5. అగ్నీ ! మేము హవిర్లక్షణ అన్నయుక్తులము. మాకు చాల అన్నము, రక్షణలతో కూడిన ధనమును ప్రసాదించుము. ధనము, అన్నము, ఉత్కృష్ట వీర్యము కలిగి మానవులను పరాజితులను చేయగల పుత్రుని ప్రసాదించుము.
6. అగ్నీ ! హవ్యయుక్త యజమాని కూర్చొని నీ కొఱకు హవనము చేయును. నీవు హవ్యాభిలాషివి. అతని అన్నమును స్వీకరింపుము. భరద్వాజ వంశీయుల నిర్దోష స్తోత్రములను గ్రహింపుము. వారిని అనుగ్రహింపుము. అందువలన వారికి నానావిధ అన్నములు లభించును.
7. అగ్నీ ! శత్రువులను పరిమార్చుము. మా అన్నమును వర్థిల్ల చేయుము. మేము శోభన పుత్ర పౌత్రాది యుక్తులమయి శతహేమంతములు సుఖములు అనుభవించవలెను.
పదకొండవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.
1. అగ్నీ ! నీవు దేవతల ఆహ్వానకర్తవు. యజన కర్తలలో శ్రేష్ఠుడవు. మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మేము చేయుచున్న ఆరాధ్య యజ్ఞమునకు శత్రుహింసక మరుత్తులను యజింపుము. మిత్రావరుణులను నాసత్య అశ్వినీద్వయమును, ద్యావాపృథ్వులను మా యజ్ఞమునకు తీసికొని రమ్ము.
2. అగ్నీ ! నీవు అత్యంత స్తవనీయుడవు. మా విషయమున ద్రోహరహితుడవు. దానాది గుణయుక్తుడవగుము. హవ్యవాహనుడవు. శుద్ధివిధాయకుడవు. దేవతలకు ముఖస్వరూపుడవు. జ్వాలలతో నీ దేహమును యజింపుము.
3. అగ్నీ ! స్తుతి ధనాభిలాషి అగును. అది నిన్ను కోరును. నీవు పుట్టినంతనే యజమానులు ఇంద్రాది దేవతలను యజించు సమర్థులు అగుదురు. ఋషులందు అంగిరులు స్తుతులను అత్యంతముగా ప్రేరేపించువారు. మేధావి భరద్వాజుడు యజ్ఞమున హర్షదాయక స్తుతులను ఉచ్ఛరించును.
4. అగ్ని దీప్తిమంతుడు. బుద్ధిశాలి. శోభాయమానుడగును.
అగ్నీ ! నీవు ద్యావాపృథ్వులను హవ్యములతో పూజింపుము. నీవు హవ్య సంపన్నుడవు. మానవ యజమానులవలె హవి సమర్పించు ఋత్విక్ యజమానులు హవ్యములతో నిన్ను సంతృప్తుని చేయుదురు.
5. అగ్ని దగ్గరకు హవ్యముతో కుశ అందినపుడు దోషవర్జిత ఘృతపూర్ణ సృక్ కుశ మీదపెట్టినప్పుడు - అప్పుడు అగ్నికి ఆధారభూతమగు వేది ఏర్పడును. సూర్యుడు తేజోరాశి సమవేతుడైనట్లు యజమాని యజ్ఞకార్య సమాశ్రితుడు అగును.
6. అగ్నీ ! నీవు బహుజ్వాలా విశిష్టుడవు. దేవతల ఆహ్వానకర్తవు. దీప్తిశాలురగు అన్య అగ్నుల సహితుడవై మాకు ధనప్రదానము చేయుము. మేము హవితో నిన్ను కప్పివేయుదుము. శత్రుతుల్యమగు పాపములనుంచి మమ్ము విముక్తులను చేయుము "స్ర సేమ వృజనం నాంహః"
(పాపములు శత్రుతుల్యములు అనుట సామాన్యముకాదు. బాధించునవి కాన పాపములు చేయరాదని అర్థము)
పన్నెండవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.
1. అగ్ని దేవతల ఆహ్వానకారి. యజ్ఞములకు అధిపతి. ద్యావాపృథ్వులను యజించుటకుగాను అగ్ని యజమాని గృహమునకు వచ్చును. యజ్ఞసంపన్నుడు, బల పుత్రుడగు అగ్ని దూరమునుండియే సంపూర్ణ జగత్తును సూర్యునివలె ప్రకాశింపచేయును.
2. యాగార్హ, దీప్తిసంపన్న అగ్నీ ! నీవు బుద్ధి సంపన్నుడవు. యజమానులందరు కోరికలుగలవారై నీకు ప్రచురహవ్యము సమర్పింతురు. నీవు త్రిభువనములందు నిలువుము. మానవులు సమర్పించిన హవ్యమును దేవతలవద్దకు చేర్చుటకు సూర్యునివలె వేగవంతుడవగుము.
3. అగ్నిజ్వాలలు సర్వవ్యాపినులు. అత్యంత తేజస్వినులు. అవి అరణ్యమున నుండును. వర్థిల్లును. సూర్యునివలె అంతరిక్షమున విరాజిల్లును. అందరకు శుభముల నొసంగు వాయువువలె అగ్నిజ్వాలలు అక్షయములు, అనివార్యములగు ఓషధులలోనికి వేగముగప్రవేశించును. తమవెలుగులతో జగములనన్నింటిని వృద్ధిచెందించును.
4. జాతవేద అగ్ని - యాజకుల సుఖదాయక స్తుతులవంటి మా స్తోత్రముల ద్వారా యజ్ఞగృహమున స్తుతుడగును. యజమానులు వృక్షభోజనుడు, అరణ్య ఆశ్రయకారి, దూడల తండ్రి, ఆబోతువంటి క్షిప్రకర్మకారి అగ్నిని స్తుతింతురు.
(దూడల తండ్రి ఆబోతు తప్పినబిడ్డకై వెదికినంత లేక ఆవుకొఱకు వేగముగా పరుగెత్తినట్లు అని అర్థము)
5. అగ్ని అనాయాసముగా అరణ్యములను భస్మముచేసి నేలమీద విస్తరించినపుడు స్తోతలు ఈ లోకమున అగ్నిశిఖలను మంటలను స్తుతింతురు. అప్రతిహత వేగమున సంచరించువాడును. దొంగవలె వేగగమనముగల అగ్ని మరుభూమి మీద విరాజమానుడగును.
6. వడిగల నడకలుగల అగ్నీ ! నీవు సమస్త అగ్నుల సహితముగా ప్రజ్వలితుడవగుము. మమ్ము నిందలనుండి రక్షింపుము. మాకు ధనము ప్రసాదించుము. దుఃఖదాయక శత్రుసైన్యమును దూరము చేయుము. మేము శోభన పుత్ర, పౌత్ర యుక్తులమై నూరు హేమంతములు సుఖములు అనుభవించవలెను.
పదమూడవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.
1. అగ్నీ ! నీవు శుభప్రద ధనవంతుడవు. చెట్లు నుండి కొమ్మలు పుట్టినట్లు - రకరకముల ధనములు నీనుండియే పుట్టినవి. పశు సమూహములు త్వరత్వరగా నీనుండియే పుట్టినవి. యుద్ధమున శత్రువును గెలుచు బలము నీనుండియే పుట్టినది. అంతరిక్షమున వర్షములు కూడ నీవల్లనే పుట్టినవి. అందువలననే నీవు అందరి స్తవనీయుడవు.
2. అగ్నీ ! నీవు భజనీయుడవు. మాకు రమణీయ ధనము ప్రసాదించుము. దర్శనీయ దీప్తుడవగుము. సర్వత్ర వ్యాపించు వాయువువలె సర్వత్ర నిలువుము. మిత్రునివలె ప్రచుర యజ్ఞము, కోరిన ధనమును ప్రసాదించుము.
3. అగ్నీ ! నీవు ప్రకృష్ట జ్ఞాన సంపన్నుడవు. యజ్ఞముకొఱకు సముద్భూతుడవు. నీవు జలపుత్రుడు వైద్యుతాగ్నితో కలిసి ఒక వ్యక్తిని అనుగ్రహింతువు. అట్టి వ్యక్తి సాధురక్షకుడు, బుద్ధిమంతుడగును. అతడు తన బలమున శత్రువులను సంహరించును. ఫణుల శక్తిని అపహరించును.
4. బలపుత్రా ! ద్యుతిమంతా ! అగ్నీ ! ఒక యజమాని నిన్ను స్తుతించును. ఉపాసించును. యజ్ఞముద్వారా యజ్ఞభూమిలో నీ తీక్ష్ణ కాంతిని ఆకర్షించును. అట్టి యజమానికి మానవుల సమస్త ప్రాచుర్యములు కలుగును. ధనధాన్య సంపన్నుడగును.
5. బలపుత్రా అగ్నీ ! నీవు మమ్ము పోషించుటకుగాను శత్రువులనుండి తెచ్చిన ధనమున ఉత్కృష్ట పుత్ర సహిత శోభన అన్నము ప్రదానము చేయుము. విద్వేషపూర్ణ శత్రువులనుండి గుంజుకున్న పశుసంబంధమగు దధ్యాది అన్నమును మరింతగాచేసి మాకు ప్రసాదించుము.
6. అగ్నీ ! నీవు బలపుత్రుడవు. బలశాలివి. మాకు ఉపదేష్టవగుము. మాకు అన్నముతో పాటు పుత్ర, పౌత్రులను ప్రసాదించుము. మేము స్తుతులద్వారా పరిపూర్ణ మనోరథులము కావలెను. మేము శోభన పుత్ర, పౌత్రులతో శత హేమంతములు సుఖించవలెను. "మదేమ శతహిమాః"
పదునాలుగవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - అగ్ని, ఛందస్సు - అనుష్టుప్ చివరిది శక్వరి
1. స్తోత్రములతో అగ్నిని సేవించినవాడును - యాగాది కార్యములు చేసినవాడును - మానవులనుండి శీఘ్రముగా యాగాది కార్యములు చేసినవాడును మానవులలో శీఘ్రముగా ప్రముఖుడు అగును. పుత్ర పౌత్రాదుల పోషణకుగాను శత్రువు నుండి మరింత అన్నమును సాధించును.
2. ఒక్క అగ్నిమాత్రమే జ్ఞానసంపన్నుడు. అన్యుడుకాడు. అతడు యజ్ఞకార్యమున అతిశయ నిర్వాహకుడు. సర్వద్రష్ట, యజమాని పుత్రాదులు యజ్ఞమున అగ్నిని దేవతల ఆహ్వానకర్త అని స్తుతింతురు.
3. అగ్నీ ! శత్రువుల ధనము వారినుండి విడిపోవును. స్తోతలను రక్షించుటకు ఆ ధనములు పరస్పరము స్పర్ధించును. నీ స్తోతలు శత్రువిజేతలగుదురు. నీ యజ్ఞము చేయుదురు. వ్రత విరోధులను ఓడించవలెను అనుకొందురు.
4. అగ్ని స్తోతలకు కార్యాన్వితుడు, శత్రుంజయుడు సాధువుల కార్యమును రక్షించగల పుత్రుని ప్రసాదించును. అతని బలములకు భయభీతులయిన శత్రువులు గడగడలాడుదురు.
5. ఎవని హవ్యస్వరూపధనము రాక్షసులవల్ల విఘ్నము కాకుండునో, ఇతరులద్వారా పంచుకొనబడదో, అట్టి యజమానిని జ్ఞానసంపన్నుడగు అగ్ని నిందకులనుండి రక్షించును.
6. అగ్నీ ! నీవు అనుకూల దీప్తివంతుడవు. దానాది సద్గుణయుక్తుడవు. ద్యావాపృథ్వులందు వర్తమానుడవు. నీవు దేవతలవద్ద మా స్తుతులను ఉచ్ఛరింపుము. స్తోతలమగు మమ్ము శోభన నివాసయుక్త సుఖములవైపు తరలింపుము. మేము శత్రువులను పాపములను కష్టములను అతిక్రమించవలెను. మేము జన్మాంతరకృత పాపములనుండి విముక్తులము కావలెను. నీవు మమ్ము శత్రువులనుండి రక్షింపుము.
పదిహేనవ సూక్తము
ఋషి - అంగిరసుడు లేక వీతహవ్యుడు లేక భరద్వాజుడు. దేవత - అగ్ని, ఛందస్సు - వివిధములు
1. అగ్ని హవ్యవాహకుడు. ఉషఃకాలమున ప్రవృద్దుడు. స్వభావతః శుద్ధుడు. అతిథిరూపుడు. అగ్ని సర్వకాలములందు ద్యులోకము నుండి అవతరించును. అక్షయ హవ్యమును భక్షించును. భరద్వాజ ఋషీ ! అట్టి అగ్నిని ప్రసన్నుని చేయుము.
2. అగ్నీ ! నీవు అరణిమధ్యమున దాగి ఉన్నావు. అచటినుండియే ఉద్భవించినావు. స్తుతివాహకుడవు. ఊర్ధ్వజ్వాలలవాడవు. నిన్ను భృగు మహర్షులు తమ మిత్రునివలె వారి గృహమందు నిలుపుకొందురు. భరద్వాజులు ఉత్కృష్ట స్తోత్రములతో నిన్ను పూజింతురు. నీవు వారి విషయమున ప్రసన్నుడవగుము.
3. అగ్నీ ! యాగాది అనుష్ఠానపరునకు నీవు సమృద్ధి ప్రసాదింతువు. దూరమున దగ్గర ఉన్న శత్రువుల నుండి అతనిని రక్షింతువు. మానవులందు భరద్వాజునకు ధనము, గృహము ప్రసాదించుము.
4. అగ్ని శోభనస్తుతులవాడు. హవ్యవాహనుడు. దీప్తిమంతుడు. అతిథివలె పూజనీయుడు. స్వర్గప్రదర్శకుడు. మనువు యజ్ఞమున దేవతల ఆహ్వానకర్త. యజ్ఞసంపాదకుడు. మేధావి. ఓజస్వి. వక్త. భరద్వాజా ! అట్టి అగ్నిని ప్రసన్నుని చేయుము.
5. అగ్ని ఉషప్రకాశమున శోభాయమానుడగును. అగ్ని భూమి పవిత్రకారకము, చేతనావిధేయక దీప్తిద్వారా విరాజమానుడు. అగ్ని-శత్రుసంహారక వీరునివలె-ఏతశఋషికి సాయము చేయుటకు ప్రజ్వరిల్లినాడు. అగ్ని సర్వభాక్షుడు క్షయరహితుడు వీతహవ్య భర ద్వాజా! అట్టి అగ్నిని ప్రసన్నుని చేయుము.
6. ఓ మాయొక్క స్తోతలారా ! అత్యంతప్రియుడు, అతిథివలె పూజనీయుడగు అగ్నిని సమిధలతో నిరంతరము పూజించండి. దేవతలలో దానగుణయుక్తుడగు అగ్ని సమిధలను, పూజలను గ్రహించును. అందువలన అనశ్వర అగ్నిముందు నిలిచి అగ్నిని పూజించండి.
7. మేము సమిధలతో ప్రజ్వరిల్లు అగ్నిని స్తుతించి ప్రసన్నుని చేయుదుము. స్వతః పరిశుద్ధుడు, పవిత్రతా సంపన్నుడు, నిశ్చలుడగు అగ్నిని యజ్ఞమున స్థాపించెదము. జ్ఞాన సంపన్నుడు, దేవతల ఆహ్వానకర్త సర్వజనవరణీయుడు, సదాశయ సంపన్నుడు, సర్వదర్శి, సర్వభూతజ్ఞడగు అగ్నిని సుఖకర స్తోత్రములతో భజింతుము.
8. అగ్నీ ! దేవతలు, మనుష్యులు, నిన్ను దూతను చేయుదురు. నీవు అమరుడవు. విశేష సమయములందు హవ్యవాహనుడవు. పాలకుడవు. స్తవనీయుడవు. జాగరణశీలుడు, వ్యాప్తుడు, ప్రజాపాలకుడగు అగ్నిని నమస్కరించి, స్థాపించెదరు.
9. అగ్నీ ! నీవు దేవతలను మనుష్యులను విశేషరీతిన అలంకరింపచేతువు. యజ్ఞమున దేవదూత వగుదువు. ద్యావాపృథ్వులందు సంచరింతువు. మేము నిన్ను స్తోత్రములతో స్తుతింతుము. యజ్ఞముచేసి భజింతుము. అందువలన నీవు త్రిభువన వర్తివి అగుము. మాకు సుఖ విధానము చూపుము.
10. అగ్ని శోభనాంగుడు. మనోజ్ఞమూర్తి. గమనశీలుడు. మేము అల్పబుద్ధులము. అట్టి అగ్నిని సేవింతుము. తెలిసికొనవలసిన వానిని తెలిసికొను అగ్ని దేవతలను భజించవలెను. దేవతలలో మాహవ్యమునకు ప్రాచుర్యము కలిగించవలెను.
11. హే శౌర్యసంపన్న అగ్నీ ! నీవు దూరదర్శివి. నిన్ను స్తుతించువానిని రక్షింతువు. అతని కోరికలు తీర్చెదవు. యజ్ఞముచేయువానిని హవి అర్పించువానిని బల, ధన పూర్ణుని చేసెదవు.
12. అగ్నీ ! మమ్ము శత్రువులనుండి రక్షింపుము. బలసంపన్న అగ్నీ ! మమ్ము పాపములనుండి కాపాడుము. మేము అర్పించిన నిర్ధోష హవ్యము నీకు చేరవలెను. నీవు దత్తము చేసిన వేలవిధములధనము మాకు చేరవలెను.