Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 17


    రాణా మాటలు విని రసపుత్రవీరులందరు తమతమ ఖడ్గములపై జేతులువైచి ప్రమాణములు స్వీకరించిరి. జయజయ నినాదములతో నాఁటిసభ ముగిసెను.


                                             2


    ఆనాఁడు రాజపుత్రులకు పర్వదినము. రసపుత్రవీరులందరు వేటాడుటకై యరణ్యమున కరుదెంచిరి. మృగయా కోలాహలముతో మహారణ్యము మారుమ్రోగుచుండెను.
    మహారాణా ప్రతాపసింహుఁడు కార్ముకము నెక్కువెట్టి యొక వన వరాహము వెంటఁబడెను. చిట్టచివరకు గుఱిచూచి బాణము విడిచెను. అలుగు సూటిగా వచ్చి అడవిపంది డొక్కలో గ్రుచ్చుకొనెను.
    ఇంతలో మరియొక దెసనుండి వేరొక బాణమువచ్చి యా సూకరమునకుఁ దగిలెను. తోడనే యా వరాహము గిరగిరఁ దిరిగి నేలఁబడి యుసురులు వాసెను.
    ప్రతాపసింహుడు దానిని దీసికొనిపొమ్మని సేవకున కాజ్ఞాపించెను.
    ఇంతలో నొక వీరుఁడేతెంచి "దాని నెవ్వరు ముట్టరాదు. అది నా శరాఘాతముచే మరణించినది. కాన దానిపైనధికారము నాది" యనెను.
    ప్రతాపుఁడు విస్మితుఁడై "ఏమి! శక్తిసింహా? దానిని నీవు చంపితివా? ఇంత స్వల్పవిషయమునను నసత్యమాడెద వేల? దానికి నా బాణమే మొదట తగిలినది. ఇంతటి స్వార్థమా?" యనెను.
    "స్వార్థము- స్వార్థమనియెదవు! స్వార్థబుద్ధి యెనరికి లేదు? నీవు స్వార్థబుద్ధితోనేగదా మేవాడ రాజ్యమెల్ల నాక్రమించినది!"
    శక్తిసింహుని యీమాటలు విని ప్రతాపుఁ డుద్రిక్తుఁడాయెను.
    "శక్తిసింహా! మహారాణాను తూలనాడిన శిక్షార్హుఁడ వగుదువు."
    "ప్రతాపసింహా! నన్ను శిక్షించుటకు నీకేమి యధికారము గలదు? పలుమాటలేల? చేతనయిన నాతో యుద్ధమొనర్చి - నన్ను జయించి - వరాహమును గొని పొమ్ము!"
    ఈ మాటలు వినఁగానే ప్రతాపుఁడు ఒరనుండి కత్తి దూసి ముందునకు దుమికెను.
    సోదరు లిరువురు భయంకర సంగ్రామమునకు సన్నద్ధులై నడుములు బిగించి ముందున కుఱికిరి.
    రాజపురోహితుఁడు 'హరభట్టారకు' డీ యన్నదమ్ముల యంతఃకలహమును జూచి "నాయనలారా! శాంతింపుఁడు! శాంతింపుడు! సోదరులలో వివాదములు దేశానర్థకములు" అని ప్రతాపశక్తిసింహుల వారింపఁబోయెను. కాని అతని హితోక్తులు వారి చెవి కెక్కలేదు.
    ఇంతలో 'హా! మహారాణా?' అను కంఠధ్వని వినవచ్చెను.
    ప్రతాపశక్తిసింహులు నిశ్చేష్టులయిరి.
    హరభట్టారకుఁడు ఖడ్గముతో వక్షస్స్థలమునఁ బొడుచుకొని వారిరువురిమధ్య పడిపోయెను. అచ్చటి భూభాగమంతయు రక్తసిక్తమైపోయెను.
    ప్రతాప శక్తిసింహులు హరభట్టారకుని సమీపించి "పూజ్యగురూ! మమ్ముక్షమింపుఁ"డని ప్రార్థించిరి.
    హరభట్టారకుఁడు కనులు తెఱచి "వత్సలారా! నా కొఱకు పశ్చాత్తాప పడకుఁడు. నా రక్తముతో మీ విద్వేషానలము శాంతించి యుండవచ్చును. మీలో నైకమత్యము నెలకొల్పఁ దలంచియే నేనాత్మర్పణము గావించితిని" అనుచుండఁగనే అతని ప్రాణపతంగము దేహపంజరమునుండి యెగసి పోయెను.
    బ్రహ్మహత్య - గురుహత్య జరిగిపోయినవి.
    ప్రతాపసింహుఁడు క్రోధావేశము నాపుకొనలేక "ఛీ! శక్తిసింహా! నీ మూలముగా గురుదేవులను గోల్పోయితిని. నీకు రాజదండనము తప్పదు. నీకు దేశభ్రష్టత శిక్షగా నిర్ణయించినాము. ఇదే మా యాజ్ఞ. ఇటనుండియే నీవు దేశాంతరమునకుఁ బొమ్ము" అని పల్కెను.
    శక్తి సింహుఁడు చేయునది లేక పండ్లు పటపట గోరుకుచు నటనుండి వెడలిపోయెను. ప్రతాపసింహుఁడు భట్టారకుని శరీరమున కంత్యక్రియలు జరిపించెను.


                             3


    ప్రతాపసింహుఁడొకనాఁటి సాయంకాలము మంత్రులతోఁగూడి మంత్రాలోచన మొనరించుచుండెను. పది పదునైదేండ్ల ప్రాయముగల ప్రతాపునికుమార్తె భారతి వీరగీతు లాలపించుచు విలువిద్య నభ్యసించుచుండెను. ఇంతలో నొక చారుఁడరుదెంచి ప్రతాపునకు నమస్కరించి యిట్లు పల్కెను:
    "మహాప్రభూ! అత్యంతావశ్యకములగు విషయములు కొన్ని తెలియవచ్చినవి. సావధానముగా వినుఁడు. మొన్న తమ యాజ్ఞానుసారము దేశభ్రష్టుఁడైన శక్తి సింహుఁడు ఢిల్లీశ్వరుని గలిసికొనెనఁట!"
    "ఏమీ! శక్తిసింహుని వీరత్వము! దేశద్రోహమునకుఁ బాల్పడియెనా?"
    "అవును; ప్రభూ! అక్బరును దర్శించి మ్రొక్కి తనకుఁ గొలువుకూటమున నొక యున్నతోద్యోగమిచ్చి గౌరవింప వలసినదని కోరెనఁట."
    "ఇంకేమి - అక్బరు మందహాస మొనర్చి గౌరవించి యుండవచ్చును."
    "శక్తిసింహుఁడొక యున్నతసైనికాధికారిగా నియమింపఏబడినాఁడట. ఇఁక నక్బరు తన రాజనీతిజ్ఞత నుపయోగించి శక్తిసింహుని మనపై ప్రయోగింప వచ్చునని చూచాయగాఁ దెలియవచ్చినది".
    ప్రతాపసింహుఁడు దీర్ఘాలోచనా నిమగ్నుఁడయ్యెను.
    ఇంతలో మహారాణా కుమారుడు 'అమరసింహుఁడు' సంభ్రమముతోఁ జనుదెంచెను. ప్రతాపుఁడులికిపడి వానిని జూచి యిట్లనెను:
    "ఏమి! అమరసింహా! మనలంజూడ నేతెంచిన 'మానసింహు'నకుఁదగు మర్యాద లొనరించితివా?"
    "మీ యానతి ననుసరించి 'మానసింహు'నాకు విందు నేర్పాటు గావించితిని. అతఁడు 'విందుఁగుడువ మీ తండ్రి రాలేదే'మని యడుగ నేనందులకు 'తమరు ఢిల్లీశ్వరుల ముద్దుల బావమరదులు. ఇఁక మా తండ్రి ప్రతాప సింహుఁడు సామాన్యరాజు. గౌరవనీయులగు తమ సహపంక్తిని గూర్చుండి విందారగించు నర్హత మా నాన్నగారికి లే"దని ప్రత్యుత్తర మిచ్చితిని. అందుల కాతఁడు మండిపడి కూర్చున్న చోటునుండి లేచి 'మీ తండ్రి గొప్పదనము చూచెదఁగాక - సిద్ధముగానుండు' మని - యింకేమేమో ప్రేలుచు వెడలిపోయెను."

 Previous Page Next Page