Previous Page Next Page 
శిక్ష పేజి 18


    ఈ వివరాలన్నీ మాటల్లో రజియా ద్వారా కొంత ఆమె తల్లిద్వారానే నేను చేసిన సాయం కూతురిద్వారా విని చాలా సంతోషపడ్తూ ...... దీవిస్తూ అమాయకంగా తనకష్టం సుఖం నాతో చెప్పుకున్న మాటలద్వారా కొంత తెలుసుకున్నాను. రజియా మీద నేను చూపిన శ్రద్దాశక్తులకి ఆమె పదే పదే కృతజ్ఞతలు చెప్పేది. కన్నకొడుకుకన్నా మిన్నగా సహాయం చేస్తున్నందుకు పొంగిపోయింది.
    మొత్తానికి రజియా ఆస్పత్రిలో వున్న ఆ పన్నెండు రోజులు రజియాతో నా పరిచయం మైత్రిగా, ఏదో తెలియని అనుబంధంగా మారిపోయింది. వంటరిగా కూర్చున్నప్పుడు రజియాపట్ల ఈ ఆకర్షణ నాకెందుకు అని పదేపదే ప్రశ్నించుకునేవాడిని. రజియా అందగత్తె, ఆమె సౌందర్యానికి ఆకర్షితుడనయ్యాను, కాని రజియా అందం స్వంతం ఎలా చేసుకోగలను. రజియాకి నాకు మధ్య జాతి, మతం, గౌరవం వగైరా అడ్డంకులు చాలా వున్నాయి. అవన్నీ అధికమించే ధైర్యసాహసాలు నాలో వున్నాయా! వంశ గౌరవానికి, పరువు ప్రతిష్టలకి ప్రాణంపెట్టే తల్లి - అన్నయ్య రజియాని మాయింటి కోడలుగా ప్రాణం పోయినా అంగీకరించరు. కేవలం ధనం-పరువు మాత్రమే అయితే ఎలాగన్నా అంగీకరింప చెయ్యొచ్చు కాని జాతి, మతం, సాంప్రదాయం అనేది చూసిన అతకని రాజియనై అంగీకరింపమని తనెలా అడగగలడు? అడిగినా అంగీకరించరు! అందరినీ కాదని రాజియని చేపట్టగలడా? అనవసరంగా మమతలు పెంచుకుంటే తరువాత తెంచుకోలేక బాధపడాలేమో ....... రాజియాతో పరిచయాన్ని అట్టే దూరం వెళ్ళనీయక పోవడం మంచిదేమో ఉహు రజియాని మరచిపోడం ఎలా? అనుక్షణం కళ్ళ ముందు నిలిచే ఆ సౌందర్యాన్ని కాదనుకోవడం సంభవమా? రజియా ముందు వెధవ జాతి, మతాలు, పరువు, ప్రతిష్టలు తృణప్రాయం కావా? రజియాకోసం ఆ మాత్రం వదులుకోలేవా? ప్రతిక్షణం సంశయంతో సందేహాలు, అనుమానాలు చుట్టుముట్టుతుండగా ఎటూ తేల్చుకోలేక పోయేవాడిని అయినా బొత్తిగా పది రోజుల పరిచయంతో యింత దూరం ఆలోచించడమేమిటి అన్పించేది. మరో క్షణంలో రజియా మనసులో అసలు ఏముందో- రజియా మొహం చూస్తూంటే ఆమె కూడా తనపట్ల ఆకర్షితురాలైనట్లే వుంది. ఏం తనకేం లోపం చదువు అందం, ఆస్థి అంతస్తు ఏదిలేదు. రజియా తనతో మాట్లాడుతుంటే ఆ కళ్ళలో వెలుగు, సిగ్గులకి అర్ధం ఏమిటి? తను గదిలోకి రాగానే ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోవడం, మాట్లాడుతుంటే తడబాటుకి వీటన్నింటికి అర్ధాలువేరే చెప్పాలా? ..... నా ఆలోచనల్లో నేనుండగానే రజియా ఆస్పత్రినించి డిశ్చార్జి అయ్యే రోజు రానే వచ్చింది. రజియా వెళ్ళిపోతుందంటే నా పెన్నిధి ఏదో దూరం అయిపోబోతున్నట్టు, నాలో చైతన్యాన్ని ఎవరో లాక్కుపోతున్నట్టు నిస్పృహ నిరాశతో గిలగిల లాడిపోయాను- రజియా, తల్లి యిద్దరూ అనేక విధాల పదేపదే కృతజ్ఞతలు చెప్పారు. రజియా ఇంకా కొన్నాళ్ళు రెస్టు తీసుకోవాలని, తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టరు చెప్పిందే మరోసారి చెప్పాను. రజియా మళ్ళీ కాలేజీకి వెళ్ళేవరకు తల్లికూడా తోడు వుండేట్టు నిర్ణయించాం అందరం కలిసి - రమ, శకుంతల యిద్దరూ హాస్యాలాడుతూ తల్లి వినకుండా రజియాను ఏడిపిస్తూ వీడ్కోలు తీసుకున్నారు. నాలో ఉత్సాహాన్ని రజియా తనతో తీసికెళ్ళి పోయింది భారంగా వీడ్కోలు చెప్పాను.
    రజియా వెళ్ళాక రజియా ఇల్లు ఎక్కడ వుందో కూడా అగడలేదని గుర్తువచ్చి నా మతి మరపుని తిట్టుకున్నాను. నాలుగురోజులు అవకముందే రజియాని చూడకుండా వుండలేకపోయాను. రజియా ఉనికి ఎలా తెల్సుకోవడం, ఎక్కడని వెతకను, ఏం చెయ్యను అనుకుంటూ పిచ్చివాడిలా అయ్యాను. చటుక్కున రజియా ఉమెన్సు కాలేజీలో చదువుతూందన్న సంగతి గుర్తువచ్చింది. ఆ మాట ఇన్నాళ్ళు గుర్తు రానందుకు చింతించాను. వెంటనే మరో ఆలోచనలేకుండా స్కూటరు ఎక్కాను. తీరా కాలీజీకి వెళ్ళాకగాని రజియా కొన్నాళ్ళపాటు కాలేజీకి రాదన్న నిజం గుర్తురాలేదు. ఉత్సాహం మీద నీళ్ళు దిమ్మరించినట్లయి నిలబడిపోయాను. అంతలో రమ, శకుంతల పుస్తకాలతో వస్తూ కనిపించేసరికి పోయిన ప్రాణం లేచివచ్చింది. ఆనందంగా 'హలో' అని పలకరించాను. ఇద్దరు ఒక్కక్షణం తెల్లబోయి "ఓ! రాకుమారుడిగారా! ఇలా దయచేశారేం. పాపం రాకుమారుడుగారు ఒక్కసంగతి మరచిపోయినట్లున్నారు. మానెచ్చెలి ఇంకా కొన్నాళ్ళు కాలేజీకి రాదుగా" అంది కొంటెగా రమ. వాళ్ళకి దొరికిపోయినందుకు కాస్త సిగ్గనిపించింది. తరువాత బుకాయింపుగా "లేదు రజియా కోసం కాదు, మీతో చిన్న పని ఉండి వచ్చాను." అన్నాను.
    "అబద్దాలాడకండి. పాపం రజియా ఎడ్రసు కావాలి గదూ! ఇంటి వివరం అడగనందుకు మీరూ, చెప్పనందుకు ఆవిడా యీ వారం రోజులుగా దిగులుపడిపోయారు. ఆఖరికి మేం గుర్తు వచ్చి ఇలా వచ్చారు" రమ నవ్వుతూనే కుండబద్దలు కొట్టినట్లు అనేసింది.
    వాళ్ళ దగ్గర ఇంకా దాచి లాభం లేదని నవ్వేశాను. "మీరు ఎలాగయినా తెలివైనవారు. పదండి యింటికి వెడదాం" అన్నాను. వాళ్ళు నవ్వుతూ నడిచారు.
    "మా రజియా డాక్టరుగారి బిల్లు చెల్లించకుండా వచ్చేసినట్లుంది. పేషెంటుని వెతుక్కుంటూ డాక్టరే బయలుదేరారు" అంది శకుంతల కొంటెగా "అవును ఫీజు కలక్టు చేసుకోవద్దూ! కాస్తా కూస్తాన వదిలివేయడానికి ......" నేనూ హాస్యంగా అన్నాను. ఏవో హాస్యాలాడుతూ మాట్లాడుకుంటూనే ఇల్లుచేరాం.
    ముందుగదిలో మంచంలో పడుకొని ఏదో చదువుకుంటున్న రజియా నన్ను చూడగానే కలవరపడిపోయింది. ఆక్షణంలో ఆమె మొహంలో భావం వర్ణించలేను. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు యింకా పూర్తిగా ఆరోగ్యం చేకూరని రజియా అతి మామూలుగా ఓ వాయిలు చీరలో వున్న రజియా  అప్పటి అందం ఎప్పటి కన్నా నన్నాకర్షించింది ఇద్దరం ఒక్కక్షణం మీరగ వారిని మరిచి చూచుకుంటూ వుండిపోయాం. నేనే ముందు తేరుకుని 'హలో ఎలా వున్నారు. వంట్లో బాగుందా' అని అడిగాను. మా మొహాలు చూస్తూ రమ, శకుంతల కొంటెగా నవ్వుతూ "వోయ్ దొంగా! డాక్టరు ఫీజు యీయకుండా ఎగగొట్టేశావుట, వసూలు చేసుకోవడానికి వచ్చారు. ఏమిస్తావో, ఎంతిస్తావో మీరు మీరు చూసుకోండి" అంటూ లోపలికి వెళ్ళారు. కొత్తదంపతుల్లా ఇద్దరం సిగ్గుపడుతూ వుండిపోయాము. కాస్సేపటికి రజియా కుర్చీ జరిపి 'కూర్చోండి' అంది తరువాత చాలా నెమ్మదిగా 'థాంక్స్' అంది... 'దేనికి' అన్నా ఆశ్చర్యంగ. 'చాల శ్రమపడి నన్ను గుర్తుంచుకొని వచ్చినందుకు' అంది బిడియంగ. 'రాకుండా వుండగలనని ఎలా అనుకున్నావు, ఈ వారం రోజులుగా ప్రతి క్షణం నీ దగ్గరికి రావాలనే అనుకున్నాను-" నిజం అన్నట్లు రజియా కళ్ళెత్తి చూసింది. "మళ్ళీ యింతవరకు మనం కలుసుకుంటామనుకోలేదు రజియా, నీ అడ్రసు అడగలేదు నిన్నెలా కలవాలో తెలియక యీవారం ఎంత చికాకుగా గడిపాననుకున్నావు" రజియా కళ్ళెత్తి చూసింది. ఆ కళ్ళల్లో కృతజ్ఞత, ఆరాధన, అభిమానం ...... ఇద్దరి మనసులు భావాలు తెలియచెప్పడానికి మాటలే అవసరం లేదు అన్పించింది ఆక్షణాన. రజియా పెద్దకళ్ళు తెలియ చెప్పిన భావం ఎలా మరచిపోగలను.

 Previous Page Next Page