Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 17

    'తెలియకుండా చేసుకోలేదు. చెప్పడానికే వచ్చాడు.'
    'ముహూర్తాలు కూడా పెట్టుకున్నాక ఊళ్లో వాళ్లను పిలిచినట్టు మమ్మల్ని పిలవడానికి వచ్చావు. ఇక్కడ నీకోసం మేం పెళ్ళి సంబంధాలు చూస్తున్నాం. నువ్వేమో...?'
    'సుందరీ! ఏమిటా మాటలు? వాడేం చేశాడు? మనభారం తగ్గించి మంచి పనే చేశాడు.' అన్నాడు కామేశ్వరరావు.
    'అవేం మాటలండీ? మనం ఎప్పుడైనా బిడ్డలు భారం అనుకున్నామా? అట్లా అనుకుంటే ఈరోజు వీడు ఇలా వుండేవాడా?'
    'అనుకోకపోయినా భారం భారమేగా?'
    'నాన్నగారూ! అమ్మ చాలా బాధపడుతుంది. నేను చేసింది. తప్పయితే చెప్పండి. ఈ పెళ్ళి మానెయ్యమంటారా?'
    'ఆ! మానెయ్యరా! మానెయ్!' సుందరమ్మ అరిచినట్టే అన్నది.
    'సుందరీ నీకు మతిపోయిందా? రామం వెళ్ళి భోజనం చెయ్యి.
    'నాకు ఆకలిగా లేదు. వెళ్తాను. చివరి బస్ వుంది.'
    'మంచిది వెళ్ళిరా! దిగులుపడకు. సంతోషంగా వుండు. పెళ్లికి వస్తాం.'
    'రామం ముఖం చాటంత అయింది. నిజంగా వస్తారు కదూ?'
    'ఎందుకురాం? వస్తాం. బస్సుకు టైం అవుతుంది ఇక వెళ్ళు.' అన్నాడు కామేశ్వరరావు.
                                *   *   *
    రామం పెళ్లికి వెళ్ళాక సుందరమ్మ సంతోషంగానే వుంది. వియ్యాలవారు చాలా గౌరవించారు. కోడలు పిల్ల అత్తయ్యగారూ! అత్తయ్యగారూ అంటూ చుట్టుకు చుట్టుకు తిరిగింది. పెద్దకోడలు కూడా అత్తగారి పట్ల ఎంతో గౌరవం కనబరిచింది .గుంటూరు నుంచి విజయవాడ రమ్మని రఘు, అతని భార్య కూడా బలవంతం చేశారు. సుందరమ్మకు వెళ్ళాలనే వుంది. కాని కామేశ్వరరావు స్కూలు పరీక్షలు దగ్గర పడ్తున్నాయి. అంగీకరించలేదు. పెళ్లయిన మూడోనాడు ఇంటికి బయలుదేరారు. వియ్యాలవారు సుందరమ్మకు కంచిపట్టు చీర పెట్టారు. వియ్యంకుడికి పట్టు పంచెలసాపు పెట్టారు. పిల్లలందరికీ బట్టలు పెట్టారు. సునందకు పట్టుపరికిణీతో పాటు ఆడబిడ్డ లాంఛనాలు జరిపించారు. సుందరమ్మ మనసు సంతృప్తిగా వుంది.
    'పిల్లవాడు చాలా బాగున్నాడు. బుద్ధిమంతుడిలా వున్నాడు. మంచి ఉద్యోగం. దమ్మిడీ కట్నం అడగలేదు. మన సునంద అదృష్టవంతురాలు.' సుందరమ్మ, భోజనం చేసి వసారాలో కూర్చుని వున్న కామేశ్వరరావుకు వక్కపొడి అందిస్తూ అన్నది.
    కామేశ్వరరావు మౌనంగా వక్కపొడి అందుకున్నాడు.
    'మాట్లాడరేమండీ?'
    'వీళ్లకు మన గురించి ఎలా తెలిసింది. అకస్మాత్తుగా మీ పిల్లను చేసుకుంటామని రావడం ఏమిటి! కట్నం వద్దనడం ఏమిటి? నాకేమీ అర్ధం కావడం లేదు. మన సునంద మాత్రం పిల్ల, హైదరాబాద్ లో వాళ్లకు దొరకలేదా? అసలు వాళ్లకు మన గురించి ఎవరు చెప్పి వుంటారు?' ప్రత్యేకంగా పని కట్టుకొని మన పిల్ల కోసం ఎందుకు వచ్చారు.'
    సుందరమ్మ కూడా ఆలోచనలో పడింది. "రామనాథం అన్నయ్య అన్ని వివరాలూ తెలుసుకుంటానన్నాడుగా? ఆ అబ్బాయి పని చేసే కంపెనీలో తన బావమర్దికూడా పని చేస్తున్నాడని చెప్పాడుగా?" అంది.
    కామేశ్వరరావు మౌనంగా వుండిపోయాడు.
    "ఈ సంబంధం ఖాయం అయితే చంద్రానికీ, సునందకు ఒకేసారి పెళ్ళి చేసెయ్యొచ్చు". అన్నది సుందరమ్మ.
    కామేశ్వరరావు ఆలోచిస్తూ వుండిపోయాడు.
    చంద్రం బి.ఇడి పూర్తి చేసి అదే ఊరులో తండ్రి పనిచేస్తున్న స్కూల్లోనే టీచర్ గా చేరాడు. చంద్రం సంపాదన కలిశాక కామేశ్వరరావుకు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంది.
    "అమ్మాయికి ఈ సంబంధం ఖాయం అవుతుందంటారా?" సుందరమ్మ సాలోచనగా అడిగింది.
    "చూద్దాం. రామనాథం ఆ కుర్రాణ్ణి గురించి వాకబు చేస్తానన్నాడుగా? "చూడు ఎవరో వచ్చినట్టున్నారు." అన్నాడు కామేశ్వరరావు.
    అంతలోనే రామనాధం లోపలకు వచ్చాడు.
    "రా! అన్నయ్యా! నీకు నూరేళ్లు. ఇప్పుడే నీ పేరు ఆయన ఎత్తారో లేదో నువ్వు లోపల అడుగుపెట్టావు.
    "నూరేళ్లు వుండి ఏం చెయ్యాలమ్మా! కాలక్షేపానికి నాకు మనవళ్లు కూడా లేరుగా?" అన్నాడు నవ్వుతూనే. ఆ నవ్వు బోలుగా అన్పించింది సుందరమ్మ. పిల్లలు లేని రామనాధం వృద్దాప్యం కళ్లముందు మెదిలింది. బోలెడంత జాలివేసింది.
    "శుభవార్త తెచ్చాను. మన సునంద అదృష్టవంతురాలు."
    "తెలుసుకున్నావా అన్నయ్యా?"
    "ఆఁ! తెలుసుకున్నాను. మా బావమర్ది ఆ కంపెనీలో పని చేస్తున్నాడు. సూర్యనారాయణ చాలా మంచి కుర్రవాడట. ఎలాంటి చెడ్డ అలవాట్లూ లేవట. తల్లి దండ్రులకు ఏకైక సంతానం అట. త్వరలోనే ప్రమోషన్ కూడా రాబోతుందంట."
    "మరి ......" కామేశ్వరరావు సందేహం వెలిబుచ్చాడు.
    "అతనివన్నీ కమ్యూనిస్టు భావాలట. కట్నం తీసుకోడట"
    "ఇప్పటికైనా మీ సందేహం తీరిందా?" భర్తను రెట్టించింది సుందరమ్మ.
    "ఊహూ! తీరలేదు."
    నీ సందేహం నాకు అర్ధం అయింది. మన అమ్మాయి గురించి ఎలా తెలిసిందనేగా? అంతదూరం నుంచి పని కట్టుకొని వచ్చి మన పిల్లను చేసుకోవడం ఏమిటనేగా నీ సందేహం!" అన్నాడు రామనాథం.
    "అవును!"
    "ఆ కుర్రాడు మన సత్యం స్నేహితుడట. తన చెల్లెల్ని చేసుకోమని సత్యం కోరాడట."
    "సత్యమా! ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? పిల్లను చూట్టానికి వాళ్లు వచ్చినప్పుడు, వాడూ రావచ్చుగా?" కామేశ్వరరావు ఉత్కంఠంగా అడిగాడు.
    "ఏ ముఖం పెట్టుకొస్తాడు? కొట్టి వెళ్ళగొట్టారుగా? వాడికి మహా రోషం'  నిష్టూరంగా అన్నది సుందరమ్మ.
    "కాదు చెల్లమ్మా! సత్యం విప్లవ రాజకీయాల్లో వున్నాడట. ఏ అడవుల్లో వున్నాడో?" అన్నాడు రామనాథం.
    "అయ్యో! అదేమిటన్నయ్యా! నా బిడ్డ అడవుల్లో వున్నాడా? వాడ్ని ఏదో అనుకున్నాం. నా ఇంట్లో తప్పపుట్టాడు అనుకున్నాం. నేనే అన్నాను పాపిష్టిదాన్ని - నా బిడ్డలందరూ రత్నాలు - వాడొక్కడే గులకరాయి అని చూశావా? ప్రయోజకులై రెండు చేతులా సంపాదిస్తున్న అన్నలు చెల్లెలి పెళ్లి గురించి పట్టించుకోలేదు. సత్యానికి మేము ఏం చేశాం. వాడు మమ్మల్ని మర్చిపోలేదు. మా గురించి ఆలోచిస్తున్నాడు. చెల్లెలికి మంచి సంబంధం కూడా చూశాడు. వాడు ఒక్కసారి వచ్చిపోతే ఏమౌతుంది. ఈ పాపిష్టి కళ్లకు మళ్ళీ కన్పిస్తాడో లేదో?"
    "ఎప్పుడో ఒకసారి వస్తాడు. కనీసం పెళ్లికయినా వస్తాడు. బాధపడకు. ఆఁ! నేను వెళ్తాను." లేచి నిల్చున్నాడు రామనాథం.
    "వుండండి అన్నయ్యా! కాఫీ తాగివెళ్ళండి."
    "ఏమిటయ్యా అంత తొందర?" అన్నాడు కామేశ్వరరావు.
    "మా బావమర్ది వచ్చాడు. ఈ రాత్రికే మళ్లీ వెళ్ళిపోతాడు. విషయం చెవున వేసి పోదామని హడావిడిగా వచ్చాను. వస్తాను" అంటూ రామనాధం వెళ్ళిపోయాడు.
    కామేశ్వరరావు సంతృప్తిగా నిట్టూర్చాడు.
    సుందరమ్మ ఆనందానికి అవధుల్లేవు.
                                 *   *   *

 Previous Page Next Page