"ఆపు, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు. ఈ పడడాలు, దెబ్బలు తగలడాలు, చెయ్యి విరగ్గొట్టుకోవడాలు వీటన్నింటి గురించి ఎవరూ అడగలేదు. ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు." కోపంగా అన్నాడు.
"నా దృష్టిలో అదో ముఖ్యమైన విషయం కాదు. అందుకే చెప్పలేదు. అదీ నాలుగు రోజులలో దెబ్బ నయం అయిపోయినట్లే మర్చిపోయే యాక్సిడెంట్ అనుకున్నాను."
జయంతి మాటలకు విస్తుపోయి చూశాడు కృష్ణమూర్తి. అతనికి కోపంతో మాటలు తడబడిపోయాయి. ఒకభార్య భర్తతో ఇంత నిబ్బరంగా, నిర్లక్ష్యంగా మాట్లాడడం సహించలేకపోతున్నాడు. సిగ్గుపడి, బెదరిపోయి తప్పయింది అని ప్రాధేయపడకుండా జరిగింది అవమానం అనుకోకుండా చెయ్యి విరిగిందన్న విషయం అంత మామూలుగా ఆ విషయం తీసుకొని మాట్లాడడం అతను ఎదురుచూడని విషయం. ఓ ఆడదాన్ని ఓ మగాడు బలాత్కారం చేశాడంటే శీలం పోవడం. ఇంత తేలిక విషయంగా మాట్లాడుతున్న జయంతినీ, ఆమె నిబ్బరాన్ని చూసి నోట మాటరానట్లుండి పోవడం అతని వంతయింది.
"నీవు... నీవు... నిన్ను ఓ మగాడు మానభంగం చేస్తే..." అతని మాట పూర్తికాలేదు. జయంతి భద్రకాళిలా అరిచింది.
"స్టాపిట్, డోంట్ యూజ్ దట్ వర్డ్." తర్జని చూపించి బెదరిస్తూ కళ్ళెర్రజేసింది. ఆ 'మానభంగం' అన్నమాట వాడొద్దు. మానం... దానికి భంగం.. అంతా ట్రాష్. మీ ఫ్రెండ్. నీచుడు నామీద బలప్రయోగం చేశాడు. బలాత్కారం చేశాడు. ఆ వెధవ. ఒళ్ళు బలిసిన ఆ వెధవ ముందు శారీరకంగా బలహీనురాలినయి వాడి ముందు ఓడిపోయాను. దీనికి మానభంగం అన్న పేరు వాడకండి. అదీ నా దృష్టిలో ఓ యాక్సిడెంటే. నా ఇష్టం లేకుండా, నా ప్రమేయం లేకుండా, శారీరకబలంతో లొంగదీసుకోవడం ఇదీ ఒక యాక్సిడెంటే. అంతే తప్ప నేనేదో శీలం, పవిత్రత పోగొట్టుకున్నానని భావించలేదు. నేను కావాలనుకోనిది నా మీద బలవంతంగా రుద్దబడడంలో నా తప్పు లేదు కనుక. ఇది నా జీవితంలో తిన్న దెబ్బలలో ఒకటి. అంతే."
"అంటే చెయ్యో, కాలో విరగడం ఇదీ ఒకటేనా? ఇది నా దగ్గర దాచి నీవు, మీ వాళ్ళు నన్ను మోసం చేయడం ఎంత దగా, ఎంత కుట్ర." ఉక్రోషంగా అన్నాడు.
"ఆగండి. ఇందులో మా వాళ్ళని అనాల్సిందేం లేదు. ఎందుకంటే, వాళ్లకి అసలు ఈ విషయమే తెలీదు."
కృష్ణమూర్తి ఆశ్చర్యపోయాడు.
ఓహో, ఎంత జాణవి నీవు. ఇంట్లో వాళ్ళకి కూడా ఇది ఇంత గుట్టుగా దాచిపెట్టగలిగావంటే శభాష్, నిన్ను మెచ్చుకోవాలి. నీ గుండె ధైర్యాన్ని అభినందించా?" వ్యంగ్యంగా అన్నాడు. "వాళ్ళతో చెప్పకపోయినా కట్టుకున్నవాడికి నా దగ్గిర చెప్పక్కరలేదనుకున్నావా? పెద్ద పవిత్రంగా చలామణి అయిపోవాలనుకున్నావా? నీవే నిజాయితీపరురాలివైతే నాకు చెప్పేదానికి ముందుగా."
"చెప్పానుగా. ఇది నా దృష్టిలో శారీరకంగా తగిలిన దెబ్బ మాత్రమే. అందుకని దీనికి నేను ప్రాముఖ్యం ఇవ్వలేదు. జరిగిందాన్ని చెప్పి వాళ్ళని అనవసరంగా బాధపెట్టడం అనవసరం అనిపించి వాళ్ళకీ, మీకు చెప్పలేదు. నేను కావాలని ఇంకెవరినో మానసికంగా ప్రేమించి, వాడితో శారీరక బంధం ఏర్పరచుకొని, అది దాచి మిమ్మల్ని పెళ్ళాడి ఉంటే అది తప్పు నా దృష్టిలో. అసలు పెళ్ళికాక ముందు అనేకం జరుగుతుంటాయి. మీరు ఎందరో అమ్మాయిల వెంట పడుండవచ్చు. ఉత్తరాలు రాసి ఉండవచ్చు. లంచ్ లకి, డిన్నర్లకి వాళ్ళను తీసికెళ్ళి ఉండవచ్చు. కానీ, అనేక కారణాల వల్ల పెళ్ళి చేసుకోలేకపోయుండవచ్చు, అవన్నీ మీరు పెళ్ళాడే ముందు అమ్మాయిలతో నిజాయితీతో చెబుతున్నారా. చాలా బుద్ధిమంతుల్లా పెళ్ళిపీటలెక్కుతారు. పెళ్ళికి ముందు మేమూ ఏ కాలేజీ అబ్బాయి ప్రేమలేఖలో అందుకొని ఉండవచ్చు. మేమూ బాయ్ ఫ్రెండ్స్ తో హోటలుకెళ్లి కాఫీ తాగి ఉండచ్చు. అబ్బాయిలు, అమ్మాయిలు కలసి మాట్లాడుకోవడం తిరగడం, ఇంకా కొందరు కాస్త ముందుకెళ్ళి అబ్బాయిల లేకి మాటలకు లోబడి ప్రేమిస్తున్నాం అనుకొని విరహగీతాలు పాడుకొని ఉండవచ్చు. ఇదంతా ప్రతివాళ్ళ లైఫ్ లో సర్వసామాన్యం యౌవనంలో. ఇదంతా తప్పు పరమ అపరాధం అని ఎవరూ అనుకొని పెళ్ళికి ముందు 'కన్ ఫెస్' చేయరు. ప్రేమించామని కడుపులు చేసినవారు పెళ్ళి వేళకి వచ్చేసరికి ముఖం చాటేయడాలు, దొంగచాటుగా కడుపులు దించుకొన్న అమ్మాయిలు - రకరకాల కథలుంటాయి ప్రతివారి వెనుక. ఆ యౌవనంలో జరిగినవన్నీ అందరూ రబ్బరుతో చెరిపేసుకున్నంత తేలిగ్గా చెరుపుకొని కొత్తజీవితాలు ఆరంభించుకుంటారు. నేను అలాంటివేం చెయ్యలేదు. ఓ పొగరెక్కిన వెధవ తన డబ్బు, హోదా ఎరచూపి ప్రేమ పేరుతో వెంట తిప్పుకోవాలనుకుంటూ వెర్రి వేషాలు వేస్తే లొంగక పోయేసరికి పౌరుషం, అవమానం వచ్చి నాకు బుద్ధి చెప్పడానికి తన బలం చూపి లొంగదీసుకున్నాడు. అది నాకు అవమానం అనుకున్నాను తప్ప తప్పని, పవిత్రత, శీలంలాంటివి పోయాయని నేను ఎప్పుడూ బాధపడలేదు. అందుకే చెప్పనవసరం లేదనుకున్నాను.
"దెబ్బ తగిలిందన్నంత తేలిగ్గా దులిపేసుకుని ఊరుకున్నావన్నమాట" వ్యంగ్యంగా ఎత్తిపొడిచాడు.
"లేకపోతే ఏం చెయ్యాలిట! ఊరూ వాడా అరిచి చెప్పి, పోలీస్ రిపోర్ట్ ఇచ్చి కోర్టుకెక్కి రొస్టుపడాలా! కోర్టులకి చూపాల్సిన సాక్షాలూ నా దగ్గర లేవు. కోర్టులు ఏ మాత్రం న్యాయం చేస్తున్నాయో చూస్తున్నాంగా. కోర్టుకెక్కే ధైర్యం నాకున్నా, న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేక.."
"కోర్టుకెక్కనక్కరలేదు. కానీ, అంత తేలిగ్గా ఏ ఫీలింగ్సూ లేకుండా దులిపేసుకున్నావంటే... నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే."
"ఏ ఫీలింగ్సూ కలగలేదని నేను చెప్పానా! నాకిష్టం లేకుండా శారీరక బలంతో నా శరీరాన్ని బలవంతంగా లొంగదీసుకున్నాడన్న కసి, ద్వేషం, అవమానం, సిగ్గుతో నా మనసు, శరీరం దహించుకుపోయాయి. ఏ చెత్తవెధవో వాడి 'అశుద్ధం' నా ఒంటినిండా పామినంత అసహ్యం, జుగుప్స, చీదరింపు కలిగింది. ఆ వెధవ వాడిన ఈ శరీరాన్ని ఎలా శుభ్రపరచుకున్నానో తెలుసా? ఒక బాల్చీడు వేడినీళ్ళలో అరసీసాడు డెట్టాల్ వంపాను. పెరట్లోంచి దోసెడు వేపాకులు కోసుకొచ్చి నీళ్లలో వేసాను. అది చాలనట్లు గుప్పెడు పసుపు నీళ్ళలో వేసి తలారా స్నానం చేశాను. కొబ్బరి పీచుతో ఒళ్ళు మంటలెక్కేవరకు తోమాను. తరువాత మరో బాల్చీడు నీళ్లలో గుప్పెడు తులసాకులు, దేముడి దగ్గర గంగ చెంబులో సగం గంగ చెంబు వంపి దేహాన్ని డిసిన్ ఫెక్ట్ చేసుకుని తరువాత రెండో బాల్చీ నీళ్ళు తలనిండా వంపుకున్నాను. అప్పటికి శరీరాన్ని అంటిన మైల తొలగిందనిపించింది.. మానసికంగా ప్రక్షాళన జరిగినట్టు తృప్తిపడ్డాను." స్థిరంగా అంది.
కృష్ణమూర్తి భార్యవంక వింతగా చూశాడు. ఆశ్చర్యంగా విన్నాడు. ఏమనాలో తెలియక మాటలకి తడుముకున్నాడు. జరిగిందానికి కోపగించుకోవాలో, భార్యకి సానుభూతి చూపాలో అన్నది కూడా అతనికి అర్ధం కాలేదు. "ఇలా ఎందుకు చేశాడు చంద్రం?" గొణిగాడు. చివ్వున తలెత్తి రోషంగా చూసింది జయంతి.
"ఎందుకంటే మీ మగాళ్ళకి ఓ ఆడది తనని లెక్క చేయకపోతే పౌరుషం వచ్చేస్తుంది. అవమానం అనిపిస్తుంది. తన డబ్బు, అందం, హోదాని నేను కేర్ చెయ్యలేదన్న ఉక్రోషం..."
"అసలు ఇదంతా ఎందుకు, ఎలా జరిగింది?"
"మీ ఫ్రెండ్ చెప్పాడేమో, మళ్ళీ ఎందుకు అడుగుతారు," తీవ్రంగా అంది.