రంగారావు -తేదీలవారీగా వ్రాసివున్న ఆ డైరీ రెండు పేజీలు చదవగానే ఆయనకు కుతూహలం ఇనుమడించింది. తారీకులు మరిచిపోయి ఓ కథలా ఆ డైరీ చదువుతూంటే ఓ దృశ్యకావ్యం చదువుతున్న అనుభూతితో తనని తాను మరిచి ఆరాటంగా చదవసాగారు.
ఈ రోజు నా జీవితం మరుపురాని మధురమాటలని రోజు రజియాని చూసిన క్షణంలో ఏదో అయిపోయాను. ఎంతటి అపురూప సౌందర్యం ఈరోజు బీచికి రావడం ఎంత అదృష్టం రాకపోతే రజియా నాకు కన్పించేదా అంతటి సౌందర్యం రాసి నాకు లభించేదా? ఎంత చిత్రంగా పరిచయం అయింది రజియా మనోహరమైన సంధ్యా సమయంలో కిలకిలలాడుతూ వచ్చారు ఆరుగు రమ్మాయిలు హాస్యాలాడుకుంటూ, కిలకిల నవ్వుకుంటున్న ఆ అమ్మాయిల అల్లరి వింటూంటే కొద్ది దూరంలో కూర్చున్న నేను చదువు సాగకపుస్తకం తెరిచి వూరికే చూస్తూ వాళ్ళమాటలే వింటున్నాను. హఠాత్తుగా ఆ అమ్మాయిలు సంభాషణ మరోరకంగా ఆరంభించారు. "నెచ్చెలీ - ఆ సుందరరాంగుడెవడే-"
"అమ్మకు చెల్లా ఆ సుందరాంగుని సోయగము చూచితివే ......" "సఖీ ఆ నూనూగు మీసకట్టు చూచితివా-మగసిరి ఉట్టిపడుటలేదే అతనితో." "చెలీ ఎక్కడివాడో ఎందుండి వచ్చినాడో ఆహ అతని పొందుగోరు భాగ్యమున కెవత్తెతపంబు చేయుచున్నదో గదా - " "చూచితివా సఖీ మన రాకుర్మార్తెని అతడెట్లు వీక్షించుచున్నాడో-" "ఆ జవనుడు మన చెలికి ప్రాణసఖుడయ్యిన నెట్లుండునే" సఖులారా-నోరు మూయండి- మతిభ్రమణం కలగలేదుకదా మీకు." "అవును సఖీ అతని సోయగము చూచినంతనే మతిభ్రమించినది మాకు ....." "అయినచో పోయి కట్టకట్టుకుని సముద్రంలో దుముకుట మంచిది."
"అట్లనకు సఖీ ఆ సుందరాంగునికి నీకు పరిణయముసేయు వరకైనా మా ప్రాణములు నిలుపుకొనవలె." "ఇదే నే పోయి అతడెవడో, ఎచటి వాడో - గాంధర్వుడో, నాగలోక నివాసియో, ఇంద్రలోక నివాసియో, భూలోక వాసియో, భూసురుడో, అసురుడో వాని కతంబు తెలుసుకొని వచ్చెద." ఒక అల్లరిపిల్ల లేవబోయింది. అందరిలో నిజంగా రాకుమారిలా వున్న అందమైన అమ్మాయి "చాల్చాలు నాటకం -యింక నోరు మూసుకోండి. అతనికి వినపడగలదు." కసిరి చేయిపట్టిలాగి కూర్చోపెట్టింది ఆ అమ్మాయిని. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్న ఆ మాటలు నాకు వినపడలేదనుకుంటే అది వారి పొరపాటే - వాళ్ళ చిలిపి మాటలకి అల్లరికి నవ్వు వచ్చింది. అల్లరి ఈ వయసులో కాక మరెప్పుడు అనుకున్నాను. వాళ్ళు ఆ మాటలన్నీ నా గురించే అన్నారని అర్దమైంది. వాళ్ళు నన్ను అల్లరి పట్టించినట్లే నేనూ చిన్న తమాష చెయ్యాలన్న చిలిపి ఊహ వచ్చినట్టు ఫోజు పెట్టి ఆహ-ఏమీ సౌందర్యము, దివినించి దిగివచ్చిన దేవకన్య వయి వుండనీవు, ఇట్టి సౌందర్యరాసిని పొందని యీ జన్మ వ్యర్ధంబు గాదే, యీమె కతంబెయ్యదో తెలిసికొనెద. స్వగతం పైకి అంటూ వాళ్ళవైపు చూశాను. వాళ్ళందరూ నోరు తెరిచి మూయడం మరిచిపోయాయి. ఒక్క క్షణం మరుక్షణంలో అందరి మొహాలు సిగ్గుతో కందిపోయాయి. తడబడి పోయారు అది గమనించనట్లే.
"ఇష్టసఖులారా! ఈ సుందరాంగి, ఈ రాకుమార్తె ఎవతయా తెల్పెదరా- ఔరా! ఈమెని చూచినంతనే నా ఒడలు పులకించుచున్నదే. చెలికత్తెలారా మీ సఖీ వివరములు తెలుసుకొననిదే నా మది శాంతించదు. కాన చెప్పినన్ను చరితార్ఘ్దుడిని సేయరే" చేతులు జోడించి వినయంగా అన్నాను. అందరూ బిక్కచచ్చిపోయి చూస్తూండిపోయారు.
"అహ! జననీ! ఏమి నీ సోయగము! నిన్ను పొందని ఈ నా జన్మంబేల? ఏదేశపు రాజకుమార్తెవో! ఏదివినించి దిగివచ్చిన దేవకన్యవో! నాపై కృప చూపవా? నీ కృపా వీక్షణంబు నాపై బరిపి నాయీ మదన తపము చల్లార్చవా- చెలులారా! నన్నిట్లు మదనాగ్నికి లోనుచేయుట మీకు న్యాయమా? మీ నెచ్చెలి పొందు నాకు సమకూర్చరా ఓ జననీ, ఓ సుందరాంగీ! నిన్ను చూసిన క్షణమే నీకు దాసుడనయినాను. ఈ క్షణముందే ఈ ప్రకృతి సాక్షిగా నిన్ను గాంధర్వ వివాహమాడెద, నీ అంగీకారము తెల్పి నన్ను కృతార్దుడిని సేయవా?" కావ్య నాయకుడిలా పోజుపెట్టి ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాను. అందరి మొహాలు సిగ్గుతో ఎర్రబడిపోయాయి. ఏం చెప్పాలో తెలియక కలవరపడిపోయారు. ముఖ్యంగా అందమైన ఆ అమ్మాయి నా విపు చూడలేనట్టు తల భూమిలోకి వాల్చేసుకుంది అమ్మాయిలు అందరూ ఒకరివైపు ఒకరు చూసుకున్నారు చటుక్కున ఆ అమ్మాయి హఠాత్తుగాలేచి పరుగుపెట్టింది. వెంటనే కర్తవ్యం అర్ధమైనట్టు మిగతా అంతా లేచి పరిగెత్తారు. నవ్వుకున్నాను. ఆ సాయంత్రం జరిగిన తమాషాకి మనసునిండా ఏదో ఆనందం ఆవరించింది. అంత సంతోషంలో ఆ అమ్మాయిలెవరో ఎక్కడి వారో ముఖ్యంగా ఆ అందమైన అమ్మాయి ఎవరో అన్న సందేహాలకి జవాబు దొరక్క కాస్త నిరుత్సాహపడ్డాను.
...... ఆ తరువాత నెల రోజులు కనిపించిన ప్రతి ఆడపిల్ల వంక చూసేవాడిని ఆశగా, ఆరాటంగా ఆ అందమైన అమ్మయికోసం. రోజులో ఏదో క్షణం ఆమె గుర్తుకురాక మానేది కాదు. ఆఖరికి నా మొర భగవంతుడు ఆలకించాడు ఆ రాత్రి సర్జన్ తో వార్డ్ డ్యూటీలో వున్నాను. క్యాజువాలిటీ నించి ఎమర్జన్సీ అపెండిసైటిస్ కేసు వచ్చింది. పేషంటుని అపస్మారక స్థితిలో మోసుకు వచ్చారు. ఆ కేసు ఎవరో గాదు నాదేవకన్యే ఒక్కక్షణం కర్తవ్య విమూడుడిలా నిలబడిపోయాను. ఆ క్షణంలో ఆ అమ్మాయి ప్రమాద పరిస్థితికి కలిగిన ఆందోళన కంటే తిరిగి ఆమె ఈ విధంగా కన్పించిన ఆనందం ఎక్కువైంది. ఆ తరువాత చకచక పరీక్షలు, సర్జన్ కి ఫోను-ఆపరేషన్ థియేటర్ రెడీ చెయ్యడం అంతా యాంత్రికంగా జరిగిపోయింది. ఆ అమ్మాయిని తీసుకువచ్చిన యిద్దరు మిత్రురాండ్రు ఇచ్చిన సమాచారం. ఆ అమ్మాయి ఉనికిని తెలియపరిచింది. ఆమె పేరు రజియా ఉమెన్స్ కాలేజీలో బి.యస్సీ చదువుతుంది. హాస్టలు నచ్చక ఒకే వూరివారయిన ఆ ముగ్గురు అమ్మాయిలు కలిసి ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇదివరకు అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తే ఏదో అనుకున్నారు.
ఇవాళ ఉదయం నుంచి కడుపునొప్పి వాంతులతో బాధపడింది. అజీర్ణం అనుకుందట సాయంత్రం నించి జ్వరం మొదలై రాత్రి అయ్యేసరికి వంటిమీద తెలివిలేని స్థితిలో పడగానే ఆ ఇద్దరమ్మాయిలు గాభరాపడి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ కథవిని అంత నిర్లక్ష్యంగా ఆలశ్యం చేసినందుకు మందలించాను. ఆ అమ్మాయిలు ఇద్దరూ అక్కడ హౌస్ సర్జన్ గా ఎదురైన నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయి మొహాలు చూసుకున్నారు. నన్ను గుర్తించి సిగ్గుగా నవ్వుకుని కళ్ళతో మాట్లాడుకోడం నా కంటబడకపోలేదు.
ఆపరేషన్ చేస్తున్నంతసేపు నా మనసు మనసులో లేదు. యాంత్రికంగా బాస్ కి అసిస్టు చేస్తున్నా ఆలోచనలు, నా దృష్టి అంతా రజియామీదే, రజియా! మనిషిలాగే పేరు అందమైనది, అందం ముస్లిం వనితల సొత్తు అంటారు. నిజంగా రజియా అంత అందగత్తె, ఆ గులాబిరంగు పల్చని పొత్తికడుపు మీద కత్తితో గాటు పెడ్తుంటే నా హృదయం విలవిలలాడింది. తెలివిలేకుండా మూసుకున్న కళ్ళకింద పొడుగాటి కనురెప్పలు విసనకర్రలా పరుచుకున్నాయి. అసలే గులాబీ రంగులో వుండే చెక్కిళ్ళు జరతీవ్రతకి ముదురు గులాబీరంగు దాల్చాయి. ఆ కోమలమైన చేయి చేతిలోకి తీసుకోగానే వణికాను. ఆ పొడుగాటి వేళ్ళు- అందంగా కత్తిరించిన ఆ గోళ్ళు-మెత్తని పూవులాంటి చెయ్యి అవసరానికి మించి ఎక్కువసేపే పట్టుకున్నాను మొత్తానికి రజియా కంటపడిన క్షణం నించి నలో ఏదో సంచలనం బయలుదేరింది.