Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 2 పేజి 16


    2. పర్జన్యుడు వృక్షములను నష్టపరచును, రాక్షసులను వధించును. మహావధరూపమున సమస్త భువనములను భయ కంపితులను చేయును. గర్జించు పర్జన్యుడు పాపులను సంహరించును. అందువలన నిరపరాధులు సహితము వర్షము కురిపించు పర్జన్యునివద్ద భయభీతులయి పారిపోవుదురు.

    3. రథికుడు కశాఘాతమున అశ్వమును ఉత్తేజితముచేసి యోద్ధలను ఉత్సాహపరచినట్లు పర్జన్యుడు మేఘములను ప్రోత్సహించి జలవర్షక మేఘములను ప్రకటించును. పర్జన్యుడు జలద సమూహములను అంతరిక్షమున వ్యాపింప చేసినపుడు సింహగర్జనచేయు మేఘధ్వని దూరమున ఉత్పన్నమగును.

    4. పర్జన్యుడు వర్షమున పృథ్విని రక్షించినపుడు అప్పుడు వర్షమునకుగాను వాయువు వీచును. నలువైపుల మెరుపులు మెరియును. ఓషధులు ఎదుగును. అంతరిక్షము స్రవించును. సంపూర్ణ భువనహితమునకుగాను భూమి సమర్థమగును.

    5. పర్జన్యా ! నీ కర్మవలననే భూమి అవనతమగును. పాదయుక్తములు, ఖురవిశిష్ట జంతువులు పరిపుష్టములగును. ఓషధులు వివిధ వర్ణములు వహించును.

    పర్జన్యా ! మాకు మహా సుఖములు ప్రసాదించును.

    6. మరుత్తులారా ! అంతరిక్షము నుండి మాకు వర్షప్రదానము చేయండి. వర్షము కలిగించు, సర్వవ్యాపకమగు మేఘమును కురిపించండి.

    పర్జన్యా ! జల సేచనచేసి ఉరుముల మబ్బులతో మావద్దకు ఏతెంచుము. నీవు జలవర్షకుడవు. మమ్ము పాలించువాడవు.

    7. పృథ్విమీద నీవు శబ్దము చేయుము. గర్జించుము. ఉదకమున ఓషధులకు గర్భాదానము చేయుము. జలములు నిండిన రథమున అంతరిక్షమున పరిభ్రమించుము. నీరునిండిన మబ్బులను విడువుము. సర్వము జలపూర్ణము చేయుము.

    8. పర్జన్యా ! జలభండారమగు మేఘమును ఉన్నత స్థానమునకు చేర్చుము. అచటినుంచి దాని అధోముఖముగా కురిపింపుము. అప్రతిహత వేగావతులగు నదులు పూర్వాభిముఖులయి ప్రవహించవలెను. జలములతో ద్యావాపృథ్వులు తడసిపోవలెను. గోవులు త్రాగుటకు సుమధుర జలము విశేషముగ లభించవలెను.

    9. పర్జన్యా ! నీవు గాండ్రించి, గర్జించి దుష్కృత మేఘమును విడగొట్టినపుడు అప్పుడు సంపూర్ణ విశ్వాత్మక చరాచర ప్రాణులు ఆనందింతురు. సమస్త జగము ప్రసన్నమగును.

    10. పర్జన్యా ! చాల వర్షము కురిపించినావు. ఇక ఉపసంహరించుము. నీవు మరు భూములను సస్యవంతములు చేయుటకు జలయుక్తములు చేసినావు. మానవుల భోగమునకు ఓషధులను పెంచినావు. ప్రజలనుంచి స్తుతులు అందుకున్నావు.

                                       ఎనుబది నాలుగవ సూక్తము

          ఋషి - ఆత్రేయ భౌముడు, దేవత - పృథివి, ఛందస్సు - అనుష్టుప్.

    1. పృథివీ ! నీవు ఇచట అంతరిక్షమున మబ్బులను దాల్తువు. బలశాలినివి. శ్రేష్ఠవు. నీ మాహాత్మ్యమున నేలను ప్రసన్నను చేతువు.

    2. రకరకాల నడకలుగల నేల తల్లీ ! స్తోతలు గమనశీలములగు స్తోత్రములతో నిన్ను స్తుతింతురు. నీవు చప్పుడు చేయు గుఱ్ఱమువలె నీరునిండిన మబ్బును చేర్చుకుందువు.

    3. భూమీ ! విద్యోతమానమగు అంతరిక్షమునుండి నీసంబంధమగు వాన కురిసినపుడు నీవు భూమి సహితముగ వనస్పతులను వహింతువు.

                                       ఎనుబది అయిదవ సూక్తము

           ఋషి - ఆత్రేయుడు, దేవత - వరుణుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. వరుణుడు రాజమానుడు. సర్వత్ర విశ్రుతుడు. ఉపద్రవ నివారకుడు. అత్రీ ! వరుణుని కొఱకు ప్రభూతము, బహుళార్ధకము, ప్రియతమమగు స్తోత్రమును ఉచ్ఛరింపుము. పశుహంతకులు చంపిన జంతువుల చర్మములు పరచినట్లు, వరుణుడు సూర్యసంచారమునకుగాను అంతరిక్షమును విశాలము చేయును.

    2. వరుణుడు వృక్షముల ఉపరిభాగమున అంతరిక్షమును విస్తారము చేయును. అశ్వములకు బలము ఆవులకు పాలు హృదయమునకు సంకల్పము విస్తరింపచేయును. అతడు జలములందు అగ్నిని అంతరిక్షమున సూర్యుని పర్వతములందు సోమలతను ఏర్పరచినాడు.

    3. వరుణుడు స్వర్గ, పృథ్వి, అంతరిక్ష హితమునకుగాను మేఘపు అధోభాగమును సచ్చిద్రము చేయును. వర్షము యవాది సస్యములను సిక్తము చేసినట్లు అఖిల భువములకు అధిపతియగు వరుణుడు సమస్త జగమును ఆర్ద్రము చేయును.

    4. వరుణుడు వృష్టిరూపమగు దుగ్దమును కోరినపుడు - అప్పుడు స్వర్గ, పృథ్వి, అంతరిక్షములను తడిచేయును. తదుపరి పర్వత శిఖరములపై మబ్బులను దింపును. మరుద్గణములు తమబలమున ఉల్లాసము కలిగి మబ్బులను సడలింతురు.

    5. వరుణుడు అంతరిక్షమున నిలిచి కొలతబద్దవంటి సూర్యునితో పృథ్విని అంతరిక్షములను కొలతలు వేయుచున్నాడు. అట్టి ప్రసిద్ధ అసురహంత వరుణుని మహాప్రజ్ఞను మేము ఘోషింతుము.

    6. ప్రకృష్ఠ జ్ఞానసంపన్నుడు. ద్యుతిమంతుడగు వరుణుని మహాప్రజ్ఞను ఎంతటివాడును ఖండింపజాలడు. నీటిని పారించు శుభ్రములగు నదులు ఏకమాత్ర సముద్రమును నింపజాలవు ! అది వరుణుని మహాకార్యమగును.

    7. వరుణా ! మేము ఎప్పుడైనా ఎవడైన దాతను మిత్రుని చెలికానిని సోదరుని పొరుగువారిని మూగవానిని బాధించిన అపరాధము చేసి ఉన్నచో అట్టి అపరాధములను నాశము చేయుము.

    8. వరుణా ! జూదమున వంచించు జూదరివలె మేము తెలిసియో తెలియకో ఏదేని అపరాధము చేసి ఉన్నచో వానిని విడిన ముడివలె విడిపింపుము. తదనంతరము మేము నీకు ప్రీతిపాత్రులము కావలెను.

                                        ఎనుబది ఆరవ సూక్తము

        ఋషి - ఆత్రేయుడు, దేవత - ఇంద్రాగ్నులు, ఛందస్సు - అనుష్టుప్.

    1. ఇంద్రాగ్నులారా ! సంగ్రామమున మర్త్యులను రక్షించండి. వారు శత్రుసంబంధమగు ద్యుతిమంతమగు ధనమును భగ్నము చేయుదురు. ప్రతివాదుల మాటలను ఖండింతురు. శత్రువాక్యమువలె ముల్లోకముల వర్తింతురు.

    2. ఏ ఇంద్రాగ్నులు యుద్ధమున అజేయులో అన్న సంబంధమున స్తవనీయులో పంచశ్రేణి మానవులను రక్షించెదరో ఆ మహానుభావులను మేము నుతింతుము.

    3. ఈ ఉభయుల బలము శత్రువులను పరాజితులను చేయునది. వారు ఒకే రథమును ఎక్కి ఆవులను ఉద్ధరించుటకును వృత్రుని సంహరించుటకును సాగినపుడు - అప్పుడు ఈ ఉభయ ధనశాలులు చేతులందు వాడియైన వజ్రము విరాజిల్లును.

    4. ధనాధిపతులు, స్వరజ్ఞులు, నిరతిశయ వందనీయులగు ఇంద్రాగ్నులారా ! యుద్ధములందు మా రథములను ప్రోత్సహించుటకుగాను మిమ్ము ఆహ్వానించుచున్నాము.

    5. అహింసనీయ దేవద్వయమా ! మేము అశ్వములకుగాను మిమ్ము స్తుతించుచున్నాము. మీరు మానవులవలె సర్వదా వర్ధమానులగుదురు. ఆదిత్యద్వయమువలె దీప్తిమంతులు అగుదురు.

    6. రాళ్లతో నూరిన సోమరసమువలె బలవర్ధక హవ్యము సిద్ధమయినది. మీరు జ్ఞానులకు అన్న ప్రదానము చేయండి. స్తుతికారులకు విశేష ధనము, అన్నము ప్రసాదించండి.

                                      ఎనుబది ఏడవ సూక్తము

        ఋషి - ఆత్రేయుడు, దేవత - మరుత్తులు, ఛందస్సు - జగతి.

    1. ఏవయా ఋషి వచన నిష్పన్న స్తోత్రములు మరుత్తుల సహితముగా విష్ణువు వద్దకు చేరవలెను. అట్లే బలశాలులు, పూజనీయులు, శోభనాలంకృతులు, శక్తి సంపన్నులు, స్తోత్రప్రియులు, మేఘ సంచాలకులు, ద్రుతగాములగు మరుత్తుల వద్దకు చేరవలెను.

    2. ఇంద్రుని సహితముగను యజ్ఞగమన విషయిక జ్ఞానముతోను ఆవిర్భవించిన మరుత్తులను ఏవయామరుత్తు స్తుతించినాడు.

    మరుత్తులారా ! మీ బలము అభిమత ఫలముకన్న గొప్పది. పరాభవించరానిది. మీరు పర్వతములవలె పటిష్ఠులు.

    3. దీప్తము స్వచ్చందముగా విస్తీర్ణమగు స్వర్గమునుండి వినగలవారును. తమ గృహములకు చేరినంత ఎవరిచేతను కదలింపరానివారును. తమ దీప్తితో దీపించువారును అగ్నివలె నదులను ప్రవహింప చేయువారునగు మరుత్తులను ఏవయా మరుత్తు ఉపాసించును.

    4. స్వేచ్చగా సంచరించు మరుత్తుల అశ్వములను రథమున జోడించినపుడు ఏవయామరుత్తు వానిని అపేక్షించును. సర్వవ్యాపి మరుద్గణములు మహా అంతరిక్షము నుండి బయలుదేరుదురు. పరస్పర స్పర్దాకారులు, బలశాలురు సుఖప్రదాతలగు మరుద్గణములు వెడలినారు.

    5. మరుత్తులారా ! మీరు స్వాధీనతేజులు. స్థిర దీప్తులు. స్వర్ణాభరణ భూషితులు. అన్నదాతలు. మీరు ఏ ధ్వనితో శత్రువులను పరాభవించి మీ కార్యము సాధింతురో అట్టి ప్రబలవర్షకారి, దీప్తి, విస్తృత, ప్రబద్ధ ధ్వని ఏవయామరుత్తును వడకించరాదు.

    6. సమధిక బలశాలురగు మరుత్తులారా ! మీ మహిమ అపారము నిరవధికము. మీ శక్తి ఏవయామరుత్తును రక్షించవలెను. నియమయుక్త యజ్ఞమును దర్శించు విషయమున మీరే నియామకులు. మీరు ప్రజ్వలిత అగ్నివలె ప్రదీప్తులు. మమ్ము నిందకులనుండి రక్షించండి.

    7. పూజనీయులు, అగ్నివలె ప్రభూత దీప్తిశాలురగు రుద్రపుత్రులారా ! ఏవయా మరుత్తును రక్షించండి. అంతరిక్ష సంబంధమగు దీర్ఘము, విస్తీర్ణమగు గృహము మరుత్తులద్వారా ప్రఖ్యాత మగును. నిష్పాప మరుద్గణము పయనించునపుడు అనంతశక్తిని వెల్లడింతురు.

    8. విద్వేషరహిత మరుద్గణములారా ! మా స్తోత్రములకు సన్నిహితులు కండు. స్తోతయగు ఏవయామరుత్తు ఆహ్వానమును ఆలకించుడు. ఇంద్రునితోబాటు యజ్ఞభాగము పొందు మరుత్తులారా ! యోద్ధలు శత్రువుల పారద్రోలునట్లు మీరు మా నిగూఢ శత్రువును దూరము చేయండి.

    9. యజన యోగ్య మరుత్తులారా ! మా యజ్ఞమునకు విచ్చేయండి. అందువలన మా యజ్ఞము సుసంపన్నమగును. మీరు నిర్విఘ్నులు. మా పిలుపును వినండి. విశేష జ్ఞానసంపన్నులగు మరుత్తులారా ! వింధ్యాది పర్వతములవలె అంతరిక్షమున నిలిచి నిందకులను శాసింతురు.

    ("యజ్ఞగమన విషయ జ్ఞానేన సహప్రజాతాః మరుతః ఏవయా మరుత్ బ్రూయతే" అని శాయణుడు. యజ్ఞమునకు చేరు జ్ఞానమున తొడపుట్టిన మరుత్తును ఏవయా మరుత్తు అందురు)

   
    విద్వాంసుడు, బహుభాషావేత్త, కవి, కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, చలనచిత్ర రచయిత, విమర్శకుడు, వ్యాసకర్త, అనువాదకుడు, వక్త, స్వాతంత్ర్య సమరయోధుడు, వినయవంతుడు, భగవద్భక్తుడు, దాశరథి రంగాచార్య రచించిన ఆంధ్రవచన ఋగ్వేద సంహిత నాలుగవ అష్టకమున అయిదవ మండలము సమాప్తము.

                                           అధనా స్సధనా స్సంతు

 Previous Page Next Page