Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 2 పేజి 17


        జ్ఞానాందమయందేవం నిర్మలస్ఫటికాకృతిం
        ఆధారప్పర్వ విద్యానాం హయగ్రీముపాస్మహే

                                       అయిదవ అష్టకము
                                          ఆరవ మండలము

               మొదటి అనువాకము             మొదటి సూక్తము

        మండలద్రష్ట భరద్వాజుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్నీ ! నీవు దేవతలలో అధికుడవు. దేవతల మనసు నీలో నిలిచి ఉన్నది. ఈ యజ్ఞమున నీవే దేవతలను ఆహ్వానించువాడవు. సమస్త బలశాలి శత్రువులను ఓడించుటకు మాకు అనివార్య బలమును ప్రసాదించుము.

    2. అగ్నీ ! నీవు అతిశయ యజ్ఞకర్తవు. హోమనిష్పాదకుడవు. హవ్యములు గ్రహించువాడవు. స్తుతియోగ్యుడవు. వేదిరూపస్థానమున ప్రవేశించును. ధర్మానుష్ఠానపరులగు, ఋత్విక్కులు ధనము పొందవలెను. ఆశతో దేవతలలో ప్రథముడవుగా నిన్నే అనుసరింతురు.

    3. అగ్నీ ! నీవు దీప్తిమంతుడవు. దర్శనీయుడవు. మహా హవ్యభోజనుడవు. సర్వకాలములందు దీప్తిమంతుడవు. అంతరిక్ష మార్గమున పయనించువాడవు. ధనాభిలాషులగు యజమానులు నిన్నే అనుసరింతురు.

    4. ధనాభిలాషులగు యజమానులు స్తోత్రములు చదువుచు అగ్నియొక్క ఆహవనీయ స్థానమునకు సాగుదురు. అవధ్య రూపమున విశేష అన్నమును పొందుదురు. అగ్నీ ! నీ దర్శనము అయినంత వారు అట్టి స్తుతులకు ఆనందింతురు. జాతవేద, వైశ్వానర ఇత్యాది నీ నామ స్మరణ చేయుదురు.

    5. అగ్నీ ! మానవులు నిన్ను వేదిమీద వర్థిల్లచేయుదురు. నీవు యజమానులు పశు, అపశు ధనమును వర్థిల్లచేయుదువు. అధ్వర్యాదులు ఉభయవిధ ధనప్రాప్తికిగాను నిన్ను వర్థిల్ల చేయుదురు. నీవు స్తుతులు అందుకొనుము. మానవుల రక్షక, మాతా, పితృస్థానుడవగుము.

    6. అగ్నీ ! నీవు అభీష్టవర్షివి. హోమనిష్పాదకుడవు. అత్యంత పూజనీయుడవు, వేదిమీద స్థాపితుడవు. అగుదువు. గృహమున ప్రజ్వలితుడవగుదువు. మేము ప్రణమిల్లి, స్తోత్ర సహితముగా నీవద్దకు చేరుదుము.

    7. అగ్నీ ! నీవు స్తుతియోగ్యుడవు. మేము శోభనవృద్ధిగలవారము. సుఖాభిలాషులము. నిన్ను అభిలషించువారము. మేము నిన్ను స్తుతింతుము. నీవు దీప్తిమంతుడవు. ఆదిత్య మార్గమున మమ్ము స్వర్గమునకు చేర్చుము.

    8. అగ్ని యజమానాదుల స్వామి; జ్ఞాన సంపన్నుడు. శత్రువినాశకుడు. కోరికలు తీర్చువాడు. స్తోతలకు ప్రాప్తవ్యుడు. అన్నవిధాయకుడు. శుద్ధతాసముపార్జకుడు. ధనార్ధులచే యష్టవ్యుడు, దీప్తిమంతుడు, అట్టి అగ్నిని మేము ఋత్విక్కులము స్తుతింతుము.

    9. అగ్నీ ! నిన్ను యజించు యజమాని నిన్ను స్తుతించు యజమాని ప్రజ్వలిత ఇంధన సహితముగా హవ్యములు అర్ధించు యజమాని స్తుతులతో నీకు ఆహుతులు అందించు యజమాని నీచే రక్షితుడయి సమస్త అభిలషిత ధనప్రాప్తుడు అగును.

    10. అగ్నీ ! నీవు మహామహుడవు. మేము నమస్సులు, ఇంధనము, హవ్యములతో నీకు పరిచర్యచేయుదుము. మేము స్తోత్రము, శస్త్రములతో వేదిమీద నిన్ను అర్చింతుము. నీశుభంకర అనుగ్రహము పొందుటకు ప్రయత్నింతుము. మేము సఫలులము కావలెను.

    11. అగ్నీ ! నీవు నీదీప్తితో ద్యావా పృథ్వులను విస్తరింప చేసినావు. పరిత్రాణకర్తవు. స్తుతులతో పూజనీయుడవు. మరింత అన్నము, విశిష్ట ధనముతో మావద్ద ప్రదీప్తుడవగుము.

    12. ధనవంతుడవగు అగ్నీ ! మాకు పుత్ర, పౌత్రాదియుక్త ధనమును ప్రసాదించుము. మా పుత్ర పౌత్రులకు అనేక పశువులను ప్రసాదించుము. కోరికలు తీర్చునట్టి పాపరహితమయినట్టి సరిపోవునంత అన్నమును, సౌభాగ్యమును ప్రసాదించుము.

    13. దీప్తిమంతుడవగు అగ్నీ ! మేము నీ నుండి గోవులు, అశ్వస్వరూపమగు ధనములను పొందవలెను. ధనవంతుడవు. సర్వరమణీయుడవగు అగ్నీ ! నీవు శుభంకరుడవు. నీలో అనంత ధనములు ఉన్నవి.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత నాలుగువ అష్టకము ఆరవ మండలమున నాలుగవ అధ్యాయము సమాప్తము)

        ఓం నతామినన్తి మాయినో న ధీరావ్రతాదేవానాం ప్రథమాధ్రవాణి
        నరోదసీ అద్రువో వేద్యా భిర్నపర్వతావి నమే స్థివాంసః ||

                ఐదవ అధ్యాయము             రెండవ సూక్తము

        ఋషి - భరద్వాజుడు, దేవత - అగ్ని, ఛందస్సు - అనుష్టుప్, చివరిది శక్వరి.

    1. అగ్నీ ! నీవు సర్వదర్శివి. సంపన్నుడవు. మిత్రునివలె ఎండిన కఱ్ఱతో హవిమీద పడుదువు. అన్నపు పుష్టితో మమ్ము వర్థిల్ల చేయుము.

    2. అగ్నీ ! మానవులు హవ్యము, స్తుతులతో నిన్ను అర్చింతురు. హింసవర్జితుడు, జల ప్రేరకుడు, సర్వద్రష్ట సూర్యుడు నిన్ను అధిగమించును.

    3. అగ్నీ ! సమానప్రీతిగల ఋత్విక్కులు నిన్ను ప్రజ్వలితుని చేయుదురు. నీవు యజ్ఞప్రజ్ఞాపకుడవు. మనువు సంతతియగు యజమానులు సుఖాభిలాషులయి నిన్ను యజ్ఞములకు ఆహ్వానింతురు.

    4. అగ్నీ ! నీవు దానశీలుడవు. మర్త్యుడగు యజమాని యజ్ఞకార్యరతుడై నిన్ను స్తుతించునో అతడు సమృద్ధిగలవాడగును. అతడు నీ ద్వారా రక్షితుడయి భీషణ పాపమువలె శత్రువులను నాశనము చేయును. నీవు దీప్తియుక్తుడవు.

    5. అగ్నీ ! కఱ్ఱలతో నీకు మంత్ర సంస్కృత ఆహుతులిచ్చువాడు పుత్ర పౌత్రాదియుక్తడయిన గృహమున నూరేళ్లు భోగములు అనుభవించును.

    6. అగ్నీ ! నీవు దీప్తిశాలివి. నీ శుభ్రవర్ణ ధూమము అంతరిక్షమున వ్యాపించి మేఘరూపము దాల్చును. నీవు స్తోత్రములకు ప్రసన్నుడవగుము. సూర్యునివలె వెలుగులతో కాంతివంతుడవగుము.               
    7. అగ్నీ ! నీవు మాకు అతిథివలె ప్రియుడవు. అందుకే నీవు ప్రజలకు స్తుతిభాజనుడవు. నగరమున ఉండు హితోపదేశముచేయు వృద్ధునివలె ఆశ్రయయోగ్యుడవు. పుత్రునివలె పోషణీయుడవు.

    8. అగ్నీ ! అరణిమంథనమున నీ ఉనికి వ్యక్తమగును. గుఱ్ఱము రౌతును మోసినట్లు నీవు హవ్యములను వహింపుము. వాయువువలె సర్వత్ర సంచరించగలవు. అన్నము, గృహము ప్రసాదించుము. అశ్వము, శిశువువలె వంకర నడకలవాడవు.

    9. అగ్నీ ! గడ్డిమేయుటకు విడిచిన పశువు గడ్డిని సాంతము మేయును. అట్లే నీకు ఎండిన కఱ్ఱలను క్షణమాత్రమున భక్షింతువు. అనశ్వర అగ్నీ ! నీవు దీప్తిశాలివి. నీ శిఖలు అడవులను ఛిన్నాభిన్నము చేయును.

    10. అగ్నీ ! యజ్ఞాభిలాషి యజమాని ఇంట హోతరూపమున ప్రవేశింతువు. మానవ పాలక అగ్నీ ! మాకు సమృద్ధి విధానము చూడుము. అంగారరూప అగ్నీ ! మా హవ్యములను స్వీకరింపుము.

    11. అగ్ని అనుకూల దీప్తిమంతుడు. దేవదానాది గుణసంయుక్తుడు. ద్యావాపృథ్వులందు ఉండువాడు. అగ్నీ ! దేవతలముందు మా స్తుతులను ఉచ్ఛరించును. స్తోతలమగు మమ్ము శుభప్రద నివాసయుక్త సుఖములకు నడిపించుము. మేము శత్రువులను, పాపములను కష్టములను అతిక్రమించవలెను. జన్మాంతరకృత పాపములనుండి విముక్తులము కావలెను. నీ రక్షణలందు మేము శత్రువుల బారినుండి తప్పుకొనవలెను.

                                       మూడవ సూక్తము

        ఋషి - భరద్వాజుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. యజ్ఞము కొఱకు పుట్టినవాడును. యజ్ఞపాలనచేయు యజమాని చిరంజీవి అగును. మిత్రావరుణులతో సమానప్రీతిగలవాడవయి, నీ తేజమున పాపములనుండి రక్షించిన యజమానికి నీ విశాలజ్యోతి ప్రాప్తించును.

    2. వరణీయ ధన సమృద్దుడగు అగ్నికి హవ్యము సమర్పించు యజమాని యజ్ఞము సఫలము అగును. అగ్ని కర్మమున అతనికి సంపూర్ణ ఫలప్రాప్తి కలుగును. అతనికి యశస్విపుత్రులు లేరను అభావము ఉండదు. అతనిని పాపము, అనర్ధక గర్వము అంటవు.

    3. సూర్యుని దర్శనమువలె అగ్నిదర్శనము పాపరహితమగును. అగ్నీ ! ప్రజ్వలితములయిన నీభయంకర జ్వాలలు చొరరానిచోటు ఉండదు. నీవు రాత్రిపూట ధ్వనిచేయు ధేనువువలె విస్తృతమగుదువు. నివాసప్రదము, అరణ్యజాత అగ్ని పర్వతాగ్రము నుండి రమణీయముగా కనిపించును.

    4. అగ్ని మార్గము తీక్ష్ణము. అతని రూపము అత్యంత దీప్తము. అశ్వమునోటితో గడ్డిని అందుకున్నట్లు అగ్ని తన శిఖలతో హవ్యములను అందుకొనును. గొడ్డలి కర్రలపై వేటు వేసినట్లు అగ్ని లతాగుల్మాదులపై వేటు వేయును. స్వర్ణకారుడు బంగారమును కరిగించినట్లు అగ్ని అడవులను బూడిద చేయును.

    5. బాణము వేయువాడు లక్ష్యమువైపు వదులును. అట్లే అగ్ని తన జ్వాలలను లక్ష్యంవైపు చాపును. గొడ్డలిపట్టినవాడు పదును పెట్టినట్లు అగ్ని తన జ్వాలలను విసరునపుడు తీక్ష్ణము చేయును. చెట్టుమీది పక్షివలె రాత్రిని అతిక్రమించును. చీకట్లను దూరము చేయును.

    6. స్తవనీయ సూర్యునివలె అగ్ని వెలుగు మంటలను కప్పుకొనును. ఎల్లరకు అనుకూల ప్రకాశమును విస్తరింపచేసి స్వతేజమున పెద్దధ్వని చేయును. గ్ని రాత్రులందు వెలిగి మానవులను పగటివలె వారి పనులందు నియమించును. అమర సుందర అగ్ని పగలు దేవతలను హవియుక్తులను చేయును.

    7. దీప్తిమంతమగు సూర్యునివలె కిరణములు విస్తరించగల అగ్ని మహాధ్వని చేసినాడు. అభీష్టవర్షి, దీప్తుడగు అగ్ని ఓషధుల మధ్య మహాధ్వని చేయును. ఇటునటు ఉపరిభాగమున వర్తించు అగ్ని మా శత్రువును అణచివేయును. శోభనవంతము, సంపన్నములగు స్వర్గమును పృథ్విని ధనముతో నింపును.

    8. అశ్వమువలె స్వయం పూజ్యమానుడు, అర్చనీయుడు అగు అగ్ని దీప్తితో పయనము సాగించును. అదే అగ్ని తన తేజమున విద్యుత్తువలె మెరుపులు మెరియును. మరుత్తుల బలములను అల్పము చేయు అగ్ని నిరతిశయ దీప్తిశాలి సూర్యునివలె ప్రదీప్తుడు, వేగసంపన్నుడు, ప్రకాశమానుడగును.

                                      నాలుగవ సూక్తము

        ఋషి - భరద్వాజుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్ని దేవతల ఆహ్వానకర్త. బలపుత్రుడు. అగ్నీ ! ప్రజాపతి యజమాని యజ్ఞమున దేవతలను యజించినావు. అట్లే మా యజ్ఞమున యజనీయ ఇంద్రాది దేవతలను నీ సమానులనుకొని వారిని యజింపుము.

    2. అగ్ని ప్రకాశకుడు. సూర్యునివలె దీప్తిమంతుడు. అందరకు బోధించువాడు. ఎల్లరకు జీవనభూతుడు. అనశ్వరుడు. అతిథి. జాతవేద. మానవులందు ఉషఃకాలమున ప్రబుద్దుడగువాడు. అట్టి వందనీయ అగ్ని మాకు ధనము ప్రసాదించవలెను.

    3. స్తోతలు అగ్నియొక్క మహాకార్యములను స్తుతింతురు. అతడు అగ్ని సూర్యునివలె శుభ్రవర్ణుడు. తన వెలుగులను కప్పుకున్నవాడు. జరారహితులను పవిత్రులను చేయగల అగ్ని దీప్తిద్వారా సకల పదార్థములను ప్రకాశింపచేయును. వ్యాపించు రాక్షసులను పురాతన నగరములను ధ్వంసము చేయును.

    4. అగ్నీ ! నీవు సర్వ ప్రేరకుడవు. వందనీయుడవు. అగ్ని హవ్యములమీద ఆసీనుడగును. ఉపాసకుల గృహములందు అన్నము కలిగించుము. రాజువలె మా శత్రువులను గెలుచును; ఉపద్రవరహితమగు మా అగ్ని గృహమున నివసించును.

    5. అగ్ని అంధకార నివారకుడు. స్వతేజమును తీక్ష్ణము చేయువాడు. హవిభక్షకుడు. వాయువువలె అందరిని శాసించువాడు. అతడు చీకట్లను తొలగించును.

    అగ్నీ ! నీ అనుగ్రహమున మేము నీకు హవి సమర్పించని వానిని ఓడించవలెను. అశ్వమువలె వేగవంతుడవయి మాపై ఆక్రమణచేయు శత్రువులను నష్టపరచుము.

    6. సూర్యుడు తన దీప్తిమంతములు, పూజనీయములగు కిరణములతో ద్యావాపృథ్వులకు ఆచ్చాదించినట్లు అగ్ని విశేషరూపమున ద్యావా పృథ్వులను ఆచ్చాదించును. తన మార్గమున సాగు సూర్యునివలె విచిత్ర అగ్ని అంధకారములను దూరము చేయును.

    7. అగ్నీ ! నీవు అత్యంత స్తవనీయుడవు. పూజార్హుడవు. దీప్తిశాలివి. మేము నిన్ను భజింతుము. నీవు మా యొక్క మహాస్తుతులను ఆలకింపుము. నేతరూపులగు ఋత్విక్కులు హవిర్లక్షణ ధనమున నిన్ను సంతుష్టుని చేయుదురు. నీవు బలమున వాయు సదృశుడవు. దేవరూపమున ఇంద్ర సదృశుడవు.

    8. అగ్నీ ! నీవు త్వరగా తోడేళ్లులేని మార్గమున మమ్ము నిర్విఘ్నముగా ఐశ్వర్యము వద్దకు తీసికొని పొమ్ము నడిపింపుము. పాపములనుండి ఉద్ధరింపుము. స్తోతలకు ప్రసాదించునట్టి సుఖములను మాకు ప్రసాదించుము. మేము సంతాన సంపన్నులమై నూరేళ్లు సుఖముగా జీవించవలెను.

 Previous Page Next Page