Previous Page Next Page 
హత్య పేజి 15


    "అనుమానం కాదులే. తెలుసుకుందామని అంతే!"

 

    "ఏమిటి?"

 

    "ఈ కొండమీద పులులు. సింహాలు, చిరతగొండ్లు"

 

    "అవిలేవుగాని మరొకటి వున్నాయి.

 

    "ఎలుగుగొడ్లులాంటివి కాదు కదా?"

 

    "ఉహూ! ఉడుతలు తొండలు లాంటివి."

 

    "ఫరవాలేదు. నాకు తోడు సాధు ప్రాణాలు కొన్నివున్నాయి. పద పైకి వెళదాం" రాగయుక్తంగా అన్నాడు కైలాసగణపతి.

 

    ఇరువురూ మళ్ళీ నడకసాగించారు.

 

    ఉరుముకొండ మరీ పెద్దదేమీ కాదు. ఓ గంట కష్టపడితే కొండ చివరిదాకా ఎక్కొచ్చు. మరీ నిలువునా లేకపోవటం వలన కొండ ఎక్కటం కూడా కష్టమేమీ కాదు.

 

    ఉరుముకొండ కానుకొని అంటే పక్కపక్కల మరో అయిదు కొండలున్నాయి. కొండకి కొండకి మధ్య లోయలున్నాయి.  రెండు కొండలమధ్య లోయకి అటూ ఇటూ దారిలేదు! దాదాపు కలిసి వుంటుంది. తతిమా కొండలమధ్య మాత్రం డొంకదారిలాంటి సన్నని దారులున్నాయి అన్ని కొండలున్నా క్రూరజంతువుల బాధ చుట్టుపట్ల గ్రామస్ధులకి లేదు.

 

    కాకపోతే ఈ మధ్య ఊళ్ళోకూడా పగా ప్రతీకారానికి సంబంధం లేని హత్యలు జరిగాయి. ఎలా జిరిగిందో, ఎందుకు జరిగిందో తెలియక ఆ విషయం కూడా మరుగునపడిపోయింది.

 

    ముఖ్యంగా ఉరుముకొండలో రాళ్ళని పరిశోధించటానికి వచ్చినవాళ్ళు హత్య కాబడ్డారు కాబట్టి ఇంకామూఢవిశ్వాసాలు మనుషుల్లో తగ్గలేదు కనుక ఆ రాళ్ళని పరిశోదించడం కొండ దేవతకి యిష్టంలేక యిలా బలితీసుకుంది. ఇది హత్య కాదు పాడూ కాదు. అన్న మూఢశిఖాగ్రేసరులు లేకపోలేదు.

 

    కైలాస గణపతి పరిశోధించడానికే వచ్చాడు.

 

    సూర్యారావు ముందు జాగ్రత్త వహిస్తూ హెచ్చరిక చేశాడు.

 

    కాబట్టి కైలాసగణపతి ప్రాణానికి ఏ ముప్పూ రాకపోవచ్చు. అది వేరే విషయం.

 

    ఇద్దరూ సగం పైదాకా కొండ ఎక్కారు.

 

    "మరోపావుగంటకి పొద్దుగూకుతుంది. ఈ పూటకి చివరిదాకా ఎక్కవద్దు రేపు పెందరాడే వచ్చి కావాలంటే కొండంతా తిప్పుతాను సరేనా?" సూర్యారావు అడిగాడు.

 

    "సరే" అన్నాడు కైలాసగణపతి.


            
                                      11

 

    ఇరువురూ ఒక గుహదగ్గర ఆగారు.

 

    "ఈ గుహలోకి వెళదామా?" కైలాస గణపతి అడిగాడు.

 

    "ఇప్పుడు వద్దు" అన్నాడు సూర్యారావు.

 

    "అదేమి ఇక్కడిదాకా వచ్చి వెళ్ళకపోవటం?"

 

    "దానికొక కధ వుంది"

 

    "బాగుంది! ఇక్కడ రాసుకో కధ, రప్పకోకధలా వుందే? ఇంతకి ఆ కధ ఏమిటో కానియ్యి." అన్నాడు కైలాసగణపతి గుహలోపలిదాకా దృష్టిసారించి.

 

    "అలా వెడుతూ మాట్లాడుకుందాము" అన్నాడు సూర్యారావు.

 

    "పైకా? కిందకా?"

 

    "పక్కకి, అటుకూడా ఒక గుహవుంది చూద్దువుగాని వెడదాం. అటు నడుస్తూ మాట్లాడుకుందాం"

 

    "సరే!" అని సూర్యారావు వెనకే పదడుగులువేసి "ఇహ కానియ్యి హరికధ" అన్నాడు.

 

    "ఇది హరికధకాదు కైలాసం గిరి కధ."

 

    "అలాగే అనుకుంటాను కధ కానియ్యి"

 

    "ఆ గుహలో గవ్వలమ్మవుంది......"

 

    "ఆవిడెవరు?" ఆతృతగా అడిగాడు.

 

    "దేవత"

 

    "దేవతలూ దయ్యాలుకూడా వుంటాయన్నమాట"

 

    "నీలు మాటకి ముందు అలా అడ్డు తగలకు నేను విడమరిచి కధ అంతా చెపుతాను."

 

    "కానియ్యి."

 

    "గవ్వలమ్మ అనే దేవతకి చాలా శక్తులున్నాయట ఆమెని ఆరాధించి, కొలిచి నియమనిష్టలతో పూజిస్తే గతము భవిష్యత్తు ఆత్మలు మాట్లాడటము తెలుస్తాయట. సోదిచెప్పే సోదివాళ్ళ దేవత ఈ గవ్వలమ్మ"

 

    "అయితే గవ్వలమ్మ ఆ గుహలో వుందా?"

 

    "ఊ"

 

    "ఆమెకి ఎన్నేళ్ళుంటాయి?"

 

    "ఆమెకి ఏళ్ళు ఉండటం ఏమిటి?" ఎదురు ప్రశ్నవేశాడు సూర్యారావు.

 

    "గవ్వలమ్మ ఆ గుహలో వుందని చెప్పావు కదరా సూరీడూ!"

 

    "ఇన్నాళ్ళు దేశంమీద తిరిగావు. ఎన్నో తెలుసుకున్నాను. నీకు బొత్తిగా ఏమీ తెలియదురా కైలాసం! గవ్వలమ్మ అనే దేవత నిజంగా ఉందో లేదో ఎవరికి తెలియదు. ఆ దేవత సోదివాళ్ళకి దేవతగాని మనకి కాదు. కుండదానిమీద మూకుడు, ఒకచేట వుంటాయి. కుండలో చిన్న పెద్ద గవ్వలు దోసెడు వుంటాయి. ఓ కొండగుహలో సోదివాళ్ళు వీటిని పెట్టి అర్థరాత్రి ఆ దేవతను పిలిచి కొలుస్తారట. ఆ దేవత కుండలో గవ్వలమీద కూర్చుని కొలిచిన వాళ్ళకి శక్తులనిస్తుందిట. ఆ కుండని వాళ్ళు అలాగేవుంచేసి మధ్య మధ్య అర్థరాత్రిళ్ళు మూడు నెలలకో, ఆరు నెలలకో కొలుస్తుంటారు.

 

    గవ్వలమ్మ దేవతని కొలవటం వల్లనే సోదివాళ్ళకి సోది చెప్పే శక్తి వస్తుందట. సోదివాళ్ళు ఎవరో ఆ గుహలో కుండని పెట్టారు. కావాంటే ఉదయం పన్నెండు గంటల లోపల వెళ్ళి ఆకుండని అంటే గవ్వలమ్మని ముట్టుకోకుండా వెళ్ళిచూసిరావచ్చు. సాయంత్రం వేళల ఆమెకి శక్తులు ఎక్కువట. ఈ విషయం తెలిసినవాళ్ళు ఎవ్వరూ మధ్యాహ్నం పన్నెండు దాటింతర్వాత గుహలోకి వెళ్ళరు." సూర్యారావు విడమరచి చెప్పాడు.

 Previous Page Next Page