Previous Page Next Page 
హత్య పేజి 14

   
    మాటకు ముందు సూర్యారావు హత్య అంటూ భయపడటం లేక భయపెట్టడం చేస్తున్నాడు. పరిశోధన విషయం పైకి చెప్పొద్దని అంటున్నాడు. ఓ విధంగా చెప్పావంటే గట్టి వార్నింగ్ యిచ్చాడు.

 

    ఇదంతా చూస్తుంటే అతనిమీద రవ్వంత అనుమానం వచ్చింది. కానీ సూర్యారావు అనుమానించతగ్గ వ్యక్తి కాడు. అతను ఆప్తమిత్రుడు. గతంలో అతని గుణం ఏమిటో కైలాసగణపతికి బాగా తెలుసు.

 

    గతానికీ యిప్పటికి పోల్చి చూస్తుంటే కైలాసగణపతి వేషభాషలు పూర్తిగా మారిపోయాయి - కైలాస గణపతి. గణపతి లాంటివాడు కాదు. కైలాస నాధుడిలా బోలాశంకరుడు కాదు. తనికీ, అతనికి ప్రతి విషయంలో సహస్రం వారవున్నా అది వాళ్ళ స్నేహానికి అడ్డుగోడలా నిలవలేదు, ఈ విషయం బాగా తెలుసు సూర్యారావుకి. ఎందుకో మొదట్లో కాస్త అనుమానించాడు సూర్యారావు. మళ్లీ తనే సర్దుకున్నాడు.

 

    ఏనాడూ లేనిదీ సూర్యారావు కైలాసగణపతిని కాస్తఅపార్ధంగా ఆలోచించుకుని మళ్ళీ మామూలు మనుషులు అయిపోయారు. పాతస్నేహంతో పసివాళ్ళలాగానే ప్రవర్తిస్తున్నారు.

 

    ఇరువురూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఊరి చివరనున్నకొండ దగ్గరకు వచ్చారు.    

 

                                     10

 

    "ఇదే ఉరుముకొండ" సూర్యారావు చెప్పాడు.


 
    "ఒక్కక్షణం ఆగు" అన్నాడు కైలాసగణపతి.

 

    సూర్యారావు నిలబడిపోయాడు.

 

    "ఆగటం ఎందుకు?"

 

    "ఇక్కడ నుంచి కొండని ఓసారి సరిగ్గా నన్నుచూడనియ్యి."

 

    "ఎందుకు?"

 

    "అవసరం నాది కాబట్టి."

 

    ఏమిటో వీడి పిచ్చి అన్నట్లు భుజాలు ఎగరేశాడు సూర్యారావు.

 

    కైలాస గణపతి కళ్ళార్పకుండా కొండని అలా చూస్తూ ఉండిపోయాడు. మధ్యలో ఓ సారి ఓ యబ్బో అన్నట్లు రెండు గూడలు ఎగరేశాడు. ఏదో అర్థం అయినట్లు తల పంకించాడు. నొసలు ముడేసి తీవ్రాలోచన చేశాడు.

 

    "ఏమొచ్చిందిరా నీకు ఈ తింగిరి వేషాలు ఏమిటి?" అని సూర్యారావు అడిగేలోపలే "పద" అన్నాడు కైలాసగణపతి.

 

    "పరిశీలన అయ్యిందా కైలాసం."

 

    "ఆ...."

 

    "ఆ కొండ చూస్తే ఏం తెలిసింది?"

 

    "కొండ అని - !"

 

    "కొండను చూస్తూ అది కొండ అవునో కాదో అని పరిశోధన చేశావా?" నవ్వుతూ అడిగాడు సూర్యారావు.

 

    "నీకు సమాధానం కావాలంటే నవ్వకు."

 

    "సరే నవ్వనులే విషయం విన్నవించు."

 

    "ఉరుముకొండ రాళ్ళలో మెరుపులున్నాయి."

 

    "ఇదేదో కొత్త విషయమే. రాళ్ళల్లో మెరుపులుండటము ఏమిటి? ఇవి మామూలు బండరాళ్ళు. గాజురాళ్ళు కూడా కాదు" ఆశ్చర్యంగా అడిగాడు సూర్యారావు.

 

    "అది అందరకూ తెలియదురా అబ్బాయ్! ప్రకృతి వైద్యం నేర్చుకొన్న వాళ్ళకి ఏ ఆకులో ఏ గుణం ఉందో అది ఎందుకు పనికి వస్తుందో చెప్పినట్లు మాకు ఏ రాయి ఎందుకు పనికివస్తుందో దూరం నుంచి చూసి చెప్పగలం. నీకు అర్థం అవుతుంది అంటే తరువాత వివరంగా చెపుతాను. రాళ్ళు అని తీసి పారేయకు. రాళ్ళకి కూడా మహాచరిత్ర ఉంది" అన్నాడు కైలాసగణపతి.

 

    "చాలా చిత్రంగా ఉందే!"

 

    "నేనూ మొదట్లో వింతగా ఉందే అని ఆశ్చర్యపోయిన వాడినే. దిగిన తరువాత లోతు తెలిసింది" చెప్పాడు కైలాసగణపతి.

 

    "నన్ను దేంట్లోను దింపొద్దు. నీవు చెపితే చాలులే నమ్ముతాను" సూర్యారావు నవ్వుతూ అన్నాడు.

 

    ఇరువురూ అలా మాట్లాడుకుంటూ కొండ దగ్గరకు వచ్చారు.

 

    "కొండపల్లి కొండలాగా చిక్కగా చెట్లు వ్యాపించి ఈ కొండలేదు. చెట్లు తక్కువ రాయి  ఎక్కువ" అన్నాడు కైలాసగణపతి.

 

    "చెట్లు లేకపోవడం ఏమిటి! అక్కడక్కడా ఉన్నాయి కదా!" చిన్న చిన్న దుబ్బు మొక్కలని చూపిస్తూ అన్నాడు సూర్యారావు.

 

    "నేను చెప్పింది అడవిలాగా చిక్కగా పెనవేసుకుని చెట్లు చేమలు లేవని, తంగేటుచెట్లు కలేగపళ్ళు, రేగుపళ్ళు లాంటివి ఈ బుడత కీచుచెట్లు గురించి కాదురా సూరీడూ"

 

    "మనం ఇంకా కొండ కిందనే వున్నాము. కాస్త పైకి ఎక్కితే ఫరవాలేదు. ఓమాదిరిచెట్లు వున్నాయి. అక్కడక్కడా శీతాఫలం చెట్లున్నాయి. ఇక్కడ చెట్లకాయలు చాలా రుచిగా వుంటాయి."

 

    "పైకి వెడితే ఇంకా ఏమేమి వుంటాయి?"

 

    "ఈ కొండమీద చెప్పుకోతగ్గవి యింకేమీ లేవు."

 

    "కొండమీద ఒక్క గుహకూడా లేదా?"

 

    ఈ మాట అడిగినప్పుడు కైలాస గణపతి ముఖంలో రవ్వంత నిరాశ దోబూచులాడింది.

 

    అదేమీ గమనించని సూర్యారావు "కొండ అన్న తర్వాత సెలయేళ్ళు లేకుండా, గుహలు లేకుండా ఎలా ఉంటాయిరా? బోలెడు గుహలున్నాయి. నీవు ఎక్కగలనంటే చూస్తానంటే పైకి ఎక్కుదాము. ఆ మాసం ఈమాసంలాటిది లేదు కదా" నవ్వుతూ అడిగాడు.

 

    "ఇదేమన్నా మహా పర్వతమా ఎక్కలేకపోవటానికి ఎక్కి చూద్దాం. బి. పి. డయాబెటిస్ లాంటి వ్యాదులు లేనందున ఇప్పటికీ నా శరీరం ఉక్కులాగానే వుంది."

 

    "అయితే పద" అన్నాడు సూర్యారావు.

 

    ఇరువురూ కొండ ఎక్కడం మొదలుపెట్టారు.

 

    నాలుగు అడుగులు వేసిన తరువాత చటుక్కున ఆదిపొయ్యాడు కైలాసగణపతి.

 

    "మళ్ళీ ఏ అనుమానం బుర్రలో ప్రవేశించింది కైలాసం"

 Previous Page Next Page