తను ఊహిస్తున్నది కరెక్టే కావచ్చు. తప్పూ కావచ్చు. కానీ ఇలా కూడా ఎందుకు జరిగి ఉండకూడదు.
రాజూ, బిల్డింగ్ వాలా ఆమెలో వచ్చిన మార్పుని తదేకంగా చూస్తున్నారు.
"నేనొకసారి ఫోన్ ఉపయోగించవచ్చా?" అంది అమూల్య. అణిచి పెట్టుకుందామన్నా ఆమె గొంతులోని ఆతృత అందరికీ అర్ధమయిపోతోంది.
"యూ ఆర్ వెల్ కమ్!" అన్నాడు రాజు.
కోయంబత్తూర్ కి లైటినింగ్ బుక్ చేసింది అమూల్య.
ఒక క్షణం పాటు బిల్డింగ్ వాలా వైపు సాభిప్రాయంగా చూశాడు రాజు.
కాసేపటి తర్వాత కనెక్షన్ వచ్చింది.
తనని తాను ఐడెంటిఫై చేసుకుని, తర్వాత చెప్పింది అమూల్య "నాకు కలైమణి అనే ప్రింటింగ్ ప్రెస్ ఓనరు గురించి ఇన్ ఫర్మేషన్ కావాలి. బహుశా అతను చాలా రోజుల క్రితమే మరణించి ఉండవచ్చు."
మళ్ళీ మొహాలు చూసుకున్నారు రాజూ, బిల్డింగ్ వాలా కొద్దిసేపటి తర్వాత సమాధానం చెప్పారు లైన్లో అవతల ఉన్నవాళ్ళు.
"ప్రింటింగ్ ప్రెస్ యజమాని కలైమణికి భార్యా పిల్లలు లేరు. అతను పనిమీద మదురైవెళ్ళి అక్కడ మరణించాడు. బంధుమిత్రులెవరూ రాకపోవడంవల్ల మునిసిపాలిటీ వారే అంత్యక్రియలు జరిపించారు. డెత్ సర్టిఫికెట్ నెంబరు...."
వివరాలన్నీ నోట్ చేసుకుని "థాంక్స్!" అని చెప్పి, ఫోన్ పెట్టేసింది అమూల్య. ఆమె మొహంలో విజయ గర్వం కనబడుతోంది.
"వాట్ షెర్లాక్ హోమ్స్! కేస్ అప్పుడే సాల్వ్ చేసేశావా?" అన్నాడు బిల్డింగ్ వాలా ఆశ్చర్యంగా.
"చేశాను! కానీ నిఖిల్ గారితోనే చెబుతాను వివరాలు!"
కన్ సీల్డ్ మైక్రోఫోనుల్లో నుంచి ఆ మాటలన్నీ నిఖిల్ వింటున్నాడని తెలియదు అమూల్యకి.
అయిదు నిమిషాల తర్వాత నిఖిల్ రూంలోకి వెళ్ళింది ఆమె.
ఆమెను ఆపాదమస్తకం పరీక్షగా చూశాడు నిఖిల్. "కూచో!"
ఆమె కూర్చున్న తర్వాత "చెప్పు" అన్నాడు నిదానంగా.
"కంగ్రాట్స్! మీవాళ్ళమీదకు కేసురాదు!"
"ఎందువల్ల!"
"మొదటినుంచి చెబుతాను"
"చెప్పు!"
దీర్ఘంగా ఊపిరి తీసుకుంది అమూల్య. "కలైమణి మొదటినుంచి కూడా అడ్డదారులు తొక్కేరకమే! నకిలీ టిక్కెట్లు అచ్చుకొట్టడంలో సంపాదించిన డబ్బు అతనికి సంతృప్తిని కలిగించలేదు. అతను ఎక్సెలెంట్ ఫోర్జరీ ఆర్టిస్టు. అందుకని అతను దొంగపాస్ పోర్టులు ఫోర్జరీచేసి అమ్మడం మొదలెట్టాడు. స్మగ్లర్లతో మంచి కాంటాక్ట్ ఏర్పడింది" అని ఒకసారి భావగర్భితంగా అతనివైపు చూసింది. "ఆ డబ్బు కూడా కలైమణి కంటికి ఆనలేదు. అప్పుడు మొదలెట్టాడు తన కస్టమర్సుని బ్లాక్ మెయిల్ చెయ్యడం"
"అతి జాగ్రత్తగా వింటున్నాడు నిఖిల్.
"అతనితో సంబంధం పెట్టుకుని ఫోర్జ్ చేసిన డాక్యుమెంట్లు తీసుకుంటున్న వాళ్ళలో మీరూ ఉన్నారు. అతను మిమ్మల్నీ బ్లాక్ మెయిల్ చెయ్యబోయాడు" అని ఆగింది అమూల్య.
"వింటున్నాను చెప్పు"
"మీతో తగాదా పెట్టుకోవడం అంటే ప్రాణంతో చెలగాటం అని అతనికి తెలియదు. మీరు అతన్ని ఫినిష్ చేసెయ్యదలుచుకున్నారు. మీరంటే ప్రత్యర్ధులకు టెర్రర్ కలిగించడంకోసం, మీరు ఏ కేసులో ఇరుక్కోకుండా ఉండడం కోసం, ఒకవేళ ఇరుక్కున్నా తేలిగ్గా బయటపడడంకోసం, మీరు అవలంబించే పద్దతులు చాలా నావెల్ గా, కొత్తరకంగా ఉంటాయి" అతను తనని పావులా వాడుకుని, కేసులో నుంచి బయటపడడం జన్మలో మర్చిపోలేని చేదు అనుభవం ఆమెకి. అది మనసులో మెదులుతూ వళ్ళు మరిచి పోయేటట్లు చేస్తుంటే, తన భావాలు కళ్ళలో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడింది అమూల్య.
అతను నవ్వాడు.
కష్టంమీద కోపాన్ని ఆపుకుని చెప్పింది అమూల్య. "అందుకని, కలైమణిని ఫినిష్ చేసెయ్యడం కోసం ఒక అద్భుతమైన వ్యూహం పన్నారు మీరు."
"ఏమిటది?"
"అందరితో విరోధం పెట్టుకున్న కలైమణి తన ప్రాణాలకు మోసమొస్తుందని భయపడి, కోయంబత్తూరు వదిలి ఊళ్లుపట్టుకు తిరగడం మొదలెట్టాడు.
అప్పుడు మదురైలో ఒక అనాథ ప్రేతాన్ని సంపాదించి కలైమణి చనిపోయాడని, అదే కలైమణి శవం అనీ అధికారులు నమ్మేలా చేసి, దహనం చేయించి, రికార్డులలో ఎంట్రీ వేయించారు మీరు. నిజానికి కలైమణి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, వేటాడబడుతున్న జంతువులా ఊళ్ళు తిరుగుతున్నాడు అప్పుడు.
కలైమణి చనిపోయినట్లు నమోదు చేయించాక, అతని మీద దృష్టి కేంద్రీకరించారు మీరు. చావుని వెదుక్కుంటున్నట్లు కలైమణి హైదరాబాద్ వచ్చాడు. హోటల్లో దారుణంగా హత్యచేయించారు అతన్ని. శవాన్ని రాబందులకు వేశారు. అప్పుడు ఇంక, అన్ని వైపులా కన్నం పడిపోయిన పడవలా అయిపోయింది ఈ కేసు. కలైమణిని హత్యచేశారని కేసుపెడితే అతను రెండు నెలల క్రితమే సహజమరణం పాలయ్యాడని డాక్యుమెంట్సు తెస్తారు మీరు.
అదీకాకుండా, అసలు ఇక్కడ హత్య అనేదేదీ జరిగినట్లు ఆధారాలేలేవు. శవాన్ని క్షణాల్లో మాయం చేశారు. హత్య జరుగుతూండగా చూసిన వాళ్ళెవరూ సాక్ష్యం చెప్పడానికి సాహసించరు! ఇంక కేసేముంటుందీ?
పైగా, మీరు ఎవరినైనా, ఎంతరేటుకైనా కొనెయ్యగలనని చెబుతూ ఉంటారు కదా?" అంది.
చాలాసేపు ఆమెవైపు చూస్తూ ఉండిపోయాడు నిఖిల్. తర్వాత అన్నాడు.