Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 14


                                             అభిమానభంగం

    తలుపు తీయగానే తానెప్పుడో స్మృతిపధం నుంచి చెరిపేసుకున్న శేఖర్ ను ఇలా పన్నెండేళ్ళ తరువాత చూస్తాననీ, అదీ భర్త స్నేహితుడిగా, ఇంటికి భోజనానికి వచ్చిన అతిధిగా చూడాల్సి వస్తుందని ఎదురుచూడని జయంతికి ఒక్కసారిగా షాక్ తగిలినట్లనిపించింది. కానీ అది ఒక్క అరక్షణం మాత్రమే. అతని ముఖంలో కనిపించిన బెదురు, భయం, తత్తరపాటు అతనూ షాక్ అయ్యాడని చెప్పాయి. తననిక్కడ స్నేహితుని భార్యగా చూసిన అతని స్థితి అర్థం అయింది జయంతికి. అతని ముఖం మాడిపోయింది. గాబరా పడిపోయాడు. ఇద్దరినీ ఒకరినొకరికి పరిచయం చెయ్యాలనుకున్న జయంతి పతిదేవుడు కృష్ణమూర్తి ఇద్దరినీ వింతగా చూశాడు. మరుక్షణం అతని ముఖం మాడింది. తామిద్దరి ముఖాలు మాడాయంటే అర్ధం ఉంది. ఈయనగారి ముఖం ఎందుకు మాడింది చెప్మా, ఆప్తమిత్రుడు తాను చేసిన ఘనకార్యం మిత్రునికి చెప్పుకున్నాడేమో తాను అతని భార్యనని తెలియక ఆఫీసునుంచి ఇంటికి కారులో వస్తూ స్నేహితునికి చాలా గొప్పగా చేసిన వెధవపని చెప్పాడేమో, చెప్పుకుని ఇద్దరూ ఓ ఆడకూతుర్ని ఏడిపించి, శాస్తి చేశామని గర్వంగా నవ్వుకుని ఉంటారు. తీరా ఇంటికి వచ్చాక ఆ ఆడకూతురు ఎవరో కాదు అన్నది ఇద్దరికి అర్ధం అయి షాక్ అయినట్లున్నారు.
    "మధ్యాహ్నం పదకొండు గంటల వేళ ప్రాణస్నేహితుడు చంద్రం ఊరికి వచ్చి కలిశాడు. లంచ్ కి తీసుకొస్తున్నాను. వంట బాగా చేయి, వాడు భోజనప్రియుడు" అంటూ మిత్రుని ఇష్టాయిష్టాలు ఏకరువు పెడితే జయంతికి చిర్రెత్తింది. వంట పూర్తిచేశాక మళ్ళీ వండడం. ఆఫీసులో ఎవరో కొలీగ్ ఏక్సిడెంట్ లో పోతే ఇచ్చిన సెలవు ఇలా వండిపెట్టడానికా అన్నట్లు చిరాకు వచ్చింది. కానీ, భర్తగారి స్నేహితుడాయె. కాదనడం ఎలా? ఆ చంద్రంగాడే ఈ చంద్రశేఖరుడని ఊహించలేక పోవడం తన తప్పా.
    అందరికన్నా ముందు తేరుకున్న జయంతి దారి తొలగి అతిధిని ఆహ్వానిస్తున్నట్లు రాని నవ్వు నవ్వింది. కానీ, అతిధిదేవుడు బెదురుగొడ్డులా లోపలికి వచ్చే సాహసం చేయలేనట్లు చెమటలు కార్చుకుంటూ, "సారీ.. సారీరా... ముఖ్యమైన అపాయింట్ మెంట్ ఉంది. మర్చిపోయాను. సారీ ఫర్ ద ట్రబుల్, సమదర్ టైమ్" అంటూ మొహం చూపలేనట్లు తల దించేసుకుని పరిగెత్తినట్లే వెళ్లి టాక్సీ ఎక్కేశాడు. పతిదేవుడు ఏమి అనే లోపలే, అనే అవకాశం ఇవ్వకముందే, టాక్సీ కదిలి పోయింది. పిరికిపంద. అలా పారిపోవడం ద్వారా అతను చేసిన వెధవపనికి మిత్రునికి మరింతగా తెలుస్తుంది అన్న ఇంగితజ్ఞానం కూడా లేనట్లుంది.
    వెళ్ళిన టాక్సీ నుంచి దృష్టి మరల్చి భార్య వైపు చూశాడు కృష్ణమూర్తి, జయంతి నిర్లక్ష్యంగా ఓ నవ్వు నవ్వి, "ఏమయింది మీ స్నేహితునికి, ఎందుకలా పరిగెత్తాడు?" కించిత్తు హేళన మేళవించి అంది జయంతి. పతిదేవుడు అనుమానంగా భార్యవంక చూశాడు. "వీడు నీకు తెలుసా?" అదోలా చూస్తూ అడిగాడు.
    "ఆఁ.. తెలుసు." వెనుదిరిగి లోపలికి నడుస్తూ నిర్లక్ష్యంగా అంది జయంతి.
    "ఎలా తెలుసు?" మరో అనుమానపు చూపు.
    "కాలేజీలో నా సీనియర్". టేబిల్ మీద ప్లేట్లు, గ్లాసులు సర్దుతూ అంది.
    "చంద్రం నీకు బాగా తెలుసా?"
    "బాగా అంటే అర్ధం. కాలేజీలోకి నేను బి.ఎస్సీ మొదటి సంవత్సరంలో చేరినప్పుడు అతను ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు."
    "అంతేనా!"
    క్రాస్ ఎగ్జామిన్ మొదలైంది. జయంతి కృష్ణమూర్తి వంక సూటిగా చూసి, "అంతేనా అంటే, ఇంకా ఏముందనా" అంది.
    "ఆఁ.. అదే అడుగుతున్నాను. కాలేజీలో క్లాస్ మేట్ అయితే పాత స్నేహితులని చూసి ఆనందిస్తాం. ఇన్నాళ్ళకి కల్సుకున్నాం అని సంతోషపడ్తాం. కానీ, చంద్రం ఎందుకలా గాబరా పడిపోయాడు?" కుర్చీ జరిపి కూర్చున్నాడు భార్యను పట్టిపట్టి చూస్తూ
    జయంతి కోపంగా చేతిలో గరిట టేబిల్ మీద పడేసి, "ఈ ప్రశ్న అడగవలసినది అతణ్ణి. పారిపోయింది అతను కాబట్టి, ఈ క్రాస్ ఎగ్జామిన్ అతణ్ణి చెయ్యండి" అంది తీవ్రంగా చూసి.
    కృష్ణమూర్తి ముఖం మాడ్చుకొని, "వాడు నిన్ను చూసి గాబరా పడిపోయాడు అంటే దానర్ధం మీ ఇద్దరి మధ్య ఏదో జరిగుంటుంది అతనికి. నీకు మధ్య..." కృష్ణమూర్తి జయంతిని నిలేస్తున్నట్లు అడిగాడు.
    "అతనికీ, నాకూ మధ్య ఏం జరిగుంటుందని మీ ఉద్దేశం." జయంతి చాలా నిబ్బరంగా, అన్నం కలుపుకుంటూ అంది.
    "నాకేం తెలుసు. నీకు తెలియాలి. అందుకే అడుగుతున్నాను." హేళనగా అన్నాడు.
    "మా ఇద్దరిమధ్య ఏం జరిగిందో అతను మీకు చెప్పే ఉంటాడు. అఫ్ కోర్స్ ఆ 'నేను' ఈ 'నేను' ఒకరే అని తెలియక ఆప్తమిత్రునికి చెప్పే ఉంటాడు. మళ్ళీ అడగడంలో మీ ఉద్దేశం ఏమిటి?" జయంతి తీక్షణంగా అంది. ఈసారి కృష్ణమూర్తికి కోపం వచ్చేసింది ఆ నిర్లక్ష్యానికి, ఆ పొగరుగా జవాబిచ్చిన తీరుకి భర్తగారికి కోపం వచ్చింది. భార్య గాబరాపడలేదు. భయపడలేదు. తప్పుచేసిన దానిలా తలదించుకోలేదు. జరిగింది దాచాలని ప్రయత్నించలేదు. మొగుడేం అంటాడో, అనుకుంటాడో అన్న బిడియం లేదు. తన కాపురం ఎలా తగలడ్తుందన్న భయం అసలే లేకుండా అలా నిర్లక్ష్యంగా దులిపేసుకుని, ఒంటిమీద ఈగ వాలితే దులుపుకున్నంత తేలిగ్గా అనేయడం భరించలేకపోయాడు.
    "మొగుణ్ణి కొట్టి మొగసాల ఎక్కి ఏడ్చినట్టుంది. నీవరస. జరిగిందానికి సిగ్గుపడడం పోయి నామీద ఎగురుతున్నావు" ముఖం ఎర్ర పర్చుకుని అరిచాడు.
    "జరిగిందానిలో నా బాధ్యతలేదు. నా తప్పు అసలే లేదు. నేనెందుకు సిగ్గుపడాలి. సిగ్గు పడాల్సింది మీ మిత్రుడు. నేను మొగుణ్ణీ కొట్టలేదు. మొగసాల ఎక్క నలుగురినీ పిలిచి చెప్పనూ లేదు..."
    "అవును చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా, గుట్టుచప్పుడు కాకుండా దాచేసి తగుదునమ్మా అని నన్ను పెళ్ళాడేసావు. ఇప్పుడు వీడు గనక రాకపోయి ఉంటే, వాడు నా స్నేహితుడు కాకపోయి ఉంటే, వాడు నిన్ను చూడకపోయి ఉంటే మహా చక్కగా పతివ్రతలా నటించేసే దానివి లైఫంతా"
    "ఆఁ... నేను పతివ్రతనే. నే మిమ్మల్ని పెళ్ళిచేసుకున్నాక పరాయి పురుషుణ్ణి చూడలేదు. ప్రేమించలేదు. తాకలేదు." జయంతి వ్యంగ్యంగా అంది.
    "అంటే పెళ్ళికి ముందు ఏం జరిగినా ఫరవాలేదనా నీ ఉద్దేశం? అవేమీ పెళ్ళాడేవాడికి చెప్పక్కర్లేదనా నీ ఉద్దేశం?"
    "నా పెళ్ళికి ముందు ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇరవైమూడేళ్ళలో అవన్నీ వరుసగా టైం రాసుకుని చూపించాలని నాకు తెలియదు. ఇరవైమూడేళ్ళలో ఎన్నో దెబ్బలు తగిలాయి. ఎన్నిసార్లో పడ్డాను. ఒకసారి చెయ్యి విరిగింది. ఒకసారి పడి పన్ను విరగ్గొట్టుకున్నాను. ఓసారి టైఫాయిడ్ వచ్చి పరీక్షకి వెళ్ళక ఫేలయ్యాను. ఓ సారి మా అత్తకొడుకు మెట్టు దిగుతుంటే వెనకనుంచి కౌగిలించుకుంటే దవడ మీద ఒకటిచ్చాను. ఓసారి సినిమాహాల్లో ఓ వెధవ వెనుకనుంచి నా నడుం మీద వేళ్ళు ఆడించాడు. ఓసారి బస్సులో వస్తుంటే మరోవెధవ అంతకంటే చెత్తపని ఇంకోటి చేశాడు. ఓసారి నా గొలుసు పారేసుకొని అమ్మచేత దెబ్బలు తిన్నాను. ఓసారి స్కూటర్ మీద వెళ్తుంటే కిందపడ్డాను...

 Previous Page Next Page