2. మానవులారా ! ప్రాతఃకాలముననే అశ్వినులను పూజించండి. వారికి హవ్యము సమర్పించండి. సాయంకాలపు హవ్యము దేవతలకు చేరునదికాదు. దేవతలు దానిని స్వీకరించరు. అది అసేవ్యమానమగును. మనకన్నముందు సోమము ద్వారా వారిని యజించువాడు. వారికి హవ్యములు అందించి తృప్తిపరచువాడు. యజించువాడు దేవతలకు అభిమతుడు అగును.
3. అశ్వినిద్వయమా ! మీ రథము హిరణ్య ఆచ్చాదితము. మనోవేగముగలది. వాయువేగముకలది. అన్నము ధరించునది. ఆ రథము వచ్చుచున్నది. మీరు దానిమీద సంపూర్ణదుర్గమ మార్గములను అతిక్రమించెదరు.
4. హవి విభాగము జరుగు యజ్ఞమున అశ్వినులకు విపులహవ్యము సమర్పించు యజమాని కర్మద్వారా తనపుత్రుని పోషించును. అశ్వినులు అగ్నిని ప్రదీప్తము చేయనివారిని హింసింతురు.
5. మేమందరము అశ్వినీ కుమారుల శ్రేష్ఠరక్ష మఱియు వారి ఆగమనముతో కూడి ఉందుము. అమర అశ్వినిధ్వయమా ! మాకు ధనము, సంతతి, సమస్త కళ్యాణములు ప్రసాదించండి.
డెబ్బది ఎనిమిదవ సూక్తము
ఋషి - ఆత్రేయ సప్తవధి, దేవత - అశ్వినులు ఛందస్సు - 1-3 ఉష్ణిక్, త్రిష్టుప్, మిగిలినవి అనుష్టుప్.
1. అశ్వినులారా ! ఈ యజ్ఞమునకు విచ్చేయండి. నా సత్యద్వయమా ! మీరు ప్రమత్తులుకారాదు. హంసద్వయము నిర్మల జలములవైపు సాగినట్లు మీరు అభిషుత సోమమువైపు సాగండి.
2. అశ్వినులారా ! హరిణి, గౌరమృగము పచ్చగడ్డి వెంట పరిగెత్తినట్లు హంసద్వయము నిర్మల ఉదకము వైపు సాగినట్లు మీరు అభిషుత సోమమువైపు సాగండి.
3. అన్నము నిమిత్తము నివాసప్రదులగు అశ్వినులారా ! యజ్ఞమునకు అభీష్ట సిద్ధికొఱకు విచ్చేయండి. హంసద్వయము నిర్మల ఉదకమువవైపు సాగినట్లు అభిషుత సోమమువైపు సాగండి.
4. అశ్వినులారా ! లాలించినంత భార్య భర్తను ప్రసన్నుని చేసినట్లు మా పితరుడు అత్రి మిమ్ము స్తుతించి తుషాగ్ని కుండమునుంచి విముక్తుడయినాడు. మీరు శ్యేనపక్షి వంటి వేగమున సుఖప్రదమగు రథమున మమ్ము రక్షించుటకు విచ్చేయండి.
5. వనస్పతి నిర్మిత పేటికా కఱ్ఱ పెట్టే ! ప్రసవించనున్న స్త్రీయోనివలె విచ్చుకొనుము. అశ్వినులారా ! మా ఆహ్వానము వినండి. నేను సప్తవధ్రి ఋషిని. నన్ను విడిపించండి.
("అత్రబ్రువన్తీతిహాసం సప్తవద్రేః పురావిదః" పూర్వకాలము తెలిసినవారు ఈ సందర్భమున సప్తవధ్రి కథ చెప్పుదురు అని ఒక వృత్తాతంము వివరించినాడు శాయణుడు.
సప్తవధ్రి సోదరుని పుత్రులు సప్తవద్రిని అతని భార్యతో కలియకుండ చేయవలెను అనుకున్నారు. వారు సప్తవధ్రిని ఒకపెట్టెలో రాత్రిళ్లు దాచువారు. ఉదయమున వదిలిపెట్టువారు.
సప్తవధ్రి ఆ బాధ భరించలేక అశ్వినులను ప్రార్థించినాడు. వారు అతనికి విముక్తి కలిగించినారు. రాత్రిళ్లు పెట్టెనుంచి బయటకి వచ్చిన ఋషి మరల ఉదయమున పెట్టలో ఉండువాడు.
పెట్టె వనస్పతి కఱ్ఱతో చేయబడినది కావున ముందు వనస్పతిని ప్రార్థించినాడు)
6. అశ్వినులారా ! భీతుడు నిర్గమనమునకు ప్రార్థించు సప్తవధ్రి ఋషికొఱకు మీమాయతో పేటికను మూసినారు తెరిచినారు.
7. వాయువు సరోవరాదులను సంచలితము చేసినట్లు నీ గర్భము చలించవలెను. పదినెలలు తరువాత గర్భస్థ ప్రాణి బయటపడవలెను.
8. వాయువు, అరణ్యము, సముద్రము కంపించినట్లు పదినెలలు నిండిన గర్భస్థజీవి మాయచుట్టుకొని బయటపడును.
9. పదినెలలు తల్లిగర్భమున ఉన్న ప్రాణి సజీవముగా అక్షతరూపమున జీవించిన జననికి పుట్టవలెను.
("గర్భిణ్యాః ప్రసవాయాశుస్తుతవానశ్వినావృషిః" ఇవి గర్భస్థ స్త్రీలు ప్రసవ సమయమున అశ్వినులను స్తుతించు మంత్రములని శాయణుడు)
డెబ్బది తొమ్మిదవ సూక్తము
ఋషి - ఆత్రేయ సత్యశ్రవుడు, దేవత - ఉష, ఛందస్సు - పంక్తి.
1. దీప్తమతీ ! ఉషా ! నీవు మమ్ములను ఇదివరకు ప్రబోధితులను చేసినావు. అట్లే నేడును ప్రచుర ధనప్రాప్తికొఱకు ప్రబోధితులను చేయుము. శోభన ప్రాదుర్భానవతీ ! అశ్వప్రాప్తికిగాను జనులు నిన్ను స్తుతింతురు. వయ్యుపుత్రుడు సత్యశ్రవుని అనుగ్రహింపుము.
2. సూర్యసఖియా ఉషా ! నీవు శుచద్రథ పుత్రుడగు 'సునీథి' అంధకారమును దూరము చేసినావు. శోభన ప్రాదుర్భవతీ ! అశ్వప్రాప్తికిగాను జనులు నిన్ను స్తుతింతురు. వయ్యుపుత్రుడు అతిశయజలరాశి సత్యశ్రవుని తిమిరమును నివారించుము.
3. ద్యులోక దుహితా ! నీవు ధనసమార్జన పరురాలవు. నీవు మా చీకట్లను దూరము చేయుము. సుజాతా ! అశ్వప్రాప్తికిగాను జనులు నిన్ను స్తుతింతురు. వయ్యు పుత్రుడు అతిశయ బలశాలి సత్యశ్రవుని తిమిరమును నివారించినావు.
4. ప్రకాశవతీ ఉషా ! స్తోత్రములతో నిన్ను ఋత్విక్కు ఐశ్వర్యము ద్వారా సమృద్ధి సంపన్నుడయి దానశీలుడగును. ధనశాలినీ, సుజాతా ఉషా ! జనులు అశ్వలాభమునకుగాను నిన్ను స్తుతింతురు.
5. ఉషా ! ధనప్రదానమునకుగాను నీముందు నిలిచిన ఉపాసకులు అక్షయ్య హవ్యధనము సమర్పించి మా విషయమున అనుకూలురు అయినారు. అశ్వప్రాప్తికొఱకు జనులు నిన్ను స్తుతింతురు.
6. ధనవంతురాలవగు ఉషాదేవీ ! నీవు స్తోతలగు యజమానులకు వీరపుత్రయుక్త అన్నము ప్రసాదించుము. అందువలన వారు ధనవంతులయి మాకు విశేష ధనమును దానము చేయవలెను. సుజాతా ! అశ్వప్రాప్తి కొరకు జనులు నిన్ను స్తుతింతురు.
7. ధనశాలిని ఉషా ! మాకు అశ్వములు, గోవులు మున్నగు ధనములు దానముచేసిన యజమానికి నీవు సంపూర్ణ ధనము విశేష అన్నము ప్రసాదింపుము. సుజాతా ! అశ్వప్రాప్తి కొఱకు జనులు నిన్ను స్తుతింతురు.
8. ద్యులోకదుహితా ! ఉషా ! నీవు సూర్యుని శుభ్రమగు రశ్మి ప్రజ్వలిత అగ్ని ప్రదీప్తి జ్వాలతో మావద్దకు అన్నము, ఆవులను కొనిరమ్ము. సుజాతా ! అశ్వప్రాప్తి కొరకు జనులు నిన్ను స్తుతింతురు.
9. ద్యులోకదుహితా ! ఉషా ! నీవు వెలుగులు పుట్టింపుము. మా విషయమున జాగుచేయకుము. రాజు దొంగను శత్రువును సంతృప్తుని చేసినట్లు సూర్యుడు తన కిరణములతో నిన్ను సంతప్తను చేయరాదు. సుజాతా ! అశ్వప్రాప్తి కొఱకు జనులు నిన్ను స్తుతింతురు.
10. ఉషా ! మేము ప్రార్థించినది. ప్రార్థించనిది కూడ ప్రసాదించుటకు నీవు సమర్థురాలవు. దీప్తివతీ ! నీవు స్తోతల తమస్సు నశింప చేతువు. వారిని హింసించవు. సుజాతా ! అశ్వప్రాప్తి కొరకు జనులు నిన్ను స్తుతింతురు.
ఎనుబదవ సూక్తము
ఋషి - ఆత్రేయ సత్యశ్రవుడు, దేవత - ఉష, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఉష దీప్తిమంత రథారూఢ. సర్వవ్యాపిని. యజ్ఞపూజిత. అరుణవర్ణ. సూర్యపురోవర్తిని. దీప్తిమతి. అట్టి ఉషను ఋత్విక్కులు స్తవములద్వారా స్తుతింతురు.
2. దర్శనీయ ఉష్ నిద్రలో ఉన్న జనులను ప్రభోదితులను చేయును. మార్గములను సుగమము చేయును. విశాల రథముపై ఎక్కును. సూర్యుని కన్నముందు సాగును. మహతి, విశ్వవ్యాప్తిని ఉష దివసారంభమున దీప్తిని విస్తరింప చేయును.
3. ఉష తన రథమున ఎరుపురంగు ఎద్దును కట్టును. ఆక్షీణ జలములను అవిచలితము చేయును. దీప్తమతి, బహుస్తుత, వరణీయ ఉష మార్గములను కనబరచి వెలిగించును.
4. ఉష అంతరిక్షమున ఊర్ధ్వ, మధ్యమ భాగములందు వసించును. తన రూపమును తూర్పున విదితమగును. విశేష శ్వేత వర్ణ ఉష బ్రహ్మాండమును ప్రబోధితము చేయును. ఆదిత్యుని మార్గమును అనుసరించును. ఆమె దిశలను బాధించదు ప్రకాశింప చేయును.
5. సుందర అలంకారములుగల యువతివలె ఉష తన దేహమును ప్రకాశింపచేయును. జలకములాడిన పడతివలె తూర్పున ఉదయించును. ద్యులోక దుహిత ఉషద్వేషక అంధకారమును బాధించును. వెలుగులతో అవతరించును.
6. ద్యులోకదుహిత ఉష పశ్చిమాభిముఖి అయి శుభంకర వేషమును ధరించు యువతి రీతి తన రూపమును ప్రకటించును. ఆమె తనకు హవ్యము అందించు యజమానికి వరించదగిన ధనము ప్రదానము చేయును. నిత్య యవ్వన ఉష పూర్వమువలెనే వెలుగులు వెదజల్లును.
ఎనుబది ఒకటవ సూక్తము
ఋషి - శ్యావాశ్వుడు, దేవత - సవిత, ఛందస్సు - జగతి.
1. ఋత్విక్కులు, యజమానులు సర్వకర్మములందు తమ మనసులు లగ్నము చేయుదురు. మేధావి. మహానుడు, స్తుతియోగ్యుడగు సవిత ఆజ్ఞచే యజ్ఞకార్యమున నిమగ్నులగుదురు. సవిత హోత కార్యములను తెలిసికొనును. వారిని యజ్ఞకార్యములకు ప్రేరేపించును. సవిత స్తుతి అత్యంత విశాలము.
2. సవిత మేధావి. అతడు స్వయం సంపూర్ణ రూపమును ధరించును. అతడు మానవుల జంతువుల గమనాది విషయక కళ్యాణమును ఎరుగును. సర్వులను ప్రేరేపించును, వరణీయ సవిత స్వర్గమును ప్రకాశింప చేయును. అతడు ఉష ఉదయించిన తరువాత ప్రకాశించును.
3. అగ్ని మున్నగు ఇతర దేవతలు ద్యుతిమంతుడగు సవితను అనుసరించి మహిమ బలమును పొందుదురు. తను మాహాత్మ్యమున పృథివ్యాది లోకములను పరిచ్చిన్నము చేయు సవిత శోభాయమానుడయి విరాజిల్లును.
4. సవితా ! రోచమానములగు మూడు లోకములందు సంచరింతువు. సూర్యకిరణములతో కలిసెదవు. నీవు రాత్రికి ఉభయ పార్శ్వములయి సాగుదువు. నీవు జగమును ధరించినందున మిత్రుడు అనబడుదువు.
5. సవితా ! నీవు ఒక్కడవే సర్వమును పాలింప సమర్థుడవు. గమనమున నీవు పూషవు అగుము. నీవు సమస్త భువనములు ధరించ సమర్ధుడవు. శ్యావాశ్వుడు. నిన్ను స్తుతించును.
ఎనబది రెండవ సూక్తము
ఋషి - ఆత్రేయ శ్యావాశ్వుడు, దేవత - సవిత ఛందస్సు - 1 అనుష్టుప్ మిగిలినవి గాయత్రి.
"తత్సవితు వృణీమ హే వయం దేవస్య భోజనం
శ్రేష్ఠం సర్వధా తమం తురంభగస్య ధీమహి".
1. మేము ప్రసిద్ధము. భోగయోగ్యమగు ధనము కొఱకు సవితను ప్రార్థించుచున్నాము. సవిత అనుగ్రహమున భగుని నుండి శ్రేష్ఠము, సర్వభోగప్రదము, శత్రుసంహారకమగు ధనమును పొందగలము.
2. సవిత యొక్క అసాధారణము, సర్వప్రియము, రోచమానమగు ఐశ్వర్యమును అసురాదులు సహితము నష్టపరచజాలరు.
3. సవిత భజనీయ భగుడు హవ్యదాతలమగు మాకు రమణీయ ధనము ప్రదానము చేయుదురు. మేము భజనీయ భగదేవుని రమణీయ ధనము యాచింతుము.
4. సవితా ! నేటి యజ్ఞదినమున పుత్రాదియుక్త సౌభాగ్యము ప్రసాదించుము. దుస్వప్నజనిత దారిద్ర్యమును దూరము చేయుము.
5. సవితా ! మా సమస్త అమంగళములను దూరము చేయుము. పుత్రులు, పశువులు, గృహాదిరూప కళ్యాణములను మావద్దకు పంపుము.
6. మేము అనుష్ఠాన పరులము. సవితృదేవుని ఆజ్ఞచే అఖండనీయ అదితిముందు నిరపరాధులము కావలెను. మాకు సంపూర్ణ ధనము లభించవలెను.
7. సవిత సర్వదర్శనీయుడు. భక్తజన రక్షకుడు. సత్యసాధకుడు. నేటి యజ్ఞదినము మేము సూక్తములతో సవితను ఆరాధింతుము. ఉపాసింతుము.
8. సవిత ధ్యాయోగ్యుడు. అతడు అప్రమత్తుడయి పగలు - రాత్రికి ముందుసాగను. నేటి యజ్ఞదినమున ఆసవితను మేము సూక్తములతో ఆరాధింతుము - ఉపాసింతువు.
9. సమస్త ఉత్పన్న ప్రాణిజాలము సవితృదేవుని యశస్సును ఎరుగును. అతడు సమస్త ప్రాణుల ప్రేరకుడు. నేటి యజ్ఞదినమున మేము సూక్తలతో ఆ సవితను ఆరాధింతుము. ఉపాసింతుము.
ఎనుబది మూడవ సూక్తము
ఋషి - ఆత్రేయ భౌముడు, దేవత - పర్జన్యుడు ఛందస్సు 1-3 జగతి, మిగిలినవి త్రిష్టుప్.
1. స్తోతా ! బలవంతుడగు పర్జన్యుని అభిముఖవర్తివయి అతనిని ప్రార్థింపుము. స్తుతివచనములతో పొగుడుము. హవిర్లక్షణ అన్నముతో పరిచర్య చేయుము. జలవర్షకుడు, దర్శనీయుడు, దానశీలుడు, గర్జనకారి పర్జన్యుడు వర్షము కలిగించి ఓషధులను గర్భిణులను చేయును.