Previous Page Next Page 
తల్లి మనసు కధలు పేజి 16


                                             వాన వెలిసింది
    ఛీ....ఛీ.... పాడు వర్ధం.... కొంప మునిగేటట్లు ఇప్పుడే రావాలా? యీ వర్షం తన ప్రోగ్రాం అంతా అప్ సెట్ అయిపొయింది...."
    నలుమూలలా నల్లటిమేఘాలు చుట్టేసి అకస్మాత్తుగా ఎడాపెడా జల్లులే ఆరంభించిన వర్షాన్ని చూచి, అప్పుడే ముస్తాబయి గుమ్మం దిగబోతున్న వనజ తెగ చిరాకుపడింది.
    'ఎండాకాలం! కొంప మునిగినట్లు ఈ వర్షం ఏమిటి.... ఛా.... ఏం చెయ్యలేక, విసుక్కుంటూ ... వరండా అంతా కాలుగాలిన పిల్లిలా తిరిగింది వనజ.
    అక్కడ "శ్యాం' తన కోసం చూస్తుంటాడు ఆత్రుతగా. ఒక ప్రక్క టయిమ అయిపోతుంది. తను రాలేదని ఎంత చిరాకు పడుతున్నాడో! ఏం చెయ్యడం. ఎలా వెళ్ళడం యీ వర్షంలో... ఇంట్లో రెండు కార్లు తగలడ్డా ఒక్క కారూ సమయానికి వుండదు... అసలు కారున్నా తనెలా వెళ్ళగలదు కారులో.. వెడితే తనేక్కడికి వెళ్ళింది యింట్లో తెలిసి పోదూ -----పోనీ గొడుగు వేసుకు వెళితే ? ..... "యీ వర్షంలో కొంప మునిగినట్లు వెళ్ళకపోతేనేం " అని కేకలు వేస్తుంది అమ్మ. అసలు వెళ్ళడానికి వీలులేకుండా కట్టడి చేస్తుంది. అందుకే లోపల గుమ్మానికి ఎదురుగానే కూర్చుంది అమ్మ. ప్చ్! ... వర్షం తగ్గేవరకు వెళ్ళడానికి అవదు. ఎన్ని ప్లానులు వేసుకున్నారు ఇద్దరు. అంతా యీ పాడు వర్షం నించి పాడయి పోయింది....' మనసులో తిట్టుకుంటూ ఆ చిరాకంతా మొహం మీదే కనపరుస్తూ.... విసుగ్గా , నిస్సహాయంగా ....వీధి వరండాలో ఫేము కుర్చీలో జారగిలపడింది వనజ వర్షాన్ని చూస్తూ. వనజని చూసి తోకాడించుకుంటూ దగ్గిరికి చేరిన పుస్సీని .... ఎప్పుడూ ముద్దులాడే వనజ.... ఆ చికాకులో విసురుగా క్రిందికి త్రోసేసింది.
    వనజ అత్రుతకి తగ్గట్టుగానే వర్షం తగ్గడం అటుంచి ఉరుములు, ,మెరుపులు గాలి, జల్లులతో మరింత విజ్రుంభించింది. నిమిషా నిమిషానికి వాచీ చూసుకుంటూ, ఆకాశం వైపు చూస్తూ ఆత్రుత పడసాగింది వనజ..... ఇంత అరగంటే వుంది టైము. ముందీ వర్షం తగ్గితే ఎలాగో అలాగ టైముకి చేరవచ్చు... ఇంకో అరగంటలో తనక్కడ ఉండకపోతే ఇవ్వాల్టికి యింక లాభం లేదు....ప్చ్.... ఎలా?....
    'అక్కా....అక్కా...." అంటూ దగ్గిరి చేసి హేండ్ బ్యాగు తెరుస్తున్న తమ్ముడి చేతులోంచి ఊడలాక్కుని 'పో ! వెధవా?' అని తిట్టి పంపేసింది ఆ కోపంలో.
    గాలి విసురుకి ఎగిరే పమిటని విసుగ్గా దోపుకుని ఎగిరే ముంగురులని వెనక్కి త్రోసుకుంటూ, చేసుకున్న మేకప్ అంతా చెదిరి పోతున్నందుకు చిరాకు పడింది. "వనజా ..? ... ఏమిటి ఆ వర్షం జల్లు అలా పడుతుంటే అక్కడ ఏం చేస్తున్నావు? లోపలికి రా....' ఇంట్లోంచి తల్లి పిలిచింది.
    "లేదమ్మా , యిక్కడ జల్లు పడడం లేదు" వర్షం కాస్త తగ్గినా వెంటనే బయటి నుంచి వెంటనే జారుకోవచ్చని వనజ ఉద్దేశం.
    ఉదయం మార్నింగ్ షో సినిమాకి లలితతో వెడతానని తల్లితో చెప్పి వప్పించింది వనజ కాని ఈ వర్షంలో ఇక వెళ్లొద్దు అనేస్తుందేమో అమ్మ చూడకుండా మెల్లిగా బయటపడాలని వనజ ఉద్దేశం.... భయపడుతున్నట్టే తల్లి అనేసింది...." ఇక ఈ వర్షంలో ఇప్పుడెం సినిమాకి వెడతావు. మానేయ్. టైము కూడ అయిపోయినట్టుంది".... వనజ విననట్లు జవాబీయలేదు.
    ఆత్రుతగా పైకి చూస్తున్న వనజకి ....గేటు తీసుకుని, తల మీద కొంగు కప్పుకుని, మెట్లెక్కి వరండా మీద, రాబోతూ వనజని చూసి సందేహిస్తూ ఒక్కక్షణం ఆగిపోయింది ఒక యువతి .
    'లోపలికి వచ్చి నుంచోండి అలా తడుస్తారెందుకు ?' యాధాలాపంగా అంది. వానక అటువైపు చూడకుండానే.
    వనజ వంక కృతజ్ఞతగా చూసి, వరండా మీదకి వచ్చి కొంగుతో తల అద్దుకుని పమిట చెంగు పిండుకుని ఎత్తిపట్టి గాలికి అరవేసుకుంటూ వనజ వైపు కుతూహలంగా చూడసాగింది ఆమె.
    తన చిరాకులో ఆమెని గురించి అంతగా పట్టించుకోలేదు వనజ. ఒకసారి యధాలాపంగా చూసి వూరుకుంది. బట్టలు పాతవయినా శుభ్రంగానే ఉన్నాయి. మనిషి మొహం చూస్తె చదువు, సంస్కారం ఉన్న మనిషనే అనిపించింది . సాదా వాయిల్ చీర ఆకూ చెప్పులు. సగం అల్లి వదలిన జడ. ఎంతో నిరాడంబరంగా ఉన్నా ఆమె మొహంలో ఒకప్పుడు బాగా బ్రతికిన ఠీవి, దర్జా ఇంకా మాసిపోలేదు . గర్బిణీ లా వుంది. మొహం పాలిపోయి కళ్ళలో జీవం లేకుండా నిల్చోడానికే ప్రయాస పడుతున్నట్లు కనిపించిన ఆమెని చూసి 'కూర్చోండి అలా....' ఓ కుర్చీ చూపించింది వనజ . ఆమె కాస్త బిదియపడుతూ కూర్చుంది.
    "టై మెంతయిందండి"
    "పదింబావు " ముక్తసరిగా అంది వనజ.
    'అమ్మయ్యో!..... పదింబావే" ఆందోళనగా అంది ఆమె. వనజ తల త్రిప్పి చూస్తూ ...." ఏం ఎక్కడికన్నా వెళ్ళాలా మీరు అర్జంటుగా ...."
    'అవునండీ ! ఓ ఆఫీసులో పదిన్నరకి గుమాస్తా ఉద్యోగానికి ఇంటర్వ్యూ వుంది. ఇంటినించి బయలుదేరానో లేదో పాడు వర్షం పట్టుకుంది.... రోడ్డు మీద యెక్కడ నిల్చుందామన్న ఏదీ కన్పడలేదు ఎక్కుదామంటే ఓరిక్షా అయినా కనిపించలేదు. బట్టలన్నీ సగం తడిసిపోయాయి.... ఇంకా పూర్తిగా తడిస్తే ఇంటర్వ్యూ కి ఎలా వెళ్ళడం అని ఆగాను. ఎప్పటికి తగ్గుతుందో ఈ వర్షం.... టైముకి వెళ్ళగల'నో లేదో " విచారంగా అంది ఆమె.

 Previous Page Next Page