"బాగుంది. గుహలోపల మనిషి వుందనుకున్నాను. ఏది ఏమైనా చూడాలనిపిస్తున్నది. నీకు వీలుంటే ఉదయం పూట వచ్చి చూద్దాము"
"అలాగే. అబ్బ ఇక్కడనుంచి అటు చూడరా ఊరు పొలాలు అద్భుతంగా కాన వస్తున్నాయి. చూడ రెండు కళ్ళూ చాలవనుకో."
సూర్యారావు నవ్వాడు. "ఎప్పుడూ చూసే నాకు నీవు చెప్పే అందాలు తెలియవుగాని, ఇక్కడ అక్కా చెల్లెలి గుహ వుంది చూపిస్తాపద" అన్నాడు.
"అక్కా చెల్లెళ్ళ గుహ అంటున్నావు వాళ్ళూ దేవతలనేనా?"
"ఉహూ. పక్క పక్కనే వున్న రెండు గుహలు ఇసుమంత బేధంలేకుండా ఒకేలాగా వుంటాయి. కనుక మేమే ఆపేరు పెట్టాము. ఇదిగో ఇదే ఆ గుహ" అన్నాడు సూర్యారావు ఓ గుహముందు నిలిచి.
"లోపలికి వెళ్ళొచ్చునా?" అడిగాడు కైలాసగణపతి.
"చాలా పెద్దగుహ. రెండు గదులంత ఉంది. అరె! ఇక్కడ నీటిపాయకూడా వుందే. ప్రాణం హాయిగా వుంది కాసేపు కూర్చుని వెళదాం."
"ఏం కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా?" సూర్యారావు బండమీద కూర్చుంటూ అడిగాడు.
"ఈ మధ్య కొండలు ఎక్కలేదు కదా కాళ్ళు నొప్పులు పుట్టక ఏం చేస్తాయి? పైగా ఈ మధ్యనే కాళ్లు నొప్పులు కూడా బైలుదేరాయి."
"మరి రోజూ కొండ ఎలా ఎక్కుతావు?
"కొండ మొత్తం ఎక్కక్కరలేదు. అటు తిరిగి ఇటు తిరిగికాస్త ఎక్కితే చాలు. రోజూ ఇంతపైకి ఉహూ రాను."
"అమ్మయ్య కొండ ఎక్కక్కరలేదన్నమాట. ఇప్పుడు నా ప్రాణం హాయిగా వుంది."
సూర్యారావు ముఖంలో రిలీఫ్ కనపడింది.
కైలాసగణపతి నవ్వుకున్నాడు.
"ఈ కొండకి ఆనుకుని అటుసైడు ఇంకో కొండవుంది. రెండింటి మధ్యలోయ ఉంది. ఆ లోయలో మాత్రం బత్తుగా అడవిలాగా చెట్లు వుంటాయి. ఇటువైపు కొండ ఎక్కటం చాలా తేలిక. అటుఅలాకాదు. పెద్ద పెద్ద చట్టుబండలు వున్నాయి. పైగా అవి నిలువుగాను, మరీ ఏటవాలుగాను వుండటంవల్ల కొండ ఎక్కటం చాలా కష్టం." సూర్యారావు కబుర్ల మధ్యలో చెప్పాడు.
"ఆ మూల ఏమిటి ఎవరో ఏనాడో వంటచేసుకున్నట్లు గుర్తుగా మసి వుంది?" గణపతి ఓ మూలకి దృష్టి సారించి అడిగాడు.
"ఈ కొండ మహాపర్వతంకాకపోయినా, దీనికో చరిత్ర, ఓ వంద కధలు వున్నాయి. నక్స్ లైట్లు, కమ్యూనిస్టు ఉద్యమం రోజుల్లో కమ్యూనిస్టులు పోలీసులకి దొరక్కుండా ఈ కొండ గుహల్లో దాక్కునికాలం గడిపేవారు. పోలీసులు పసిగట్టి పట్టుకోవటానికి వస్తే కొండకి అటువేపు దిగి లోయలోకి వెళ్ళి మాయం అయ్యేవారు."
"కొంపదీసి వాళ్లు ఇప్పుడు కూడా వున్నారేంటి?"
"ఆ పార్టీ ఇంకా బతికేవుందని పేపరులో చదివినప్పుడు అనుకుంటాను. రాజ్యం కోల్పోయిన రాజుల్లాగా పబ్లిక్ గా వాళ్ళు ఊళ్ళల్లో అక్కడక్కడ తిరుగుతుంటే పోలీసులకేమి పట్టింది వాళ్ళని పట్టుకోటానికి! అలాగే వాళ్ళకి దాక్కొనే అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు వుండీలేనివాళ్ళకింద లెక్క"
"బందిపోట్లు లాంటివాళ్లు దాక్కోవటం లాంటిది వుందా?"
"ఉహూ. మాకు దొంగల భయం అన్నదే లేదు. ఇంక బందిపోట్లు దాకా ఎక్కడ? గొడ్లుకాచే కుర్రాళ్లు పుల్లలు ఏరుకోవటానికి ఒకరూ ఇద్దరూ తప్పించి ఎవరూ కొండ ఎక్కరు. సీతాఫలాలు చెట్లకి ఇప్పుడే పడుతున్నాయి. అవిపెద్దయి పక్వానికి వచ్చేసమయంలో పిల్లకాయలు పైకెక్కి కోసుకొస్తారు. అక్కడక్కడ తేనెతుట్టెలు వున్నాయి. అవి దులుపుకోటానికి పెద్దవాళ్లు నూటికో కోటికో వస్తారు అంతే."
"ఈరోజుకి ఇంకా పైకి ఎక్కలేనుగాని వెళ్ళిపోదాం రెండు మూడు రోజులు నీవు తోడువచ్చి కొండ అంతా చూపించరా సూరీడూ! ఆ తర్వాత ప్రతిరోజూ నేనే వచ్చి-
కైలాసగణపతి నోరుజారి పరిశోధన అంటాడేమో అని కంగారుపడిపోయి "షికారుకి షికారుకి వస్తావు అంతే కదూ?" అన్నాడు సూర్యారావు.
"షికారుకి కాదు కొండగాలి మేయటానికి వస్తాను. పైరుగాలికన్నా కొండగాలి ఆరోగ్యానికి పైగా నాబోటి రోగిష్టివాడికి చాలా మంచిది తెలుసా" అన్నాడు కైలాసగణపతి.
"అవును" అని అమ్మయ్య అనుకున్నాడు పరిశోధన మాట ఎత్తనందుకు ఆనందంతో సూర్యారావు.
"ఇంక లేద్దాము"
"అలాగే. రేపు ఇంకా పెందరాలే వద్దాము.
"సరే." అన్నాడు సూర్యారావు.
ఇరువురూ పక్కగుహకూడా చూసి కొండ దిగటం ప్రారంభించారు.
12
"పిండతైలం రాస్తావా?" సూర్యారావు అడిగాడు.
"పిండతైలమా! అదేమిటిరోయ్ సూరీడూ! అసలు ఏ జీవి తాలూకా పిండం అది?" కైలాసగణపతి మోకాలు నొక్కుకుంటూ అడిగాడు.
"మందుపేరు పిండతైలం. ఆయుర్వేదం మందు. కీళ్ళ నొప్పులకి అద్భుతంగా పనిచేస్తుంది. మహాయోగ రాజగుగ్గిలం మాత్రలు మింగుతూ ఈతైలం రాస్తే వాత నొప్పులు కీళ్ళ నొప్పులు ఉష్ కాకీ అంటూ ఎగిరిపోతాయి."
"నీవు చెప్పింది నమ్ముతున్నాను. కానీ నాకు పనిచేయవు."
"అదేమి! నీకొచ్చింది స్పెషల్ జబ్బా?"
"దీనిని కొండవాతం అంటారు."
"అదేమిటిరోయ్! ఈపేరు నేను ఎప్పుడూ వినలేదే?" ఆశ్చర్యంగా అడిగాడు సూర్యారావు.
"నువ్వు వినకపోవచ్చు. నాకు బాగా తెలుసు. అనుభవం నాది కదా! కొండంతా తిరిగిచూద్దామనే ఉత్సాహంతో వరసగా మూడు రోజులబట్టీ నిన్ను వెంటబెట్టుకు వెళ్ళి తిరిగా కాదా! ఆ ఉత్సాహంతో వయసు మాట మరచిపోయి కుర్రాడిలాగా ఎగిరి గంతులు వేసేసరికి కాలిపిక్కలు మోకాళ్ళు ఏ మాత్రం మొహమాటం లేకుండా పట్టెశాయి. దీనికి కొండవాతం అని పేరు పెట్టానులే" నవ్వుతూ చెప్పాడు కైలాసగణపతి.