"విషయం టోటల్ గా అదీ- అర్థం అయ్యింది కదా- వస్తాను మరి-" మేనేజర్ వెళ్ళిపోయాడు.
సూర్యం దీర్ఘాలోచనలో పడ్డాడు.
* * * *
శక్తి నిద్రలేచి స్నానం చేసి హాల్లోకొచ్చేసరికి తండ్రి రడీ అవుతూ కనిపించాడు.
"ఎక్కడికి బయలుదేరుతున్నారు?" అడిగాడు శక్తి.
"ఇంకెక్కడికి- షాప్ కి బయలుదేరుతున్నారు. నువ్వు వెళతావని చెబుతున్నా విన్పించుకోవటం లేదు." బియ్యం ఏరుతున్న తల్లి అంది బాధగా.
"మీరు ఆరోగ్యం పూర్తిగా కుదుట పడేవరకు నేనే వెళతాలెండి. మీరు రెస్ట్ తీసుకోండి" అన్నాడు శక్తి.
కిరాణా కొట్లో పద్దులు చూడటానికి వెళ్ళటం నిజానికి శక్తికి ఇష్టం లేదు. అలా అని తల్లిని, తండ్రిని బాధపెట్టలేక ఆ నిర్ణయాని కొచ్చాడు.
శక్తి నోటి నుంచి ఆ మాట వస్తుందని ఊహించని వాళ్ళు సంతోషంతో పొంగిపోయారు.
చెల్లి శారద దిగ్భ్రాంతిగా చూసింది.
కాగీ తాగేసి వాళ్ళలా చూస్తుండగానే బయటకెళ్ళిపోయాడు శక్తి.
* * * *
శక్తి అంత ఉదయమే షాప్ కొస్తాడని ఊహించలేదు సూర్యం.
ఒకింత సేపటి వరకు సూర్యం ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు.
"లాస్ట్ ఇయర్ ఎకౌంట్స్ అయిపోయాయి. ఇవ్వాళేం చేయమంటారు?" మౌనంగా తనకేసే చూస్తున్న సూర్యాన్ని ఉద్దేశించి అడిగాడు శక్తి.
మనిషొకటి తలిస్తే, భగవంతుడు మరొకటి తలుస్తాడట. మనచేతుల్లో ఏమీ లేదనే విషయం మనకి ఎప్పటికప్పుడు తెలుస్తూనే వున్నా- మనం మళ్ళీ మళ్ళీ మన ప్రయత్నం చేస్తూనే ఉంటాం... నీ ఆసరాతో నా వ్యాపారాన్ని పెంచుకోవాలని... నీకూ ఒకసారి చూపించాలని తలచాను.... కాని పరిస్థితులు అనుకూలంగా లేవు. ముసుగులో గుడ్డులాటెందుకు... నేను వ్యాపారస్తుడ్ని. నాకెవరితోనూ శతృత్వం వుండకూడదు. నేనెవరికీ ప్రత్యర్థిని కాకూడదు. ఉంటే అది వ్యాపార సూత్రమే కాదు. నీకు, బాలచంద్రకు మధ్య ఏ విషయంలో గొడవ జరిగిందో నాకు తెలీదు. కాని నిన్ను నా దగ్గర పని చేయించుకోవద్దని తాఖీదు పంపాడు బాలచంద్ర. నేను వినక తప్పదు. వాళ్ళ మాటలని మన్నించక తప్పదు. వాళ్ళకి అధికారముంది, బలముంది, డబ్బుంది. మరేమనుకోకు, ఒక ఆప్తుడిగా నా సహాయం ఎప్పుడూ నీకుంటుంది.
ఆవేశం, కోపం, గొడవలు, కొట్లాటలు సినిమా కథలకి పనికి రావొచ్చు.
రాజకీయాలకు అవసరం కావొచ్చు. కాని మనిషి ఎదుగుదలకు వ్యాపారానికి లాకీ కాదు, ఈ వయస్సులో హడావిడి చేయటం... పెద్దవాళ్ళను ఢీ కొనటం గొప్పగానే అనిపిస్తుంది. సమాజంలో హీరోగా గుర్తింపు కూడా లభించవచ్చు. ఆ పైన జీవితం...? చెప్పలేం అది ఏ దరి చేరుస్తుందో? మన శక్తి యుక్తులు కొట్లాటలు, గొడవలకు, కోర్టులకు ఖర్చు పెడితే మిగిలేదేమిటి? బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటము మంచిది. ఇంతకంటే మరేం చెప్పలేను..." అన్నాడు సూర్యం గిల్టీగా తల వంచుకొని.
శక్తికి అంతా అర్థమైపోయింది.
బాలచంద్ర తొలిదెబ్బ తన మీద పడింది. అతనికి తెలీకుండానే, అతని కళ్ళు ఎరుపెక్కాయి. ఆ కోపాన్ని స్పష్టంగా గమనించాడు సూర్యం.
"నేనూ వ్యక్తిత్వం ఉన్నవాడినే... మనుష్యుల మంచి చెడ్డలు తెలుసు. అయినా ఒక వ్యాపారస్థుడిగా చెడుతో సర్దుకోవాలంటే తప్ప, విరోధం తెచ్చుకోకూడదు. నీలో ప్రతిభ వుంది. దానికి పదునుంది. దానిని ముఖ్యంగా నీ కోసం ఉపయోగించుకో. పైకొస్తావ్... చెడ్డవాళ్ళని బాగుచేయటం మంచిదే. అది వ్యాపారం కాదు... సమాజ సేవ. సమాజంలోని చెడుని కడిగేయటానికి నువ్వేం శానిటరీ ఇన్ స్పెక్టర్ వి కావుగా. నా మాట విని ఈ ఊరు నుంచి ఎటన్నా వెళ్ళిపో... బాగుపడ్డాక తిరిగిరా-" సూర్యం బాధపడుతూ అన్నాడు.
సమాధానం చెప్పకుండా షాప్ లోంచి బయటకొచ్చాడు శక్తి.
అతని మనసంతా కకావికలమయి పోయింది. తనింట్లో ఏం చెబుతాడు? ఈ విషయం తెలిస్తే తల్లి బాధపడుతుంది. తనది చూడలేడు.
అసలు దీనికంతటికి కారణం బాలచంద్ర... ఆ బాలచంద్రను ఊరికే వదలగూడదు. వాడికి తగిన గుణపాఠం చెప్పితీరాలి. తప్పదు. ఆ నిర్ణయానికొచ్చాక పాత బస్టాండ్ కొచ్చాడు.
అప్పటికే సత్తార్ హోటల్ దగ్గర ఒంటికాకిలా నించుని ఉన్నాడు రమణరావు.
వస్తూనే జరిగింది చెప్పాడు శక్తి.
నిట్టూర్చాడు రమణరావు.
"నిట్టూర్చి ఊరుకుంటే మనమీ ఊళ్ళో తలెత్తుకు తిరగ్గలమా?"
"మరయితే ఏం చేద్దామంటావ్?" రమణరావు అడిగాడు.
"ముందు మన వాళ్ళనందర్నీ తీసుకురా... ఆ పైన ప్లాన్ ఆలోచిద్దాం" సీరియస్ గా అన్నాడు శక్తి.
"అన్నీ ఆలోచించే అంటున్నావా?" భయంగా అన్నాడు రమణరావు.
"ముందు నువ్వెళ్ళు" కోపంగా అన్నాడు శక్తి.
రమణరావు సైకిలెక్కాడు.
అరగంట గడిచింది.
సుబ్రహ్మణ్యం, జగపతి, ఇంకా ఇద్దరు ముగ్గురు మిత్రబృందం పాత బస్టాండ్ కొచ్చారు.
అప్పటికే బాలచంద్రకి ఎలా బుద్ధి చెప్పాలో ఒక ప్లాన్ ఆలోచించాడు శక్తి. అదే చెప్పాడు వాళ్ళకి.
"నాకు భయంగా వుందిరా" రమణరావు అన్నాడు వణికిపోతూ.
"పిరికి వెధవా.... మనం ఎత్తుకెళ్ళి నాశనం చేసేది బ్లూ ఫిల్మ్ రీల్స్ ని, అది చట్ట విరుద్ధం కాదా? సినిమాల మధ్యలో బ్లూఫిల్మ్స్ వేస్తున్నాడని కంప్లయింట్ చేస్తే ఎవరన్నా పట్టించుకుంటారా? లేదు. వాడికంత పలుకుబడి వుంది. వాటిని లేపేసామనుకో... ఇటు ఎవరికీ కంప్లయింట్ చేసుకోలేడు. అటు వాటిని తెచ్చిన దగ్గర నష్టపరిహారం కట్టకుండా ఉండలేడు...." శక్తి అన్నాడు పళ్ళు నూరుతూ.
"ఈ విషయం సీరియస్ అయిపోతుందేమో..." జగపతి నర్వెస్ గా ఫీలవుతూ అన్నాడు.