Previous Page Next Page 
మరణహొమం పేజి 14


    
    ఏదో కుట్ర జరిగిపోతుంటే తను మధ్యలో వెళ్ళినట్లనిపిస్తుంది ఆ ఆఫీసులో ప్రవేశించినప్పుడల్లా.   
    ఇలాగే కొన్నాళ్ళపాటు ఈ ఆఫీసులో పనిచేస్తే టెన్షన్ తో బీపీ రావడం ఖాయం! అదీ కాకపోతే, నెర్వస్ బ్రేక్ డవున్ వచ్చేస్తుంది.   
    ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చవలసి వస్తుంది తనని!   
    తనమీద తనకే జాలివేసింది అమూల్యకి.   
    లాయరు బిల్డింగ్ వాలా నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. పైన తిరుగుతున్న ఫాన్ నున్నటి ఆయన బట్టతల మీద ప్రతిఫలిస్తోంది.   
    "మనం ఇవాళ నుంచి కేసు స్టడీ చెయ్యడం మొదలెడదాం" అన్నాడాయన.   
    గుండె ఝల్లుమంది అమూల్యకి. ఇదివరకు జువాలజి క్లాసులో మొదటిసారిగా కప్పను కోసేముందు కలిగింది అలాంటి ఫీలింగు!   
    భయం, అసహ్యం, ఒళ్ళు జలదరింపు!   
    హత్యని హత్యకాదని నిరూపించవలసిన విషమ పరీక్ష ఇప్పుడు!     
    "కేస్ స్టడీ మొదలెట్టేముందు కొంచెం రిలాక్సవుదాం. నా పేరు చూసి నవ్వు కుంటున్నావా? బిల్డింగ్ వాలా ఏమిటని?" అన్నాడు లాయరు నవ్వుతూ.   
    ఇబ్బందిగా చూసింది అమూల్య.   
    "చాలా పార్సీపేర్లు అలాగే ఉంటాయి? తరాల క్రితం చేసిన వృత్తి పేరే ఇంటి పేరయిపోతుంది. నారీ కంట్రాక్టర్, ఫరూఖ్ ఇంజనీర్ - అలా అన్నమాట! మా తాత బిల్డింగ్స్ కట్టే కంట్రాక్టర్. ఆ పేరే స్థిరపడిపోయింది మాకు.   
    ఆపరేషన్ కి ముందు అనెస్తీషియా ఇచ్చినట్టు కబుర్లు చెబుతున్నాడాయన.   
    "నా పూర్తిపేరు జంషెడ్జి బిల్డింగ్ వాలా! నువ్వీ జోక్ విన్నావా?"   
    చూస్తోంది అమూల్య.   
    "ఇదివరకో పెద్దమనిషి ఉండేవాడమ్మా! చాలా పెద్ద పేరు ఆయనది. జంషెడ్జీ కర్పెట్ జీ జీజీ భాయ్! అని. ఆయనొకసారి ఇంగ్లాండు వెళ్ళాడు రాణీగారి దర్శనానికి. అక్కడ ఉండే ద్వారపాలకుడు వచ్చినవాళ్ళ పేరు పెద్దగా అనౌన్స్ చేసి, తర్వాత వాళ్ళని లోపలికి పంపడం ఆచారం. అతనికి మన పార్సీగారి పేరు అర్ధంకాలేదు. రెండుసార్లు అడిగికూడా నోరు తిరక్క, తనకు తోచినట్లు అనౌన్స్ చేశాడు. "డామ్ సేస్ హీ, కర్స్ సేస్ హీ, షీ ఈజ్ ఏ బాయ్!" అని.  

    జంషెడ్జీ కర్సెట్ జీ జీజీ భాయ్ కి వచ్చిన తిప్పలవి!   
    బలవంతంగా పెదిమల మీదికి చిరునవ్వు తెచ్చుకుంది అమూల్య.   
    "నవ్వకు!" అన్నాడాయన చిరునవ్వుతో. "ఇది ఉత్త జోక్ మాత్రమే! నిజానికి మా పార్సీలం ఇండియా జనాభాలో మైక్రోస్కోపిక్ మైనారిటీనే అయినా, ప్రతి ఫీల్డులోనూ ముందుంటాం మేము. దేశ రక్షణలో ఫీల్డ్ మార్షల్ మానెక్ షా, అణుశక్తిలో హోమీభాభా, ఎయిర్ లైన్స్ లో, ఇండస్ట్రీ స్ లో టాటా, క్రికెట్ లో ఉమ్రీగర్, కంట్రాక్టర్, ఇంజనీర్, పార్లమెంటు సభ్యుల్లో పీలూమోడీ...."    

    "లాయర్ లలో మీరూ!" అంది అమూల్య అయన ఇచ్చిన చనువుని ఉపయోగించుకొని దెబ్బకొడుతూ.   
    అతను సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు. "కాదు! నన్ను మించిన లాయర్లు చాలామంది ఉన్నారు. దేశాన్ని ముందుకు నడిపించడంలో ఎవరి కంటే వెనకబడము మేము! ఒకే! నౌ బిజినెస్! ఈ ఫైలు చదువు."   
    "నీకంత దేశభక్తి ఉంటే ఈ నిఖిల్ దగ్గర ఎందుకుంటావ్? ఇలాంటి వెధవ కేసులు ఎందుకు వాదిస్తావ్?" అని మనసులో అనుకుని, ఫైలు చదవడం మొదలెట్టింది అమూల్య.   
    ఏదో రొటీన్ కేసు అది!   
    "ఇప్పుడింక ఆ మర్డర్ కేసులోకి వద్దాం. మనకుర్రాళ్ళు ఆ మనిషిని అందరూ చూస్తుండగా చంపారు. హత్యా చెయ్యలేదని నువ్వు నిరూపించాలి. ఎలా చేస్తావో? ఆలోచించు! తొందరలేదు!" అన్నాడు బిల్డింగ్ వాలా. వేటాడడంలో తన పిల్లకు శిక్షణ ఇస్తున్న గెద్దలా ఉన్నాడాయన.   
    కుర్చీలో కూర్చుని టెస్ట్ ట్యూబులా ఉన్న ప్యాకింగులోనుంచి పెద్ద చుట్టతీసి వెలిగించాడు. పొగపీలుస్తూ చిన్మయానందంతో కళ్ళు మూసుకున్నాడు.   
    పెదిమలు కొరుక్కుంటూ చాలాసేపు ఆలోచించింది అమూల్య. అవును? ఎలా సాల్వ్ చెయ్యాలి ఈ కేసుని? ఏ ఆధారమూ లేకుండా? షెర్లాక్ హోమ్సు కూడా ఇలాంటి కేసు దొరికితే తెల్లమొహం పెడతాడేమో!   
    మెల్లగా ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు అసిస్టెంట్ రాజు.   
    "మాంచి వర్కరు దొరికాడులే! గొప్ప ఆర్టిస్టు! నీ సంతకంలో నిన్నే మోసం చెయ్యగలడన్నమాట! కలైమణి వీదిముందు ఎందుకు పనికి వస్తాడు? అబ్బే!"   
    చటుక్కున అలర్టుగా అయిపోయి, చూపులు మరల్చకుండానే, చెవులు రిక్కించి విన్నది అమూల్య.   
    కలైమణి కంటే గొప్ప ఆర్టిస్టు! నీ సంతకంతో నిన్నే ఫూల్ చేస్తాడు?   
    అంటే కలైమణి బదులు ఇంకో ఫోర్జరీ చేసే మనిషిని పట్టారన్నమాట వీళ్ళు!   
    తరుణ్ చూపించిన పాస్ పోర్టులు గుర్తొచ్చాయి. నాలుగు ఫోటోల్లోనూ నాలుగు రూపాలతో ఉన్న నిఖిల్ కళ్ళముందు మెదిలాడు.   
    "కలైమణా?" అన్నాడు రాజు నవ్వుతూ ఫోన్ లో. "వాడు ఇప్పుడు చిత్రగుప్తుడి సంతకాలు ఫోర్జరీ చేసి, శిక్ష తగ్గించుకునే ప్రయత్నంలో ఉండి ఉంటాడు. పైకెళ్ళి పోయాడుగా!"  

    ఒక్కసారిగా మెదుడులో మెరుపు మెరిసినట్లయింది అమూల్యకి.   
    మెదడు ఒక్కొక్కసారి అంత వేగంగా ఎలా పనిచేస్తుందో అంతుబట్టదు. హత్యానేరం తన మీదకు రాకుండా చేసుకోవడానికి నిఖిల్ దగ్గర ఉన్న ట్రంప్ కార్డ్ ఏమిటో సెకండులో వెయ్యోవంతులో స్ఫురించింది అమూల్యకి. ఎగ్జయిట్ మెంటుతో ఎర్రబడి పోయింది ఆమె మొహం.

 Previous Page Next Page