ఇక అప్పట్నుంచి ఆయన తన కొడుకు నిర్మలంటే ఎందుకంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడో ఎంక్వయిరీ మొదలుపెట్టాడు.
నిర్మల మందు పెట్టడంవల్లే కొత్త భార్యను వదిలి నిర్మలతో గడుపుతున్నాడని చాలామంది చెప్పడంతో ఆయన కూడా ఆ మాటల్ని నమ్మాడు.
"మందు కక్కించేస్తే సరి. అది పిలిచినా మనవాడు పోడు" అని వాళ్ళంతా తేల్చి చెప్పారు.
అలా స్త్రీలుగానీ, పురుషులుగానీ ఏదన్నా మందు పెట్టేస్తే, దాన్ని కనిపెట్టి కక్కించే దాంట్లో కోడూరు అరవిందస్వామి చాలా ప్రసిద్ధుడు.
ఆయన దగ్గిరికి కొడుకును తీసికెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు సుబ్బాచారి.
ఆదివారం రోజే ఆయన విరుగుడు మందిస్తాడు. దాంతో సుబ్బాచారి తన కొడుకుని పిలుచుకుని ఓ ఆదివారం నాడు బయల్దేరాడు.
మందు పెట్టేసిందని నిర్ధారించిన దగ్గర్నుంచి, అరవిందస్వామి ఆరాతీసి సుబ్బాచారి బయల్దేరేటట్టు చేయడంలో రాఘవులు ప్రముఖ పాత్ర వహించాడు. ఆ విధంగానైనా ఆదినారాయణ పీడ విరగడైపోతే తనకు నిర్మల దక్కుతుందని అతని ఆశ.
అందుకే సుబ్బాచారి పిలవడం తరువాయి వాళ్ళతో తోడుగా వెళ్ళడానికి రాఘవులు తయారయ్యాడు. సుబ్బాచారి, ఆదినారాయణ, రాఘవులు- ముగ్గురూ కోడూరు బస్సెక్కారు.
కోడూరులో మరో బస్సుమారారు.
అక్కడినుంచి చిట్వేల్ రూటులో పదిహేను కిలోమీటర్లు వెళితే పచ్చిమాడల పల్లె వస్తుంది. ఆ ఊర్లోనే అరవిందస్వామి వుండేది.
ఊర్లోకి వెళ్ళగానే "స్వామి వుండేదెక్కడ?" అని విచారించారు.
"ఉత్తరంగా వెళ్ళండి- ఓ మామిడి తోపొస్తుంది. అక్కడే స్వామి వుండేది" అని చెప్పారు.
ముగ్గురూ తిరిగి నడక ప్రారంభించి అక్కడికి చేరుకున్నారు. పదెకరాల స్థలంలో విస్తరించుకొని వుంది ఆశ్రమం. అక్కడక్కడ హోటళ్ళలాంటివి వున్నాయి. అరవిందస్వామి వుండడానికి మాత్రం ఓ పెద్ద మేడ వుంది.
వచ్చినవారు స్వామిని దర్శించుకోవడానికి 'ఇక్కడ రసీదు పొందవలయును' అన్న బోర్డు తగిలించి వున్న ఓ షెడ్డు దగ్గర ఆగారు. అక్కడ ఇద్దరు కుర్రాళ్ళున్నారు.
వాళ్ళను చూడగానే "ఏం కావాలి?" అని అడిగాడు.
"మందు కక్కించుకోవాలి" అన్నాడు సుబ్బాచారి కొడుకును చూపించి.
"నూట పదహారు రూపాయలివ్వండి"
సుబ్బాచారి జేబులోంచి డబ్బు తీసిచ్చాడు. ఓ కుర్రాడు రసీదులాంటిది ఇచ్చాడు.
"అదిగో ఆ మేడ దగ్గిరికి వెళ్ళండి" మరో కుర్రాడు దూరంగా వున్న మేడ చూపించాడు.
ముగ్గురూ అక్కడినుంచి కదిలి మేడ దగ్గరికి వెళ్ళారు.
అది పెద్ద బిల్డింగ్. కింద విశాలమైన హాలు వుంది. వాటి గోడలకు కాళికాదేవి వివిధ రూపాలలో వున్న ఫోటోలు వున్నాయి. 'ఇంద్రియ లాలసతను వదిలిపెడితే ఏకంగా మోక్షమే' లాంటి సూక్తులు రాసివున్న బోర్డులు అక్కడక్కడా వేలాడుతున్నాయి.
హాలు ఓ చివర కాళికాదేవి విగ్రహం వుంది. దాని ముందు ఓ పులి చర్మం తివాచీమీద పరిచివుంది.
అప్పటికే దాదాపు ఏభైమంది వరకూ అక్కడ వున్నారు. వాళ్ళకు సంబంధించిన బంధుజనం కొద్దిదూరంలో కూర్చున్నారు.
"మనిషికి నూట పదహారు రూపాయల చొప్పున వసూలు చేశారు కదా, ఆ లెక్కన అరవిందస్వామికి అయిదువేలు ఈరోజు రాబడి" అన్నాడు రాఘవులు సుబ్బాచారి చెవిలో నెమ్మదిగా.
"అలాంటి మాటలనకు. స్వామి చాలా శక్తిగలవాడు. మన మాటలు ఆయనకీ వినిపించినా వినిపించగలవు" అన్నాడు సుబ్బాచారి భయంగా.
"ఇంతకీ స్వామి ఎప్పుడొస్తాడు?"
"శక్తిపూజలో వున్నాడట. మరో పదినిముషాలకి రావచ్చన్నారు" అన్నాడు సుబ్బాచారి.
అరవిందస్వామి ఖచ్చితంగా మరో పదినిమిషాలకి వచ్చాడు. ఆయన రాగానే జనమంతా ఒక్కసారి లేచి నిలబడి చేతులు జోడించారు.
అరవిందస్వామికి అరవై అయిదేళ్ళవరకూ వుండొచ్చు. కానీ ఆయన శరీరం దృఢంగా, రాయిలా వుంది. తెల్లగా వుండడంవల్ల గోధుమపిండి ముద్దలా వున్నాడు. మొలకు ఎర్రటి అంగీ తప్ప ఒంటిమీద మరేం లేదు. నుదుటిని పెద్దకుంకుమ బొట్టు గోధుమ పంటచేల మధ్య మిరపకాయల తోటలా వుంది. మెడలో రుద్రాక్షమాల ఇనుపగుళ్ళ మాలలా వుంది. అదీగాక ముత్యాల దండలాంటిది అన్నం మెతుకులను ఒకదానికొకటి అంటించినట్టు వేలాడుతోంది.
దేవుడు యుగానికి ఒక అవతారం ఎత్తితే ఆయన మాత్రం అన్ని అవతారాలను ఒకేసారి ఎత్తినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనపడతాడు.
కొందరికి ఆయన గజమంత్రగాడిలా అనిపిస్తే, ఇంకొందరికి ఆధ్యాత్మికామృతాన్ని పంచడానికి జన్మించిన స్వామిలా కనిపిస్తారు. మరి కొందరు తాంత్రిక స్వమిలా భావిస్తారు.
వాళ్ళ నమ్మకాలు వమ్ము చేయనట్టు ఆయన కూడా మంత్రాలు వేస్తాడు, తంత్రాలు చేస్తాడు, యంత్రాలు (తాయెత్తు లాంటివి) కడతాడు.
వచ్చిన వాళ్ళందరికీ నమస్కరించి స్వామి తిరిగి తన పర్సనల్ గదిలోకి వెళ్ళాడు. ఒక్కో రోగిని పిలిపించుకొని, రోగమేమిటో నిర్ధారించుకున్నాక మంత్రమో తంత్రమో వేస్తాడు.
వచ్చినవాళ్ళలో స్త్రీలు కూడా చాలామంది వున్నారు. డాబూ దర్పం వున్న వాళ్ళు కూడా భయభక్తులతో రావడం చూసి రాఘవులు ఆశ్చర్యపోయాడు.
ఒక్కొక్కరు లోపలికి వెళ్ళి తిరిగి వస్తున్నారు.
ఆదినారాయణ వంతు వచ్చేటప్పటికి చాలాసేపే అయింది.
గదిలో ముగ్గురూ కింద కూర్చున్నారు. అది ఎ.సి. గది కావడంతో గాలి చల్లగా తగుల్తోంది. గాలిక్కూడా వాసన వున్నట్టు సువాసనలు ముక్కు పుటాలను తాకుతున్నాయి . బ్లూ రంగు తెరలతో ఆ గది నీటి అడుగున దేవతలు కట్టుకున్న ఇల్లులా వుంది.
అరవిందస్వామి ఓ పెద్ద కుర్చీలో అపరశంకరుడిలా వున్నాడు. ఇద్దరు యువకులు స్వామి ఆజ్ఞలను నెరవేర్చడానికి అప్రమత్తతతో వున్నారు.
"ఏమిటి సమస్య?" స్వామి గంభీరంగా అడిగాడు.
సుబ్బాచారి తన కొడుకును చూపిస్తూ-
"వీడు నా కొడుకు ఆదినారాయణ. మా ఊర్లో ఓ టక్కులాడి వుంది. దాన్ని వదలడం లేదు వీడు. ఈ మధ్యనే పెళ్ళయింది. భార్యకు కూడా కాదని వీడు ఆ టక్కులాడితో వుంటున్నాడు."
స్వామి ఓ సారి కళ్ళు మూసుకుని అంతా తన మహిమతో చూస్తున్నట్టు కదలకుండా వుండిపోయాడు. మరో రెండు నిముషాలకి కళ్ళు తెరిచి శిష్యుడి వైపు తిరిగి "రెండు నల్ల తమలపాకులు, వక్క- సున్నం వేయవద్దు- ఇటివ్వు" అని అడిగాడు.
మరో నిముషానికి శిష్యుడు గురువు అడిగింది తీసుకొచ్చి ఇచ్చాడు.
వాటిని ఆదినారాయణకు ఇచ్చి "బాగా నములు రసం మాత్రం ఊయకు" అని చెప్పాడు.
ఆదినారాయణ బుద్ధిగా వాటిని నమలడం మొదలుపెట్టాడు. మరో అయిదు నిముషాలవరకు స్వామి మౌన ముద్రలో వున్నాడు.
"ఇప్పుడెళ్ళి బయట నోటిలోని తాంబూలరసం ఊసిరా" అన్నాడు.