ఆపరేషన్ అయి, రజియాకి పూర్తి స్పృహ వచ్చే సరికి తెల్లవారింది. ప్రత్యేక శ్రద్ధతో ప్రతి అరగంటకి వెళ్ళి రజియాని చూస్తుండే వాడిని అంతసేపు, మెలుకువ వచ్చాక ఎదురుగా కన్పించిన నన్ను చూసి రజియా అంత బాధలోనూ చకితురాలైపోయింది. అసలే పెద్దవయిన ఆ కళ్ళు మరింత విప్పారాయి, పాలిపోయిన ఆ బుగ్గలు గులాబి రంగు దాల్చాయి. ఏమి అర్ధంకానట్టు అయోమయంగా నా వంక చుట్టూ చూసింది. 'ఎక్కడ వున్నాను, నేనెక్కడ వున్నాను' అంటూ గొణిగింది. ఆపరేషన్ కాగానే ఆమె స్నేహితురాళ్లిద్దరూ రూమ్ కి వెళ్ళివస్తాం అని వెళ్ళారు. జరిగినది ఏది ఆమెకి గుర్తులేదని స్పష్టపడింది.' మీరు.....మీరెవరు నేను..... నేను ....." అంటూ గాభరాగా చుట్టూ చూసింది. ఆరాటంగా లేవబోయింది. చటుక్కున ముందుకు వంగి ఆమె భుజాలు రెండు పట్టుకొని పడుకోబెట్టాను. 'ఆ..... ఆ లేవకండి ...... లేవకూడదు మీరు' అన్నాను. పక్కన వున్న నర్సు వచ్చి ఆమెని సరిగా పడుకోబెట్టీ దుప్పటి కప్పింది. భయంగా చూసింది రజియా, 'మరేం భయంలేదు మీకు అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. అంతే ఇప్పుడింకేం భయంలేదు. మీకేం ఫరవాలేదు నిశితంగా పడుకోండి' అన్నాడు మృదువుగా, నమ్మలేనట్టు చూసింది. దుప్పటిలోని ఆమె చెయ్యి కడుపు మీదికి వెళ్ళింది. తరువాత బాధతో పెదాలు బిగబట్టి ..... 'మీరు ..... మీ రెక్కడి నించి వచ్చారు. మా ఫ్రెండ్స్ "అంతా వుండేవారు. మీరు అట్టే మాట్లాడకండి- కదలకుండా పడుకోండి వాళ్ళు యిప్పటివరకు ఇక్కడే వున్నారు. ఇప్పుడే రూము కెళ్ళారు. మీరింకమాట్లాడకండి రెస్టు తీసుకోవాలి-" అంటూ "నేనిక్కడ హౌస్ సర్జన్ ని. మీకేం ఫరవాలేదు. నేను వచ్చి మధ్య మధ్య చూస్తుంటాను' అని కోరకుండానే అభయం యిచ్చి ఆమె మళ్ళీ కాస్త మగతలోకి జారగానే బయటకి వచ్చాను. పగలు డ్యూటీ నాది కాకపోయినా రెండు గంటల కొకసారి వచ్చి చూసేవాడిని, నా శ్రద్దాశక్తులని ఆశ్చర్యంగా చూస్తున్న నర్సులకు, తోటి కొలీగ్స్ కి నా ఫ్రెండు చెల్లెలు అంటూ చిన్న అబద్దం చెప్పాను, రజియాపట్ల నా కుతూహలం, ఆసక్తికి నాకే అర్ధం తెలియదు.
ఆస్పత్రిలో రజియావున్నపదిరోజులు నాకు పదినిమిషాలలాగ గడిచాయి. ఆమె అక్కడ అలా దేవకన్యలా బెడ్ మీద పడుకుంటే హాస్పిటల్ కే అందం, చైతన్యం వచ్చినట్లు అన్పించేది ఆ పది రోజులలో రజియా సిగ్గు, బెరుకు పోగొట్టుకుని నాతో చనువుగా మాట్లాడింది. ముందురోజు బాధలో వున్నా తరువాత కాస్త తేరుకున్నాక నా పట్ల కుతూహలం కనపరుస్తుందని నాకనిపించేది. ఆమె స్నేహితురాళ్లిద్దరూ ఆమెని తెగ హాస్యాలు చేసి ఏడిపిస్తూ ఆట పట్టించేవారు. ముందురోజు నేను యింటికెళ్ళి కాలవ్యవధి తీర్చుకుని మళ్ళీ వచ్చేసరికి ఆమె స్నేహితురాళ్ళిద్దరూ ఆమెని తెగ హాస్యాలు చేసి ఏడిపిస్తూ ఆట పట్టించేవారు. ముందురోజు నేను యింటికెళ్ళి కాలవ్యవధి తీర్చుకుని మళ్ళీ వచ్చేసరికి ఆమె స్నేహితురాళ్ళిద్దరూ ఇదేమిటి నీ రాజకుమారుడిక్కడ ప్రత్యక్షమయ్యాడు హఠాత్తుగా.'
"చెలీ నీ మనోభీష్టం నెరవేర్చుటకు ఆ దేముడే మిమ్మలనిట్లు కలిపి యుండెనేమో" అంటూ హాస్యం ఆడుతున్నారు. రజియా కోపం నటిస్తూ "నోరు మూసుకోండి లేకపోతే దవడ వాయిస్తాను" అంది. "పాపం ...... నిన్న రాత్రి నీ రాకుమారుడి మొహం చూడవే, ఏంగాభరాప్పడిపోయాడు. యిటు పరుగెత్తి, అటు పరుగెత్తి ఫోన్లు చేసి తెగ హడావిడి పడిపోయాడు. పాపం ఏడుపొక్కటే తరువాయి అనుకో ప్రతి పేషెంటు మీద యింత దయ, ఎటెన్ షన్ చూపిస్తే యీ ధర్మాసుపత్రులలో ధర్మం అనేది గగన కుసుమం అవక పోయేది కాదా!"
"బాగుందే నెచ్చెలీ నీ మాట అందహ్రూ మన రజియా అంత అందకత్తెలే ఆయన వుంటే డాక్టర్లందరూ పరుగులెత్తి పందాలు వేసుకుని సేవలు చేయగలరా" "అయితే యీ చిన్న దాని అందానికి ఆ సుందరాంగుడు బోర్లా పడ్డాడంటావు?"
"ఆహా కావలిస్తే ముందుపళ్ళు విరగ గొట్టుకున్నాడో లేదో చూడు. "అబ్బబ్బ ఏమిటే గోల అర్ధం పర్ధం లేకుండా యీ వాగుడేమిటి, పోండిక్కడనించి," "పోతనం, నీ రాజకుమారుడు డ్యూటీలో ప్రవేశించనీ" ఇంకా పక్కన నిలబడి వినడం సభ్యత కాదని లోపలికి ప్రవేశించాను. "ఏమిటి మీ స్నేహితురాలిని పాపం ఇబ్బంది పెడుతున్నారు" అన్నాను. వాళ్ళ మాటలు నేను విన్నానని గుర్తించగానే ముగ్గురు సిగ్గుతో తలలు దించుకున్నారు. రజియా అయితే కళ్ళు తెరవలేనట్టు మూసుకొని ఉండిపోయింది. "ఏం లేదు ...... నిన్న రాత్రి మీరు పాపం, చాలా శ్రమపడ్డారని, మీరుండబట్టి రజియాకు అంత తొందరగా వైద్యసదుపాయం తేలిగ్గా దొరికిందని చెపుతున్నాను" అంది రమ నవ్వుతూ. "కష్టపడ్డానని వప్పుకున్నారు గదా -మరి నా కష్టానికి బహుమతి ఏమి ఇవ్వదా మీ స్నేహితురాలు ......" కొంటెగా అడిగాను. "ఎడ్వాన్సు ముందే యిచ్చేసింది ......" శకుంతల చిలిపిగా అంది. ఆశ్చర్యంగా చూస్తూ "యేమిటది?" అన్నాను.
"అదే ....... అదే ...... లబ్ డబ్ ....... లబ్-డబ్ ....... అని కొట్టుకుంటుంది చూడండి ...... దాని పేరు మీ భాషలో గుండెకాయ ....... హృదయం ..... మససా ....... బాబోయ్" రజియా రమ చెయ్యి మీద ఒక్కగిల్లు గిల్లింది. కెవ్వుమంది రమ. రజియా సిగ్గుతో, కోపతో ఎర్రబడిపోయింది. వాళ్ళ చిలిపి మాటలు ఇంకా ఇంకా వినాలని వున్న బొత్తిగా పాపం రజియాని అలా ఇబ్బంది పెట్టడం బాగులేదనిపించింది. అందుకే టెంపరేచర్ ఛార్ట్ తీసి చదువుతున్నట్టు నటించాను, రమ, శకుంతల కొంటెగా నవ్వుతూ లేచి "రజియా కాలేజీ ఒకటి ఏడ్చింది మాప్రాణానికి సాయంత్రం మళ్ళీ వస్తాను. అయినా మేంలేని లోటు రాకుండా చూసుకుంటారులే డాక్టరుగారు సాయంత్రంవరకు ఆయన కేరాఫ్ ఎడ్రసులో వుండు. మేం వెడుతూ మీ అమ్మగారికో టెలిగ్రాం కొడతాం. బై ది బై డాక్టరుగారు మేం బీదవాళ్ళం - రజియా ఇవాల్సిన ఫీజు కింద ఆమె ఏం ముట్టచెపుతుందో, మీరేం పుచ్చుకుంటారో అది మీ ఇద్దరే చూసుకోండి, వస్తాం, టా- టా' అంటూ తుర్రుమన్నారు.
"బలేవాళ్ళే మీ స్నేహితురాళ్ళు, చాలా అల్లరి చేస్తారనుకుంటాను. మిమ్మల్ని తెగ ఆటపట్టించి ఏడిపిస్తున్నారు ....." రజియా సిగ్గుగా తల ఆడించింది. "ఎలా వుంది నొప్పి కాస్త తగ్గిందా." మృదువుగా అడిగాను. "బాగా నొప్పిగా వుంది ఇంకా కాళ్ళు వూరికే లాగుతున్నాయి" అంది నీరసంగా. 'ఈ రోజు కాస్త అలాగే వుంటుంది మరి" అన్నాను సానుభూతిగా. "మీ అమ్మగారు, నాన్నగారు వస్తారేమో లెండి రేపటికి -" ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతూ "అమ్మకి కబురు తెలియగానే వస్తుంది, నాన్నలేరు" "అలాగా, అసలు ఏవూరు మీది -" అంటూ మాటల్లో వాళ్ళ కుటుంబ వివరాలు లాగాను రజియా తండ్రి చాలా రోజుల క్రితమే పోయాడు. వాళ్ళది వున్న సంసారం గాదు రజియా అన్న ఒకడున్నాడుగాని పెళ్ళిచేసుకున్న భార్య మాటలకి లోబడి తల్లిని, సోదరిని చచ్చారో, బతికారో కూడా కనుక్కోడం మానేశాడు. రజియా తల్లి పాపం ఆ వున్న యింట్లో సగం అద్దెకిచ్చి నలుగురు పిల్లలకి చదువు చెపుతూ అతి కష్టం మీద రజియాని చదివిస్తుంది. రజియా ఈ ఏడాది కాంగానే ఉద్యోగం చేసి తల్లిని ఆదుకోవాలని ఆరాటపడుతుంది. కాని రజియా తల్లి ఏదన్నా సంబంధం చూసి పెళ్ళి చేసి తన బాధ్యత తీర్చుకోవాలని ఆరాట పడుతుంది. రజియాకి అందం తప్ప ఐశ్వర్యం లేదు. ఆ సౌందర్యమే సమస్త భూషణాల పెట్టు. రజియా అపురూప సౌందర్యానికి ఆకర్షితులై యిద్దరు ముగ్గురు రజియాను పెళ్ళాడతామన్నారు, కాని చదువు సంధ్య లేని ఆ రౌడీలని రజియా ఇష్టపడలేదు.