"నీ వర్షన్ విందామని, మా కామన్ ఫ్రెండు ఒకడు వీడు కాలేజీలో చేసింది చెప్పాడు. వీడు సరిగా చెప్పలేదు" కుతూహలంగా చూశాడు.
ఏం జరిగింది? పధ్నాలుగేళ్ళ క్రితం.. కాలేజీలో చదువుకునే టీనేజ్ వయసు - తళుకు, బెళుకు, వగరు, పొగరు ఉండే వయసులో ఓ ఆడపిల్ల. అందులో అందంగా ఉండే ఓ అమ్మాయి... ఎంతో హాయిగా, ఆనందంగా, తుళ్ళుతూ ఆడేపాడే వయసు అమ్మాయి.. కలలు కనే వయసు- కలల్లో రాకుమారుడు, ఆజానుబాహుడు, అరవింద దళయతాక్షుడు, ఉన్నతుడు, సంస్కారుడు, ప్రేమించేవాడు, అలరించేవాడు, మైమరిపించేవాడు. తానే లోకంలో భావించేవాడు వస్తాడని, వరమాల వేస్తాడని, మురిపాల సంసారం గురించి ప్రతి అమ్మాయి ఊహించి కలలు కనే వయసు అది! మగవాడంటే హుందాగా ఉండాలి, హుందాతనంలో సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. తెలివిగా, చదవాలి, ఆడపిల్లలంటే గౌరవించాలి, లేకిగా ఉండకూడదు, చీప్ గా ప్రవర్తించరాదు - అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు లైక్ చేస్తారు. ప్రేమిస్తారు, గౌరవిస్తారు అని కొన్ని స్థిరాభిప్రాయాలు ఏర్పరచుకునే వయసు అది. తమ ఊహలకి భిన్నంగా ఎవడైనా ప్రవర్తిస్తే తిరస్కారం కలుగుతుంది. అదే జరిగింది చంద్రశేఖర్ ని చూసిన క్షణంలో జయంతికి.
జయంతి కాలేజీలో చేరిన మొదటిరోజే శేఖర్ కళ్ళు ఆమెమీద పడ్డాయి. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి ట్రాన్స్ ఫరయి వచ్చి కాలేజీలో కొత్తగా బి.ఎస్సీలో చేరింది. మొదటిరోజే ఆమె అందం అతన్ని ఆకర్షించింది. రోజుకో డ్రస్సుతో మోటార్ సైకిల్ మీద అంతెత్త బూట్లతో ఫ్రెండ్స్ ని వెంటేసుకు తిరిగే శేఖర్ చదువులో మాత్రం వెనుకే. ఏదో డిగ్రీ కావాలని చదవడం తప్ప, తండ్రి బిజినెస్ లు చూసుకుంటే చాలు, కష్టపడి డిగ్రీలు మీద డిగ్రీలు సంపాదించే పెద్ద చదువులు అక్కరలేదన్న ధీమా. దాంతో అటెండెన్స్ కి మాత్రమే కాలేజి, చదువుకి కాదు అన్న గ్రూప్ అంతా కలిసి ఆడపిల్లల్ని ఆకర్షించడానికి పాట్లు పడడం, ఆకర్షణకి లొంగినవాళ్ళతో షికార్లు, సినిమాలు, హోటళ్ళు తిరిగే గ్యాంగు అది. వీళ్ళ గురించి నెల రోజులకే జయంతికి అర్ధమైంది. అర్ధం కానిది ఉంటే సీనియర్లు చెప్పారు. అలా శేఖర్ అంటే మొదట్లోనే తేలికభావం ఏర్పడిపోయింది. అతను రోజురోజుకీ ఆమెపట్ల ఆకర్షితుడైనకొద్దీ ఆమెకి అతనిపట్ల ఏహ్యత రోజురోజుకి పెరిగింది. అతన్ని చూడగానే ముఖం చిట్లించుకొనేది. అతని వెకిలివేషాలను తిరస్కారంగా చూసేది. అది అతని అహాన్ని రెచ్చగొట్టింది. తనలాంటి అందగాడు, డబ్బున్నవాడు ఆమె కోసం, ఆమె స్నేహం కోసం ఆరాటపడుతుంటే లెక్కలేనట్లే విదుల్చుకుని తనవైపు కన్నెత్తి అయినా చూడకపోవడంతో అతని అహం దెబ్బతింది.
"ఏమనుకుంటోంది. బోడి.... దీనిపాటి నాకెవరూ దొరకరనుకుంటోంది గాబోలు.. ఏదో పెద్ద అందగత్తెనని గర్వం...."
"నే తల్చుకుంటే దీని పొగరు నిమిషంలో అణుస్తా. పలకరిస్తే ముఖం తిప్పుకుని వెళ్ళిపోతుందా. పుస్తకం అడిగితే విసురుగా లేదంటుందా, చూస్తున్నా దీని వరస." మిత్రుల దగ్గర ఉక్రోషం వెళ్ళగక్కేవాడు. మిత్రబృందం నాలుగు సమిధలు వేసి మంట ఎగదోసేవారు. స్నేహితుల చెల్లెళ్ళ ద్వారా రాయబారాలు నడిచాయి. "పాపం ఆ శేఖర్ నీవంటే పడిచస్తున్నాడే పాపం అంతలా వెనకబడ్తుంటే మాట్లాడితే నీ సొమ్మేం పోతుంది.' స్నేహితురాళ్ళ వకాల్తా పుచ్చుకున్నట్లు మాటలు - "ఛా...వాడిని చూస్తేనే నాకు తిక్క రేగుతుంది. చదువూ సంధ్యా లేకుండా, రోజుకో డ్రస్సు వేసుకుని మోటార్ సైకిళ్ళ మీద తిరగడం గొప్ప అనుకుంటాడు కాబోలు. అది చూసి ఆడపిల్లలు వలలో పడిపోతారనుకుంటున్నాడేమో. వాడి సంగతి నా దగ్గిర చెప్పొద్దు." అసహ్యం అంతా మాటల్లో ముఖంలో చూపించింది.
ఆ కబురు శేఖర్ దగ్గరికి చేరింది. అవమానం జరిగిపోయినట్లు ఉడికిపోయాడు. మిత్రులు మరింత ఎగదోశారు. "వాడి బాబుకి రెండు ఫ్యాక్టరీలుంటే నాకేం, మూడు కార్లుంటే నాకేం. అవన్నీ వాడి బాబుకున్నాయి. వీడికేం ఉందట. చదివి అవన్నీ వాడు సంపాదిస్తే అప్పుడు వస్తుంది గౌరవం. తండ్రి డబ్బుతో షోకులు చేసుకు తిరగడం కాదు" అందిరా. "చూస్తున్నా వాడి వ్యవహారం, సిగ్గు లేకుండా ఆడపిల్లల్ని ఏడిపించడం, కామెంట్స్ పాస్ చేయడం గొప్ప అనుకుంటున్నాడేమో. అది వాడికి సంస్కారాన్ని తెలుపుతుంది." లాంటి కబుర్లు అన్నీ విన్న శేఖర్ మొహం అవమానంతో మాడిపోయేది. జయంతి తిరస్కారం అతనిలో కక్షరేపింది. తనని గడ్డిపోచలా తీసిపారేయడం సహించలేకపోయాడు. తాను గడ్డిపోచ కాదన్నది ఆమెకి అర్ధం అవ్వాలన్న పంతం పెరిగింది. ఆమె అహం అణచాలన్న ప్రతీకార వాంఛ రోజురోజుకీ పెరిగింది. అదను కోసం వేచాడు. ఆమె ఇంటిల్లిపాదీ మిత్రులతో యాదగిరిగుట్ట వెళ్ళారు. జయంతి పరీక్షలని ఒంటరిగా ఉండిపోయింది చదువుకుంటూ. మిత్రులు కబురు అందించారు. నాలుగు గంటలవేళ ఎవరూ చూడకుండా తలుపు తట్టాడు. ఎవరో అని తలుపు తీసిన జయంతికి మాట్లాడే అవకాశం గాని, అరిచే అవకాశం గాని, ప్రతిఘటించే అవకాశం గాని ఇవ్వకుండా వెంట తెచ్చుకున్న రుమాలు నోట్లోకుక్కి, తెచ్చిన తాడుతో చేతులు కట్టి, ఆమె మీద కక్ష తీర్చుకున్నాడు. ఆమె కళ్ళల్లో నిస్సహాయత్వం అతని అహాన్ని అణిచింది. ఆమె కంట తిరిగిన నీరు ప్రతీకార జ్వాలని చల్లార్చింది. "మగాడి అహంతో ఎప్పుడూ ఆడుకోకు" వెళ్ళేముందు వార్నింగ్ ఇచ్చాడు. "నామీద కంప్లైంట్ ఇస్తే పోయేది నీ పరువే. నే చేశాననడానికి నీకే సాక్ష్యం లేదు. కోర్టుకి సాక్ష్యం కావాలి. పోలీసులని కొనగలిగే డబ్బు మాకుంది కనుక కంప్లైంట్ చేసి ఫూల్ వి అవకు" లాంటి ఉచిత సలహాలు పారేసి రుమాలు, తాడు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు.
అప్పటి జయంతి స్థితి వర్ణించడానికి మాటలు లేవు. ఒకగంట దిమ్మెరపోయి ఆలోచనారహితంగా కూర్చుండిపోయింది. మరోగంట ఆవేశంలో రకరకాలుగా ఏంచేయాలి అన్నది ఆలోచించింది అన్ని కోణాల నుంచి. కోర్టుకు కళ్ళులేవు. చెవులు తప్ప. పోలీసులకి చెప్పడం అంటే తన, తనవారి పరువు పేపర్లో వేయించుకున్నట్లే. వాడు పొగరుగా చెప్పినా నిజమే చెప్పాడు. తనేం చెయ్యలేదని వాడికి తెలుసు. నిజం చెప్పి తల్లితండ్రులని బాధపెట్టి, నలుగురిలో నవ్వులపాలవడం తప్ప ఒరిగిందేం లేదు. ఇదే ఏ బయటెక్కడో అయితే అందరికీ తెలిసేది. కొందరయినా తన మాట నమ్మేవారు. కొన్నయినా సాక్ష్యాలు చూపగలిగేది. కానీ, తన ఇంట్లో... ఎంత తెలివిగా ప్లాన్ అమలు చేశాడు. తనే పిలిచింది అని చెప్పినా చెప్పగలడు. ఇప్పుడు ఇది బయటికి చెప్పి తాను ఫూల్ అవడం తప్ప వాడన్నట్లు ఏం జరగదు. ఆవేశాన్ని వివేకం అణిచింది. అందరూ ఇంటికి వచ్చేసరికి ఇల్లు, మనసు, శరీరం యథాప్రకారంగా మార్చింది. "ఇప్పుడేమిటే తన స్నానం చేశావు?" ఇంటికొచ్చిన తల్లి ఆశ్చర్యంగా అడిగింది. "చదివి చదివి బుర్ర వేడెక్కింది. చెమట పట్టి చీదరగా ఉందని స్నానం చేశా"
"ఎప్పుడూ లేనిది దేవుడికి దీపం పెట్టావు. ఈ భక్తి ఎప్పటినుంచి?" తేలిగ్గా నవ్వి అంది.
ఆరోజుతో ఆ సంఘటన మర్చిపోవాలని ప్రయత్నించింది. కానీ, శేఖర్ మర్చిపోనివ్వలేదు. గిల్లీకాన్షస్ మనసుని తినేస్తుంది కాబోలు. ఏదో ఆవేశంలో చేసినా మర్నాడు జయంతిని చూడడానికి మొఖం చెల్లలేదు. ఏం గొడవ చేస్తుందోనని భయపడ్డ అతను జయంతి ఏం జరగనట్టే ఉండిపోవడంతో ఆశ్చర్యపడ్డాడు. పైకి ఎంత నిర్లక్ష్యం నటించినా జయంతి ముఖంలో పూర్వపు చలాకీతనం, ఆ కళ్ళలో ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లుండడం చూసి అతనిలో ఆత్మవిమర్శ, తప్పుచేశానన్న భావం మొదలైంది. ఆగలేక జయంతిని క్షమించమని కోరుతూ మనం పెళ్ళిచేసుకుందాం, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను అంటూ రాశాడు పశ్చాత్తాపం కనబరుస్తూ.
"నిన్ను పెళ్ళాడేకంటే వీధినపోయే ముష్టివాడిని పెళ్ళాడతాను. నా జోలికి రాకు. మరో ఉత్తరం రాయకు. రాస్తే నా శవం చూస్తావు. చచ్చేముందు నీవు చేసిన పని అందరికీ తెలిసేటట్లు చేసి మరీ చస్తాను. ఇది నిజం" అంటూ రాసింది. దాంతో శేఖర్ బెదిరాడు. జయంతి జోలికి వెళ్ళడం మానేశాడు. ముళ్ళమీద ఉన్నట్లు మూడు నెలలు గడిపి పరీక్ష రాశాననిపించుకుని ఆ కాలేజీ నుంచి బయటపడ్డాడు.