ఆదినారాయణ లేచాడు. "మీరూ వెళ్ళిచూడండీ" అని స్వామి అనడంతో రాఘవులు, సుబ్బాచారి ఆదినారాయణను అనుసరించారు.
ఆదినారాయణ బయటికి వెళ్ళడంతోనే నోట్లో నిండిపోయి వున్న రసాన్ని ఉమ్మాడు. ఎర్రటి రంగులో రక్తం పడ్డట్టు పడింది.
కొళాయి దగ్గర నోరంతా శుభ్రం చేసుకున్నాడు.
ముగ్గురూ తిరిగి లోపలికి వచ్చారు.
"అవి మంత్రించిన ఆకులు. ఆమెవరో మందు పెట్టేసింది. నిజమైతే సున్నం పూయని ఆకులైనా ఎర్రటి రసం వచ్చుంటుంది. లేకుంటే ఆకుపచ్చ రంగులో వుంటుంది. జ్వరం వస్తే ధర్మామీటర్ పెట్టి కొలిచినట్టి ఇది మంత్రంతో చేసిన టెస్ట్" స్వామి కళ్ళు తెరవకుండానే అంతా తనకు తెలుసునన్నట్టు ముఖంలో నవ్వును పూయిస్తూ చెప్పాడు.
సుబ్బాచారి ఠక్కున రెండు చేతులూ కట్టుకుని "ఎర్రగా వచ్చింది స్వామీ" అన్నాడు భయం భయంగా.
"అయినా నువ్వేం భయపడకు. ఇదిగో ఈ మందును మూడు రోజులు ఉదయాన్నే పాలల్లో కలిపి ఇచ్చేయ్. మొత్తం ఆమె పెట్టిన మందంతా పేగుల్లోంచి బయటకు కొట్టుకొచ్చేస్తుంది. ఇది మంత్రించిన కుంకుమ. దీన్ని రోజూ రాత్రుళ్ళు పడుకునే ముందు నుదుటన పెట్టుకోమను. ఆ పిల్ల మీద పడ్డా మనవాడి మనసు చలించదు" అంటూ స్వామి రెండు పొట్లాలు తీసిచ్చాడు.
సుబ్బాచారి వాటిని భక్తితో తీసుకున్నాడు.
ముగ్గురూ తిరిగి ఊరికి వచ్చేశారు.
రాఘవులుకి మాత్రం వూరికి వచ్చేసినా స్వామితప్ప మరేమీ కళ్ళ ముందు కదలడంలేదు.
స్వామి అనుభవిస్తున్న లగ్జరీ, దర్శనార్థం వస్తున్న స్త్రీలు, చుట్టూ పరిచారికా జనం, సంఘంలో ఓ హోదా- వీటిని మరిచిపోలేకపోయాడు. ఎలాగయినా తను స్వామిలా అయిపోవాలనుకున్నాడు.
రోజురోజుకీ ఆ కోరిక ఎక్కువైపోయింది చాలీచాలని ఆదాయం, కష్టం చేసి సంపాదించాలన్న ధ్యాసలేక పోవడం- మొహం మొత్తేసిన భార్య- ఇవి మరీ ప్రేరేపించటంతో ఓ రాత్రి ఎవరికీ చెప్పా పెట్టకుండా స్వామి దగ్గిరికి ఉడాయించాడు.
మొదట తోటమాలిగా ఆశ్రమంలో ప్రవేశించాడు. స్వామి శిష్యుల్లో ఒకడయ్యేందుకు ఓ సంవత్సరం పట్టింది. తన తెలివితేటలన్నీ ఉపయోగించాడు. అరవిందస్వామి అభిమానాన్ని సంపాదించేందుకు ఎన్ని మార్గాలున్నాయో వాటినన్నిటినీ ఆశ్రయించాడు. చివరికి ఆయనకీ ప్రియశిష్యుడై పోయాడు.
ఇక అప్పట్నుంచి రాఘవులు వెనక్కి తిరిగి చూడలేదు. మంత్రాలు, తంత్రాలు దగ్గర్నుంచి తాయెత్తులు కట్టేవరకు అన్నీ నేర్చుకున్నాడు. వాటికి సంబంధించి అన్ని పుస్తకాలూ చదివాడు. తనమీద తనకి పూర్తిగా నమ్మకం కుదిరాక అక్కణ్నుంచి వచ్చేశాడు.
ఊరికి సమీపంలో, టౌన్ కి ఓ పదికిలోమీటర్ల దూరంలో బంజరు భూమిని కొంత సంపాదించి ఓ చిన్నపాక వేసుకున్నాడు.
మొదట భూతవైద్యుడి అవతారం ఎత్తాడు. దెయ్యాల్ని, పిశాచాల్ని తరమడంలో ఆయనకీ మించినవాడు మరొకరు లేడని పేరు తెచ్చుకున్నాడు. ఎంత కఠినమైన రోగమైనా చిటికెడు విభూదితో నయం చేస్తాడన్న ప్రతీతిని తెచ్చుకున్నాడు.
మెల్లమెల్లగా అతని నివాసం అభివృద్ధి చెందింది. ఆరెకరాల స్థలంలో ప్రారంభమైన అతని ఆశ్రమమ పదెకరాలకు విస్తరించింది. గుడిసె స్థానంలో ఓ పెద్ద బంగళా లేచింది. శిష్యులు చేరారు. రాఘవులు కాస్త రాఘవానందంగా మారాడు.
అదిగో ఆ సమయంలో తనకున్న స్త్రీ కోరికల్ని తీర్చుకోవాలన్న బుద్ధి బయల్దేరింది. దాన్నెలా అమలు చేయాలో అప్పటికే పథకం సిద్ధం చేసుకున్నాడు.
అప్పుడొచ్చింది అక్కడికి కస్తూరి. ఆమెకి ముప్పై అయిదేళ్ళుంటాయి. ఎక్కడి అందాలు అక్కడే గప్ చిప్ అన్నట్టు శరీరంలో ఎక్కడా బింకం సడలలేదు. చామనఛాయతో ఆమె ఎంతో సెక్సీగా వుంది. విశ్వామిత్రుడిలాంటి మహామునులు ఎందుకు తపోభంగం చేసుకున్నారో రాఘవులుకి గుర్తుకొచ్చింది.
ఆమెను తన పర్సనల్ గదిలోకి పిలిపించుకుని ఆమెకొచ్చిన కష్టం ఏమిటో అడిగాడు.
"పిల్లల్లేరు" అంది ఆమె తలొంచుకుని. దానికి ఆమె ఎంత బాధ పడుతుందో వణికిన గొంతే చెప్పింది. ఆమె భర్త ఏదో ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళయి ఏడేళ్ళు అవుతున్నా వాళ్ళిద్దరూ అమ్మానాన్నలు కాలేకపోయారు.
"పిల్లలు లేకపోవడం ఎంత ఆవేదనకు గురిచేస్తుందో నాకు తెలుసు. మా ఊర్లో జరిగిన ఓ సంగతి చెబుతాను. అది విన్నాక ఏం చేయాలో నిర్ణయించుకుందాం" అన్నాడు రాఘవానంద నిర్మలంగా నవ్వుతూ.
ఆమె ఆయన వంక చూస్తోంది.
"మా ఊర్లో భీముడు అనే వాడొకడుండేవాడు. వాడి అసలు పేరు ఏదో వుందిగానీ చూడడానికి లావుగా బలిష్టంగా వుండడంవల్ల వాడ్ని అ పేరుతోనే పిలిచేవారు. చిన్న చిన్న కరెంటు పనులు చేసి పొట్ట పోసుకునేవాడు. పల్లెటూర్లో కరెంటు పనులు ఏం వుంటాయి? అందుకే చాలీచాలని ఆదాయంతో సంసారాన్ని అతి కష్టంమీద లాక్కొచ్చేవాడు.
వాడి భార్య పేరు బుజ్జి. బాగా మాగిన పనసపండు ఘుమఘుమలాడినట్టు ఆమె కూడా మాంచి వయసులో మత్తు మత్తుగా వుండేది.
భీముడికీ, బుజ్జికీ పెళ్ళయి అయిదేళ్ళు అవుతున్నా పిల్లలు కలగలేదు. రెండో సంవత్సరం నుంచి గుళ్ళూ గోపురాలూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. నాలాంటి వారిని మొక్కినా వాళ్ళ కోరిక తీరలేదు.
వాళ్ళింటికెదురుగానే ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ గా పనిచేసే విశ్వనాథం వుండేవాడు.
సాయంకాలం స్కూల్ నుంచి రాగానే విశ్వనాథం ఎదురింటి భీముడితో బాతాఖానీ వేసేశాడు. అలా వాళ్ళిద్దరికీ స్నేహం. పిల్లల్లేరని రోజూ ఆ దంపతులు విశ్వనాథం దగ్గర వాపోయేవాళ్ళు.
"నిజమే- దేవుడి కరుణ మనమీద సోకకపోతే ఇలాంటి కష్టాలే వస్తాయి. అలాగని ఊరుకుంటే లాభం వుండదు. మీరిద్దరూ టౌన్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ లు చేయించుకోండి. ఏమైనా లోపాలుంటే వాళ్ళు సరిచేస్తారు" అన్నాడో రోజు విశ్వనాథం.
"టెస్ట్ లకి బాగా డబ్బు ఖర్చవుతుందా? నీకు తెలుసు కదా మా కుటుంబ పరిస్థితి" అని అడిగాడు భీముడు. అతనికి తండ్రి కావాలన్న ముచ్చట చాలానే వుంది.
"భీముడంట భీముడు- ఒక్క నలుసునైనా పుట్టించలేకపోయాడు. ఆకారపుష్టి, నైవేద్యంనష్టి- ఎందుకంత శరీరం?" ఇలాంటి మాటలు అతను చాలానే వింటున్నాడు. కాస్తంత క్లోజ్ వున్న వాళ్ళు ఇలాంటి సూటి పోటి మాటల్ని ముఖంమీదనే అనేవాళ్ళు. ఇంకొందరు వినీ వినకుండా కామెంట్ చేసేవాళ్ళు మరికొందరైతే చెవులూ కొరుక్కునేవాళ్ళు.
ఇలాంటి అవమానాల్నుంచి తప్పించుకోవాలంటే తను తండ్రి కావాలి. డాక్టర్ దగ్గరికి వెళితే పిల్లలు పుడతారంటే ఏదో ఆశ మనసునంతా ఉత్తేజపరుస్తోంది. కానీ డబ్బులు ఎక్కడ్నుంచి తెస్తాడు? అందుకే ఎంత ఖర్చవుతుందని భయం భయంగా అడిగాడు.
"పెద్దగా కాదులే" అన్నాడు విశ్వనాథం.
"అయితే రేపే వెళదాం. ఆ డాక్టర్లు, టెస్ట్ ల గొడవలు సరిగా తెలియవు. నువ్వూ మాతో తోడుగారా"
"వస్తాను. మీ ఇద్దరి కడుపు పండితే సంతోషించే వాళ్ళల్లో నేను మొదటివాడ్ని. పిల్లల్లేక మీరెంత బాధపడుతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్న వాడ్ని" అంటూ సానుభూతి చూపించాడు విశ్వనాథం.