ఆ చచ్చుకబుర్లు వింటే సావిత్రికి వళ్ళు మంట! నలభై ఏళ్ళన్నా లేకముందే ఈ ఆడవాళ్ళు ఈ దేశంలో, ముసలమ్మాలా యిసురో మంటూ ఎందుకు వుంటారో ననుకునేది కోపంగా. విదేశాలలో నలభై ఏళ్ళు ఏమిటి ఏభై ఏళ్ళు వచ్చినా ఎంత చలాకీగా వుంటారు! అనుకుంటూ ఈ దేశాన్ని ఈవిడ వాళ్ళని కలిపి తిట్టుకునేది మనసులో. 'ఆ పాశ్చాత్యదేశాల మాదిరి మనదేశంలో ఎలా వుంటారు. మనది ఉష్ణదేశం అలా వుండడం అసంభవం' అంటాడు కృష్ణమూర్తి. సావిత్రి పైకే ఆ మాట అన్నప్పుడు. కాని ఆ మాట నిజం కాదని సావిత్రి వాదన! శరీర పోషణ బట్టి మనిషి స్వభావాన్ని బట్టి ఉంటుంది.
అందుకే సావిత్రి తనని ఫిట్ గా వుంచుకోడానికి తాపత్రయ పడుతుంది. ఆ తాపత్రయం ముదిరి ఈ మధ్య పిచ్చిగా మారింది. భార్య కింత పిచ్చి ఎందుకో కృష్ణమూర్తికి అర్ధం గాకపోవడం సహజమే!
కానీ సావిత్రిని నిలవేసి ఆ మాట అడిగితె జవాబు చెప్పలేదు. అసలు యీ అలంకరణ పట్ల యింత శ్రద్దాశక్తులు ఎలా అరంభించాయో , ఇలా చిన్నపిల్లలా కనపడాలన్న తాపత్రయం ఎందుకో, వయసుని దాచాలన్న ఆరాటం అవీ ఎందుకో సావిత్రికే తెలియదు. కానీ అలా కనపడాలన్న కోరిక మాత్రం సావిత్రిలో రోజురోజుకీ పెరుగుతుంది.
ఓ రెండు మూడేళ్ళ ముందు ఇంత చాదస్తం వుండేది కాదు....ఓ సారి కృష్ణమూర్తి మేనేజింగ్ డైరెక్టర్ వచ్చాడని ఇంట్లో డిన్నరు పార్టీ ఇచ్చాడు. సహోద్యోగులు , ఇతర పెద్ద ఉద్యోగులు అంతా కలసి ఓ పది పదిహేను ఫేమిలీల వాళ్ళు వచ్చారు పార్టీ చాలా గ్రాండ్ గా జరిగింది. హాట్ డ్రింక్స్ , సాప్ట్ డ్రింక్స్ , చిప్పు, జీడిపప్పుల సరఫరాలు జోరుగా సాగాయి.
రాగానే "మీట్ మైవైఫ్" అంటూ సావిత్రిని డైరక్టర్ కి పరిచయం చేశాడు కృష్ణమూర్తి. అతను సావిత్రిని కళ్ళలో మధువుతో పాటు త్రాగేసేటట్లు చూడ్డం మొదలుపెట్టాడు. అతని చూపులకి కాస్త ఇబ్బంది పడ్డా లోలోపల గర్వపడింది సావిత్రి...." చార్మింగ్ వైఫ్ అంటూ ఏదో ప్రశంసాపూర్వకంగా అతను కృష్ణమూర్తి తో అంటున్న మాటలు పూర్తిగా వినపడకపోయినా తన గురించేనని కాస్త గర్వపడింది.
డిన్నరయ్యాక లోపల్నుంచి ప్లేటులో కిళ్ళీలు తెచ్చింది కూతురు. డ్రింక్స్ అవీ వున్న పార్టీలప్పుడు పిల్లలని కలవనీయక పోవడం అలవాటు ఇంట్లో! కూతుర్నీ కేకేశాడు కృష్ణమూర్తి పట్టుకు రమ్మని. కూతురు రాగానే అక్కడి వాళ్ళను పరిచయం చేశాడు. ఆ మాట వినగానే డైరక్టరు కుర్చీలోంచి గెంతి నంత పనిచేసి "మీ అమ్మాయా.....ఇంత పెద్ద కూతురు మీకుందని కలలో కూడా అనుకోలేదు" అంటూ ఇంగ్లీషు లో బోలెడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు సావిత్రితో.
ఆ మాట ఓ పెద్ద కాంప్లిమెంటులా అనిపించింది సావిత్రికి. నిజంగా తను అంత అందంగా, చిన్నదానిలా వున్ననన్న మాట అనుకుంటూ పొంగి పోయింది. ఆ క్షణంలో కూతురు పైకి వచ్చి తన వయస్సుని నలుగుర్లో చెప్పక చెప్పినందుకు కోపం కాకపోయినా అదోలా అన్పించింది. అయితే.......పిల్లలని కనక చూడకపోతే తను పాతికేళ్ళు దానిలా కన్పిస్తుందన్న మాట ! ఆ మాట పదే పదే అనుకుంది. అందరితో ఏవో మాట్లాడుతున్నా ఆ క్షణంలో సావిత్రి ఆలోచన అదే.
నిజానికి సావిత్రి ఈ సౌందర్యం లో తపన పెరగటం అదే మొదలు! అందరు వెళ్ళాక డ్రస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని తన అందం నిశితంగా గమనించడం మొదలు పెట్టింది. నిజంగానే తను అందంగా వుంది. చిన్నదానిలా, మహా అయితే ఓ పాతికేళ్ళ దానిలా కనిపిస్తుంది.....
బట్టలు మార్చుకుంటూ తదేకంగా అద్దంలో చూసుకుంటున్న భార్యని కాస్త ఆశ్చర్యంగా చూశాడు . కృష్ణమూర్తి "ఏమిటలా చూసుకుంటున్నావు నీ అందానికి నీవే మురిసిపోతున్నావా?" నవ్వుతూ అడిగాడు.
"ఆ .....మురిసిపోతున్నాను.....పోనీ మీరే విన్నారుగా మీ డైరెక్టరు ఏమన్నాడో.....మీరెప్పుడయినా ఒక్క సారయినా అలా పోగిడారా?' సగం వేళాకోళంగా సగం నిష్టూరంగా అంది సావిత్రి.
"ఓస్, అదా....ఏదో అన్నాడు. హోస్టువి గదా అని మాత్రం పొగడకపోతే ఎలా అనుకుని ఉంటాడు కాస్త.....అక్కడున్న అందరిలో నీవే బాగున్నావాయే .....అంచేత ఏదో అన్నాడు.....కొంపదీసి నిజం అనుకుంటున్నావేమిటి?" టీజ్ చేశాడు.
అవునులెండి. నిజం ఒప్పుకుంటే నామోషి కాబోలు...."
"బాగుంది అయితే రెండు పూటలా నీ దగ్గిర కూర్చుని నీ అందాన్ని స్తుతుస్తూ భజన చెయ్యామంటావేమిటి...... బాగున్నావనే కాదుటోయి పెళ్ళాడినది.....అప్పటికే పెళ్ళాం మొహం ముడుచుకోవడం చూసి సమర్ధించుకుంటూ నవ్వుతూ అన్నాడు కృష్ణమూర్తి.
మొత్తానికి ఆ డైరెక్టరు నిజంగా అన్నా, యధాలాపంగా అన్నా....ఆ అన్న రెండు ముక్కలకి సావిత్రి చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. అప్పటి నించే శరీర సౌందర్యం పట్ల శ్రద్దసక్తులు ఎక్కువయ్యాయి.....అలంకారాలు హెచ్చాయి.... ఆరాటం హెచ్చింది.
చక్కగా అందంగా ముడివేసుకుని , పౌడరద్దుకుని కనుబొమ్మలు దిద్దుకుని లిప్ స్టిక్ వేసుకుని ఏ ఫారెన్ నైలాను చీరో కట్టుకుని, స్లేవ్ లెస్ బ్లౌజ్ తాలుకూ తన నున్నటి భుజాలని చూసుకుంటూ మురిసిపోయే వేళ.....అద్దంలో వెనుక నించి ఏ కూతురు నీడో కనపడగానే కలవరపడి పోయేది సావిత్రి.....ఛా....తనకి పిల్లలు వేగిరం పుట్టేసి తనని పెద్దదాన్ని చేసేసి కూర్చోబెట్టారు.....తనీడు వాళ్ళకి పదేసి ఏళ్ళ పిల్లలు కంటే లేరు.....తనకి పద్దెనిమిదేళ్ళ కూతురు, పదిహేనేళ్ళ కూతురు పన్నెండేళ్ళ కొడుకు.....వాళ్ళని చూస్తుంటే సావిత్రికి తన వయస్సుని వాళ్ళు డప్పు వేసి చాటుతున్నారాన్నంత బాధగా వుండేది.
ఆ బాధ కృష్ణమూర్తి అప్పుడప్పుడు కూతురు పెళ్ళి మాట ఎత్తినప్పుడల్లా మరింత ఎక్కువయ్యేది. "ఇంక సంబంధాలు చూడడం ఆరంభిస్తే బాగుంటుందనుకుంటాను" అనేవాడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా.
ఉలిక్కిపడేది సావిత్రి. 'అప్పుడే దానికి పెళ్ళేమిటి బాబూ....ఇంకో నాలుగేళ్ళు పాటు ఆ మాట ఎత్తకండి. దాన్నయినా కాస్త హాయిగా వుండనీయండి కొన్నాళ్ళు....... ' విసుగ్గా అనేది, ఆ విసుగు వెనకాల వేరే అర్ధం వుంది సావిత్రి మాటలో.
బాగుంది, ఇరవై వస్తున్నాయి దానికి. యిప్పటి నించి సిన్సియర్ గా మనం ట్రై చేస్తే ఓ రెండేళ్ళు అయినా పట్టదేమిటి సంబంధం కుదిరేసరికి.....అది పెళ్ళీడు కాదేమిటి?" అనేవాడు కృష్ణమూర్తి సావిత్రి మాటలలో వేరే అర్ధం వుందని తెలియక.
"ఆ....ఆ.... పెళ్ళి చేసేయండి.....అది మర్నాటి నించి పిల్లల్ని కంటుంది. చక్కగా మీరు నేను అమ్మమ్మ తాతగారు అయి మూల కూర్చుంటాం......' భర్తకి ఏమని బోధపరచాలో స్పష్టంగా తన అభిప్రాయం చెప్పలేక కసిగా అంది సావిత్రి. కృష్ణమూర్తి కాస్త ఆశ్చర్యంగా చూశాడు. భార్య మనస్తత్వం ఏమిటో అతనికి అర్ధం కాలేదు. ఎవరైనా బరువులు బాధ్యతలు సాధ్యమైనంత త్వరగా తీర్చుకుందామని అనుకుంటారు. అలాంటిది భార్యే పెళ్ళి యిప్పట్లో వద్దనడం ఏమిటో అతనికి అర్ధం అయ్యేది కాదు.
'ఏమో బాబూ ' మీకు తాత నవాలని ముచ్చటగా వుందేమో కానీ ఇప్పటి నించి అమ్మమ్మని అవాలని నాకు లేదు సరదా.....ఛా....యిప్పటి నించి నన్ను అమ్మమ్మని చేసేయకండి" అనేది. అప్పుడప్పుడు హాస్యంగా అంటున్నట్టు.
ఇంట్లో కూతుళ్ళు యధాలాపంగా 'అమ్మా, ఈ పుల్ వాయిల్ చీర నీకెందుకమ్మా నాకిచ్చేయి' అన్నా, ఈ నైలక్స్ నీకేం బాగుంటుందమ్మా నా కిచ్చేయ్యకూడదూ' అని కూతురడిగేసరికి సావిత్రికి ఎక్కడ లేని కోపం వచ్చేది.