్ని నుండియే కలుగుచున్నవి. ఇది నేటికిని వాస్తవ సత్యము)
3. అగ్నీ ! నీవు ప్రాచీనులు అధునాతులగు ప్రజలందరిలోను ఉన్నావు. నీ పనులు ద్వారా యజమానులకు కోఱిన ధనములు ఇచ్చుచున్నావు. జ్ఞానీ ! జాతవేదా ! పరిచర్య చేయు యజమానులకు నిరంతరము ధనము ప్రసాదించుము.
4. అనుకూలదీప్తిగల అగ్నీ ! అంతర్హిత దేశమున ఉండి బాధించునట్టి అభ్యంతర వర్తియై బాధించునట్టి శత్రువులను నీ తేజమున దహింపుము. నీ తేజస్సు జరారహితము వృష్టిప్రదము. అసాధారణము.
5. బలపుత్ర అగ్నీ ! యజ్ఞము ద్వారా నీకు పరిచర్య చేయునట్టి ఇంధనము. శస్త్రములు, స్తోత్రములతో నీకు పరిచర్యలు చేయునట్టి యజమాని మానవులలో ప్రకృష్ట జ్ఞానవంతుడు, అన్నవంతుడు, యశోవంతుడగును.
6. అగ్నీ ! నీకు నిర్దేశించిన పనిని త్వరగా ముగించుము. నీవు బలవంతుడవు. నీకు ఇతరులను పరాజితులనుచేయు బలము ఉన్నది. ఆ బలముతో శత్రువులను నష్టపరచుము. నిన్ను స్తోత్రములతో నుతించువానిని అనుగ్రహింపుము. నీవు ద్యుతిమంతమగు తేజోయుక్తుడవు.
7. అగ్నీ ! నీ రక్షణలతో మాకు కోఱిన ధనము లభించవలెను. ధనాధిపతీ ! మాకు శోభన పుత్రాదియుక్త ధనము లభించవలెను. మేము అన్నాభిలాషులము. మాకు నీ వలన అన్నలాభము కలుగవలెను. జరారహిత అగ్నీ ! మాకు నీయొక్క అజరము ద్యుతిమంతమగు యశము లభించవలెను.
ఆరవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.
1. అగ్ని స్తుతి యోగ్యుడు. బలపుత్రుడు. అడవులను కాల్చువాడు. మసిదారివాడు. తెల్లనివాడు. కమనీయుడు. హోత. స్వర్గీయుడు. యజమానులు అన్నాభిలాషులు, వారు నవీన యజ్ఞయుక్తులయి అగ్నివద్దకు వెళ్లుదురు.
2. అగ్ని శ్వేతవర్ణుడు. శబ్దకారి. అంతరిక్ష సంచారి. అజరుడు. అతడు అత్యంత ధ్వనికారులయిన మరుత్తులతో కలిసి యువతముడగును. అగ్ని పావకుడు మహానుభావుడు. అతడు అసంఖ్యాకములగు కఱ్ఱలను భక్షించి కాల్చి సాగును.
3. విశుద్ధ అగ్నీ ! ప్రదీప్తములగు నీశిఖలు జ్వాలలు గాలికి సంచరించును. అనేక కఱ్ఱలను భక్షించును. సర్వత్ర వ్యాపించును. మంటలతో కలిగిన కొత్త కిరణములు ఘర్షణకారులయి తమ దీప్తితో అడవులను ఆక్రమించును. దహించును.
4. దీప్తిసంపన్నుడవగు అగ్నీ ! నీ కిరణములు శుభ్రములు. సంపూర్ణములు. అవి భూమికి జుట్టువంటి ఓషధులను కాల్చును. అప్పుడు అవి విడిచిన గుఱ్ఱములవలె ఇటునటు ఉరుకులు పెట్టును.
5. వర్షము కలిగించు అగ్ని జ్వాలలు మాటిమాటికి వెడలుచుండును. అవి వృత్రుని వధించుటకు పోయిన వజ్రము మాటిమాటికి వెడలినట్లుండును. వీరుల పౌరుషమువలె అగ్నిజ్వాలలు దుస్సహములు దుర్నివార్యములు.
6. అగ్నీ ! నీ వెలుగు ప్రబలము. ఉత్తేజకరము. ఆ వెలుగుతో భూమిమీద చేరగల స్థానములను వెలిగించుము. నీవు సమస్త విపత్తులను దూరము చేయుము. నీ కాంతి ప్రభావమున విరుద్ధులను ఓడించుము. శత్రువులను దనుమాడుము.
7. అగ్నీ ! నీవు విచిత్రము. అద్భుతమగు బలసంపన్నుడవు. ఆనందదాయకుడవు. మేము ఆహ్లాదకర స్తోత్రములతో నిన్ను స్తుతింతుము. నీవు మాకు అద్భుతము. అత్యద్భుతము, యశస్కరము, అన్నప్రదము, అన్నదాయకము. పుత్రపౌత్రాది సమన్వితమగు విపుల ఐశ్వర్యము ప్రసాదించుము.
ఏడవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - వైశ్వానరాగ్ని, ఛందస్సు 6,7 జగతి. మిగిలినవి త్రిష్టుప్.
1. వైశ్వానరాగ్ని స్వర్గమునకు శిరోభూతము. భూమిమీద సంచరించువాడు. యజ్ఞమునకుగాను పుట్టినవాడు. రాజువంటివాడు. యజమానులకు అతిథి స్వరూపుడు. దేవతలకు ముఖము నోరు వంటివాడు. రక్షా విధాయకుడు. దేవతలు, ఋత్విక్కులు అగ్నిని ఆవిర్భవింప చేసినారు.
2. అగ్ని యజ్ఞబంధకుడు, ధనస్థానము. హవ్యమునకు ఆశ్రయ స్వరూపుడు, స్తోతలు అతనిని చక్కగా స్తుతింతురు. అతడు యజ్ఞ ద్రవ్యవాహకుడు, యజ్ఞమునకు కేతనమువంటివాడగు వైశ్వానరాగ్నిని దేవతలు పుట్టించినారు.
3. అగ్నీ ! హవిరూప అన్నయుక్త పురుషుడు నీవద్ద నుంచే జ్ఞానవంతుడగును. వీరులు నీవద్ద నుంచే శత్రు పరాభవకారులు అగుదురు. అందువలన మాకు కోరిన ధనమును ప్రసాదించుము.
4. అమృత అగ్నీ ! నీవు అరణిద్వయమునుండి పుత్రునివలె జన్మించినావు. దేవతలు నిన్ను శిశువునువలె పోషించినారు. వైశ్వానరా ! నీవు ద్యావాపృథ్వుల మధ్య కనిపించినపుడు యజమానులు నీకు సంబంధించిన యజ్ఞముచేసి అమరత్వలాభము పొందుదురు.
5. వైశ్వానరా ! ప్రసిద్ధములయిన నీ మహాకార్యములను ఎంతటివాడయినను ఆటంకపరచజాలడు. మాతాపితృ స్వరూపులగు ద్యావాపృథ్వుల క్రీడాభూమి అయిన అంతరిక్షమున జన్మించినావు. దినములను శాసించు సూర్యుని అంతరిక్షమున నిలిపినావు.
6. వైశ్వానరుని జలశాసక తేజముద్వారా అంతరిక్షపు ఉన్నత ప్రదేశము - నక్షత్రాదులు ఏర్పడినవి. వైశ్వానరుని శిరోభాగమున జలరాశికాపురముండును. అచటినుండియే ఏడునదులు చెట్లకొమ్మలవలె పుట్టినవి.
7. శోభన కర్ముడగు వైశ్వానరాగ్ని లోకములను నిర్మించినాడు. జ్ఞానసంపన్నుడయి, ద్యులోకపు వెలుగులు నక్షత్రములను సృష్టించినాడు. సమస్త భూతజాతములకు నాలుగు దిక్కులు ఏర్పరచినాడు. అజేయుడు, పాలకుడు, జలరక్షకుడగు అగ్ని విజయము చేయును.
ఎనిమిదవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - వైశ్వానరుడు, ఛందస్సు - జగతి, చివరిది త్రిష్టుప్.
1. వైశ్వానరుడు వారి వర్షకుడు. దీప్తిమంతుడు. జాతవేద. అతని బలమునకుగాను ఈ యజ్ఞమును మేము విశేషముగా స్తుతించుచున్నాము. వైశ్వానరాగ్నిముందు - నవీనము, నిర్మలము, శోభస్కరమగు స్తుతులను సోమరసమువలె సమర్పించుచున్నాము.
2. సత్కర్మపాలకుడగు వైశ్వానరుడు ఉత్కృష్ట ఆకాశమున జాయమానుడయి లౌకిక, వైదిక ఉభయకర్మలను రక్షించును. అంతరిక్షమును అంచనా వేయును. శోభనకర్మలు చేయు వైశ్వానరుడు తన తేజమున ద్యులోకమును స్పృశించును.
3. వైశ్వానరుడు అందరకు మిత్రభూతుడు. ఆశ్చర్యకారకుడు. అతడు ద్యావాపృథ్వులను తమతమ స్థానములందు స్తంభింప చేసినాడు. తన తేజమున చీకట్లను దూరము చేసినాడు. ఆధార భూతములగు ద్యావా పృథ్వులను పశుచర్మములవలె విస్తృతపరచినాడు. వైశ్వానరాగ్ని సమస్త వీర్యములను ధరించును.
(పశు చర్మములను ఆరవేయునపుడు ఒకదాని తరువాత ఒకదానిని ఆరవేయుచు పోవుదురు. అదియు నేలమీద పరచి)
4. మహామరుత్తులు అంతరిక్ష మధ్యమున అగ్నిని ధరించినారు. మానవులు వారిని పూజనీయ స్వాములు అనుకున్నారు. స్తుతించినారు. దేవతల దూత, వేగవంతుడగు మాతరిశ్వవాయువు సుదూర సూర్యమండలము నుండి వైశ్వానరాగ్నిని ఈ లోకమునకు తెచ్చినాడు.
5. అగ్నీ ! నీవు యాగయోగ్యుడవు. నిన్ను నవీన స్తుతులతో అర్పించువానికి నీవు ధనము, యశస్విపుత్రులను ప్రసాదింతువు. జరారహిత, విరాజమాన అగ్నీ ! పిడుగు చెట్టును కూల్చినరీతి నీ తేజమున శత్రువును కూల్చుము.
6. అగ్నీ ! మేము హవిర్లక్షణ ధనయుక్తులము. మాకు నీవు అనపహార్యము, అక్షయము, సువీర్యమగు ధనమును ప్రసాదించుము. మేము నీచే రక్షితులమై వందల, వేల రకముల అన్నమును పొందవలెను.
7. మూడులోకములందున్న యాగార్హ అగ్నీ ! ఎవరిచేతను హింసించబడని రక్షణ కలిగించు బలమున స్తోతలను రక్షింపుము. హవ్యాదాతలమగు మా బలమును రక్షింపుము. మేము నిన్ను స్తుతించుచున్నాము. నీవు మమ్ము వర్థిల్ల జేయుము.
తొమ్మిదవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - వైశ్వానరుడు, ఛందస్సు - జగతి.
1. నలుపురాత్రి - తెలుపు పగలు తమతమ ప్రవృత్తులతో లోకములను రంజింపచేసి నియమప్రకారము పరిణామమొందురు. వైశ్వానరాగ్ని రాజువలె ప్రకాశితుడయి, తన వెలుగుతో తమోనాశము చేయును.
2. మాకు పడుగు పేకలు తెలియవు. నిరంతర కార్యక్రమమున నేయు బట్టను గురించిన అవగాహనలేదు. ఈ లోకమున నిలిచి తండ్రిద్వారా ఉపదేశము పొందిన ఏ పుత్రుడు పరలోకమును గురించిన మాట చెప్పుటకు సమర్ధుడగును?
(పడుగు పేకలు యజ్ఞకార్యములు వస్త్రము యజ్ఞమని. పడుగు పేకలు ద్యావాపృథ్వులు వస్త్రము సృష్టియని. పడుగు పేకలనగా బట్ట నేయునపుడు ఇటునటు సాగుదారములు)
3. వైశ్వానరునకు ఒక్కనికే తంతు-ఓతు (పడుగు పేకల) జ్ఞానము ఉన్నది. జలరక్షకుడు, భూలోకమున సంచరించు అగ్ని అంతరిక్షమున సూర్యరూపమున సమస్త జగత్తునకు వెలుగులను ఇచ్చును. అందువల్ల అతడు సమస్త ప్రాణులను అవగతము చేసికొనగలడు.
4. వైశ్వానరాగ్ని తొలిహోత అగును. మానవులారా ! మీరు అగ్నిని భజించండి. అమరణశీల అగ్ని మరణశీల శరీరమున జఠర రూపమున వర్తమానుడగును. నిశ్చలము, సర్వవ్యాపి, అక్షయ అగ్ని దేహము ధారణపూర్వకముగ ఉత్పన్నమయి వర్థిల్లును.
5. మనోవేగమునకన్న వేగము కలిగియు నిశ్చలమగు జ్యోతి సుఖమయ మార్గములు చూపుటకు గాను జంగమ జీవులలో అంతర్హితమయి ఉండును. సమస్త దేవగణములు సమాన ప్రజ్ఞులయి, సన్మానముతో ప్రధాన కర్మ కర్త వైశ్వానరులకు అభిముఖవర్తులు అగుదురు.
("జ్యోతిః బ్రహ్మచైతన్యం నిహితం నకేనచిత్ స్థాపితం" ఈ జ్యోతి బ్రహ్మచైతన్యమగును. ఎవరిచేతను నిలుపబడినదికాదు అనిశాయణుడు)
6. నీ గుణములు వినుటకు చెవులు - నీరూపముకనుటకు కనులు పరువులిడుచున్నవి. హృదయ కమలమందున్నజ్యోతి బుద్ధి, నీ స్వరూపమును అవగతముచేసికొనుటకు ఆరాటపడుచున్నది. ఎక్కడి వానినో గురించి చింతించు మాహృదయము మీముందునకు ఉరుకులు పెట్టుచున్నది. మేము వైశ్వానరుని ఏ రూపమును వర్ణించవలెను?
7. వైశ్వానరా ! అంధకారమున అవస్థితుడవైన నీకు సమస్త దేవతలు నమస్కరింతురు. నీ రక్షణలతో మమ్ము రక్షింపుము.
పదవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - గ్ని, ఛందస్సు - 7 విరాట్, మిగిలినవి త్రిష్టుప్.
1. ఈ యజ్ఞము ప్రవర్తమానము. విఘ్నరహితము. అగ్ని స్తవనీయుడు. స్వర్గోద్బవుడు. దోషవర్జితుడు. యజమానులారా ! ఈ యజ్ఞమున అగ్నిని స్తోత్రముల ద్వారా సమ్ముఖమున స్థాపించండి. జాతవేద యజ్ఞమున మా సమృద్ధి మార్గము చూపును.
2. అగ్ని దీప్తిమంతుడు. బహుజ్వాలా విశిష్టుడు. దేవతల ఆహ్వానకర్త.
అగ్నీ ! అవయవభూతములగు అన్యఅగ్నుల సహితుడవై మానవస్తోతల ఈ స్తోత్రమును వినుము. స్తోతలు మమతవలె అగ్నికి మనోహర స్తోత్రములను ఘృతమువలె సమర్పింతురు.
3. యజమాని స్తోత్రముల సహితముగా అగ్నికి హవ్యము సమర్పించును. అతడు అగ్నిద్వారా మానవులందు సమృద్ధిగలవాడగును. అగ్నివిచిత్రదీప్తివంతుడు. అతడు ఆశ్చర్యకర రక్షణలతో ఆ యజమానిని గోయుక్త గోష్ఠ భోగమునకు యజమానిని చేయును.
4. అగ్ని పుట్టగానే పొగవలన నల్లనివాడయినాడు. దూరమునుంచి కనిపించువాడు. దీప్తిద్వారా విస్తీర్ణమైన ద్యావాపృథ్వులను పూరించినాడు. నింపినాడు. పావకుడగు అగ్ని తన కాంతులతో కటికచీకట్లను పారదోలి పరిదృశ్యమానుడగును.