"అన్నీ చెప్పావు గానీ ఒక్కసంగతి చెప్పడం మర్చిపోయావు"
మారిన అతని గొంతు వినగానే హఠాత్తుగా భయం కలిగింది అమూల్యకి. "ఏమిటి?" అంది అస్పష్టంగా.
"కలైమణి వివరాలు నీకెలా తెలుసు?"
ముచ్చెమటలు పోశాయి అమూల్యకి. ట్రాప్ అయిపోయింది! కేసు సాల్వ్ చెయ్యగలిగానన్న సంతోషంతో నోరు జారిపోయింది.
"మిస్టర్ రాజు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను."
"రాజు మాటలు నేనూ విన్నాను. రాజు మాట్లాడిన మాటల్లో కలైమణి గురించి ఇన్ని వివరాలు లేవు."
తలదించుకుని చేతిగోళ్ళవైపు చూసుకుంది అమూల్య. ఏం మాట్లాడాలో తోచలేదు. గుండె ఎక్స్ ప్రెస్ రైలులా శబ్దం చేస్తోంది.
"కమాన్! నిజం చెప్పు! కమ్ అవుట్ క్లీన్!"
మౌనంగా ఉండిపోయింది అమూల్య. సో! దిసీజ్ ద ఎండ్! తన జీవితానికి ముగింపు ఇంత త్వరగా వచ్చేస్తుందనుకోలేదు తను. చిత్రవధ చేస్తారా తనని? పేగులు తీసి రాబందులకు వేస్తారా? బ్రిలియంట్ లాయరు కావలసిన తను బలవంతపు చావు చస్తుందా?
"నీకెలా తెలుసో నాకు తెలుసు!" అన్నాడు నిఖిల్ కఠినంగా. "తరుణ్ చెప్పాడు నీకా వివరాలన్నీ! అవునా? తరుణ్ కోయంబత్తూరు వెళ్ళిరావడం నాకు తెలుసు!"
భయపడిపోయే స్థితిని దాటిపోయింది అమూల్య మనసు. ఈ కుట్రలు, కుతంత్రాలూ, ఎత్తులూ, పైఎత్తులూ, ఒకళ్ళ కదలికలని మరొకళ్ళు వెయ్యి కళ్ళతో గమనించడాలూ, అన్యాయం, ఆక్రోశం, ఆరాటం, పోరాటం.
ఆమెకి తల తిరుగుతున్నట్లు అనిపించింది.
"నిజం చెప్పు! నువ్వు తరుణ్ పంపిస్తే నాదగ్గర వచ్చి చేరావ్, నా రహస్యాలు చేరవెయ్యడానికి! అవునా?"
తల ఎత్తి అతని కళ్ళలోకి సూటిగా చూసింది అమూల్య. మంచు ముక్కల్లా ఉన్నాయి అతని కళ్ళు. వాటిలో ఉద్వేగం లేదు. ఆర్ద్రతలేదు. ఏ భావమూ లేదు. మనసులేని మరమనిషి ఒకడు గాజుకళ్ళతో తనని చూస్తున్నట్లు ఉంది.
"అవును" అంది నిదానంగా.
ఆ మూడు అక్షరాలూ తన బతుకుని మూడుముక్కలు చేసెయ్యవచ్చని తెలుసు ఆమెకు.
కుర్చీలోనుంచి లేచాడు నిఖిల్. ఒక్కొక్క అడుగే వేస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు. మృత్యుదేవతలా తనవైపు నడిచి వస్తున్న నిఖిల్ వైపు వణికిపోతూ చూసింది అమూల్య.
ఏం చేస్తాడు తనని ఇతను! ముక్కలు ముక్కలుగా నరికించి కాకులకీ గద్దలకీ వేయిస్తాడా? కాన్ సన్ ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉన్న టబ్ లో ముంచేస్తాడా? ఏం చేస్తాడు?
దగ్గరగా వచ్చి ఆగాడు నిఖిల్.
"తరుణ్ పంపిస్తే వచ్చానన్నావు నువ్వు! ఆల్ రైట్! కానీ పులిగుహలోకి రావడం మాత్రమే నీఇష్టం! ఇక్కడ నుంచి నిన్ను వెనక్కి పంపాలా వద్దా అనేది నాఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అవునా?"
ఒక్కసారి దీర్ఘంగా శ్వాసతీసుకుంది అమూల్య. అయితే ఇతను తనని చంపబోవడం లేదన్నమాట!
కానీ చావుకంటే ఘోరమైన శిక్ష తనకోసం ఎదురుచూస్తోందని గ్రహించలేక పోయింది అమూల్య.
"నువ్వు ఇక్కడే బందీగా ఉండిపోబోతున్నావ్! శాశ్వతంగా!" అన్నాడు నిఖిల్.
ఉలిక్కిపడింది అమూల్య. శాశ్వత బందీనా? ఈనేరస్తుల మధ్య?
అంతకంటే చావే నయమేమో!
అతి ప్రమాదకరమైన ప్లాస్టిక్ బాంబు పేల్చినట్లు ఇంకో మాటకూడా చెప్పాడు నిఖిల్.
"నాకు ఇరవై ఎనిమిదేళ్ళొచ్చాయ్! ఊపిరి పీల్చుకునే వ్యవధి కూడా ఉండదు నాకు. అందుకనే ఇన్నాళ్ళూ పెళ్లి చేసుకోలేదు. నిన్ను చూశాక పెళ్ళి ఆలోచనొచ్చింది నాకు. చాలా సెక్సీగా ఉంటావ్ నువ్వు! నిజమైన ఆడదానికి ఉదాహరణలా."
వంటిమీద వంద గొంగళి పురుగులు పాకుతున్నట్లు వళ్ళు జలదరించింది అమూల్యకి.
ఈ రౌడీ, ఈ గూండా, ఈ సంఘవిద్రోహి తనని పెళ్ళి చేసుకుంటాడా? అదీ కూడా తన తెలివితేటలచేత ఆకర్షింపబడో, తన మంచితనం చూసో, తన ప్రవర్తన మెచ్చుకునోకాదు.
తను సెక్సీగా ఉంటుంది కాబట్టి!! తనేం అంగడి బొమ్మా, నచ్చితే స్వంతం చేసుకోవడానికి?
పుండుకి కారం రాసినట్టు అతను ఇంకో మాట కూడా అన్నాడు.
"ఈ రెండు మూడు నెలల్లో ఎప్పుడన్నా టైం దొరికితే పెళ్ళి చేసుకుంటాను నిన్ను!"
ఒళ్ళు భగభగమండింది అమూల్యకి. పెదిమలు కొరికిపట్టి కోపాన్ని ఆపుకుంది. అయితే ఆమెకు మరొకటి కూడా తట్టింది. ఈ పెళ్ళి ప్రమాదం వెంటనే ముంచుకు రాబోవటం లేదు. రెండు, మూడు నెలలు! చూస్తుంది తను! రెండు మూడు నెలల తర్వాత కూడా పరిస్థితులు ఇలాగే ఉండబోతాయా? టైం దొరికితే అతను పెళ్ళి చేసుకుంటాడుట! టైం చూసి తనే చావుదెబ్బ తీస్తుంది. పెళ్ళి మేళాలకంటే ముందు చావు బాజాలు వినవలసి వస్తుంది ఈ ముఠా! తనేం అల్లాటప్పా అమ్మాయికాదు. బ్రిలియంటు లాయరు. ఎదుటి వాళ్ళ ఎత్తులకి పై ఎత్తులు వెయ్యడం తన వృత్తి! తన హాబీ!
ఆమె ఆలోచనల్లో ఉండగానే, వెళ్ళొస్తానని కర్టెసీ కోసమన్నా చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నిఖిల్.
అప్పుడు ముందుకు వచ్చాడు లాయర్ బిల్డింగ్ వాలా.