Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 16


                     స్వతంత్ర భారతము

                                             1

    అది రాజసభామంటపము. మేవాడ పౌరులందఱు పట్టాభిషేక మహోత్సవమును సందర్శించుటకై చనుదెంచి యుండిరి. నిండుసభ కన్నులకుఁ బండువుసేయుచుండెను.
    సభామధ్యమున నొక యున్నత వేదికపై మేవాడరాజు సింహాసనము విరాజిల్లుచుండెను. సింహాసనము ముందున్న రత్నపీఠముపై మేవాడ రాజ మకుటమును, వీరఖడ్గమును ధగధగ మెఱయుచుండెను.    
    ఇంతలో నచ్చటికోక రాజకుమారుఁడు ససంభ్రమముగ చనుదెంచెను. అస్తవ్యస్తములగు నాతని దుస్తులను, వ్యత్యస్తములగు నాతని యాభరణములను గాంచి సభ్యులు నవ్వుకొనసాగిరి.
    ఆ రాజనందనుఁడు సభ్యులను జూచి "నేను ఉదయసింహుని కుమారుఁడను. ఇంకను మీరు నన్ను గుర్తింపలేదా! లేచి నాకు స్వాగత మీయరేమి? నన్నుఁ జూచి లేవరేమి?" అని యఱచెను.
    సభయంతయు నీతని పలుకులకు లోలోన నవ్వుకొన సాగెను. ఎవరును మాఱుపలుక లేదు.
    అతఁడు మరింత బిగ్గరగా "మీకు చెవుడా? నేను రాజకుమారుడను. పట్టాభిషేకమునకు వచ్చితిని. నన్నాహ్వానింపరేమి?" అని పలికెను.
    "ఇఁక చాలు! కూర్చుండుము! కూర్చుండుము" అని సభలోనుండి కేకలు బయలుదేరెను.
    "ఓహో! నన్ను కూర్చుండుమనుచున్నారా? మంచిది? ఇదిగో!" అని రాజసింహాసనముపైఁ జదికిలఁబడెను. అట్లు కూర్చుండి ముందున్న కిరీటమును దీసి తలపైఁ బెట్టుకొనఁ బోయెను.
    వెంటనే 'ఆగు' మని మహాసభలో నుండి యొక కంఠ ధ్వని వినవచ్చెను. సభ్యులందఱు ఆశ్చర్యచకితులయిరి.
    సలుంబ్రా కృష్ణసింహుడు నిజాసనమునుండి దిగున లేచి "ఓయీ! ఇది నీ సింహాసనముగాదు. ఇది వీరాధి వీరుడగు ప్రతాపసింహునిది. 'రాణా' యగు నధికారము ఉదయసింహుని జ్యేష్ఠపుత్రునిదేకాని కనిష్ఠపుత్రుడ వగు నీది కాదు. దిగిర"మ్మనెను.
    జగమల్లుఁడు క్రోధావేశముతో "ఏమీ! మా తండ్రి ఉదయసింహుని యాజ్ఞానుసారము మీరు నడవ నవసరము లేదా? నాఁడు మరణశయ్య మీఁదఁ బరుండి నా జనకుడు నన్నుఁ బట్టాభిషిక్తుఁజేయు'మనిన నీవు 'చిత్త'మనలేదా? ఇప్పుడింత ద్రోహమునకుఁ బాల్పడితివా?" అని పల్కెను.
    ఈ పలుకులు చెవులకు ములుకులైసోక కృష్ణవిభుఁడు దండ తాడిత భుజంగముకైవడి మండిపడుచు "మూర్ఖుఁడా! నేఁడో రేపో మరణించు ముదుసలి కేల సంతాపము గలిగింప వలెనని నాఁడంగీకరించితినిగాని వేఱుగాదు. అయినను మీ యన్న సర్వసద్గుణ సంపన్నుడు. మేవాడ వీర కేసరియగు ప్రతాపసింహుఁడుండ మేవాడ సింహాసనము నీకుఁ బ్రాప్తించు ననుకొంటివా? చాలు. నీ తండ్రి పిరికిపందయై 'చిత్తూరు'ను యవనుల వశమొనర్చినాఁడు. ఆ తండ్రిని మించిన తనయుడవు నీవు. నేఁడు 'రాణా'వైరసపుత్రుల నింకను శాశ్వత దాస్యమునఁబడి మ్రగ్గుమందువా? ఇదిగో! ఎందఱెత్తి వచ్చినను భయపడువాఁడనుగాను. ప్రతాపుని 'రాణా'ను చేసి తీరెదను. గౌరవముగా దిగిర"మ్మని సింహాసనము కడ కేఁగెను.
    జగమల్లుడు "వృథావాదోపవాదములతో మాకు నిమిత్తములే"దనుచు కదలక మెదలక సింహాసనము మీద భీష్మించుకొని కూర్చుండెను.
    కృష్ణసింహుఁ డాగ్రహావేశము నాపు కొనలేక "ఓయీ! రాజధర్మమునకు వ్యతిరేకముగా, ప్రజాభిప్రాయమునకు విరుద్ధముగా నీవట నుండుటకు వీలు లే"దని జగమల్లుని సింహాసనము నుండి బలవంతముగఁ గ్రిందకు లాగివైచెను.
    సభ్యులెల్లరు సంతోషముతోఁజప్పట్లు చఱచిరి.
    జగమల్లుఁడు మేవాడపౌరుఁడెవ్వఁడును తన పరాభవమునకుఁ జింతింపమి వెఱఁగంది సాశ్రులోచనుఁడై సభనుండి వెడలిపోయెను.
    సలుంబ్రా కృష్ణసింహాది ప్రముఖులచేఁ బ్రార్థితుడై ప్రతాపసింహుఁడు సభ్యుల కరతాళధ్వనులు మిన్నుముట్టుచుండ సభాస్థలిఁ బ్రవేశించెను. సభాసదు లందఱు సమ్మోదముతో నాతనికి స్వాగత మొసంగిరి.
    ప్రతాపుఁడు ప్రసన్నవదనుఁడై ప్రజాభిప్రాయానుసారము రత్నసింహాసనము నధిరోహించెను.
    "మహారాణా ప్రతాపునకు జయము జయ" మని సభ్యులు పుష్పవర్షము కురిపించిరి.
    పరమానంద హృదయులై మేవాడ పౌరులు తమ యదృష్టమును పొగడుకొనిరి.
    సలుంబ్రా కృష్ణసింహుఁడు లేచి ప్రతాపుని తలపై బంగారు కిరీటముంచి రాజఖడ్గమును హస్తమున కందించెను.
    మహారాణా ప్రతాపసింహుఁడా వీర కృపాణమునుగైకొని కన్నుల కద్దుకొనెను. అనంతరము సింహాసనము నుండి లేచి తన ప్రజల నుద్దేశించి యిట్లు పల్కెను:
    "మేవాడ ప్రజలారా! మీకు నాయందుఁగల భక్తి విశ్వాసములకు ధన్యవాదములు. మేవాడ దేశము స్వాతంత్ర్య లక్ష్మితోఁ దులదూగవలె నన్నదే నేఁటి మన ధ్యేయము. స్వచ్చంద పవిత్ర జీవనమే మన యాశయము. మాతృదేశ స్వాతంత్ర్యరక్షాదీక్షతో మన భవితవ్యము నిర్ణయింపఁబడఁగలదు. ఒక్కింత యుపేక్ష యొనర్చినందువలననే కదా మన చిత్తూరు నేలమట్టమై పోయినది! అదే మన చిత్తూరు దుర్గము! శిథిలమై, జీర్ణమైయెట్లున్నదో చూడుఁడు. రాజ ప్రాసాదములు గ్రద్దలకు గబ్బిలములకు నిలయమైనవి. నగర వీధులన్నియు బీడయి పాడయిపోయినవి. విధ్యుక్తధర్మముల నిర్వహణమే మనకర్తవ్యము. లెండు. వీరకంకణములు ధరింపుఁడు. స్వాతంత్ర్యసమరవీరులై ముందడుగు వేయుఁడు. ఏనాఁడు మన చిత్తూరు పూర్వవైభములతో విరాజిల్లునో అదే మనకు విశ్రాంతి దినము. దేశస్వాతంత్ర్య సంరక్షణార్థము సర్వస్వము త్యాగ మొనర్ప సంసిద్ధముకండు! చిత్తూరు స్వాతంత్ర్యమును సంపాదించువరకు రసపుత్రవీరులెవ్వరును తల్పములమీఁద శయనింపరాదు. పంచభక్ష్య పరమాన్నము లారగింపరాదు. ఇదే మన ప్రతిజ్ఞ! ఇదే మన జీవితలక్ష్యము!"

 Previous Page Next Page