Previous Page Next Page 
వ్యూహం పేజి 15


    "మీ బాబు రాజకీయంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే నువ్వు కన్నెపిల్లల్ని నాశనం చేయాలని చూస్తావట్రా... ఎమ్మెల్యే కొడుకువి కాబట్టి పాకీ పనులు చేస్తే చెల్లుతుందనుకోకు... ఇక ముందెప్పుడయినా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని తెలిసిందా, పెళ్ళాం దగ్గరకూడా పనికిరాకుండా నేనే స్వంతంగా నీకు ఆపరేషన్ చేసి పారేస్తాను" కోపంగా అన్నాడు శక్తి.

 

    బాలచంద్ర గుడ్లు అప్పగించి వెర్రిచూపులు చూస్తుండిపోయాడు.

 

    "అన్నయ్యా- నువ్వు రాకపోతే..." ఏడుపును ఆపుకుంటూ అంది నాగమణి.

 

    "ఈ టైంలో ఎందుకు వచ్చావు."

 

    నాగమణి సమాధానం చెప్పలేదు.

 

    "నాన్న అడిగితే ఏమని చెబుతావు" వెక్కుతూనే అడిగింది నాగమణి.

 

    "ఇంతవరకూ మా ఇంట్లో చదువుకుంటుందని చెబుతానులే- నాకు శారద ఎంతో నువ్వు అంతే. జీవితంలో ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించకు-" అన్నాడు శక్తి సీరియస్ గా.

 

    మిత్రులకు వీడ్కోలు చెప్పి, నాగమణిని వాళ్ళింటి దగ్గర దిగబెట్టి ఇంటికి వచ్చాడు శక్తి.

 

    అప్పటికి ఇంట్లో వాళ్ళందరూ మంచి నిద్రలో వున్నారు. వంట గదిలోకి వెళ్ళి తనే వడ్డించుకు తిని గదిలోకి వెళ్ళిపోయాడు.

 

                                *    *    *    *

 

    బాగా తెల్లవారిపోయాక మెలుకువ వచ్చింది శక్తికి.

 

    గడియారం వైపు చూసాడు.

 

    ఎనిమిది అయింది. గబుక్కున లేచాడు.

 

    శక్తి లేవటం గమనించిన శారద కాఫీగ్లాసుతో ప్రత్యక్షమయ్యింది. శారద కనపడటంతో, ఫీజు విషయం జ్ఞాపకానికి వచ్చింది.

 

    గ్లాసు అందుకుని

 

    "ఫేంట్ జేబులో డబ్బులుంటాయి తీసుకో..." అన్నాడు శక్తి.

 

    "దేనికి... ఫీజుకా?" అడిగింది శారద.

 

    "మరి?"

 

    "అమ్మ నిన్న ఇచ్చిందిగా."

 

    ఒక్కక్షణం ఆలోచనలో పడ్డాడు శక్తి.

 

    స్నానం చేసివచ్చి, గదిలో బట్టలు మార్చుకుంటూ వుంటే తల్లి గదిలోకి వచ్చింది.

 

    "శారద ఫీజు విషయం వారం రోజుల నుంచి ఎంతగానో ప్రయత్నించాను. ఆఖరుకు నిన్న సాయంత్రం ఆ సూర్యంగారి దగ్గరకు వెళ్ళి అడగవలసి వచ్చింది. మహానుభావుడు ఎప్పుడు అడిగినా కాదనడు. నువ్వు ఆయన దగ్గర నమ్మకంగా పనిచెయ్యరా.... నీకు ఆయన ఏదో రకంగా సహాయం చేస్తాడు-"

 

    తల్లి తన ధోరణిలో తాను చెప్పుకుంటూ పోతోంది.

 

    చెల్లెలు ఫీజు కట్టటానికి అమ్మకి డబ్బులు ఇచ్చాడు. తనడిగితే అమ్మ తీసుకున్న విషయం కనీసం చెప్పకుండా తనకీ డబ్బులు ఇచ్చాడు సూర్యం- ఎందుకలా?

 

    ఆ సమయంలో ఆయనపట్ల కొండంత గౌరవం పెరిగిపోయింది.

 

    సూర్యానికి ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థంకాలేదు.

 

    ఇంట్లో మరేం మాట్లాడలేదు. బైటకి వచ్చాడు.

 

                                             *    *    *    *

 

    "నిన్న గొప్ప సలహా ఇచ్చావయ్యా... నాకు బాగా నచ్చింది. లేడీస్ డ్రస్ మెటీరియల్ షోరూమ్ పెడదాం.... నువ్వు అలవోగ్గా అన్నా పెద్ద బిజినెస్ పాయింట్ తోనే అన్నావయ్యా- పెట్టుబడి నాది... పెత్తనము నీది- ఆ షాపు నువ్వే చూసుకోవాలి..."

 

    షాపులోకి అడుగుపెట్టిన శక్తిని కూర్చోబెట్టి, మాట్లాడనివ్వకుండా చేసి చెప్పేసాడు సూర్యం.

 

    "మీ ఇష్టం- కానీ నిన్న మా చెల్లెలు ఫీజుకోసం మా అమ్మగారికి డబ్బులు ఇచ్చి- నేను అడిగితే మళ్ళీ నాకు ఎందుకు ఇచ్చారు..." ఆ మాట అన్న శక్తివైపు.

 

    ఒక్కక్షణం అలా తేరిపార చూసాడు సూర్యం.

 

    "మీ నాన్నగారు అడిగినా కూడా ఇస్తానయ్యా- ఎందుకంటే మొన్నటి వరకూ మీ కుటుంబం అంటే ఇష్టం. ఈరోజు నువ్వంటే ఇంకా ఇష్టం- ఇన్నేళ్ళ నుంచీ వ్యాపారంలో వున్నవాడిని, ఈ వూళ్ళో ఇంకో వ్యాపారం ఏమి చెయ్యాలో నాకే తోచలేదు. అలాంటిది నువ్వు ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పేసావు కదయ్యా..." పొగడ్తగా అన్నాడు సూర్యం.

 

    "ఈ డబ్బులు తీసుకోండి. కావాలంటే మళ్ళీ తీసుకుంటాను." జేబులోంచి డబ్బులు తీసి టేబుల్ మీద పెడుతూ అన్నాడు శక్తి.

 

    "తప్పదంటావా..." నవ్వుతూ అన్నాడాయన.

 

    "షోరూం బడ్జెట్ అంతా వేసానయ్యా... ఒక్కసారి మనం అన్నీ మాట్లాడుకుంటే బాగుంటుంది. రాత్రికి ఒకసారి ఇంటికి వస్తావా?"

 

    "చిన్న పని వుంది. రాత్రి పదిగంటలకు ఇంటికి వస్తానండీ-" అని సూర్యంతో చెప్పి బయటకు వచ్చాడు శక్తి.

 

    అదే సమయంలో ఓ వ్యక్తి లోనకు ప్రవేశించాడు.

 

    అతను థియేటర్ మేనేజర్.

 

    అతన్ని చూడగానే సీట్లోంచి లేచి నమస్కారం చేసి-

 

    "రండ్రండి... ఏమిటి ఇలా దయచేసారు..." అని ఆహ్వానించాడు సూర్యం- లోలోన ఆశ్చర్యపోతూ.

 

    "లోకహితం కోసం కొన్ని పనులు చేయక తప్పదు కదయ్యా" అంటూ సూర్యం ఎదురుగా వున్న చెయిర్ లో కూర్చున్నాడు థియేటర్ మేనేజర్.

 

    కాఫీలు, కబుర్లూ అయ్యాక-

 

    "చూడు సూర్యం... నువ్వు కానీ, నేను కానీ ఎమ్మెల్యేగారి మనుషులం... అందుచేత ఆయన శత్రువులతో చేతులు కలపటం మంచిది కాదేమో..." అన్నాడు మేనేజర్ నాందిగా.

 

    "మీరేం చెబుతున్నారో నాకు అర్థం కావటం లేదు."

 

    "బాలచంద్రగారికీ, శక్తికీ అసలు పడదు. కారణాలు మనకు అనవసరం- అలాంటి ఎమ్మెల్యేగారి శత్రువు నీ దగ్గర ఉద్యోగం చేయటము అంటే..." అర్థోక్తిగా ఆపేసాడు మేనేజర్.

 

    విషయం అర్థం అయ్యింది. బాలచంద్రకు- ఎదురు తిరగటం అంటే నాశనం కోరుకోవటమే. శక్తి ద్వారా అలాంటి ప్రమాదాలు వస్తాయని ఊహించలేదు సూర్యం. చకచకా ఆలోచించి క్షణాల్లో తేరుకున్నాడు.

 

    "శక్తి మన దగ్గర పనిచేసే మనిషి కాదు... వాళ్ళ నాన్న బదులు వచ్చాడు. రావద్దని చెప్పేస్తాను... మన క్షేమం... మనవాళ్ళ క్షేమం నాకు ముఖ్యం. ఆ మాత్రం నాకు తెలీదా" భయాన్ని దాచుకుంటూ లౌక్యంగా అన్నాడు సూర్యం.

 Previous Page Next Page