ఒక్కొక్క మాట వింటుంటే ఈపజిల్ మరింత చక్కగా తయారవుతుంది. బలే గడుసువాడు. మాట తిన్నగా చెప్పకుండా నేనే దయ చూపించానంటాడు....నా తల వేడెక్కింది. దాంతో పాటు కోపం కూడా వచ్చింది.
"ఇది చాలా బాగుంది రెడ్డి గారూ.... నా చేత్తో నేను ఒక మార్కు వేయలేదు మీ అబ్బాయి పేపరు మీద మరి ఇదంతా ఎలా జరిగిందో మీకే తెలియాలి.... అవునులెండి మీ దగ్గరున్న డబ్బుతో మీరు సాధించలేనిది ఏమి వుండదు.... కానీ అనవసరంగా యిలాంటి వాటిలో యిరికించి నాపెరుకి అప్రతిష్ట తేకండి యిలాంటివి నాకిష్టం లేదు .' కఠినంగా అన్నాను.
అయన అదోలా నవ్వాడు....' అలా అనేస్తే నేనేం సేప్పగలనమ్మ గారూ ----నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే నేనేం సెయ్యగలను పోనీలెండి గాని ....నేను మూడో క్లాసు లోనో, నాలుగో క్లాసు లోనో ఓ పాఠం సదూకున్నాను అదెవరో బెంగాలీ అయన విద్యాసాగరో మరెవరో ఓరింటికి విందు భోజనానికి ఎల్లాడట...... మామూలు బట్టలేసుకుని .....అడి బట్టలు చూచి ఎవరూ లోపలికి రానీలేదంట. ఆపాళాన యింటికెళ్ళి మంచి బట్ట లేసుకుని గుర్రబ్బగ్గీలో రాగానే అందరూ ఎదురెళ్ళి ఆహ్వానించారట ....అప్పుడనుకున్నాడంట అయన ఈ గౌరవం డబ్బుకి గాని, మనిషికా అని...."
అయన మాట్లాడేది ఏమిటో అర్ధం కాక ఈ అసందర్భపు మాట లేమిటని విసుగు వచ్చింది నాకు. "యిదంతా మీరెందుకు చెపుతున్నారు? నేనన్నదానికి దీనికి, సంబంధం ఏమిటి?"
రెడ్డిగారు వ్యంగ్యంగా నవ్వాడు. 'ఆ ...ఆ... అదే యిన్నాళ్ళు నేనూ డబ్బుకే యిలువ. వేసానికే విలువ అందరూ యిస్తారని అయన లాగే అనుకున్నాను.... కానీ ....మీకాడికి వచ్చేసరికి అదంతా తప్పయిపోయింది నా కారు, నా లచ్చలు , నా వుంగరాలు ..... నా వందలు, నా ద్రాక్ష పళ్ళు ఏవీ సేయలేని పని అరడజను బత్తాయి పళ్ళు.... జంధ్యం పోగు నీరు కావి అంగోస్త్రం చేసేసింది -----మరి అక్కడనించి యీ క్రొత్త పాఠం నేర్చుకున్నాను.... వస్తానమ్మా చాలాసేపు నిలబెట్టేశాను మిమ్మల్ని..... మా అమ్మాయిని కూడా ఓ కంట కనిపెట్టి సూడండి.
తెల్లపోయి చూస్తున్న నాకు ఓ నమస్కారం పెట్టి నవ్వుకొంటూ వెళ్ళిపోయాడు యీరపరెడ్డి.
స్టాఫ్ రూములోకి ఎలా వచ్చి కూర్చున్నానో నాకే తెలియదు. అరడజను బత్తాయి పళ్ళు, నీరుకావి అంగాస్త్రం . జంధ్యం పోగు .... నా బుర్రలో గిరగిర తిరిగాయి. రెండేళ్ళ క్రితం జరిగినది గుర్తు తెచ్చుకోడానికి ఎక్కువ ప్రయత్నం అవసరం లేకపోయింది. గుర్తు రాగానే ఆవేశంతో ఆగ్రహంతో వణికిపోయాను. ఎంత మోసం ఎలాంటి పన్నాగం.
ఎముకల గూడులా వున్న సద్బ్రాహ్మణుడు మూడు మూరల అంగోస్త్రం తో, జంధ్యం పోగులతో విభూతి పట్లతో వున్న ఆయవారపు బ్రాహ్మణుడు గుర్తుకి వచ్చాడు.
అయన జాలికద విని కరిగిపోయాను. తిండి లేదన్నాడు. భార్య రోగిష్టిదన్నాడు. ఐదుగురు ఆడపిల్లలు గుండెల మీద కూర్చున్నారన్నాడు! ఏకైక పుత్రరత్నం ఈ పరీక్ష ప్యాసవుతాడని గంపెడాశ పెట్టుకున్నాడు. ఈ పరీక్ష ప్యాసయితే ఏదో ఆఫీసులో ఎవరో ఆఫీసరు కాళ్ళు పట్టుకుని ఉద్యోగం స్థిరపరుస్తాడట, ఆ ఉద్యోగంకి ఈ పరీక్ష ప్యాసవాలట ఆ ఆఫీసరు ఉద్యోగం యిస్తానని మాటిచ్చడట. పరీక్ష ప్యాసయితే చాలట. అబ్బాయి ఎంతో కష్టపడి చదువుకున్నాడు. ఈ పరీక్షకి ముందు జ్వరం వచ్చి యీ ఒక్క పేపరే కాస్త పాడు చేశానన్నాడట కొడుకు . నేను యీ సాయం చేయకపోతే అందరం కలిసి యీ కృష్ణలో కట్టకట్టుకుని చావటం మినహా మరోదారి లేదని దీనాతిదీనంగా ప్రార్ధించాడు. జబ్బుతో తీసుకుంటున్న ఆ తల్లీ, యీ కొడుకు చేయబోయే ఉద్యోగం కోసమే ప్రాణాలు నిలుపుకొందని జాలిగా చెప్పాడు. కుచేలుడు ఆనాడు శ్రీకృష్ణ పరామాత్మకి అటుకులు తెచ్చి యిచ్చినట్టు అరడజను బత్తాయి పళ్ళు మినహా ఏమీ యివ్వలేని పేదవాడిని పాదాల దగ్గిర పెట్టాడు. నా వల్ల కాదన్నా యిలాంటి పని చేయలేనన్నా..... నా కాళ్ళని పట్టేసుకున్నాడు..... మీరు కాదంటే మరి గత్యంతరం లేదంటూ వలవల ఏడ్చాడు..... నన్ను యిబ్బంది లో పెట్టి యిరకాటం లో పడేసి సానుభూతి సంపాయించి జాలితో కరిగేటట్టు కన్నీటి కధ చెప్పి నేను మాటిచ్చేవరకు అభయం ఇచ్చేవరకు కాళ్ళు వదలని ఆ బ్రాహ్మడు గుర్తొచ్చాడు...... ఎంత దగా.... ఎంత మోసం యీ రెడ్డి ఎంత నాటకం ఆడాడు. ఐదో పదో ఆ బ్రాహ్మడి చేతిలో పెట్టి తన అవసరానికి ఎంత చక్కగా వినియోగించుకున్నాడు . నేనన్నమాట ఆధారంతో ఎంత పన్నాగం పన్ని నా కళ్ళు కప్పాడు.
నన్నెంతలో బోల్తా కొట్టించాడు అయినా నేనెలా మోసపోయాను ' ఆ రెడ్డి కొడుకు నెంబరు..... యీ బ్రాహ్మడు చెప్పిన నెంబరూ ఒకటే నన్న గుర్తు లేనంత మందమతి నెలా అయ్యాను? పేపరు చూచి మార్కులు వేసే టప్పుడయినా పోలిక పట్టలేనంతగా నా బుర్ర ఎలా మొద్దు బారిపోయింది ? అంతలా నా కళ్ళు ఎలా మూసుకు పోయాయో"
హు యీ పద్దెనిమిది మార్కులు అబ్బాయి రేపొద్దున డాక్టరయి ప్రజాసేవ చేయడానికి రాసుంటే అపాలన్నా ఆపడం నా తరమా?..... యిలాంటి దేశోద్దారకులు దేశానుద్దరించడానికి రాసుంటే నాలాంటి వాళ్ళ కళ్ళు మూసుకుపోయే ఉండాలి. నాచేతిలో ఏం వుంది? ఇలాంటివి ఆపడానికి?..... నేను నిమిత్త మాత్రురాలిని అంతే! చాతకాని నవ్వు ఒకటి నవ్వుకుని క్లాసుకు బయలుదేరాను.
***