Previous Page Next Page 
తల్లి మనసు కధలు పేజి 14


    అయన మొహం ఎర్రబడింది. నా వంక తీక్షణంగా ఒకసారి చూసి, కవర్లు జేబులో పెట్టుకుని గబగబ వెళ్ళి కారులో ఎక్కి తలుపు దడాలున వేశాడు. కారు వెళ్ళిపోయింది. తేలిగ్గా నిట్టూర్చి వీధి తలుపులు వేసి వెనుదిరిగాను.
    వెయ్యి రూపాయలు తక్కువ మొత్తం కాదు. కావాలంటే ఇంకా యిస్తాడు. అంత సొమ్ము వదులుకునే మనస్థయిర్యం ఎంత మందికి వుంటుంది? డబ్బు ప్రభావానికి లోంగేవాళ్ళున్నంత వరకు యీ చదువులు యిలాగే వుంటాయి.
    ఓ మంచి పని చేశానన్న తృప్తితో గర్వంగా నన్ను నేను అభినందించు కున్నాను.
    
                                                *    *    *    *
    "నమస్కారం , గుర్తున్నానా మీకు?" క్లాసు అయ్యాక స్టాఫ్ రూములోకి వస్తుంటే వరండాలో ఓ పెద్దమనిషి నమస్కారం పెట్టి పలకరించాడు. ఆయన్ని ఎక్కడో చూసినట్లని పించింది నాకు. కాని గుర్తు రాలేదు. సరిగ్గా జవాబు చెప్పలేక అలా చూస్తూ నిల్చున్నాను ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ.
    "మరిసి పోయుంటారు. ఓసారి తమ దర్శనం కొసం బెజవాడ లో మీ యింటికి వచ్చాను...."
    బెజవాడ లో ! అంటే రెండేళ్ళ క్రిందట అన్నమాట. ఎప్పుడోచ్చాడో ఎందుకు వచ్చాడో సరిగా జ్ఞాపకం రాకపోయినా ఏదో ఆయన్ని చూసిన గుర్తు మాత్రం వుంది.
    "మరిసిపోయారు తమరు. మావాడి పి.యు.సి మార్కులకోసం మీ కాడకి వచ్చాను గందా. అప్పుడే మరిసారు తమరు....అవునులెండి మాలాంటోళ్ళు ఎందరో వస్తుంటారు మీకాడికి...." అదోలా నవ్వుతూ అన్నాడాయన.
    చటుక్కున గుర్తుకొచ్చింది. అవును, రెండేళ్ళ క్రితం నేను బెజవాడలో వున్నప్పుడు కొడుక్కి మార్కుల కోసం లంచం ఆశ చూపించి ప్యాసు చేయమన్న యీరపరెడ్డి.
    "ఆ ఆ ..... అవునవును.... గుర్తుకొచ్చారు... చాలా రోజులయింది వెంటనే గుర్తు పట్టలేక పోయాను ....ఇక్కడికి ఏం పని మీద వచ్చారు."
    "మేవు హైదరాబాద్ లోనే ఉంటున్నాం యిప్పుడు.... మా పిల్లని కాలేజిలో చేర్పించడానికి వచ్చాను.....పి.యు.సి. క్లాసు సదువుతుందమ్మాయి...."
    'ఆహా..." అని ఇంకేం అనకుండా ముందుకు ఓ అడుగు వేశాను నమస్కారం పెట్టి వెళ్ళొస్తానని చెప్పి. కాని అంతలోనే వాళ్ళ అబ్బాయి సంగతి గుర్తొచ్చి అడగాలన్న కుతూహలంతో వెనక్కి వచ్చాను.
    'అన్నట్టు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు యిప్పుడు ఏం చదువుతున్నాడు?" అయన అదోలా నవ్వాడు....' ఏదో తమ దయ వల్ల మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు"
    'ఆహా, మొత్తం మీద అన్నట్టుగానే అబ్బాయిని మెడిసన్ చదివిస్తున్నారన్నమాట. తరవాత....సెప్టెంబరు చాన్సులో ప్యాసయ్యాడా? మార్కులు బాగా వచ్చాయా ఆసారి....' కుతూహలంగా అడిగాను.
    సెప్టెంబరు కాదండి. మొదటి ఛాన్సు లోనే ప్యాసయి పోయాడు.... వెంటనే మణిపాల్ లో చేర్పించాను...." అదోరకంగా అతని కళ్ళు మెరిసాయి.
    తెల్లపోయాను! మొదటి చాన్సులో ఎలా ప్యాసయ్యాడు? తక్కిన పేపర్ల సంగతి నాకు తెలియక పోయినా నా దగ్గిరవున్న పేపరులో పద్దెనిమిది మార్కులు వచ్చిన ఆ అబ్బాయి ఎలా ప్యాసయ్యాడు. ఆశ్చర్యంతో చూశాను , బహుశా యూనివర్శిటీ ఏ రిజిష్ట్రార్ కొ డబ్బు బాగా ముట్టజెప్పి చేయించారేమో! అయి వుంటుంది ! ఈయన యింటికొచ్చి అడగబట్టి ఫలానా నెంబరు ఎన్ని మార్కులు వచ్చాయో నాకు గుర్తు వుంది కాని, లేకపోతే పేపర్లు దిద్ది పంపించాక ఎవరెవరు ప్యాసయ్యారో, ఫేయిలయ్యారో గుర్తు ఎవరికుంటుంది! అక్కడ ఏం చేసినా మాకు తెలియదు గదా.
    "ప్యాసయ్యాడా? ....మొదటి చాన్సులో ప్యాసయ్యాదా? అదెలాగ/ పద్దెనిమిది మార్కులు వచ్చిన మీ అబ్బాయి ఎలా ప్యాసయ్యాడండీ " ఆశ్చర్యపోతూ అడిగినట్టడిగాను....
    "హీ....హీ తమ దయుంటే ప్యాసు కావడానికి ఏముందండి..... తమరు అలా అన్నారు కానీ ....మీ మనసెంత మంచిదో నాకు తెలీదా ?.... వెకిలి నవ్వు నవ్వాడు.
    దిమ్మెరపోయాను . నా దయుంటే ప్యాసవడం ఏముందంటాడు ఏమిటి?.... నేనేం దయ చూపలేదు, నాచేత్తో ఇంకో అరమార్కు కూడా ఆ పేపరు మీద వేయలేదు. నా మనసు చాలా మంచిదంటాడేమిటి/ అంతా గందరగోళంగా అనిపించింది.
    "మీరేం అంటున్నారో నాకర్ధం కావడం లేదు. నేనేం మీ అబ్బాయికి మార్కులు వేయలేదే?.... నేను దయ చూపడం ఏమిటో నా కర్ధం కావడం లేదు...."
    "పోనీడంమ్మగారూ .... అయిపోయిండానికి యిప్పుడేందుకు..... ఏదో తమరు కాస్త జాలిగా ఆలోచించారు.... వాడి పరీక్ష ప్యాసయింది.... అంతేచాలు నాకు....
    మళ్ళీ అదే మాట?"
    "రెడ్డిగారూ! మీరు ఏం అంటున్నారో నాకు అసలు తెలియడం లేదు. నాకు తెలిసి తెలిసి ఇలాంటి పని నేనెప్పుడూ చేయలేదు.... మరి ఇదెలా సాధ్యం అయింది..... దయచేసి తిన్నగా చెప్పండి.... నా కిలాంటి మాట రావటం ఇష్టం లేదు. ఇదెలా జరిగిందో చెప్పండి.... మీరెవరికొ యూనివర్శిటీ లో డబ్బిచ్చి ఫ్యాసు చేయించి వుంటారు. నేను చేశానంటారేమిటి? కాస్త తీక్షణంగా అడిగాను.
    'అబ్బే రామ రామ....తమరి సేత్తో తవరేసిన మార్కులే.... మరి నేనెవరికాడికి ఎల్లలేదండి.... అందుకే తవరిది జాలిగుండె అన్నాను....' అని అతి వినయంగా అన్నాడు.

 Previous Page Next Page