Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 15
6
ఒక పర్యాయము రుద్రమదేవి బంధుమిత్రసమేతముగా మ్రొక్కుబడులు దీర్చుకొనుటకై మొగలిచెర్ల కేతెంచినది. అచ్చట ఏకవీరాదేవికి సహస్రనామార్చనము చేయించినది. లక్ష కుంకుమార్చనము జరిపించినది. పేదసాదలకు దానధర్మములు గావించినది. తనకు పుత్రసంతానము లేకపోవుటచే, తన పుత్రికయగు ముమ్మడమ్మకు కాకతీయ సామ్రాజ్యధౌరేయుఁడైన కుమారు ననుగ్రహింపుమని భగవతిని భక్తి పూర్వకముగా ప్రార్థించినది.
అనంతరము రుద్రమదేవి యొక చలువరాతి మంటపమునఁ గూర్చుండి విశ్రాంతి దీసికొనుచుండ నొక యాశ్వికుఁడు రోజుకొనుచు వచ్చి మహారాజ్ఞి కొక లేఖ నందించెను. రుద్రమదేవి యాలేఖ విప్పి తనలోఁదానిట్లు చదువుకొనెను.
రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ మన్మమహామండలేశ్వర శ్రీరుద్రమదేవ మహారాజులుంగారి పాదపద్మములకు ప్రణామములు! మురారి హరిహరులు సేనాసమేతులై వచ్చి మన దుర్గమును ముట్టడించినారు. వారలకు దేవగిరి ప్రభువగు మహాదేవరాజు బాసటయై వచ్చినాఁడు. తాము వెనువెంటనే రాజధానికి రావలెనని విన్నవించుకొనుచున్నాను.
ఇట్లు మహామంత్రి,
శివదేవయ్య.
రుద్రమదేవి ముఖము క్రోధారుణమయ్యెను. కనుబొమలు ముడిపడెను. దక్షిణహస్త మప్రయత్నముగ నొరలోనున్న కృపాణమును సంస్పృశించెను. "ఏమీ మేము నగరమున లేని సమయమున దుర్గమును ముట్టడించినారా! ఆ పిరికి పందలకు దేవగిరిరాజు సాయమా? వీరికి వినాశకాలము దాపురించుటచేతనే యిట్టి విపరీతపు బుద్ధులు పుట్టినవి" అను మాటలు తెలుఁగురాణి నోటినుండి వెలువడినవి.
7
మహారాజ్ఞి దుర్గములో లేదను విషయమును తెలిసికొని తగిన సమయము కొఱకై వేచియున్న మురారి హరిహరదేవు లపారసేనావాహినులతో నాంధ్రసామ్రాజ్యముపై దండెత్తి వచ్చిరి. వారి దుర్బోధలకు లోనైన మహాదేవరాజు మూడులక్షల సైన్యములతోవచ్చి ఏకశిలానగర దుర్గమును ముట్టడించెను. మహామంత్రి శివదేవయ్య దుర్గద్వారము మూయించి రిపుసైన్యములు దుర్గపరిసరములకు రాకుండ కోటగోడపై నుండి భయంకర సమరము సాగించుచుండెను. మురారి హరిహరులును, మహాదేవరాజును రుద్రమదేవి తిరిగి వచ్చినచో తమ యాటలు సాగవనియు నా సమయము మించినచో తమ ప్రయత్నమంత బూడిదలోఁ బోసిన పన్నీరగుననియు నిశ్చయించి యెట్టులైనఁ గోటను పట్టితీరవలయునను గట్టి పట్టుదలతో ప్రాణములకు తెగించి పోరుచుండిరి.
ఇంతలో రుద్రమదేవి యసంఖ్యాక చమూసమూహముతో వచ్చి వెనుక నుండి శత్రుసైన్యములపైఁ బడెను. మహారాజ్ఞి వచ్చినదని తెలియుటతోడనే యాంధ్రవీరుల శౌర్యసాహసములు ద్విగుణీకృతము లయ్యెను. అపార పౌరుషముతో - అద్వితీయ పరాక్రమముతో - అఖండ సాహసముతో - అనుపమాన దేశభక్తితో ఆంధ్ర వీరాగ్రేసరులు కేసరులవలె శాత్రవసైన్యములను చీల్చి వైచుచుండిరి. ఆంధ్ర సైనికుల విజృంభణమునకు హరిహర మురారి మహాదేవుల బలములు నిలువలేక పోవుచుండెను.
రుద్రమదేవి స్వయముగ సర్వసైన్యాధిపత్యమును స్వీకరించెను. భయంకర కృపాణమును ధరించియుద్రేకముతో విద్రోహులపై దుముకుచున్న రుద్రమ మహిషాసురమర్దనివలె ప్రకాశించెను. ప్రతిపక్ష సైనికులు ప్రతిఘటనకు నిలువలేక భయోద్వేగములతో పంచబంగాళమైరి. ఆంధ్రపౌరుష ఝంఝా నిలమునకు దేవగిరి సేనలు గడ్డిపోచలయ్యెను.
ఆంధ్రుల విజయశంఖములు ప్రతిధ్వనించినవి. ఆంధ్ర జయభేరి మ్రోగినది. ఆంధ్రపతాక సగర్వముగా నభోభాగమున నర్తన మొనర్చినది. ఆంధ్ర సమ్రాజ్ఞి విజయలక్ష్మీ విరాజితయయినది.
8
నాఁడు కాకతీయాంధ్రసామ్రాజ్యలక్ష్మికి భద్రపీఠియైన రత్న సింహాసనముపై రుద్రమదేవ మహారాజులుగారు సమాసీనులై యున్నారు. సభ్యుల ముఖపద్మములన్నియు విజయోత్సాహముచే వికసించియున్నవి. దండనాథులు సగర్వముగ నుపవిష్టులై యున్నారు. నాఁటి మహాసభకు ఆంధ్ర వీరభటులెల్లరును మహారాజుగారిచే నాహ్వానింపఁబడి వచ్చియుండిరి.
ముందుగా మంత్రివర్యుఁడు శివదేవయ్యలేచి సభ్యులనుద్దేశించి యిట్లు చెప్పఁదొడంగెను - "సభాసదులారా! అంధ్రమహాజనులారా! నేఁడు మన యాంధ్ర సామ్రాజ్య విజయోత్సవము. ఈ శుభసమయమున మహారాజులుం గారిని గురించి యొక్కింత నుడువలసియున్నది. ఈ మహారాజు రుద్రమదేవియే అని మీకెల్లరకును తెలియును. పురుష వేషముతో నిన్ని దినముల నుండియు రాజ్యపాలన సేయుచున్న మన తెలుఁగురాణి అఖండ సాహసవతి. వీరాంగన. ఈమె చేతి చలువచేతనే ఆంధ్రసామ్రాజ్యము నేటికి సురక్షితమైనది. ప్రజాభిమానమును మిక్కుటముగఁ జుఱగొనిన మనరాణి ప్రజాభ్యుదయమునకై యెన్నియోసత్కార్యము లాచరించినది. పెక్కు దానములు చేసినది. ఈమె ప్రజ్ఞావివేకములు, రాజ్యపాలనా చాతుర్యము సంస్తవనీయములు.
ఇదుగో! ఈ ప్రక్క బంధితులైయున్న వీరిరువురు మురారి హరిహర దేవులు. ఆంధ్రసామ్రాజ్యమును విచ్చిన్నము చేయుటకై కుట్రలు పన్నిన దేశద్రోహులు.
అదుగో! అతఁడు దేవగిరిరాజు. దుర్మదాంధుఁడై దురాక్రమణ కుద్యమించి మనపై నెత్తివచ్చినాఁడు. తగిన ఫల మనుభవించినాఁడు. వీరికి యోగ్యమగు శిక్ష మీ సమక్షమున మహారాజ్ఞి యిప్పుడే విధించెదరు.
మీ రాంధ్రచక్రవర్తిని యెడఁజూపిన గౌరవాదరాభిమానములకు, ప్రేమకు, సదా కృతజ్ఞతతో శ్రీరుద్రమదేవి వారు తాం ధన్యవాదము లర్పించు కొనుచున్నారు."
సభాసదుల జయజయధ్వనులమధ్య రుద్రమదేవి లేచి యిట్లు పల్కెను.
"మహావీరులారా! అభివందనములు. మీ యందఱ బాహుబలముచే మన సామ్రాజ్యము సుస్థిరమైనది. రణరంగమున మేనువాల్చిన వీరసైనికులకు మా శ్రద్ధాంజలి.
మురారి హరిహరులకు యావజ్జీవ కారాగారశిక్ష విధించుచున్నాము."
అనంతర మవనతముఖుఁడైయున్న దేవగిరి రాజును వీక్షించి రుద్రమదేవి యిట్లనియెను.
"రాజా? చేజిక్కిన శత్రువుల కెట్టి యపకారమును చేయఁబోము. అది మా ఆంధ్రవీరుల ధర్మము. నీవు దుర్బోధలచేఁగాని, దురాశాపిశాచావేశపూరితుఁడవైగాని, నిష్కారణముగా మాపై నెత్తివచ్చి పరాజితుఁడవైతివి. నీకు లక్ష సువర్ణఖండములు అపరాధము విధించుచున్నాము. అది చెల్లించి స్వేచ్చగా వెడలిపొమ్ము. ఆంధ్ర సామ్రాజ్యముపై నెన్నఁడును దురాలోచనకుఁ గడంగకుము."
మహాదేవరాజు లక్ష సువర్ణఖండములు చెల్లించినాఁడు. రుద్రమదేవి వానినెల్ల స్వతంత్రసమరమున వీరవిహారము చేసిన విజయాంధ్ర భటులకు దోసిళ్ళతోఁ బంచి పెట్టినది. మరియుఁ బెక్కుబహూకృతులతో వీరులను గౌరవించినది. నాఁడు ప్రజాబాహుళ్యమును, సైనిక చయమును సాటిలేని సంతోషముతో పొంగిపోయినవి.
రుద్రమదేవి వీరనారీమణి. ఆమె విజయోపాఖ్యానము భారతదేశ చరిత్రలో సువర్ణ పంక్తులతో లిఖింపఁదగినది. రుద్రమ ప్రసన్నపరిపాలనము భారతమాత పాదపూజకు ప్రఫుల్లకమలమైనది. ఆంధ్రదేశ వైభవమును ఆంధ్రమహిళ సామర్థ్యమును ప్రపంచమున కెలుఁగెత్తిచాటిన రుద్రమదేవిని గన్న ఆంధ్రమత ధన్యురాలు!
* * * *
Previous Page
Next Page